Site icon Sanchika

ఆచార్యదేవోభవ-8

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

లబ్ధ ప్రతిష్ఠులు:

[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా ప్రసిద్ధి నొందిన ఆధ్యాపకుల ముచ్చట్లు గత ఏడు సంచికలలో ప్రస్తావించాను. ఇతర శాఖలో ఆచార్యులు, నా ఎరుకలోని కొందరు ప్రముఖుల జీవన సరళిని గమనిద్దాం. ఆయా రంగాలలో వారు నిష్ణాతులు.

ఆచార్య మొదలి నాగభూషణశర్మ:

హైదరాబాదు తారనాకలో తెలంగాణా రాష్ట్ర ఆర్కైవ్స్ శాఖ కార్యాలయం ఉందని తెలుసు గాని, అందులో వంద సంవత్సరాల నాటి పాత పత్రికలు భద్రపరిచారని చాలామందికి తెలియదు. 2015-17 సంవత్సరాల మధ్య నేను కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారి ఠాగూరు స్కాలర్‌షిప్ కింద రెండేళ్ళు తెలుగు పత్రికల సాహిత్య సేవను గూర్చి పరిశోధన చేశాను. ఆ సమయంలో ముఖానికి ‘మాస్కు’ తగిలించుకుని ధూళిధూసరితమైన ఆ గ్రంథాలయంలో ఆంధ్రప్రతిక తొలి సంచికను చదివాను. ఎన్నెన్నో మాసపత్రికలు, వారపత్రికలు, ప్రత్యేక సంచికలు అక్కడ భద్రపరిచారు.

ముసుగు వీరుడు:

నేను తొలిసారిగా 2015 ఫిబ్రవరిలో ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు గ్రంథాలయంలో ఓ మూల టేబుల్ ముందు కూచొని ఒక భూతద్దం పట్టుకొని పాత పత్రికలో విషయాలను పరిశీలిస్తూ ‘మాస్క్’ ధరించిన ఓ 80 ఏళ్ళ పండితుడు కూర్చుని ఉన్నారు. వెంటనే గుర్తు పట్టలేదు. మాస్క్ తొలగించి మాట్లాడారు. ఎవరో కాదు, మిత్రులు మొదలి నాగభూషణశర్మ. తెలుగు ప్రాచీన నాటకాలపై పుస్తకం వ్రాస్తూ ఫ్రీలాన్స్‌గా వచ్చారు. వారంలో మూడు రోజులైనా కనిపించేవారు. ఆ వయసులో ఆయన జ్ఞానతృష్ణకు ఆశ్చర్యం వేసింది.

నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 24 జూలై 1935 నాడు పండిత కుటుంబంలో జన్మించారు. తండ్రి సుబ్రమణ్యశర్మ అధ్యాపకులు. నాటక రచయిత. ఆయన ప్రోత్సాహంతో ఎనిమిదో ఏట రంగస్థల ప్రవేశం చేశారు నాగభూషణశర్మ. కళాశాలలో చదివే రోజుల్లో మధురవాణి పాత్ర ధరించారు. 20వ ఏట 1954లోనే భారతిలో ‘అన్వేషణ’ నాటకం ప్రచురితమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ఎం.ఏ. చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలొ నాటక దర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ. చేశారు.

ఉద్యోగపర్వం:

నాగభూషణశర్మ తొలిరోజుల్లో ఆకాశవాణి నాగపూరులో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‍గా కొద్ది కాలం పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ అధ్యాపకులుగా పని చేశారు. థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎందరికో మార్గదర్శనం చేసి నటులను చేశారు. రసరంజని ఆధ్వర్యంలో టిక్కెట్లు పెట్టి నాటకాలు ప్రదర్శించారు. విస్తృతంగా విదేశాలలో పర్యటించారు. నాటక ప్రయోగ శిక్షణనిచ్చారు. హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ స్థాపించి ఏ. ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు తదితరులు కె.వి.రమణాచారి ప్రోత్సాహంతో అనేక నాటక ప్రయోగాలు చేశారు.

వీరి దర్శకత్వంలో గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలు ప్రదర్శితమయ్యాయి. ఉదాహరణకు – ది విజిట్, కింగ్ ఆఫ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్ పేర్కొనవచ్చు. ‘ప్రజానాయకుడు ప్రకాశం’ నాటకం దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. పాశ్చాత్య నాటకాలకు స్వేచ్ఛానువాదం చేశారు. మాక్‍బెత్, కాయితం పులి ప్రసిద్ధం.

ప్రదర్శనలు:

రేడియోకి నాటకాలు వ్రాశారు. 70 దాకా రంగస్థల నాటకాలు స్వతంత్రంగా, అనువాదంగా ప్రచురించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులుగా 1996లో హైదరాబాదు రవీంద్రభారతిలో యక్షగానాలపై మూడు రోజుల కార్యశాల, ప్రదర్శనలు నిర్వహించారు. నేను కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయ యక్షగానంపై పత్ర సమర్పణ చేశాను.

తెలుగు సాహిత్యం పై గాంధీజీ ప్రబావం, నూరేళ్ళ తెలుగు నాటక రంగం, లోచన (వ్యాస సంపుటి) వీరి కొన్ని రచనలు. వీరి ప్రకాశం నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం అందుకొన్నారు. రసమయి రంగస్థల పురస్కారం విశిష్టం.

జీవన సాఫల్య పురస్కారం:

2019 జనవరి 6న 85వ ఏట తెనాలిలో అప్పాజోశ్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారి లక్ష రూపాయల అవార్డు స్వీకరించారు. మూడు రోజుల పాటు ఆయన రచనపై పరిశోధనా పత్రాలు సమర్పించబడ్డాయి. నేను వారి రచనలపై పత్ర సమర్పణ చేశాను. అప్పటికే ఆయన వయసు పైబడింది.

ఒక్కొక్కరి జీవితం కళారంగానికే అంకితమవుతుంది. అట్టివారిలో శర్మ అగ్రగణ్యులు. చివరి క్షణం వరకూ నాటకాలపైనే పరిశోధనలు కొనసాగించారు. మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో అప్పాజోశ్యుల వారు శర్మపై ఒక ఉద్గ్రంథం ప్రచురించారు. ఆంగ్ల భాషాధ్యాపకుడిగా జీవన గమనం ప్రారంభించి, రంగస్థల కళామతల్లిని సేవిస్తూ, ఆరు పదుల జీవితాన్ని గడిపి అప్పాజోశ్యుల అవార్డు అందుకొన్ని పదిరోజులకే 2019 జనవరి 15న సంక్రాంతి పర్వదినాన ఇంద్రలోకంలో రంగస్థల ప్రదర్శనకు నిష్క్రమించారు. తెలుగు నాటక రంగంలో ఒక అధ్యాయం ముగిసింది.

మాజీ హోమ్ సెక్రటరీ కె. పద్మనాభయ్యగారితో రచయిత

హిందీ అనువాద శిరోమణి:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ శాఖ అతి ప్రాచీనం. తెలంగాణ ముద్దు బిడ్డ భండారం భీమసేన్ జోస్యులు మెదక్‍లో 30 నవంబరు 1930న జన్మించారు. ఆయనే భీమ్‍సేన్ నిర్మల్. నేను హైదరాబాదు ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా 1982 – 87 సంవత్సరాలలో పని చేశాను. అప్పుడు జాతీయ నాటకాలను హిందీ నుండి తెలుగులోకి నిర్మల్ ఎన్నో అనువాదాలు చేశారు. సరళమైన అనువాదం. తెలుగు నుడికారం వుట్టిపడేది. తెలుగు నుండి హిందీకి కూడా అనువాదాలు చేశారు. ఆయన హిందీలో ఎం.ఏ, పి.హెచ్.డి. చేశారు. తెలుగులోనూ ఎం.ఏ. చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో అధ్యాపకులై ఆచార్య పదవి నధిష్ఠించారు. ఎందరికో మార్గదర్శకులయ్యారు. ఎందరికో పి.హెచ్.డి. పర్యవేక్షణ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి హిందీ సలహా సంఘ సభ్యులు. ఢిల్లీని అనువాద్ సభ్యులు. హిందీ ఎన్‍సైక్లోపీడియాకు రచనలు చేశారు.

రచయితగా ఎన్నో అవార్డులు వరించాయి:

భీమ్‌సేన్ నిర్మల్ హిందీ, తెలుగు భాషలలో 50కి పైగా గ్రంథాలు ప్రచురించారు.

వివిధ ప్రక్రియలలో అనువాదకులుగా నిర్మల్ ప్రసిద్ధులు. దక్షిణ ప్రాంతంలో హిందీ విద్వాంసులలో ఆయన అగ్రగణ్యులు.

చారిత్రక పరిశోధక చక్రవర్తి:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ యేన్షియంట్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ శాఖ అతి పురాతనం. ఆ శాఖలో మేరుశిఖరం ముక్కామల రాధాకృష్ణ శర్మ. ఆయన ప్రాచీన చరిత్రపై అథారిటీ. 1933లో జన్మించి పరిపూర్ణ జీవితం అనుభవించి 2014 జనవరిలో గతించారు.

చారిత్రక అధ్యయానానికి ఎంతో ఓపిక కావాలి. పల్లెటూర్లకు తిరగాలి. శాసన పరిశోధన చేయాలి. ఆ రంగంలో శర్మ అధ్యయన అధ్యాపనాలు చేశారు. ఎందరికో  మార్గదర్శనం చేశారు. నేను హైదరాబాదులో ఆకాశవాణిలో ఉండగా (1982-87) ఎన్నో ప్రసంగాలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగ ఆచార్యులుగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. పదవీ విరమణానంతరం ఎమిరిటస్ ప్రొఫెసర్‍గా ఉన్నారు. శాఖను తీర్చిదిద్దారు.

ఆయన ఎన్నో ప్రామాణిక గ్రంథాలు ప్రచురించారు:

ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ సంఘం సమావేశాలు హైదరాబాదులో, ఇతర ప్రాంతాలలో జరిగినప్పుడు వాటి నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. పత్ర సమర్పణ చేశారు.

రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సదస్సులో రచయిత

ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో ఆచార్యులుగా పేరెన్నిక గన్న మరికొందరు మహనీయుల చరితలు – ప్రత్యేకించి జర్నలిజం విభాగ అధ్యాపకుల గూర్చి వచ్చే వారం…

Exit mobile version