[box type=’note’ fontsize=’16’] పరుష పురుష సమాజంలో చైతన్యవంతమయిన అమ్మాయి కథ చావా శివకోటి రచించిన “ఆడ – మగ” కథ. [/box]
[dropcap]”అ[/dropcap]త్తయ్యా! ఏం చేస్తున్నావ్…?” అంటూ లోపలికొచ్చింది సీత.
“కనిపిస్తూనే ఉన్నాను కదే. చూస్తూ నువ్వు అడగడం, నేను చెప్పడం బాగా అనిపించదు” అని తలెత్తి సీతని చూస్తూ, “ఇటు రా! ఇలా కూర్చో. ఈ పప్పులో రాళ్ళు ఏరు. బియ్యంలో మట్టిగడ్డలుండడం సహజం. ప్రస్తుతం పప్పుల్లో కూడా…!” అని, “నువ్వు ఏరుతుండు. నేను లోనికెళ్ళి మంచి కాఫీ కలుపుకొస్తాను. అప్పుడు తీరుబాటుగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఏం…?” అని లేస్తూ పప్పు చేటని సీత చేత నుంచింది. చేట తీసుకొని ‘ఇందుకన్నమాట నేనొచ్చింది’ అన్నట్టు చూసింది.
“నాకు నువ్వు ఏమనుకొంటున్నావో తెలుసే. అంత జ్ఞానం భగవంతుడు నాకివ్వలేదు. ఇస్తే గిస్తే ఇట్టాటివి నీకు చెప్పను” అంటూ లోనకు నడిచింది.
తనలో తాను నవ్వుకొని పప్పులోని రాళ్ళను శ్రద్ధగా ఏరసాగింది సీత. ఐదు నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీతో సరసకు వచ్చి కూర్చొని కాఫీ గ్లాసు చేతికందిస్తూ “ఇక పప్పు పని ఆపు, కాఫీ తీసుకో” అంది. గ్లాసును సీత అందుకోగానే చేటను తీసి పక్కనుంచింది.
“ఆఁ! ఇక చెప్పు. పెళ్ళిచూపులకి అబ్బాయి ఎప్పుడొస్తున్నాడు?” అంది కొంచెం దగ్గరికి జరిగి.
ఆవిడ మాట వినిపించుకొనక, “మామయ్య ఏడి?” అడిగింది సీత.
“నువ్వు మీ ఇంటి దగ్గర్నుంచే వస్తున్నావు కదా. ఈయన మీ ఇంట్లో లేడు కనుక తోవన నీకే ఎదురు పడి ఉండాల్నే?” అంది నవ్వుతూ.
“ఇంటి దగ్గర లేడు, తోవనా కనిపించలేదు.”
“అయితే మన ఊరుంది కదా, దానికి ఆయన నిత్యం చేయాల్సింది ఎప్పుడూ ఎంతో కొంత మిగిలే ఉంటుంది. కనక…” అంది నవ్వుతూ.
మాట్లాడలేదు సీత. నెమ్మదిగా కాఫీ త్రాగుతూ ఉంది నిరాసక్తంగా.
“నేనడిగినదానికి సమాధానం చెప్పలేదు” అని, “కాఫీ నువ్వు చేసినట్టే ఉందా?” అని అడిగింది.
కాఫీ త్రాగడం పూర్తి చేసి, “అవును అత్తా! ఏదో అడిగావు కదూ” అని, “నాకు తెలీక అడుగుతాను, ‘కన్యాశుల్కం’ అన్న దానిని వెనకట ఎందుకు అంగీకరించారంటావ్?” అంది.
తను అడిగినదానికి సమాధానం చెప్పడం సీతకు ఇష్టం లేదన్నది అర్థమైంది.
“ఇప్పుడు ‘కన్యాశుల్కం’ గొడవెందుకు గుర్తుకు వచ్చిందే?”
“కాఫీ బాగుంది. అందుకే నువ్వు కాఫీ ఇచ్చిందాకా కదలంది” అంది.
సమాధానం చెప్పకపోవడం అటుంచి ఏదో చెప్పి ఉబ్బేసే ప్రయత్నం చేస్తుందనుకొని “అసలు నీకు ఇందులో కలిగిన అనుమానమేంటే?” అంది చేటను తిరిగి చేతిలోకి తీసుకొంటూ.
“చెప్తాను…” అని ఓ క్షణం ఆగి, “మన దత్తుడు తాతయ్య మలబారు దాకా వెళ్ళి అమ్మాళ్ అమ్మమ్మను కొనుక్కొని వచ్చాడంటారు. ఈ కొనడానికీ కన్యాశుల్కానికీ ఏమిటి సంబంధం? మనిషన్నాక ఆడైనా మగైనా మనిషే కదా? మరి వీరిని అమ్మడాలు, కొనడాలు ఏమిటి పశువుల్లా?” అంది కళ్ళలోకి చూసి.
“అదా, చెప్తా! ఆ రోజులలో ఈ ప్రాంతాన ఆడపిల్లలు దొరకక వారున్న చోటకి వెళ్ళి, బేరమాడి, పెండ్లాండి, కొనుక్కొని తెచ్చుకొనేవారు. అందుకు పరిహారమన్న మాట. అయితే ఆ తర్వాత వారి కుటుంబాలతో బంధుత్వాలు వగైనా అంతగా ఎక్కడా ఉన్నట్టు కన్పించవు. పెండ్లిండ్లకు, చావులకు రాకపోకలు కథాజిత్తుగా కూడా ఉండేవి కావు.”
“అంటే బేరం కుదరగానే, మూడు ముళ్ళూ వేయించుకొని వచ్చినావిడ, తల్లిదండ్రులకు చివరి చూపు చూసి రావడమేనంటావా?”
“ఆఁ! దాదాపు అదే. దానికీ ఓ కారణం ఉంది. ఇక్కడికి మలబారు ప్రాంతమేమో చాలా దూరం. ఆ రోజులలో ప్రయాణ సౌకర్యాలు ఇప్పట్లా లేవు. అందుచేత కూడా…” అని “ఇక కన్యాశుల్కం అన్నావ్ కదా… వయసుడిగిన వారికి ఆడపిల్లనిచ్చేందుకు అంత సుముఖత చూపేవారు కాదు వెనకట. పెండ్లి అంటే ఈడూజోడూ కుదరాలి కదా. పైగా ఆడపిల్లలు తక్కువ. అందుచేత ఆ తల్లిదండ్రులను ప్రలోభపెట్టేందుకు ఈ ‘కన్యాశుల్కం’ పుట్టింది. దీనిని మనం పిల్లల అమ్మకం అన్నా, మరేమన్నా జరిగింది మాత్రం అదే. కోరుకున్న పిల్ల కావాలంటే అడిగినంత కన్యాశుల్కం చెల్లించేవారు. అట్లా అయితేనే మనువులు ఖరారయ్యేవి.”
“ఆడవారి ఇష్టాయిష్టాలు అడిగేవారు కాదా?” అడిగింది సీత.
“అంతగా లేదు. అయితే వీటి వలన వైధవ్యాలు సమాజాన ప్రబలినయి. అందుకు ఎదురయ్యే దుష్పరిణామాలను అధిగమించడం కోసం ఆడవారికి శిరోముండనం చేయించడం, ఏవో ఆచారాలని చెప్పి ఉపవాసాలు ఉంచడం, ఇంటెడు చాకిరీ చేయించడం, మగ పురుగు కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వగైరాలు…” అని, “గురుజాడ వారి ‘కన్యాశుల్కాన్ని’ చదవలేదటే…? పుస్తకాల పురుగువి కదా! నన్నెందుకు అడుగుతున్నావ్?” అంది సీతను గమనిస్తూ.
“అది కాదు అత్తయ్యా! అంటే అట్టా తెచ్చుకొన్న వారికి వారిపై సకల హక్కులు దఖలు పడుండేవా?” అడిగింది సీత.
“అన్నట్టే కదా. కొనుక్కోడం వల్ల అవి సంక్రమిస్తయి కదా. నాకో చిన్న అనుమానం”
“అడుగు. అడిగే వారికి చెప్పేవారు లోకువ అని ఊర్కే అనలేదు” అంది నవ్వి.
“మరి ఇప్పుడు మన దగ్గర ప్రబలి ఉన్న ఆచారం వరకట్నం”
“ఊ! ఊ!!”
“అంటే ‘వరుడ్ని’ ఇంత పైకమిచ్చి కొనుక్కోవడమే కదా!”
“చెప్పు. వింటూనే ఉన్నా”
“లోగడ కొనుక్కొన్న వారి హక్కులు… మరి ఇప్పుడు కొనుక్కొంటున్న ఆడవారికి ఉన్నట్టు కనిపించదేం? ఇదీ కొనుగోలు చేయడమే కదా!”
“అవును”
“అంటే కన్యాశుల్కమే హేయమైనదిగా మనం అనుకొంటున్నాం. ఇది అంతకంటే హేయంగా లేదు?” అని నవ్వి, “అక్కడ కొనుక్కుని వస్తువు తనది అన్న భావన బలంగా ఉంటే ఇక్కడ కొనుక్కొని, వారికి అన్ని హక్కులూ ఇచ్చి వారు పెట్టే ఆరళ్ళు భరించడం ఆత్మహత్యా సదృశ్యం కాదా? ఆలోచించి చూడు. ఎంత నిష్ఠూరంగా కనిపిస్తోందో. మంచి మార్పు జగురుతున్న ఈ కాలాన ఇంత వెధవాయిత్వాన్ని మన సమాజం ఎందుకు ఆహ్వానిస్తున్నది?”
“అవును. విడ్డూరమే. ఒక దున్నపోతును కొని అరక కట్టక, పని చేయించక దానికి తన సర్వస్వంపై పెత్తనం ఇవ్వడమే గాక బేలగా, బానిసగా మిగలడం విడ్డూరం కాక ఏమిటి? ఛ. వినడానికే సిగ్గుగా ఉంటుంది.”
“మరి ఇది ‘చెడు’ అని తెలిసీ సమాజపరంగా ఎందుకు ఇలా వేళ్ళూనికొని పోయినట్టు? ఇది అసహజమైందని ఈ మన మేధో సమాజానికి అనిపించదా?”
“అనిపిస్తుంది”
“మరి…?”
“’అనిపించినా ఇది పురుషాధిక్య సమాజం. వారు చెప్పిందే ఇక్కడ వేదం. వారిని అనుసరించడమే ఇక్కడ జీవనయానం. అందుచేత అక్కడ కొన్నా అతనే పెత్తందారు, ఇక్కడ అమ్ముడుపోయినా అతడే పెత్తందారు.”
“మొదట మనం మనుషులం కదా. మనుషులం అన్న దానిని వదిలి ఆడా, మగాలలో ఇదేమిటి? మనుషులు రెండు రకాలా?”
“ఆడది అతని రక్షణలో సుఖమూ, స్థిరత్వమూ పొందుతుందని, పదిలంగా ఉండగలదన్న నమ్మకం కలిగిననాటి నుంచి ఇది నడుస్తోంది. అయితే ఈ అభద్రతా భావనికీ అతనే కారణం. ఇది మరో విషయం. ఇది ఇట్టా ఆపితే… ఈ మధ్య ఏదో పత్రికలో చదివినట్టు గుర్తు. రాజస్థాన్‌లో పెండ్లి చేసుకొన్న భార్యను కూడా మరొకరికి అమ్మే హక్కు ఉన్నట్టు. అది యథేచ్ఛగా జరుగుతున్నట్టు. అది ఈ ప్రభుత్వమూ, సమాజమూ ఆపలేక పోతున్నట్టూ.”
“అవును. సాంప్రదయమనీ, ఆచారమనీ ఆ ముసుగున ఇంకా నడుస్తూనే ఉంది.”
“నాకు తెలీక అడుగుతాను, అత్తమ్మా! మరి ఈ మగవాళ్ళనెక్కడయినా ఆడవాళ్ళు అమ్మిన జాడ ఉందా?”
నవ్వింది పెద్దగా. అది నవ్వు కాదు. ఆనందపు జీరగా కన్పించింది. ఏడవలేక నవ్వు.
“లేదు”
“మరి ఎందుకిలా ఇది నిరాఘాటంగా సాగుతోంది? ఇదీ ఓ రకమైన నరమేధమే కదా!”
“చెప్పాను కదే”, అని తల బాదుకొని “పరుష పురుష సమాజమిది” అంది నెమ్మదిగా.
“అసలు మనం మనుషులమేనా?” అంది సీత మొఖం పెంచుకొని.
“అకస్మాత్తుగా ఎందుకొచ్చిందా అనుమానం?”
“అయ్యో! ఈ వెధవల్ని కన్నదీ మనమే కదా!”
“ఆ…!” అని నోరు తెరిచింది, మగ వెధవల్నన్నందుకు.
“తమని కన్నది ఓ అమ్మేననీ, అట్టా కన్నాకా కూడా మరో ఆడదానితో తమ ప్రవర్తన ఇంత నిస్సిగ్గుగా, లజ్జాకరంగా ఉండడం తప్పు అనీ, ఎంత అహంకారికైనా, మూర్ఖుడికైనా అర్థమౌతది” అంది.
“ఇదిగో ఏమిటీ ప్రశ్నలు? నేను అబ్బాయి విషయం ఏదైనా తెలిసిందా అని అడిగితే ఇట్టా కాని పోని ప్రశ్నలు అడుగుతావేంది?”
“నోరు విప్పకపోయినా అంతా చూస్తునే ఉన్నాం కదా.”
“అత్తయ్యా! పశు పక్షాదుల కంటే మనిషి తెలివిమంతుడనీ, వాటిని తన అదుపులోకి తెచ్చుకొన్నాడనీని (వాటితో పాటు మనల్నీ) అంటారు. ఇది నిజం కూడా. అవి సైతం ఆడజీవికి కోరిక కలిగినా గమనించనిదే వాటి ఛాయలక్కూడా వెళ్ళవు. మరి మనిషి ఇంత విజ్ఞుడై ఉంది వాటికంటే అనాగరికంగా, పాశవికంగా మెలగడం; అందుకు సాంప్రదాయాలనో, చట్టుబండలనో అని ఆడవారిని చెప్పుక్రింది తేలులా ఉంచాలనుకోడం; మతమో మాయో అని బురఖాలను తగిలించడం…” అంటూ ఆవేశపడింది.
“ఇదిగో! నాకెందుకు చెబుతున్నావే ఇదంతా. నిన్ను నేనేమైనా అడిగానా? నేనడిగింది అబ్బాయి ఎప్పుడొస్తాడని. అంతేనా?”
“అత్తయ్యా! నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది సూటిగా సమాధానం కాకున్నా, వాడు రాకపోతే ఎదురు చూడాల్సిన బాధ్యత మనపై ఉందనీ, అది మన బాధ్యత అనీ చెప్పావు. అలా కాదంటే సంబంధాలు కుదరవనీ… అంతేనా?” అని కళ్ళింతగా చేసుకుని చూస్తున్న అత్తను మాట్లాడనివ్వక “ఈ సమాజాన సంసార బంధం ఆడా, మగా ఇద్దరిది. నీకు నేనెంత దూరమో నాకు నువ్వంతే దూరం. ఈ ఆడా, మగా అన్న ముద్ర మనల్నెంత బలహీనుల్ని చేస్తుందో ఆలోచించు. ఇంతటి కఠిన నిజాల్ని అంగీకరంచలేక రకరకాల బలహీనపు భావనలు కలిగిస్తున్నదేం? ఇలా మిగిలామేం? ఇది మన తప్పు కాదు. అనేక సంవత్సరాలుగా మనల్ని ఈ సమాజం పంచుకున్న తీరు, ఆ మలుపే న్యాయమనీ, ధర్మమని మన తలలోన నాటుకొనేలా చేసింది ఈ వ్యవస్థ. అందుచేత ఎదురుగా కనిపిస్తున్న నిజం కూడా నిష్ఠూరంగా కన్పిస్తుంది. మరి మనమేమిటో మనకి అర్థమైన కొందరైనా ఈ నిజాన్ని నిజమని చెప్పడంలో తప్పు లేదు కదా? ఇది తప్పు అని అర్థం చేసుకున్న వారైనా ఆలోచనలో పడతారు కదా. అదీ విందాం. కాని నిజాన్ని నిజమని ధైర్యంగా అందాం. వారు ఇప్పటిదాక చెప్పుకొస్తున్నదేమంటే ఆడవారికున్న సమస్యలేమో ప్రత్యేకమైనవనీ, అవి విడి విడిగా విడిపోయి ఉంటాయనీ కనుక వారుగనే పరిష్కరించుకోగలగాలనీనూ. మనం మనుషులమైనప్పుడు ఇది మనుషుల సమస్య కాదా? ఆడవారి జీవిత కథలో మగవాడు ఉంటున్నప్పుడు దానిని పరిష్కరించే బాధ్యత వీడికి లేదా? అలా అని తప్పుకొని తమ తీరున తీరు మారక ఏ ప్రమేయం లేనట్టు ప్రవర్తించడం ఎంతటి అమానుషమో ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించు. పెద్దగా తేల్చుకోని సమస్యలు కావు కదా?” అంటూ లేచింది.
ఇక ఇది ఏమీ చెప్పదని అర్థం చేసుకొని, “మీ మామయ్యను ఒక్కసారి రమ్మని చెప్పు” అంటూ లోనకు నడిచింది, అసలది ఎందుకొచ్చి వెళ్తోందీ అర్థం గాక.
“అలాగే చెబుతాను” అంటూ తలూపి, “అత్తా! నేను రాగానే నువ్వు అడిగావే ‘పిల్లాడు వచ్చాడా? నచ్చాడా?’ అని. చెప్పనా?…” అని గడప దగ్గర ఆగి “నేనుసలు పెళ్ళి చేసుకోదలచలేదు. చేసుకోను. కనుక చూడడం, నచ్చడం, నచ్చకపోవడం అంటూ ఉండవు కదా?” అంటూ నడిచింది
అవాక్కయిపోయి చూసింది అత్త.