ఆడ పిల్లల పెళ్లిళ్లు – తల్లుల ఆర్భాటం

2
2

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘ఆడ పిల్లల పెళ్లిళ్లు – తల్లుల ఆర్భాటం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రా[/dropcap]మాపురం వరంగల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదు సంవత్సరాల క్రితం వరకు అక్కడ ఏమీ మార్పు లేదు. చూస్తూండగా సందడి పెరిగింది. పంచాయితీ వారు సిమెంట్ రోడ్లు వేయించేరు. ప్రజలకు శుభ్రత పట్ల అవగాహన పెరిగింది. నగరాలు త్వరగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో జనం దృష్టి రామాపురం వైపు మళ్లింది.

భూమి సారవంతమైనది. పెరడు లోనే కూరగాయలు పండించుకోవచ్చు. ఊరి జనం శాంతి, స్నేహ భావాలతో కలసి మెలసి ఉంటారు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం అందరి దృష్టినీ ఆకర్షించింది.

శంకర రావు వరంగల్ మున్సిపల్ ఆఫీస్‌లో వాటర్ వర్క్స్ శాఖలో పని చేసేరు. పైపులైన్ల రిపేర్, భద్రత, తనిఖీల కోసము తరచుగా రామాపురం వెళ్లేవారు. కొన్నేళ్ల క్రితం అక్కడ రెండు ఎకరాల పొలం అమ్మకానికి వచ్చింది. పొదుపు చేసిన సొమ్ము కొంత, మిగతాది అప్పుగాను ఆ పొలం కొన్నారు. రిటైర్మెంట్ కాలానికి అక్కడ శివాలయం వీధిలో ఓ స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు. అక్కడ సెటిల్ అయ్యేరు. ఆయన కొడుకు వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ నాన్నలతోపాటు  అక్కడ నివసిస్తున్నాడు.

నాలుగేళ్ల క్రితం శంకర్ రావు కాలం చేసేరు. ఆయన భార్య భవాని. కొడుకు కోడలుతో అక్కడే ఉంది. దైవ చింతన కలది. రామాయణం, భాగవతం, భారతం వంటి గొప్ప గ్రంథాలు, ప్రముఖ రచయితల పుస్తకాలు నిరంతరం చదువుతుంది. అందరితో స్నేహంగా ఉంటుంది. వారు అడిగినప్పుడు మంచి సలహాలు ఇస్తుంది. ఎవరికీ ఏ సహాయం కావాలన్నా ఆమె సిద్ధమే. నిల్వ ఊరగాయలు, పచ్చళ్లూ ఎలా పెట్టాలి, శుభకార్యాలకు ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలి, పూజలూ నోములూ, వ్రతాలూ నిర్వహించే పద్ధతులేమిటి – ఇటువంటి విషయాలలో అక్కడివారు ఆమెతో మాట్లాడి తెలుసుకుంటారు. వారి ఆర్థిక స్థాయిని, అవసరాలను, దృష్టిలో పెట్టుకొని, తగిన రీతిలో ఆచరణీయమైన సూచనలు ఇస్తుంది. అలా అందరికీ ప్రీతిపాత్రమై పెద్దమ్మ గారు అని మర్యాద పొందింది. వయస్సు డెభై ఐదు ఏళ్ల పైమాటే.

రామాపురంలో రామారావు అనే స్కూల్ మేష్టారు ఉన్నారు. మొదట ప్రాథమిక పాఠశాలల్లో చేరినా, డిగ్రీలు సంపాదించుకొని పదోన్నతి పొంది, ఇప్పుడు హై స్కూలులో లెక్కలు బోధిస్తున్నారు. సెలవులలోనూ, ఆదివారాలలోనూ ఆ ఊరి జనం ఇళ్లకు వెళ్లి వారితో తమ పిల్లలను చదివించవలసిన అవసరం గురించి ఎంతో ఓర్పుతో చెప్పేవారు. వార్తా పత్రికలు తీసుకు వెళ్లి చదివి వినిపించి, ఫోటోలు చూపించి బాగా చదువుకున్న పిల్లల జీవితాలు ఏ విధంగా మంచి భవితకు దారి తీస్తాయో వివరించే వారు. ఇతర టీచర్ల సహకారం కూడా తీసుకునే వారు. కొత్త విద్యా సంవత్సరం ఆరంభమయ్యే సమయంలో పిల్లలను బడిలో చేర్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేసేవారు.

ఆ హై స్కూలులో తరగతులన్నీ విద్యార్థులతో కళకళలాడుతూ ఉన్నాయి. పాఠశాలలో సౌకర్యాలకు, ఆధునికీకరణకూ స్థానికమైన ధనవంతులూ, పూర్వ విద్యార్థులూ, కొందరు టీచర్లు కూడా విరాళాలు ఇస్తారు. లైబ్రరీ, లాబొరేటరీ, కంప్యూటర్ విభాగమూ, క్రీడా సామాగ్రి సమకూర్చేరు.

రామారావు భార్య అరుణ. గోపీ చందు, అనుపమ వారి పిల్లలు. గోపీ ఎమ్ ఎస్సీ చదివి హైదరాబాదులో ఒక మందుల కంపెనీలో ఉద్యోగంలో చేరేడు. అనుపమ బీఎస్సీ చదివింది. ఇరవై మూడేళ్లు. ఇంక పెళ్లి చేయాలని సంబంధాల కోసం చూస్తున్నారు. అశోక్ అనే వరుడు గురించి ఒక పెద్ద మనిషి ద్వారా వివరాలు తెలిసేయి. అతడు ఖమ్మంలో సి.ఏ. (ఛార్టర్డ్ అకౌంటెంట్) గా ప్రాక్టీసు చేస్తున్నాడు. తల్లీ, ఇద్దరు అక్కలూ వున్నారు. అక్కలిద్దరికీ వివాహాలు అయ్యేయి.

అశోక్ తండ్రి అతని చిన్నతనం లోనే మరణించేడు. మేనమామల సహాయంతో కష్టపడి చదువుకున్నాడు. ఆస్తులేవీ లేవు. అద్దె ఇంట్లోనే తన తల్లితో నివాసముంటున్నాడు. రామారావు కుమార్తె గురించి తెలుసుకున్నాడు. వారి జీవన విధానమూ, అనుపమ గురించీ రామా పురంలో తనకు తెలిసిన వారి ద్వారా వివరాలు సేకరించేడు. కొంత కాలానికి తల్లి, అక్కలిద్దరితో పాటు పెళ్లి చూపులకు వెళ్లి అనుపమను చూసి వచ్చేడు.

కొన్ని రోజుల తరువాత మాట్లాడడానికి రమ్మని రామారావుకు కబురు పంపేడు. రామారావుకు అతని పెళ్లినాడు అతని మామ తన కూతురు అరుణ పేర ఒక ఎకరం పొలం ‘పసుపు కుంకుమలు’గా ఇచ్చేడు. దాని విలువ ఇప్పుడు కోటి రూపాయల పైమాటే.

ఆ కుటుంబాలలో  పొలం ఇవ్వకుండా వివాహాలు జరగవు. కనుక అర ఎకరం పొలం ‘పసుపు కుంకుమలు’గా అనుపమకే. పైన లాంఛనాలు, శుభ లేఖలు, కల్యాణ వేదిక, భోజనాలు, కొత్త బట్టలూ – వీనికి పదిహేను లక్షలు రూపాయల ఖర్చుకు సిద్ధపడాలి.

రామారావు మేస్టారుకి ఓ పక్క సంతోషం, మరోపక్క ఖర్చులు తట్టుకోగలనా అనే బాధ ఉన్నాయి. వీనికి తోడు అరుణకు ఈ సంబంధం ఎక్కువ నచ్చ లేదు. “అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వచ్చిన మొదటి సంబంధమే. చేసేయాలని రూలు ఏమైనా ఉందా? మనం ఏభై లక్షల ఆస్తి ఇస్తున్నాము. మంచి ఆస్తి కలవాడు వచ్చినప్పుడు చూడచ్చు. అనుపమకు వయస్సు మించిపోలేదు. కంగారు ఎందుకూ..” అని భర్తతో పది సార్లు నస పెట్టింది.

రామారావు భవాని దెగ్గరకు వెళ్లేడు. తన సమస్య, భార్య అభిప్రాయాలు వివరించి, “పెద్దమ్మ గారూ  – అశోక్ యోగ్యుడని నాకు తోస్తోంది. అరుణను మీ వద్దకు తీసుకు వస్తాను. అనుభవం కలవారు. మంచి సలహా ఇవ్వండి” అన్నాడు.

మర్నాడు అరుణను, రామారావును, భవాని సాదరంగా లోనికి రమ్మంది. వారి మాటలు వింది. “చూడమ్మా అరుణా, ఊళ్లో మేష్టారు గురించి అందరికీ తెలుసు. మీ కుటుంబమంటే కూడా అందరికీ గౌరవమే. వరుడు పెళ్ళికి ఒప్పుకున్న నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని నా అభిప్రాయం. అక్కడ ఖమ్మంలో ఉండేది అశోక్, అతని తల్లి మాత్రమే. ఆమెకూ పెద్ద వయసు వచ్చింది కదా. మీ ఇంట్లో అమ్మాయి సంప్రదాయంగా పెరిగింది. నీవు నీ అత్త మామలను, ఆడ బిడ్డలనూ ప్రేమతో, గౌరవంతో చూసిన విషయం అనుపమకు తెలుసు. మీ అత్తమ్మ మరణించి ఇరవై ఏళ్లయింది. తొంభయి సంవత్సరాల మీ మామ మీతోనే వున్నారు. పెద్దాయనకు అన్ని వేళలా ఏం కావాలో  నీవు అమర్చిన విషయం ఊళ్లో అందరికీ తెలుసు”.

“అశోక్ ఆలోచనలు ఇలా సాగి ఉంటాయి – పెళ్లయి వెళ్లిన మర్నాటి నుండి అత్తమ్మను బయటకు ఎలా పంపాలా అనే ఆలోచన ఈ అనుపమ చేయదు – అని. అంతే గానీ ఇంతకన్నా అందం, ఆస్తి, అంతస్తూ ఉన్న అమ్మాయి ఒక C.A. నో, మరో M.C.A. నో దొరకక కాదు”.

“అతనికి ఆస్తి లేదన్న లోపమే కదా నీ బాధ. అరుణా – సంస్కారాన్ని మించిన ఆస్తి ఏముంటుంది చెప్పు?”

“రామారావూ ఓ పని చెయ్యవయ్యా. నువ్వు ఖమ్మం వెళ్లి నీ బంధు మిత్రుల ద్వారా అశోక్ గురించి అతని తల్లి గురించి వివరాలు సేకరించు. మంచి మనుషులు అని తెలిస్తే ముందడుగు వెయ్యండి. ఆ పై మీ ఇష్టం” అన్నది భవాని.

ఆ విధంగా అశోక్ అనుపమల వివాహం జరిగింది. ఆమె హాయిగా ఖమ్మంలో ఉంది.

***

భవాని అక్క కూతురు శ్యామల. రామాపురానికి దగ్గరలోనే ఓ చోట ప్రైవేట్ బడి ఆఫీసులో పని చేస్తోంది. నలుగురికి ఉపయోగపడే పని చేయాలని, ‘మ్యారేజీ కన్సల్టెన్సీ’ని నిర్వహిస్తోంది. పెళ్లి సంబంధాల లిస్టులు అన్నీ రాసుకొని, వివరాలతో ఫైళ్లు తయారు చేస్తుంది. వచ్చిన వారికి అవి ఇస్తుంది. నగర జీవితాలలో నేడు పెను మార్పులు చోటు చేసుకొన్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. సోషల్ గేదరింగ్స్ తగ్గేయి. పేరంటములు, ఇరుగు పొరుగు వారు కలుసుకోవడమూ, మాటా మంతీ ఇప్పుడు లేవు. సెలవు రోజుల్లో ‘బయట’ భోజనం చేయడం, ఎవరికీ వారే సినిమాలు, విహారాలు – ఇలా నడుస్తోంది నేటి వ్యవస్థ. అందుచేత, మేరేజి బ్యూరోలు పెళ్లి సంబంధాలకు నేడు వేదికలయ్యేయి.

శ్యామల సంబంధాలు చూసుకోడానికి వచ్చిన వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కొందరు తల్లులు ఆడపిల్లల పెళ్లి విషయంలో అతిగా జోక్యం కలుగచేసుకొంటున్నారు. ప్రవచన ఉపన్యాసాలు విని, యూ ట్యూబ్ చూసి వాళ్లే నక్షత్రం సరిపడ లేదని వెంటనే వద్దనేస్తున్నారు. వరుని ఫోటో చూసి వంకలు; “ఆమ్మో బాగా లావు, చాలా పొట్టి, అబ్బాయి నలుపు” ఇలా వడపోత ఎక్కువ అయింది. “ఆ కంపెనీ మంచిది కాదు”, “అంత తక్కువ జీతంతో ఎలా బ్రతుకుతారు” ఇలా అనుకుని సంబంధం వివరాలైన తండ్రికి గాని, వధువుకు గానీ చేరనివ్వటం లేదు.

సుధ అన్న ఆమెకు ఇద్దరమ్మాయిలు. శ్యామల దగ్గరకు గత ఆరు సంవత్సరాలుగా ప్రతి వారం వస్తుంది. అన్నిటికీ వంకలే. ఈ లోగా పిల్లలిద్దరూ చదువులయ్యి ఉద్యోగాలలో చేరేరు. వారి వయస్సులు ఇరవై ఆరు సంవత్సరాలు దాటి పోయేయి. సుధను చూసినప్పుడు శ్యామలకు తన బంధువులామె గుర్తుకొస్తుంది. ఇది జరిగి ఇరవై సంవత్సరాలు దాటింది. వచ్చిన సంబంధాలన్నింటికీ వంకలు పెట్టింది. ఆమె కూతురు అందగత్తె ఏమీ కాదు. తెలివైనది. బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఢిల్లీలో స్థిరపడింది. అక్కడ ఒక ఇంజనీరు ఆమెను వివాహమాడడానికి ఇష్టపడి కబురు పంపేడు. ఈ బంధువు గారు మాత్రం “ఇద్దరూ నలుపే. రేపు పుట్టబోయే పిల్లలు ఎలా వుంటారో? అయినా మా అమ్మాయి ఉద్యోగం చూసి పెళ్లి కొడుకులు క్యూ లో నిలబడతారు” అంది. నేటికీ ఆమెకి పెళ్లి కాలేదు.

ఇలా ఆడపిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లుల ఆర్భాటం పెరగడానికి కారణమేమిటి? మిగతా కుటుంబ సభ్యుల ప్రమేయమే లేదా – అని శ్యామల బాధపడి – ఈ పోకడలను తన పిన్ని భవాని తోటి చర్చిస్తూ ఉంటుంది.

“పిన్నీ, ఈ మధ్య ఒకామె తన కూతురు జర్మనీలో ఓ బ్యాంకు మేనేజరుగా పని చేస్తోంది. ఆ వుద్యోగం వదలదు. అక్కడే స్థిరపడడానికి ఇష్టపడే వరుడుని చెప్పండి అంది”. మరో ఆమె “మా అమ్మాయి బిట్స్ పిలానీలో M.Tech  చేసి సింగపూర్ లో ఉద్యోగం సంపాదించింది. అమెరికా వెళ్లి Ph.D చెయ్యాలని కోరిక. అందుకు ఇష్టపడే పెళ్లి కొడుకుని చెప్పండి” అంది.

“ఇలా గిరి గీసుకుని తమకు మాత్రమే అనుకూలంగా ఉండే వరుడు కావాలంటే పెళ్లిళ్లు ఎలా అవుతాయి పిన్నీ. వరుడు వెంపు వారికి కూడా కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి కదా. కోరికలు అత్యాశలు అయిపోతున్నాయి. ఈ కండిషన్ల వల్ల ఆడపిల్లల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. వీటి ప్రభావం కుటుంబ వ్యవస్థ మీద పడుతోంది. నాకు చాలా ఆందోళనగా వుంది” అంది శ్యామల.

“నిజమే శ్యామలా! నేటి తల్లుల మనస్సుల్లో ఏముందో? తమకు తీరని కోరికలు పిల్లల ద్వారా తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారు. నాకూ చాలా బాధగా వుంది. జీవితమంటేనే సర్దుకుపోవడం. ఇలాంటి ఆర్భాటాలకు అడ్డుకట్ట పడాల్సిందే. ఆ మంచి రోజు కోసం వేచి చూడాలి మరి” అంది భవాని సాలోచనగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here