ఆడపిల్లల తండ్రిగా – గుమ్మడి

5
2

[dropcap]నా[/dropcap]న్నంటే – పసితనంలో బిడ్డకి తన గుండె మీద నడక నేర్పించిన ప్రేమమూర్తి!.. నాన్నంటే – వేలు పట్టుకుని నడిపించిన మార్గదర్శి!.. నాన్నంటే – తన సంతోషాలు, సరదాలు పక్కన పెట్టి బిడ్డ అభివృద్ధికి పాటుపడిన ప్రతిఫలం ఆశించని త్యాగం!.. నాన్నంటే – సిగరెట్ పరిమళ వీచిక!.. నాన్నలో ఉన్న చిన్నచిన్న వ్యసనాలను కూడా ప్రేమించబుద్ధి అవుతుంది.

మాటలలో సౌజన్యం, చేతలలో కరుణ, కళ్ళలో ప్రేమ తొణికిసలాడుతూ అచ్చమైన తెలుగింటి తండ్రిలా ఉండే నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. కోడె వయసులోనే ముసలి పాత్రలు వేస్తూ ఆ పాత్రలలో జీవించిన నటుడు గుమ్మడి. తన తోటినటులు అందరూ హీరోలుగా రాణిస్తూ ఉంటే తను మాత్రం సహాయ పాత్రలు పోషిస్తూ ఆ పాత్రలకి హుందాతనం తీసుకువచ్చారు. ఇంకా చెప్పాలంటే వయసులో తన కన్నా పెద్దవారికి తండ్రిగా, భర్తగా నటిస్తూ ఆ విషయం మీదకు దృష్టి పోనీయకుండా నటించిన గొప్పనటుడు ఆయన. ముఖ్యంగా ఆడపిల్లల తండ్రిగా, ఆ పాత్రలలో తనకు పోటీ లేదన్నట్లు నటించారు గుమ్మడి.

మహానటి సావిత్రికి తండ్రిగా ఎక్కువ చిత్రాలలో నటించారు గుమ్మడి. వాస్తవానికి గుమ్మడి పుట్టింది 1927లో, సావిత్రి పుట్టింది 1935లో. ఇద్దరి మధ్యా వయసు తేడా కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే! అన్నగా నటించాల్సిన వయసు. కానీ తండ్రిగా జీవించారు. సావిత్రికి తండ్రిగా ఆయన నటించిన మొదటి సినిమా మాయాబజార్ (1957). మాయాబజార్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ఆ సినిమా గురించి చెబితే చర్విత చర్వణం అవుతుంది.

‘సుమంగళి’ (1965) లో లక్షాధికారియైన శ్రీహరిరావు (గుమ్మడి) కి ఏకైక కుమార్తె శారద (సావిత్రి). ఆ తండ్రికి కూతురంటే ఎంత ఇష్టమంటే తను కట్టించిన కాలేజీకి కూతురు పేరుతో ‘శారదా కళాశాల’ అని పేరు పెడతాడు. తను మొదలు పెట్టబోయే ఏ వ్యాపారానికైనా కూతురు చేతుల మీదుగా డబ్బు తీసుకుంటే కలిసి వస్తుందని అయన నమ్మకం. ఆ కాలేజీకి తెలుగు లెక్చరర్‌గా వస్తాడు విశ్వం (ఏ.యన్.ఆర్.). ప్యాంటు, షర్టు, టక్కుతో మోడరన్‌గా ఉంటాడు విశ్వం. అతని వాలకం చూసి శారద తండ్రితో “సరిగ్గా చూడండి నాన్నా! ఆ మోహంలో తెలుగు చెప్పే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? తెలుగు మాష్టారంటే ఎలా ఉండాలి? ధోవతి, చొక్కా, తలపాగా, పిలక జుట్టు..” అంటుంది గారాబంగా. “అమ్మాయి చెప్పింది అక్షరాలా కరెక్ట్. నువ్వీ ఉద్యోగానికి పనికిరావు. వెళ్ళు” అంటాడు. తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చి నచ్చచెబుతాడు.

“అవున్నాన్నా! అయన చాల గొప్పవారు. ఆరోజు అయన మొహం మీదే ఏవేవో అనేశాం..” అంటుంది శారద. తల్లి వచ్చి “అందుకే ఆలోచించకుండా ఎవరినీ ఏమీ అనకూడదు. అమ్మాయిగారు వద్దనటం, అయ్యగారు సరేననటం. ఇప్పుడే మంటారు?” అంటుంది. తండ్రి ఒక్క క్షణం భార్య వంక చూసి, కూతురితో “అమ్మలూ! రేపటి నుంచీ నువ్వు ఇంట్లోనే ఉండు. మీ అమ్మని కాలేజీకి పంపిద్దాం” అంటాడు. “అవునులెండి! నేనేం చెప్పినా మీకు ఎగతాళిగానే ఉంటుంది. ఈ మాత్రం దానికి కాలేజీకి వెళ్ళనక్కర్లేదు” అంటుంది తల్లి. తల్లీదండ్రుల సరస సంభాషణలు విని హాయిగా నవ్వుకుంటుంది శారద. ఈ సన్నివేశం చూస్తుంటే ఆడపిల్లలకి కూడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇచ్చే తండ్రి దగ్గర అమ్మాయిలు ఎంత ఆనందంగా ఉంటారో అర్థం అవుతుంది. ఈ సినిమా నాటికి సావిత్రి శరీరం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఆ లావు మీదకు దృష్టి పోకుండా, పెళ్ళికాని అమ్మాయి లాగానే చలాకీగా, హుషారుగా నటించింది.

అదే కాలేజీలో పనిచేయటానికి వచ్చిన విశ్వంని ప్రేమించి, పెళ్ళాడాలని నిర్ణయించుకుంటుంది శారద. అది తెలిసి కోపంతో శ్రీహరిరావు కూతురిని చెడామడా తిట్టేస్తాడు. చివరికి “నేను చచ్చాననుకుని ఈ పెళ్లి చేసుకో!” అంటాడు. అప్పటిదాకా తండ్రి తిట్లన్నీ తలవంచుకుని విన్న శారద కళ్ళెత్తి చూస్తుంది. ఆ కళ్ళల్లో నుంచీ రెండు కన్నీటి బొట్లు చెంపల మీదకు జారతాయి. ‘ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం తండ్రి స్థానం చెక్కుచెదరనిది ఆమె మనసులో’ అని అర్థం అవుతుంది ప్రేక్షకులకు. ఈ సన్నివేశంలో గుమ్మడి, సావిత్రి పోటీపడి నటించారు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి వారిద్దరికీ ఇలాంటి అభినయం కొట్టినపిండి లాంటిది.

శారద వివాహం అయిన తర్వాత మొదటిరాత్రి జరగక ముందే విశ్వానికి యాక్సిడెంట్ అయి దాంపత్యజీవితానికి దూరం అవుతాడు. ఆ విషయం తెలిసిన శ్రీహరిరావు వచ్చి “భగవంతుడు నిన్ను ఎంత చిన్నచూపు చూసాడు తల్లీ!” అంటూ ఆవేదన చెందుతాడు. అంతేకానీ, “నా మాట విననందుకు తగినశాస్తి అయింది” అని సంతోషించడు. ఎందుకంటే కన్నబిడ్డ మీద కక్ష సాధించాలని ఏ తల్లీదండ్రీ కోరుకోరు. కూతురికి వచ్చిన కష్టం వినగానే బాధ పంచుకోవటానికి పరుగున వస్తాడు. సుమంగళి చిత్రంలో తండ్రీ కుమార్తెల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు.

‘మూగమనసులు’ (1964) లో జమిందారు (గుమ్మడి) కుమార్తె రాధ. వంటవాడు వచ్చి జమిందారు భార్య (సూర్యకాంతం)ని “అమ్మగారూ! టిఫిన్ ఏం చేయమంటారు?” అని అడుగుతాడు. ఆమె కస్సున లేచి “అన్నీ నా ఇష్టప్రకారమే జరుగుతున్నాయా! అడుగు మీ అయ్యగారిని..” అంటుంది విసురుగా. “అయితే అమ్మాయిని రానీ..” అంటాడు జమిందారు. “ప్రతిదానికీ అమ్మాయి.. అమ్మాయి.. రేపు రాధమ్మకి పెళ్ళయి అత్తవారింటికి వెళితే ఏం చేస్తారు?” అంటుంది. “ఈ ప్రశ్న వందసార్లు అడిగావు. వందసార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు. మళ్ళీ చెబుతున్నాను. ఆ చేసుకునే వాడొచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మనింట్లో, నాతోనే ఉంటుంది. తెలిసిందా!” అంటాడు. మూతి మూడు వంకర్లు తిప్పుతుంది సవతి తల్లి.

ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా, ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరు. మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లలకి బయట వ్యాపకాలు తక్కువ. చెంగుచెంగున లేడిపిల్లలా గెంతుతూ, నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే కన్నవారికి కన్నులపంటగా ఉంటుంది. అటువంటి అమ్మాయి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్లుంటుంది. ఆ రోజుల్లో ఇప్పటిలాగా కాదు. ఒకసారి పెళ్ళయి వెళ్ళిపోతే ఏ ఏడాదికో, రెండేళ్ళకో ఒకసారి పుట్టింటికి వచ్చేది! అది కూడా భర్త, అత్తమామలు అందరూ అనుమతిస్తేనే! అందుకే ఇంట్లో పెద్దలు “ఆడపిల్ల ఆడ..పిల్లే గానీ, ఈడ..పిల్ల కాదు” అనేవారు నర్మగర్భంగా. అందువల్ల ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు బాధగా కన్నీరు పెట్టుకుంటారు. ఇక్కడ రాధ కూడా వెళ్ళేటప్పుడు తండ్రిని కౌగలించుకుని కన్నీరు కారుస్తుంది. తండ్రి కూతురు తలని గుండెకు హత్తుకుని వదలలేక, వదలలేక వదిలి పెడతాడు. రాధ భర్తతో కలసి పడవలో గోదావరి దాటి వెళ్ళిపోతూ ఉంటే తండ్రి మేడమీద నిలబడి ఆ పడవ కనుమరుగు అయ్యేదాకా అలాగే చూస్తూ నిలబడిపోతాడు. జమిందారు పాత్రలో గుమ్మడి అసలు సిసలైన తండ్రిగా కనిపిస్తాడు.

రాధకి భర్త పోయాడని తెలిసిన జమిందారు “అమ్మా!” అంటూ ఒక్క పెట్టున అరుస్తాడు. దానితో ఆయన కంఠం మూగబోతుంది. అక్కడినుంచీ గుమ్మడి పాత్రకి సంభాషణలు లేవు. తన అభినయంతో ప్రేక్షకుల ప్రేక్షకుల మనసు కరిగించేస్తాడు గుమ్మడి. తండ్రీ కుమార్తెల మధ్య ఉన్న ప్రేమానురాగాలను మనసుకు హత్తుకుపోయేటట్లు అభినయించారు సావిత్రి, గుమ్మడి ఈ చిత్రంలో. ఇంకా పూజాఫలం, విమల, నవరాత్రి, మనుషులు మమతలు, నిండు దంపతులు, సిరిసంపదలు, ప్రేమ పగ మొదలైన చిత్రాల్లో గుమ్మడి, సావిత్రి తండ్రీ కుమార్తెలుగా నటించారు.

‘కళ్యాణ మంటపం’ (1971) లో చంద్రముఖి (కాంచన) వేశ్య కులంలో పుడుతుంది. ఆమె కడుపులో ఉండగానే తండ్రికి దూరమౌతుంది. ఒక ధనవంతుడు ఆమె తల్లిని చేరదీస్తాడు. అతనే తండ్రి అనుకుని “నాన్నగారూ! ఈ రోజు మా స్కూల్లో పరీక్ష పెట్టారు. నేను ఫస్టున పాసయ్యాను..” అని చెబుతూ ఉండగానే అతను వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు. తల్లి కన్నీళ్లు కారుస్తూ ‘అతను నీ తండ్రి కాదు’ అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది.

ఒకరోజు అనుకోకుండా కన్నతండ్రే ఆమె ఇంటికి వస్తాడు. తల్లీదండ్రీ చిన్నతనం లోనే ప్రేమించుకుంటారు. కానీ వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించరు. ఆమె వేశ్య కులంలో పుట్టినదన్న సాకుతో అతనికి వేరే పెళ్లి చేస్తారు. ఆ రోజు ఎదురింట్లో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వచ్చి తల్లి పాట విని లోపలికి వస్తాడు తండ్రి. ధోవతి, లాల్చీ, భుజమీద ఉత్తరీయం, తెల్ల మీసాలు, తెల్ల జుట్టుతో చూపులకు సౌజన్యమూర్తిలా ఉంటాడు. ఇక్కడ తండ్రిగా గుమ్మడి నటించాడు. “ఆయనే మీ నాన్నగారు” అని చెబుతుంది తల్లి గుర్తుపట్టి. సంతోషంగా దగ్గరకి రాబోయి, సందేహంగా ఆగిపోయి, “నేను మిమ్మల్ని తాకవచ్చా!” అని అడుగుతుంది. “అమ్మా!” అంటూ గభాలున దగ్గరకు లాక్కుని గుండెకు హత్తుకుంటాడు.

చంద్రముఖి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి, కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. “నాన్నగారూ! నేను మీ కన్నబిడ్డనై ఉండి కూడా అందరి చేత వేశ్య కూతురు అని పిలవబడుతున్నాను” అంటుంది దీనంగా. వెంటనే భరించలేని ఆవేదనతో ఒక్కక్షణం కళ్ళు మూసుకుంటాడు. ఆమె చేతులు, తల ఆత్మీయంగా స్పర్శిస్తూ “నీ పేరేమిటి తల్లీ!” అని అడుగుతాడు. “చంద్రముఖి” అని చెబుతుంది. “నా పేరే నీకు పెట్టిందన్న మాట. నా పేరేమిటో తెలుసా! చంద్రశేఖర రావు” అని చెబుతూ, “ఈ పరిస్థితులలో నిన్ను ఆశీర్వదించటం తప్ప నేనేమీ చేయలేను. అంత యోగ్యత కూడా లేదు” అంటాడు. ఈ సన్నివేశంలో చాలాకాలం తర్వాత తన తొలి సంతానాన్ని కళ్ళారా చూసుకుంటున్నట్లు చూస్తాడు గుమ్మడి. అంతలోనే దూరమైన సంగతి గుర్తొచ్చి, నిట్టూరుస్తూ ఏమీ చేయలేని నిస్సహాయతని చక్కగా వ్యక్తీకరించాడు. మాటల్లో సౌజన్యం, మమత ధ్వనిస్తూ సంభాషణలు చెప్పటం చూస్తే నిజమైన తండ్రి ఇలాగే ఉంటాడు కదా! అనిపిస్తుంది.

‘కృష్ణవేణి’ (1974) సినిమాలో కృష్ణవేణి (వాణిశ్రీ) కి డెలివరీ జరిగేటప్పుడు నరాల బలహీనత వల్ల మతి చలిస్తుంది. కొన్నాళ్ళు ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోయి మామాలు మనిషి అవుతుంది. కానీ అందరూ ఇంకా పిచ్చిదానిలాగానే చూస్తూ ఉంటారు. నాకు బాగానే ఉంది. అన్నీ అర్ధమవుతుతున్నాయి అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఆఖరికి చెల్లెలిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నవాళ్ళు కూడా “పెళ్లి కూతురి అక్కకి పిచ్చిట. పిచ్చి వంశం లోని పిల్లని చేసుకోవాల్సిన ఖర్మ లేదు” అని పీటల మీద నుంచీ లేచి వెళ్ళిపోతారు. కృష్ణవేణి వాళ్ళని బ్రతిమిలాడి, కాళ్ళు పట్టుకున్నా, కనికరించకుండా విదిలించుకుంటాడు పెళ్ళికొడుకు.

పెళ్లి తప్పిపోయిందని కన్నీళ్లు పెడుతున్న తండ్రి దగ్గరకు వచ్చి “నాన్నా! నా మూలంగానే కదూ మీకీ కష్టాలన్నీ! నేను చచ్చిపోయినా బాగుండేది” అంటుంది. తండ్రి గభాలున ఆమె నోరు మూసేస్తాడు. “అంత మాట అనకు తల్లీ! భగవంతుడు ఒక అమ్మాయిని పుట్టించాడంటే ఆమెకి భర్తని కూడా ఎక్కడో నిర్ణయించే ఉంటాడు. ఆ విషయం తెలియక మనం పెళ్లి నిశ్చయించాము. తప్పిపోయింది. ఇంత మాత్రానికి ఎందుకే బాధ పడతావు పిచ్చిదానా!” అంటాడు. కృష్ణవేణి చివ్వున తలెత్తి “ఆ.. ఆ.. ఆ మాటే నాన్నా అందరూ అంటున్నది పిచ్చిది అని. మీరు కూడా నన్ను పిచ్చిదనే అంటున్నారు” అంటుంది ఏడుస్తూ. “లేదమ్మా! ఏదో మాటవరసకి అన్నాను. నువ్వు పిచ్చిదానివి కాదు. కానే కాదు” అంటూ కూతురు తల గుండెకు హత్తుకుని ఏడ్చేస్తాడు తండ్రి కూడా. ఈ సన్నివేశంలో గుండెను పిండేసినట్లు నటించారు గుమ్మడి, వాణిశ్రీ.

ఒకప్పుడు ఆడపిల్ల తండ్రి అంటే సమాజంలో చాలా చిన్నచూపు ఉండేది. భర్త ఆమెని పుట్టింట్లో వదిలిపెడితే అందరూ చులకనగా చూస్తారు. అందువల్ల కూతురు కాపురంలో కలతలు రాకూడదని తండ్రి, అత్తవారింట్లో ఒదిగి ఒదిగి నడుచుకునేవాడు. వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తేవాడు. అయినా ఛీదరింపులు, ఛీత్కారాలు తప్పేవికాదు. అవన్నీ భరిస్తూ ఆత్మాభిమానం చంపుకుని, అవమానాలు సహించి ఒక్కసారి కన్నకూతురిని కళ్ళారా చూసుకునేందుకు అత్తవారింటి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన కన్నతండ్రికి గుప్పెడు మెతుకులు పెట్టటానికి కూడా స్వాతంత్ర్యం ఉండేది కాదు అమ్మాయిలకి అత్తవారింట్లో. భయపడుతూ, భయపడుతూ మాట్లాడతారు.

ఓ సినిమాలో (ఇద్దరు అమ్మాయిలు–1970) కూతురు (వాణిశ్రీ) ఊరు వెళ్ళటానికి చిరుగులు లేని చీర ఒక్కటైనా లేదని, కొత్తచీర కావాలని అడుగుతుంది. బట్టలకొట్లో గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు తండ్రి (గుమ్మడి). కొత్త చీర కొనే స్తోమత లేక, కూతురి మనసు నొప్పించలేక చీర దొంగిలించి తెస్తాడు. తర్వాత ఆ విషయం తెలిసిన కూతురు “నువ్వు దొంగతనం చేసావా నాన్నా!” అంటుంది అపనమ్మకంగా. “ఆడపిల్లను కన్నతండ్రికి దొంగతనం ఒక విశేషమా తల్లీ!” అంటాడు కన్నీళ్ళతో. ఆనాటి ఆడపిల్లల తండ్రుల దీనస్థితికి అద్దం పడుతుంది ఈ సంఘటన.

ఆడపిల్లల జీవితం అంత దయనీయంగా మారటానికి కారణం ఏమిటి? అని ఆలోచించారు కొందరు ఆధునిక తండ్రులు. తిండి, బట్ట కోసం భర్తమీద ఆధారపడటమే కారణం అని తోచింది. ఆ స్థితిలో నుంచీ బయటపడాలంటే స్త్రీ కూడా విద్యావంతురాలు కావాలి, సంపాదనాపరురాలు కావాలి అనే విషయం గ్రహించారు. ఆడపిల్లకి కూడా చదువు చెప్పించారు. స్త్రీ గడపదాటి బయటకు వెళ్ళటం పరువు తక్కువ అనే ఛాందసభావాన్ని వదిలేశారు. ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు ఆధునిక తండ్రులు.

అందుకే “కనీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రులను వృద్దాప్యంలో ఆదరించటం బిడ్డల ధర్మం. మా అమ్మా నాన్నలకి ఇష్టం లేని పని నేను చేయను” అంటూ తన ప్రేమను కూడా త్యాగం చేస్తుంది కుమార్తె (చక్రవాకం–1972–వాణిశ్రీ).

ఇంకా చక్రధారి, జీవనతరంగాలు, సతీ సావిత్రి, కధానాయిక మొల్ల, ఆరాధన మొదలైన చిత్రాల్లో గుమ్మడి, వాణిశ్రీ తండ్రీ కూతుళ్ళుగా నటించారు. ఆ రోజుల్లో హీరోయిన్ ఎవరైనా తండ్రి మాత్రం గుమ్మడే! గుమ్మడి ఆహార్యం కూడా ధోవతి, లాల్చీ, కళ్ళజోడుతో చూడగానే పితృభావం కలిగించేటట్లు ఉంటుంది. చిత్రపరిశ్రమ లోని దాదాపు అందరు హీరోయిన్లకీ అయన తండ్రిగా నటించారు.

ఆయన తన కన్నా వయసులో ఎక్కువ అయిన కన్నాంబ, శాంత కుమారి, హేమలత, సూర్యకాంతం, ఛాయాదేవి మొదలైన సీనియర్ నటీమణులకు భర్తగా నటించారు. ‘అర్ధాంగి’ సినిమాలో నటించే నాటికి గుమ్మడి వయసు 27 సంవత్సరాలు. వృద్ధ జమీందారుగా, శాంత కుమారికి భర్తగా నటించారు. సినిమా మొదలు పెట్టక ముందు ఓరోజు మేకప్ లేకుండా వచ్చిన గుమ్మడిని చూసి “ఈ కుర్రాడు నాకు భర్తగా వేయటమేమిటి?” అన్నారు శాంతకుమారి. మేకప్ వేసిన తర్వాత చూసి “ఈయనైతే ఫర్వాలేదు” అన్నారు. “ఈయనే ఆ కుర్రాడు” అని నిజజీవితంలో ఆమె ఆమె భర్త, చిత్ర దర్శకుడు అయిన పి.పుల్లయ్య చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యం చూసి, అక్కడ ఉన్న వారంతా పకపకా నవ్వారు.

స్పష్టమైన ఉచ్చారణకు పెట్టింది పేరు గుమ్మడి. “నేను స్పష్టంగా మాట్లాడలేని రోజున నటించను” అని చెప్పి ఆ మాటమీదే నిలబడ్డారు గుమ్మడి. చాలా సినిమాల్లో గుమ్మడి పాత్ర గుండెపోటుతో మరణిస్తుంది. నిజ జీవితంలో కూడా గుండె పోటుతోనే 2010 డిసెంబర్ 26న కన్నుమూసారు గుమ్మడి.

ఆయన సమాధి గుంటూరు జిల్లా, రేపల్లె సమీపాన రావికంపాడు దగ్గర ఇప్పటికీ ఉన్నది.

Images credit – Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here