Site icon Sanchika

ఆదర్శ గ్రామం

[dropcap]కృ[/dropcap]ష్ణారావు బాగా చదువుకున్నాడు. ఉద్యోగమంటూ చేయటానికి ఎక్కడికి వెళ్ళలేదు. కొడుకు విదేశాలు పోయి ఉద్యోగం చేస్తానంటాడేమోనని అతని తల్లిదండ్రులు భయపడ్డారు. అతను విదేశాలకు పోను అని చెప్పేసరికి వాళ్ళు సంతోషించారు. కాని మన దేశంలోనే ఉండి ఏదైన ఉద్యోగం చేస్తాడేమోనని అనుకున్నారు. అలా చెయ్యకపోయేసరికి మొదట్లో కొంత బాధపడ్డారు. తమ కళ్ళేదుటే స్వంతఊర్లో, తమతోనే కలసి ఉంటూ పొలం పుట్రా చూచుకుంటూ వుండేసరికి బాగా సంతోషించారు. అంతేకాకుండా ఊరి విషయాలు పట్టించుకుంటు ఊర్లో అందరికీ తలలో నాలుకలా వుండేసరికి మురిసిపోతున్నారు.

ఆ రోజు సాయంకాలం కృష్ణారావు తమ పొలాలకేసి బయల్దేరాడు. ఊరులోని ఇళ్ళు దాటగానే పెద్ద చెరువు వస్తుంది. దాన్ని ‘ఊరు’ చెరువు అంటారు. ఎందుకంటే ఆ చెరువులో నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు దాన్ని ‘ఊరు చెరువు’ అని పిలిచేవారు. చెరువులో నీళ్ళున్నప్పుడు దాన్నిండా తామర పూలు, తెల్ల కలువలు, మధ్య మధ్యలో ఎర్ర కలువ మొక్కలనిండా పూలు పూసి వుండేవి. తామరాకుల మీద నీటిబిందువులు పడితే తమాషాగా మెరుస్తూ ఆ నీటి బిందువులు గుండ్రంగా తిరుగుతూ పాదరసపు బిందువుల్ని గుర్తుచేసేవి. ఆ చెరువొడ్డునే ఒక బావి కూడా వెనుకటి రోజుల్లో తవ్వించారు. అది బాగా లోతుగా ఉండేది. దాంట్లోని నీరి తియ్యగా ఉండేవట. ఒకప్పుడూ ఊరువారు దాన్ని మంచినీళ్ళ బావిగా వాడుకునేవారు. ఇప్పుడెవరూ ఆ బావి జోలికి పోవడం లేదు. ఇళ్ళల్లో చేతి పంపులు వేసుకుని ఆ నీటినే తాగుతున్నారు. ఇప్పుడా బావి చుట్టూ మట్టి కూడా తవ్వుకుపోయారు. ఇటుక కట్టబడితో వున్న పునాది గోడలు కనపడుతున్నాయి. ఆ గోడలో రావిమొక్కలు, మర్రిమొక్కలు మొలిచాయి. ఊరి చెరువు వంక చూస్తూ కృష్ణారావు చాలా బాధపడ్డాడు. తన చిన్నప్పుడు ఇది ఎంత పెద్ద చెరువు, అవతలి ఒడ్డు కనపడేది కాదు. ఎంతో లోతుగా కూడా ఉండేదని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా చెరువు నాలుగుప్రక్కలా ఆక్రమించేశారు. మట్టిపోసుకుని మెరక చేసుకున్నారు. దానిమీద చిన్నచిన్న ఇళ్ళు కట్టారు. పశువుల చావిళ్ళు వేశారు. మధ్యమధ్యలో చిన్నచిన్న దుకాణాలు కూడా పెట్టారు. ఇప్పుడా చెరువు ఐదారు ఎకరాల మేరకు మిగిలిందేమో! అలాంటి చెరువు ఈ వేసవికాలం ఎండిపోయింది. ఆ చెరువు ఎండటం తనిప్పుడే చూస్తున్నాడు. ఎంత మండు వేసవిలోనైనా చెరువుకు మధ్యభాగంగా అక్కడక్కడా నీళ్ళుండేవి. అంతా బురద బురదగా వుండేది. తామరకాయలు కోసుకుందామని చెరువులో దిగితే కాళ్ళు కూరుకుపోయేవి. ఇలా చెరువు ఎండిపోతే ఊర్లోని బావులు, చేతి పంపుల్లో కూడా జల బాగా తగ్గిపోతుంది. పైగా ఇప్పుడంతా పొలాల్లో రెండవ పంటగా మొక్కజొన్న వేస్తున్నారు. ఊరికి నాలుగువైపులా పొలాలున్నాయి. దాదాపు అందరూ మొక్కజొన్నే వేశారు. ఇదివరలో జనుము, మినుము, పెసర లాంటి పంటలకయితే నీటి అవసరం ఉండేది కాదు. మొక్కజొన్నకు నీటి తడులు కావాలి కాబట్టి, ఇంజన్లు పెట్టి, మోటర్లతో నీటిని తోడి చేలను తడుపుతున్నారు. దాంతో ఇళ్ళలో వాడకానికి కూడా నీళ్ళు సరిగ్గా ఉండటం లేదు. ఇళ్ళలోని పంపుల్లో సన్నని ధారా వస్తుంది. బావులు అడుగంటుతున్నాయి. భూగర్భంలో నీటిమట్టం పెరగాలంటే ఏదో ఒకటి చేయాలి అని కృష్ణారావు ఆలోచించాడు. తన పొలమెళ్ళి చూచుకుని తిరిగి ఊళ్ళోకి వచ్చి పంచాయితీ అరుగుల మీద కూర్చున్నాడు. అప్పటికే అక్కడ నలుగురైదుగురు కూర్చుని ఉన్నారు.

“బాబాయ్! ఈ సంవత్సరం మన ఊరుచెరువు పూర్తిగా ఎండిపోయి నెర్రలు కొట్టింది. చెరువు బాగా పూడిక వేసినట్లుంది. ఆ పూడిక తీయిస్తే బాగుంటుంది. నీరు ఊరుతుంది. వర్షాకాలం వచ్చి వానలు కురవగానే చెరువు బాగా నిండుతుంది. ఈ చెరువు బాగుంటేనే, నీటితో నిండి వుంటేనే, మన ఊరంతా నీటి జల సమృద్ధిగా వుంటుంది. మనమంతా బావుల్లో, పంపుల్లో జల తగ్గిపోయింది అనుకోకుండా వుంటాం. పెద్దవాడివి నీకు తెలియనిదేముంది బాబాయ్? ఈ చెరువులో నీళ్ళు లేక మన పశువుల్ని ఇళ్ళల్లోనే కొద్ది నీళ్ళతో కడుగుతున్నాం. అదే చెర్లోనిండా నీళ్ళుంటే అవి హాయిగా చెర్లో దిగి చాలాసేపు వుండి అలసట తీర్చుకునేవి. పశువుల్ని బాగా రుద్ది కడిగేవాళ్ళం. ఏం చేద్దాం ఆలోచించు బాబాయ్” అన్నాడు కృష్ణారావు అక్కడ కూర్చున్న ఒక పెద్దాయన్ని ఉద్దేశించి.

“నువ్వు చెప్పేది నిజమేననుకో. కాని మనమేం చేస్తాం? ఏదైనా చేస్తే ఏ పంచాయితీ వారో పట్టించుకుని చేయాలి. పూడిన తీయడమంటే మాటలా? ఇవాళ ఎండల్లో, కూలి మనిషొక్కడికి ఐదువందలు అడుగుతున్నారు. మనవల్ల ఏమౌవుతుంది చెప్పు. చెర్లో ఏటా చేపలు పాడుకుని పట్టుకునేవాళ్లు ఏమైనా చెయ్యాలి” అంటూ చుట్టమసి కాల్పుతూ మరలా దాన్ని నోట్లో పెట్టుకుని గుప్పుగుప్పున పీల్చసాగాడు ఆ పెద్దాయన.

“పెద్దవాడివి నువ్వే అలా అంటే ఎలా బాబాయ్? మనమంతా తలా కాస్త చందాలు వేసుకుని చెరువు శుభ్రం చేస్తే బాగుంటుంది. నా వంతు పదివేలిస్తాను. మీరంతా తలాకాస్త వేసుకుంటే కూలీలకు డబ్బిచ్చి పూడిక తీయిద్దాం” అంటూ అక్కడున్న వారికి నచ్చచెప్పటానికి చాలా ప్రయత్నం చేశాడు కృష్ణారావు. కాని ఎవరూ ముందుకు రాలేదు.

కృష్ణారావు ఇంటికి వచ్చిన తరువాత చెరువు సంగతి చెప్పి బాధపడ్డాడు. ఆయన తన చిన్నప్పుడు ఆ చెరువు ఎంత కళకళలాడేదో, ఎంత విశాలంగా వుండేదో చెప్పాడు. దాని నీళ్ళవలన ఊరంతా ఎండ వేడిలేకుండా చల్లగాను, ఊరిలో నీళ్ళ కరువు లేకుండా వుండేదని అన్నాడు. ఇంకా “చిన్నతనంలో ఎప్పుడో ఒకసారి ఈ చెరువు ఎండిపోయిందిరా అబ్బాయ్! అప్పుడు ఊరిపెద్దలే పట్టించుకుని పూడికతీయించారు. చెరువుకట్టలన్నీ ఎప్పటికప్పుడు బలంగా వుండేటట్లు చూసేవారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడే చెరువు ఎండటం చూశాను” అని చెప్పాడు.

మర్నాడు మళ్ళీ కృష్ణారావు పంచాయితీ అరుగుల మీద కూర్చున్నాడు. ఆ రోజు ఆదివారం. కాబట్టి పంచాయితీ ఆఫీసుకు శెలవు. ఒకరిద్దరు ఊరివాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. కృష్ణారావు తన జేబులోనుండి సెల్‍ఫోన్ తీసుకుని ఒక నెంబరుకు ఫోన్ చేశాడు. ఆ నంబరు అతని మేనత్త కొడుకు రాఘవేంద్రరావుది. అతను బాగా స్థితిపరుడే. అదే ఊళ్ళో వుంటున్నాడు.

“బావా! నేను చెప్పేది కొంచెం విను. నేనొకరికి డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. ఒక ఐదువేలు తక్కువ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు డబ్బుకోసం వచ్చి కూర్చున్నారు. నువ్వేమైనా సర్దగలవా? నేనిక్కడే అరుగుల దగ్గర వున్నాను” అన్నాడు రాఘవేంద్రరావుతో.

“దానికేం భాగ్యం బావా! నీకింకా కావాలన్నా తెస్తాను. ఇప్పుడే వస్తాను” అన్నాడు అతను.

కృష్ణారావు మరొక నంబరుకు ఫోన్ చేశాడు.

“నేను అవసరంగా హైదరాబాద్ వెళ్ళాలి. ఒక ఐదువేలు తగ్గాయి. నువ్వు తేగలవా?” అంటూ వరుసకు తమ్ముడయ్యే అతనికి ఫోన్ చేశాడు.

“తెస్తానన్నయ్యా. హైదరాబాద్ వెళ్ళటానికి ఇంత చిన్నమొత్తం సరిపోతుందా?” అంటూ అడిగాడు తను.

“చాలు సరిపోతాయి” అన్నాడు కృష్ణారావు.

“మీ వదిన ఏవో నగలు కొనుక్కోవడానికి మద్రాసు వెళ్తుందట. నేనిచ్చిన డబ్బులు సరిపోక ఇంకో ఐదువేలో, పదివేలో నిన్నడగమంటున్నది. ఈ ఆడవాళ్ళకు ఎక్కడెక్కడి డబ్బూ చాలటం లేదు” అంటూ మరొకరికి ఫోన్‍చేశాడు కృష్ణారావు.

“వదిన దుబారా ఖర్చులు పెట్టే మనిషి కాదులే అన్నయ్యా! ఏదో పెద్ద వస్తువు కొనుక్కోవాలని అనివుంటుంది. ఇంటికి తెచ్చిచ్చేదా డబ్బు” అని అడిగాడతను.

“నేనిక్కడ పంచాయితీ అరుగుల మీదే ఉన్నాను. అక్కడికే రా” అన్నాడు.

ఇలాగే ఏవో కారణాలు చెప్పి ఐదువేలు కాని, పదివేలు కాని తెమ్మని మరికొందరికి ఫోన్లు చేసి చెప్పాడు.

ఎప్పుడూ డబ్బులు అడగని కృష్ణారావు తమని డబ్బు అడిగాడని అందరూ డబ్బులు తీసుకుని పంచాయితీ అరుగుల దగ్గరకొచ్చారు.

కృష్ణారావు ఇంటినుంచి వస్తూనే తన జేబులో పదివేలు పెట్టుకుని మరీ వచ్చాడు. ఇప్పుడందరూ కూడా అలాగే వచ్చారు. అందరివంక నవ్వుతూ చూస్తూ కృష్ణారావు మాటలు మొదలుపెట్టాడు.

“నామీద వున్న అభిమానంతో, ఇంకా నామీదవున్న గౌరవంతో మీరంతా ఇక్కడికి వచ్చారు. డబ్బుకూడా తెచ్చేవుంటారు. అవునుకదూ?” అని అడిగాడు.

“అడక్క అడక్క నువ్వు అడిగితే తేకుండా ఎలా ఉంటాను బావా” అన్నాడు మేనత్త కొడుకు. మిగితా వాళ్ళు ఒకళ్ళ ముఖం మరొకళ్ళు చూసుకున్నారు. ఎప్పుడూ లేంది ఇలా అందర్నీ డబ్బు అడగటమేమిటి అన్న ఆలోచనలో పడ్డారు.

“మీకందరికీ మరలా ఒక విషయం చెప్పాలి. ఈ ఊరు మనది. ఈ చెరువూ మనది. ఊరూ, ఊరి పరిసరాలు బాగుంటేనే మనమూ బాగుంటాం. ప్రభుత్వం తరుపున పంచాయితీవారో, మరొకరో వచ్చి బాగుచేస్తారని ప్రతిపనికీ మనం ఎదురు చూడగూడదు. మన ఊరిని చేతనైనంత వరకు మనమే బాగుచేసుకుందాం. మనందరం తలా కొంత డబ్బు వేసుకుని చెరువు పూడిక పనులు మొదలుపెడదాం. మనందరినీ, ఐదువేలో, పదివేలో ఇవ్వటం మరీ అంత ఇబ్బందేం కాదు. డబ్బును ఒకరి దగ్గర వుంచుదాం. చెరువు పూడిక తీస్తే చాలా మట్టి వస్తుంది. ట్రక్కుల లెక్కన అమ్ముదాం. పొలాల్లోకి, ఇళ్ళకీ మెరకలు కావలసినవాళ్ళు తోలించుకుంటారు. ట్రాక్టరు బాడుగ ట్రాక్టరువాళ్ళకిద్దాం. మిగతా డబ్బు మనం తీసుకుందాం. మనం ఇవ్వాల్సినదంతా రోజువారీ కూలీలకు కూలీ ఇచ్చిమట్టి తవ్వించుకోవటమే. కూలీలు దొరక్కపోతే ప్రొక్లెయినర్ తెప్పించుకుందాం. నా ఉద్దేశమయితే మన ఊరి కూలీలచేత తవ్విస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. కూలీ ఇవ్వగా మిగిలిన డబ్బులోనుంచి మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును తీసుకోదలిస్తే తీసుకోవచ్చు. నేనుమాత్రం పదివేలిస్తాను. వాటిని వెనక్కు తీసుకోను. ఊరికోసం నేను సంతోషంగా ఖర్చు పెడతాను. ఇప్పుడు నేను అప్పుగా ఇవ్వమన్నది ఇందుకే. మీరంతా డబ్బుతెచ్చారు” అంటూ తన జేబులోని పదివేలు తీసి అక్కడ పెట్టాడు.

మిగతావారు కూడా ఆ ఆలోచన నచ్చి తమ జేబుల్లోని డబ్బుతీసి అక్కడపెట్టారు. అందరిలోకి పెద్దయిన రామకృష్ణయ్య గారు నవ్వుతూ “బాగానే ఉపాయం పన్నావు. నాకు నచ్చిందిరా అబ్బాయ్. డబ్బు వేరే ఎవరి దగ్గరో ఎందుకు? నీ దగ్గరే వుంచు. రేపే కొబ్బరికాయ కొట్టి పనులు మొదలుపెడదాం. ఈ రోజే మట్టి పనివాళ్ళను, ఊరిలోని ట్రాక్టరున్న వాళ్ళను పిలిచి మాట్లాడదాం. నువ్వన్నట్లే కానిద్దాం. ఏమంటారు?” అంటూ మిగతావారి వంక చూశాడు.

అందరూ సరేనన్నట్లుగా ఊగుతూ తలడించారు. చెరువు పూడిక పనులు మొదలయ్యాయి. అందరికీ ఉత్సాహంగా ఉన్నది. చెరువు దగ్గర పనిజరిగే రెండూ పూట్లా చాలామంది చేరుకున్నారు. ఊళ్ళో పొలాల్లోకి, ఇళ్ళస్థలాలను మట్టిని చేరవేస్తూ ట్రాక్టర్లు హడావుడిగా తిరుగుతున్నాయి. అనుకున్నదానికంటే ఎక్కువమంది మట్టి కొనుక్కుంటున్నారు. దగ్గరి ఊళ్ళవాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు. పనివాళ్ళు మట్టి తవ్వి రాశులు పోస్తున్నారు. ఎట్టకేలకు పని పూర్తి అయినది. లెక్కలు చూసుకుంటే చాలా డబ్బులు మిగిలింది. చెరువుకు నాలుగువైపులా కట్టలు బలంగా పోయించారు. మధ్యలో ఉన్న భాగాన్ని గోతులు లేకుండా సమాంతరంగా చేశారు.

“ఎవరి డబ్బు వారు తీసుకుంటే తీసుకోండి. అయినా డబ్బు ఇంకా మిగులు ఉంటుంది. మరికొన్ని చందాలు వేసుకుని ఊళ్ళో ఒక భవనాన్ని కట్టుకుందాం. వేడుకలకూ, విందులకూ ఊరి జనాలకూ బాగా పనికి వస్తుంది” అన్నాడు కృష్ణారావు.

“నీ ఆలోచన బాగుంది కృష్ణారావ్. మా డబ్బు మాకు వెనక్కు వద్దు. అవసరమైతే ఇంకా కొంతమొత్తం మేమే ఇస్తాం. మరికొంతమందిని కూడా అడుగుదాం. నిజంగా మన ఊరికి ఒక, కమ్యూనిటీ హాలు చాలా అవసరం. ఎలాగైనా నువ్వు బాగా చదువుకున్నవాడవు. నీ ఆలోచనలన్నీ బాగుంటాయి. ఏ సంవత్సరం ఏ పంట వేస్తే బాగుంటుందో చెప్తావు. ఏ ఎరువులు వాడాలో కూడా చెప్తావు” అంటూ అందరూ మెచ్చుకున్నారు.

ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. ఆ వర్షానికి చెరువు చక్కగా నిండింది. త్వరలోనే మరలా తామరపూలూ, కలువపూలతో పాటు చేపలు కూడా తిరగసాగాయి. చెరువు నుండుకునే సరికి ఊరందరి బావులూ నిండుగా వున్నాయి. పంపుల్లోని నీటిధార బాగా వస్తున్నది. కాలవల నీళ్ళు అందని పొలాలకు ఈ చెరువులోని నీటిని రబ్బరు పైపుల ద్వారా ఇంజను పెట్టి పంపిస్తున్నారు. తడిసిన చేలల్లో సకాలంలో నాట్లు వేసుకొంటున్నారు.

ఒక ఎడారిలో కమ్యూనిటి హాలు కూడా పూర్తయింది. మొదటగా ఊరరి పెద్దల్లో ఇద్దరి జంటలకు షష్టిపూర్తి వేడుకలు చేశారు. అందరూ ఆనందించారు.

“కృష్ణారావ్! ఇకముందు కూడా మంచి ఆలోచనలు ఇలాగే చేస్తూవుండు. మా అందరి సహకారం వుంటుంది” అని అందరు అన్నారు. అందరి సహకారంలో కృష్ణారావు ఆ ఊరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దారు.

Exit mobile version