[dropcap]సి[/dropcap]రిపురం గ్రామంలో రాజవ్వ, రంగయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి రాకేష్, రాజేష్ ఇద్దరు కొడుకులు. వీరిద్దరు ఎప్పడూ పోట్లాడుకొనే వారు. కానీ రాకేష్ చదువులో క్లాస్ ఫస్ట్. అలాగే రాజేష్ ఆటల్లో ఫస్ట్. వీరిద్దరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు.
రాకేష్ తెలివితేటలకు టీచర్లు ఆశ్చర్య పోయేవారు. రాకేష్ తండ్రి తాగుడుకు బానిసై, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. పాపం రాజవ్వ కూలీ పని చేసి, కుటుంబాన్ని పోషించేది. ఇంతలో రాజవ్వ ఆరోగ్యం క్షీణించింది. మంచానికి పరిమితమైంది. తన పిల్లలు ఏమై పోతారోనని దిగులు పెట్టుకొని కొన్నాళ్ళకు మరణించింది. తల్లి మరణం రాకేష్ నెంతో క్రుగదీసింది.
ఏమి చేయాలో అర్థం కానీ వయసులో, పెద్దవాడైన రాకేష్‌పై కుటుంబ పోషణ బాధ్యత పడింది. బాగా ఆలోచించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొన్నాడు. ఉదయం పూట ఇంటింటికీ దినపత్రికలు పంచే పేపర్ బాయ్‌గా, తర్వాత గ్రామంలోని పాల ఉత్పత్తి కేంద్రంలో పాత్రలు శుభ్రం చేసేవాడు. వచ్చిన డబ్బులతో తమ్ముడి, తండ్రి ఆలనా పాలన చూసేవాడు. బడికి వెళ్ళి చదువులో ముందుండేవాడు.
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాకేష్ పాఠశాల స్థాయిలో జరిగే మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షల్లో అర్హత పొందాడు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయి మొదటి స్థానంలో నిలిచిన రాకేష్‌ను కలెక్టర్ అభినందించి నగదు బహుమతిని అందజేసాడు. ఉపాధ్యాయులు రాకేష్ కుటుంబ పరిస్థితి కలెక్టర్‌కు వివరించగా రాకేష్ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రకటించాడు.
రాకేష్ కలెక్టర్ ప్రోత్సాహంతో బాగా చదివి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. తనలాంటి అనాథలను, పేద పిల్లలను చేరదీసి, ఉచితంగా చదువు చెప్పిస్తూ రాకేష్ ఆదర్శంగా నిలువసాగాడు.