ఆదర్శపు అనుబంధాలు

0
3

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జగన్ మిత్ర గారి ‘ఆదర్శపు అనుబంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే నేనూ మా ఆవిడా బాల్కనీలో కాఫీ తాగుతూ, కబుర్లాడుకుంటూ ఉంటాము. మా ఆవిడ ఉదయపు ఎండలో నడవడమో కూర్చోవడమో చేస్తే మంచిదని, డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు.

మా ఇంటి చుట్టూ వందెకరాల్లో, రకరకాల చెట్లతోనూ గుబురు పొదలతోనూ పచ్చదనం పరుచుకొని ఉంటుంది. పెద్ద సంఖ్యలో పావురాలు తిరుగాడుతూ ఉంటాయి. మా బాల్కనీలోనయితే, మూడునాలుగు జతలు పగలంతా తచ్చాడుతూ ఉంటాయి. మేము ఏమారితే, వంటగదిలోని మన చేతికి అందే ఎత్తులోని, స్టవ్ హూడ్ పై, వాటిల్లో ఏదో ఒక జత కాపురం పెట్టేస్తాయి. నాకు భలే ముచ్చటేస్తుంది. ప్రేమలు పంచుకోడానికి మనుషులకే కాదు. పశు పక్ష్యాదులక్కూడా అభినివేశముంటుందని. మాయావిడకు తెలియకుండా పాతబడుతూ ఉండే ఫుట్ మేట్స్‌ను, హూడ్ మీద వేస్తాను, మెత్తగా ఉంటుందని. ఎప్పుడైనా తన కంటపడి, నన్ను వారించబోయినా, పోనీలేవే, వాటికయినా ఆశ్రయమిద్దాము, పుణ్యమైనా దక్కుతుంది అంటూ వంకరగా నవ్వేస్తాను. నా నవ్వులోని అంతరార్థం తనకూ తెలుసు. ఆవిణ్ణి సంతోషపెట్టడానికి రకరకాల ఫీట్లు. అర్థం కాని అందమైన అబద్ధాలు.

మా ఆవిడ ఆరోగ్యం బాగుండక పోవడంతో, నేనే తనకు సర్వస్వం అయ్యాను. నా పనులు, ఆవిడ పనులూ చేసేసి, ఇంటిపని వంటపనీ ముగించుకొని, హుషారుగా ఆఫీసుకు వెళుతూ ఉంటాను. మరో పని పెట్టుకోకుండా, సాయింత్రానికి ఠంచన్‌గా చాయ్ బిస్కట్‌తో ఆవిడముందు కూర్చుంటూ ఉంటాను.

అప్పుడప్పుడు మా అత్తగారు వచ్చినా, ఎక్కువ రోజులుండే పరిస్థితి కాదు. మామయ్య ఆరోగ్యo అంతంత మాత్రం. పల్లెటూళ్లో డాక్టర్లు అందుబాటులో ఉండక,  అతనికి తోడుగా, ఒక మెయిడ్‌ను పెట్టి, మా దగ్గర వారం పదిరోజులుండి పోతూఉంటుంది.

“బాబూ! ఏ జన్మలోనో మా అమ్మాయి చేసుకున్న పుణ్యమే, నువ్వు దానికి దొరకడం. దాని కోసం, ఆసుపత్రులకు తిరగడం, వేళకు మందులు అందివ్వడం, చూస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్న పది రోజులూ, ఇంటిపని వంట పని నేను చూసుకుంటూ ఉన్నా, ఆ తర్వాత, నువ్వు పడే కష్టమేపాటిదో నాకు తెలుస్తూనే ఉంది”

“అదేముంది లే అత్తయ్యా! బయట తిరిగే నాకు, ఏదైనా జరిగితే, నాకు మీ అమ్మాయి తోడుండదా? మీరు నన్ను దూరం  పెట్టేస్తారా?”

“ఏమండీ! అవేం మాటలoడీ” అంటూ మా ఆవిడ,

“నట్టింట అపశకునాలు పలక్కూడదయ్యా?” అంటూ అత్తయ్య ఒకేసారి అడ్డుతగిలారు.

నేను పైకి చూసి, ఈశాన్యపు దిక్కుకెసి నడుస్తూ, “అదేం కాదులే అత్తయ్యా! మీ అమ్మాయి రోజూ శుభాలు పలుకుతూ, పూజలు చేస్తూనే ఉంటుంది. మరి మనింట ఈ అశుభకరమైన అనారోగ్యమెందుకు అడుగుపెట్టిందా అని!?”

“తర్కం కాదు గాని నాయనా. మా అమ్మాయితో నువు పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నానయ్యా!”

“మరేం చెయ్యమoటారత్తయ్యా?”

“చేస్తున్నదే మహద్భాగ్యం. నీ పన్లు నువు చేసుకుంటూ, ఆఫీసు పన్లు చూసుకుంటూ, ఆడవారి పన్లూ సరిపెట్టడం ఎంతటి ఇబ్బందో నాకు తెలవదా బాబూ1? మేమే ఏదో ఒకటి చెయ్యాలయ్యా!”

“అమ్మా! మనింట్లో చేరిన సరోజను, కొన్నాళ్లు మాకు తోడుగా పంపించగలవా? పల్లెటూళ్ళో మీకయితే కేకెయ్యంగానే ఎవరో ఒకరు పలుకుతారు. సాయంగా దొరుకుతారు”

“వొద్దు వొద్దు వొద్దనే వొద్దత్తయ్యా! మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోగలను. ఈ సేవలో నాతో వేరే వాళ్ళు పోటీ పడడం నాకిష్టం లేదు. ఇంకెంత. నాకు రిటైర్మెంట్ దగ్గరపడుతోంది. ఆ రోజునుండి నేను మరో పనేమీ పెట్టుకోను”

“అమ్మాయి తన కష్టాన్ని నీతో చెప్పుకోడానికి సిగ్గు అడ్డమొస్తోందట. ప్రత్యేకమైన సందర్భాల్లో నీతో సేవ చేయించుకోవడం కష్టంగా ఉంటోందట. నాతో చెప్తూనే ఉంది. ఇప్పటికే లేటు చేశాను”

“సరోజకు నా వయసు ఉంటుందా అమ్మా?”

“నీకంటే చిన్నదే అయ్యుంటుంది. చూడ్డానికి మాత్రం నాకంటే చిన్నదిగా అనిపిస్తుంది. మనూరి ఎడ్మాష్టారమ్మకు సరోజ సాయంగా ఉండేది. పనిమనిషీ కాదు. వంటమనిషీ కాదు.  అక్కో చెల్లో వదిన, అంతకు మించిన ఇంటి మనిషి. ఇంట్లో మనిషి. అబ్బో చాలా చెప్పింది ఎడ్మాష్టారమ్మ”

“అవునా అమ్మా?”

“మనింటికి వచ్చాక మీ నాన్నాను నాన్న అంటుంది. నన్ను నోరారా అమ్మా అనిపిలుస్తుంది. ఇంటి పనుల్లో నన్ను చెయ్యిపెట్టనివ్వదు. నాన్న పాదాలకు నూనెతో మర్దనా చేస్తుంది. నాకు తలకు నూనె పూసి, ఎప్పుడైనా అడక్కుండానే పేలు దువ్వెన పట్టుకుంటుంది. మా ఇద్దరికీ వండి పెడుతుంది. మనింట్లో ముద్ద ముట్టదు. పోయి వండుకు తింటుందట. అభిమానస్థురాలని చెప్పింది మేష్టారమ్మ”

“మొత్తానికి మంచి మనిషినే కుదిర్చారు మేడమ్ గారు”

“నువు ఇంజనీరింగ్ చేసిన కాలేజీ ఏవూరు? నోటికి ఆ పేరు తిరగదు”

“గబుక్కున మీ అమ్మాయికీ తిరగదు లే అత్తయ్య. రాజాం లో ఉంది ఆ కాలేజీ. గ్రంధి మల్లిఖార్జున రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి” అన్నాను నవ్వుతూ.

“ఆఁ రాజాం అనే చెప్పింది. అక్కడ్నుండి అచ్చుతాపురం పరవాడ సముద్రపొడ్డుకు వచ్చేసి, అక్కడున్న ఏదో మందుల కంపెనీలో అతను కేజువల్‌గా చేరాడట. ఆ మజ్జెన గేసు డ్రమ్మేదో పేలి, ఆ గేసు పీల్చి భర్త చనిపోయాడట. పిల్లా పాపా లేరని చెప్పింది. అలా జరిగిన ఇంట్లో పిల్లలుంటే, వారి భవిష్యత్తు నరకమే కదమ్మా! అలాంటి కష్టం పగవారిక్కూడా రాకూడదమ్మా! ఏమిట్లో మరి. నేనడగలేదు!”

“అవునా పాపం! అయినా పిల్లలు లేకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలమీద ఆధారపడి ఉంటుంది. అదేమీ శాపం కాదు. అయినా వాళ్ళు ఏమిట్లయితే ఏం?”

“అది కాదమ్మా. పల్లెటూళ్లలో ఇటువంటి ఆరాలన్నీ మామూలే కద. నీకు తెలవదా. ఊళ్ళో ఎవరైనా ఏమిట్లయినా అందరూ అందర్నీ వరసలతోనే పిలుచుకుంటారు. సరోజ నీలాగ గుణవతి అనుకో. ఇక్కడికొచ్చి, మీతో బాటు ఇరవయ్యి నాలుగు గంటలూ తిరిగే మనిషి గురించి, మీకు తెలియాలి కదమ్మా! అందుకని!”

“నీకు తెలుసు కదమ్మా, నాకూ మీ అల్లుడికీ అటువంటి పట్టింపులంటే గిట్టవని!”

***

“అక్కా! నీళ్ళు కాగాయా? చిల్లర సొరుగులో ఉంటుంది కదా. నేనే ఇవ్వాలా. రెండొందలు తీసుకెళ్లు. పాలు కూరలకు సరిపోతాయి. ముందు ఆయనకు టిఫిన్ పెట్టేసెయ్. ఆయన వెళ్ళాక మనం తిందాము. ఆయన వచ్చే టైమవుతోంది. పకోడీయో నాలుగు బజ్జీలనో చేసి పెట్టు. టీ తో బాటు ఇష్టంగా తింటారు. రేపటికి పెసరట్లకు నానబెట్టు. ఉప్మాతో ఉల్లి పెసరట్టు బాగా ఇష్టపడతారు” ఇలా ఇంటి అవసరాల్లో, బజారు పనుల్లో అంతా తానై కుదిరిపోయింది సరోజ.

***

రోజులు గడుస్తున్నాయి. ఓ ఆదివారం నాడు నేనూ మా ఆవిడా బాల్కనీలో కూర్చున్నాము. సరోజ మాకు కాఫీ అందించి, మా ఇంటి దగ్గరలోని శివాలయానికి వెళ్లింది. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేసేసి, పూజ చేసుకునేది. తన  పూజకు అన్నీ రెడీ చేసేసి, ఆది సోమ మంగళ శుక్రవారాల్లో గుడికి వెళ్లొస్తూ ఉంటుంది.

“మా అమ్మ అన్నట్టుగా సరోజ గుణవతి కదండీ?!? నా వల్ల మీమీద పడే భారాన్ని పూర్తిగా తనే తీసుకునేసింది. మీ అవసరాలను కూడా తనే చూసుకుంటోంది కదండీ. నాకు చేసినట్టే, సరోజ పేర కెనరా బేంక్‌లో ఏంజెల్ అకౌంట్ ఓపెన్ చేయించండి. తన డబ్బుల్లోని ముప్పై వేలు జమ చేస్తే, ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కదండీ?”

“అవునవును. నేనూ గమనిస్తున్నాను. మేడమ్ గారు అత్తయ్యకు చెప్పినదానికంటే, అత్తయ్య నీకు చెప్పిన దానికి మించి పనిమంతురాలు. ఎక్కడివక్కడే ఉంటున్నాయి. డబ్బులో బంగారమో అని కాదు గాని, అన్నీ ఇంటాక్ట్‌గా ఉంటున్నాయి. మంచి మనిషి. ఒకేమనిషికి ఇన్ని కష్టాలేమిటా అని రేపు ఆదివారం సూర్ణారాయణమూర్తిని నిలదియ్యి”

“కర్మ సిద్ధాంతాలను ఎవరూ మార్చలేరండీ! ఏవండీ. వాళ్ళ సొంత ఊళ్ళో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పలేదు. భర్త వైపు వాళ్ళో, తనవైపు వాళ్లెవరైనా ఉన్నారో లేదో తెలియదు. తనదీ నా వయసో, నాకన్నా పెద్దదో చిన్నదో? ఏమో. వయసుతో పనిలేకుంటా, నాకు లాగా, ఎవరికైనా ఎప్పుడైనా సుస్తీ చేస్తే చెయ్యొచ్చు. మన దగ్గర ఉన్నంతకాలం మనమే చూసుకోవాలి కదండీ”

“మన దగ్గరే ఉంటుందని ఏముందీ? ఎవరైనా మనకంటే మంచిగా ఆఫర్ చేస్తే మనం అడ్డు చెప్తామా?”

“ఇన్ని నెలలుగా మనతో ఉన్న సరోజలో డబ్బు మనిషిని చూడలేదండి. జీతం తీసుకోవడం లేదు. అవసరపడితే అడుగుతానంటోంది. డబ్బుల కోసమైతే, మనల్ని విడిచి పెడుతుందని నేను అనుకోను”

“సర్సరే! ఇంతకీ ఏమి చెప్పదలచుకున్నావో చెప్పరాదూ?”

“మన వంతు సాయంగా ఆమె పేర, ఎల్.ఐ.సి పాలసితో బాటు, మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోండీ”

“బావుంది. చాలా బావుంది. కెనరా బేంక్ అన్నావు బావుంది. ఇంటి పనిమనుషులకు ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకోమనే యజమానురాళ్లను నీలోనే చూస్తున్నాను”

“అది కాదండీ”

“అవును. నేను చెప్పేదీ అదికాదనే. చూడు మదర్ మేరీ! నేను రిటైరయ్యాక, నీతోనే నాలోకం. ఆనక ఈమెతో మనకు పనేం ఉండదు. ఇప్పటికీ ఈ విషయానికి ఫులుస్టాప్ పెట్టు”

***

నేను రిటైరయిన రోజున ఆనవాయితీగా నా మిత్రులందరూ ఇంటివరకూ సాగనంపారు.  హుషారుగా ఉన్న నేను మా ఆవిడతో అన్నాను, “ఈ క్షణం నుండి నేను నీ దాసుణ్ణి. నేను నీకే అంకితం. ఈజిట్ ఓకే” అంటుండగా, సరోజ టీ స్నాక్స్ తెచ్చిపెట్టి, తన పనిలోకి వెళ్లిపోయింది.

ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, “ఇక మీ అమ్మగారితో చెప్పేద్దామా ఈమెను ఊరుకు పిలిపించేసుకొమ్మని”

మా ఆవిడ నన్ను కళ్ళతోనే వారించింది. “తొందరపడకండి. పండగలకు మా అమ్మను రమ్మంటాను. సరోజ విషయాన్ని చెప్పి, సలహా అడుగుదాము. అక్కడికి అవసరమో లేదో తెలియాలి కదండీ”

మేం మాట్లాడుకుంటుండగా నా ఫోను రింగయ్యింది. “థేంక్స్ రా” అంటూ బాల్కనీలోకి నడిచాను. నా మిత్రుడు యలమంచలి  సత్యం. యలమంచలి వాడి ఊరు పేరు. ఆఫీసులో నాకు వన్నియర్ సీనియర్. వాడితో ఎప్పుడు మాట్లాడినా, వాడిని ఎప్పుడు కలుసుకున్నా, మరో ఆర్నెల్లకు సరిపడా ఎనర్జీ ఇస్తాడు.

“ఎవరండీ అంత హేపీగా ఉన్నారు?”

“యలమంచలి సత్యం. నీకు తెలుసుకదా. రిటైర్మెంట్ ఫంక్షనుకని వచ్చాడు. రిటర్న్ గోదావరి ఎక్కేసాడట”

“ఇంటికి తీసుకు రాలేకపోయారా? అతనే కదా? పెళ్లికాని సత్తిగాడు అంటూ ఉండేవారు?” అంటూ నవ్వేసింది.

“ఇక వాణ్ని అలా పిలవడానికి లేదు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వాడే చెప్పాడు. పేపర్లో ఇష్టం లేదట. మేరేజ్ బ్యూరోవాళ్ళకు, తెలిసిన ఫ్రెండ్స్‌కు చెప్తున్నాడట. గవర్న్మెంట్ లో రిటైరైన వాళ్ళకోసం ఆర్టీసీ X రోడ్స్ లో ఒక మేరేజ్ బ్యూరోకు మార్నింగ్ అటెండ్ అయ్యి, నా ఫంక్షనుకు వచ్చాడు. ఇక్కడికి దగ్గరలోనున్న హఫీజ్ పేటలో మరొకటి ఉందట. కనుక్కోమన్నాడు. ఎవరైనా ఉంటే రిఫర్ చెయ్యమని అడిగాడు. కుదిరితే, సింపుల్‌గా అన్నవరం గుడిలో కానిచ్చేసుకుంటానన్నాడు. మనం తప్పకుండా అటెండవ్వాలి”

“రిటైరయ్యేదాకా ఎందుకని చేసుకోలేక పోయాడండీ?”

“నీ ప్రశ్నలోనే జవాబుంది. చేసుకోలేకపోయాడు. కుటుంబ బాధ్యతలతో చేసుకోలేకపోయాడు. బాధ్యతలు తీరేనాటికి వీడికి వయసు తీరిపోయింది. వద్దనుకున్నాడు. ఎవరు నచ్చచెప్పారో, ఎవరు మనసు మార్చారో, ఇప్పుడు చేసుకుందామనుకుంటున్నాడు. తనకు నచ్చిన అనాథనో, అభాగ్యురాలినో, విధవరాలినో, డైవర్సీనో చేసుకొని, తనకో జీవితాన్నిద్దామనుకుంటున్నాడు. ఈ రోజు తన మనసు విప్పాడు. మనసున్న మనిషి. గొప్ప స్నేహితుడు”

“మీరు చెప్పేదాని బట్టి అతనో సంఘ సంస్కర్త అనే కితాబివ్వాలి. చేసుకోబోతున్నామెకు మీ డిపార్ట్మెంటు  భార్య హోదా ఇస్తుందాండి?”

“ఆఁ ఆఁ! ఇస్రో వారు ఇటీవల ఒక ఆర్డరు పాస్ చేశారు. రిటైర్ అయ్యేవరకూ పెళ్లి చేసుకోని వారు, రిటైరయ్యాక పెళ్లి చేసుకున్నాచెల్లుబాటవుతుంది. సర్వీసులో ఉంటుండగా పెళ్లి చేసుకొని, స్పౌస్‌ను కోల్పోయినా, విడాకులు ఇచ్చిపుచ్చుకున్నాక, సర్వీసులో ఉన్నా, రిటైరయినా పెళ్లి చేసుకోవచ్చును. డెపార్ట్మెంటు గుర్తిస్తుంది అనేది ఆ ఆర్డరు”

“అవునాoడీ!” అంటూ సంతోషపడిపోయింది.

“ఆఁ! ఆ మంచి ఆశయముతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. వివరంగా చెప్పాడు. వినగానే, ఆగలేక, అందరిముందు, నా మెళ్ళో ఉన్న మాలను వాడి మెళ్ళో వేసేశాను”

***

ఓ రోజు మా ఆవిడ ఆయాసంతో తెగ హైరానా పడిపోతోంది. అటువంటి సమయాల్లో ఎలా మేనేజ్ చెయ్యాలో డాక్టర్లు చెప్పినట్టుగానే చేస్తున్నాను. సరోజ కూడా తను ధైర్యంగా ఉంటూ, నాకూ మా ఆవిడకూ ధైర్యం చెప్తూ, సపర్యలు చేస్తోంది. డాక్టర్ సంజన కలిమిరెడ్డికి ఫోన్ చేశాను. ఆమె వచ్చింది. అప్పటికి గండం తప్పించింది. తర్వాత వారం రోజులుగా  డాక్టర్ చెప్పినట్టుగానే, సరోజ మా ఆవిణ్ణి రాత్రింబవళ్ళు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది.

ఆ రోజు సరోజ బజారుకు వెళ్లింది. నేను మా ఆవిడ పక్కనే కూర్చున్నాను. ఆమె నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఏకధాటిగా ఏడుస్తోంది. మాట్లాడగలిగే స్థితి ఉన్నా, మాట్లాడలేక పోతోంది.

“ఏమీలేదు. ఏమీకాదు. డాక్టర్ సంజన కూడా చెప్పింది. ఈరోజు వస్తానంది. రానీ. అడుగుతాను”

“ఏమైనా అయితే?”

“నీకేమైనా ఉందా. ఇంజనీరింగు చదివావు. వాస్తవాలు చూస్తూ, వింటూ కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు?”

“చదువుకున్నాను. జాబ్ చేస్తానన్నాను. నీకేంటే మహారాణివి. ఎవరైనా నీకోసం పనిచేయాలి గాని, నువ్వు ఎవరికోసమో పనిచెయ్యడమేoటన్నారు. ఎన్నేళ్ళైనా పిల్లలు కలగలేదని దిగులు పడుతూ ఉంటే, మనకెందుకే పిల్లలు, నేను నీకు చాలనా అన్నారు. ఈ మాయదారి జబ్బొచ్చి తడవతడవకూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, విసుక్కోకుండా నెలల తరబడి సెలవులు పెట్టేసి, నాకోసం హాస్పిటళ్ళమ్మట తిరుగుతూ, సేవ చేస్తూ ఉన్నారు. దాచుకున్నదంతా నా కోసమే తగలేస్తున్నారు”

“అదే మరి. దాన్నే మేజిక్స్ ఆఫ్ మేరీడ్ లైఫ్ అన్నారు” అంటూ తేలిగ్గా నవ్వేశాను, ఆమెను తేలికపరచాలని.

“కాదండీ! నా పరిస్థితి నాకర్థమవుతూ ఉందండి. నాకేమైనా అయితే మీరు ఒంటరి అయిపోతారు. ఏవండీ! నాకేమైనా అయితే, మీరు మళ్ళీ పెళ్లి ఛేసుకోవాలి. అంతే!” అంటూ లిప్తపాటులో, తన చేతిలో ఉన్న నా చేతిని, తన తలమీద పెట్టుకునేసింది.

“హా! వాటీజ్ దిస్. ఆర్యూ మేడ్! మళ్ళీ సీరియల్స్ చూస్తున్నావా ఏం?”

“మీరు మాటివ్వకపోతే నేను పిచ్చిదానిగానే చనిపోతాను”

ఆ మాటతో నేనక్కడనుండి బయటకు వచ్చేశాను.

***

పండగల్లో మా అత్తగారు వచ్చి వెళ్లారు. ఆ నాల్రోజులూ మా ఆవిడ బాగానే తిరుగాడింది. కోలుకుoటున్నాదనే డాక్టర్ సంజన అభిప్రాయపడింది. మా ఇంటి బాల్కనీలోనూ, చుట్టు పక్కలా తిరుగుతున్న పావురాలను గమనించి, ఓ మాటంది. “వీటివల్ల కూడా ఊపిరి తిత్తుల వ్యాధులు అగ్రివేట్ అవుతాయి, మేడమ్‌కు మంచిది కాదు. నెట్స్ వేయించుకోండి” అనేసి వెళ్లిపోయింది.

తెల్ల వారింది. మా ఆవిడతో కబుర్లు పెట్టుకున్నాను. రిటైరయ్యాక మరో పనేముంటుంది?

“ఏమండీ! నా కిప్పుడు బాగానే ఉంది. ఓ నాల్రోజులు ఏవైనా గుళ్లూ గోపురాలూ తిప్పి తీసుకురండీ”

“నాకూ అలాగే ఉంది. వెళ్తూ వెళ్తూ చెంగాళ పరమేశ్వరి, వేనాడు దర్గా, అక్కడ్నుండి చెన్నై చేరుకొని, అష్ట లక్ష్మిదేవాలయం, వేళoకిణ్ణి చర్చి చూసుకొని వద్దాము. డాక్టరును అడుగుదాము, ఏమంటుందో విన్నాక ప్లాన్ చేద్దాములే”

“అలాగనే. మీ ఇష్టం. కాఫీ తాగుదామా?”

“అక్కా అక్కా!” జవాబు లేదు. “పాలు నిండుకున్నాయేమో. బజారుకు పోయుంటుంది”

కాసేపట్లో తిరిగొచ్చిన సరోజ, కొల్హాపూరు మహాలక్ష్మి దేవిలా అనిపించింది. చేతిలో ప్రసాదం మరో చేతిలో కుంకుమ పొడి ఉన్న తమలపాకు.

“చెప్పకుండా వెళ్లావేమక్కా?”

“వార్తలు విందామని టీవీ పెడితే, ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకునే రోజు అని చెప్తున్నారు. మీ పేర అర్చన చేయించాలనిపించింది” అంటూ చేతిలోని వాటిని టీపోయ్ మీద పెట్టింది.

చాలా ఆశ్చర్యమేసింది. ఆనందమనిపించింది. బొట్టు పెట్టమన్నట్టుగా మా ఆవిడ సరోజ ఎదురుగా నిలబడింది.

“నేను పెట్టకూడదు. నువ్వే పెట్టుకోమ్మా” అన్నట్టుగా చూసింది సరోజ.

“నువ్వు మాకోసం పూజలు చేయించవచ్చు. మాకు సేవలు చెయ్యొచ్చు. మాకు వండి పెట్టొచ్చు. తోడబుట్టిన లాంటి దానివైనా, నా నుదుటున సింధూరం పెట్టకూడదంటావు!? అంతేనా?? అంతా ట్రాష్. అలాంటి ఆచారాలూ అపచారాలు ఈ ఇంట్లో కుదరనే కుదరవు. పెట్టక్కా!” అంటూ బొట్టు పెట్టించుకుంది. నాకు మా ఆవిడే పెట్టింది.

ఆ సంతోషంలో సరోజ చేతిలో కొన్ని ఐదు వందల నోట్లు పెట్టింది.

“ఇన్ని నాకెందుకమ్మ. అన్నీ మీరే చూసుకుంటున్నప్పుడు డబ్బులతో పనేముంటుంది”

“మా సంతోషం కొద్దీ ఇస్తున్నాము. మహాలక్ష్మిని కాదనగూడదక్కా! అవసరపడితే అప్పిద్దువుగాని”

***

రోజులు గడుస్తున్నాయి.

అప్పుడప్పుడే, కరోన కలకలం మొదలైంది. భయపెడుతున్న టీవీని చూడడం మానుకున్నాము.

“నిన్ను చూసుకోడానికి నేనున్నానుకదా. ఈ టైములో ఇక్కడుంటే ఇబ్బంది పడుతుందేమో. సరోజను ఊరు వెళ్లిపోమందామా?”

“ష్! వినబడుతుంది. వినిందేమో ఖర్మ. ఇన్నాళ్లూ చేయించుకొని, ఈ పరిస్థితుల్లోనా వెళ్లిపోమనేది? కాని కాలంలో కఠినంగా ఆలోచించడం భావ్యం కాదండీ”

“సరే” అయిష్టంగానే అన్నాను.

పోనుపోనూ కరోనా ఫీవరు ముదురుతున్నట్టుగా తెలిసి, జనాల అలికిడి తగ్గుతోంది. దేశ ప్రజానీకం సంసిద్ధం కాని ఒకానొక రోజున, దేశం మొత్తం  లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దేశం తన ఊపిరిని తనే బిగబట్టుకునేసింది. జనజీవనాన్ని అష్ట దిగ్బంధనం చేసేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే. ఎక్కడి రైళ్లు అక్కడే. ఎక్కడి విహంగాలు అక్కడే. ఎక్కడి మనుషులు అక్కడే. ఎక్కడి ఫైళ్ళు అక్కడే. షాపులు మూసుకున్నాయి. పరిశ్రమల సైరెన్లు మూగబోయాయి. ఆసుపత్రులు మినహా అన్నీ బంద్.

దేశం మాట అటుంచి, మా ఆవిడ విషయo లోనే నాకు ఆందోళన మొదలైంది. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే? డాక్టర్ సంజనను రమ్మనలేను. ఈవిణ్ణి తీసుకెళ్లలేను. మందూ మాకూ ఎట్లా? కరోనా భయంతో, సాయం చేయగలిగే వాళ్ళు కూడా అందుబాటులోకి రారు. హోల్‌సేల్‌గా కొని తెచ్చుకుంటాము కాబట్టి వెచ్చాలకు ఇబ్బంది ఉండదు. పాలపిండితో టీ కాఫీలు గడిచిచిపోతాయి గాని, కూరగాయలు? పక్కింటి గాలి సోకినా కరోనా తగులుకుంటుందనే పుకార్లు రౌండ్లు కొడుతున్నాయి. అందరూ తలుపులు బిగించేసుకుంటున్నారు. మనిషికి మనిషి ఎదురైతే, ఇద్దరిలో ఒక్కడే మిగులుతాడనే బెదురు సర్వవ్యాపితమైపోయింది. ఇటువంటి వార్తలతోనే జనాలు సగం చచ్చిపోతున్నసందర్భం.

ఏ పరిస్థితి ఎదురు రాకూడదనుకుంటానో అదే ఎదురైంది. చాలా రోజుల తర్వాత, ఆ రాత్రి మా ఆవిడ పరిస్థితి దిగజారడం మొదలైంది. దానికి తోడు జ్వరము జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు, విపరీతమైన ఆయాసoతో మాట రావడం లేదు. గుండె దడ అంటూ సైగలు చేస్తోంది.

“నేను రాలేని పరిస్థితి. పోలీస్ పికెటింగు. మరో పక్క కర్ఫ్యు. బీపీ పల్సు ఆక్సీజెన్ టెంపరేచరు చూశారా?”

చెప్పాను.

“మీరు చెప్పిన రీడింగ్స్ చూస్తుంటే, ఇది కరోనా లాగానే అనిపిస్తోంది. చూద్దాం. గంటగంటకు రీడింగ్స్ నోట్ చేస్తూ ఉండండి. ఏం ఫర్వాలేదు. యెర్లీ మోనింగ్ మీ కార్లో కిమ్స్‌కు తీసుకెళ్ళండి. పోలీసులు అడ్డుకుంటే నాకు ఫోన్ చేయండి. వాళ్ళతో మాట్లాడతాను. డాక్టర్ రాజేశ్ కంచర్ల గారికి  వివరంగా చెప్తాను” అనేసి ధైర్యం చెప్పింది డాక్టర్ సంజన.

కరోనా మాట వినగానే, “సరోజా! ఈ రూమును ఐసొలేట్ చేస్తున్నాను. నువ్వు రావద్దు. నీ రూములోనే ఉండు. ఏమైనా అవసరపడితే ఫోన్లో అడుగుతాను. డోరు బయట పెడుదువుగాని”

నా మాటలను పట్టించుకోకుండా, సరోజ వేడి నీళ్లని, పాలని, గ్లూకోజ్ అంటూ అటూ ఇటూ తిరుతోంది. గంటకోసారి పాదాలనూ, అర చేతులనూ కొబ్బరి నూనెతో మర్దనా చేస్తోంది. నుదుటిమీద అమృతాంజనం రుద్దుతోంది. నేను ఒకటికి రెండు సార్లు చెప్పి చూశాను.

“ఏవండీ!” అంటూ నా చేతిని తట్టింది. సరోజా హాల్లో కూర్చుంది. టైము నాలుగు దాటింది. బ్రహ్మకాలం. మా ఆవిడ నా చేతిని తన చేతిలోకి తీసుకొని, ఆరోజు మాదిరిగానే నా చేతిని తన తలపైకి లాగి పెట్టుకుంది.

“మీరు చేస్తున్న సేవకు, పంచిన ప్రేమానురాగాలకు బదులుగా నేను మీకేమి తిరిగివ్వలేను. మీ రుణం తీర్చుకునే అవకాశం నా చేతుల్లోంచి జారిపోతోతున్నట్టుగా అనిపిస్తూ ఉందoడీ. ఈ క్షణంలో, మిగిలిన మీ వందేళ్ల జీవితాన్ని సంరక్షించుకునే ఏర్పాటే, నేను ఆరోజూ  కోరుకున్నాను, ఈరోజూ గుర్తు చేస్తున్నాను” ఆయాసపడుతూ చెప్తోంది.

“సరోజా సరోజా”

లోపలికోస్తూ, “ఏం కాదమ్మా. ధైర్యంగా ఉండు. నీకు మేమున్నాo” సరోజ మాట్లాడుతూనే ఉంది.

తెల్లారే లోపల, ఏమనుకుంటాడో ఏమో అనుకున్నా, ఏమనుకున్నా ఫర్వాలేదు అనుకుంటూ, కిమ్స్ డాక్టర్ రాజేష్‌కు ఫోన్ చేశాను. తను నా కొలీగ్ కంచర్ల వెoకటేశ్వర రావు కొడుకే.  ఫంక్షన్స్‌కు తండ్రితోబాటు వచ్చేవాడు.

“చెప్పండంకుల్. మీ నంబర్ నాదగ్గరుంది. వై. కృష్ణప్రసాద్ కొడుకు పెళ్ళిలో ఇచ్చారు. ఈ టైములో కాల్ చేశారేం?”

విషయమంతా వివరంగా చెప్పాను.

“శిల్పా పార్క్ మా యింటికి టెన్ మినిట్స్ డ్రైవ్. మీరు హాస్పిటల్‌కు రావడం అంటే, హెక్టిక్ టాస్క్. నేనే వస్తున్నాను. కరోనాలో సీరియస్ కేసులను అటెండవడానికి సీనియర్‌గా నాకు పర్మిషన్ ఉంది. మీ లొకేషన్ షేర్ చేయండి”

లక్ష్మణుడి వైద్యానికి, సంజీవ పర్వతాన్ని అవలీలగా ఎత్తుకొచ్చిన అభయాంజనేయుల వారిలా అనిపించాడు.

డాక్టర్ రాజేశ్ తో బాటుగా, మదర్ ధెరేశా ఎన్.జి. వో టీముకూడా, మా ఇంట అడుగు పెట్టింది.

“నథింగ్ టు వర్రీ ఆంటీ. నేనున్నాగా” ఏడుస్తున్న పేషెంటు పక్కనే కూర్చున్నాడు తలనిమురుతూ.

నా దగ్గర నెంబరు తీసుకొని, డాక్టర్ సంజనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు.

మెడికల్ యెక్విప్మెంట్ తో వచ్చిన మదర్ ధెరేశా టీము, డాక్టర్ డైరెక్షన్‌లో చేసుకుపోతున్నారు.

“అంకుల్. నేను ఫోను తీసుకోలేకపోతే, మా నాన్నకు ఫోన్ చేయండి నన్ను అలర్ట్ చేస్తారు. తన ఫోన్ తీసుకోకపోయిన రోజున, నాకు అక్షింతలే” అంటూ నవ్వేసి, “ఈ టీము ప్రతి రోజూ ఉదయమూ సాయింత్రమూ వచ్చి, మోనిటర్ చేస్తారు. డాక్టర్ సంజనాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. వస్తాను. అమ్మా! తొందరలో నాకు భోజనం తినిపిస్తావు” మోగుతున్న మొబైల్‌ను తీసుకొని, మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు, డాక్టర్ రాజేష్. అంతా కల లాగా జరిగిపోయింది.

***

మరో పదిహేను రోజులవరకూ బాగా ఇబ్బంది పడినా, సరోజ సమకూర్చిన సౌకర్యాలతోనూ, ఆమె ఇచ్చిన మానసికమైన బలంతోనూ, తన పనులు తను చేసుకునేందుకు శక్తి కూడుకుంది. మామూలు మనిషి కావడానికి బాగా టైము పట్టింది.

మామూలు స్థితికి చేరుకునేనాటికి, లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు పాలకులు ప్రకటించారు. ఫ్రీజయినవన్నీ మోషన్ లోకి వచ్చేశాయి. ఆ రాత్రి రాత్రంతా మా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాణాసంచా వెలుగుల్లో పట్టపగలుగా మారిపోయాయి.

మర్నాడు ఉదయం లేటుగా లేచాను. లేచేసరికి సరోజ కనిపించలేదు. పిలిచాను. పలకలేదు. పూజ గదిలో దీపాలు వెలుగుతున్నాయి. పూజ ముగించుకొని గుడికి వెళ్ళుంటుంది. లేదా పాలకు కూరలకో పోయుంటుంది అనుకున్నాను. నా తెల్లవారి కార్యక్రమాలకోసం, అటూ ఇటూ తిరుగుతుండగా, సరోజ ఊరునుండి మా ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకున్న చందనా బేగు, నా కళ్లబడింది.

శంకతో చూడగూడదు అనుకుంటూనే చూశాను. ఆమె కున్న రెండు చీరేలు, చీరల మధ్యన నాదీ మా ఆవిడదీ కలిసున్న పెద్ద సైజు ఫోటో ఉన్నాయి. అడుగున చిన్న మనీ పర్సు, అందులో ఆమె ఆధార్ కార్డు, వరల్డ్ మేరేజ్ డే న ఇచ్చిన ఐదువందల నోట్లూ ఉన్నాయి. అంటే, ఈమె మామూలు మనిషయింది, లాక్‌డౌన్ ఎత్తేశారు కాబట్టి, మాకు  తన అవసరం లేదనుకుని, ఊరికి బయలుదేరుతోందన్న మాట.

సరోజ సెంట్రిగ్గా నాలో ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు.  ప్లస్సులు, మైనస్సులు, మల్టిప్లికేషన్లు!!

నిద్రపోతున్నమా ఆవిడను లేపాను. సరోజ వెళ్లిపోవడానికి రెడీ అయ్యింది అని చెప్పాను. తుళ్లిపడింది. గబగబా రూము బయటికి వచ్చి, హాల్లో ఉన్న చందనా బేగును మా రూములోకి మార్చేసింది.

కాసేపటికి ఆమె గుడి నుండి వచ్చినట్టుగా, చేతిలోని ప్రసాదాన్ని తమలపాకులోని కుంకుమను టీపోయ్ మీద ఉంచుతూ, “స్నానం చేశాక బొట్టు పెట్టుకొని, ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకొండి” అన్నది.

“సరోజా! మనం అన్నవరం వెళ్లొచ్చాక నీ ఇష్టం. మాతో ఉండాలన్నా, ఊరుకు వెళ్లిపోవాలన్నా నిర్ణయం నీదే!” తనతో నేను మాట్లాడిన పొడవైన వాక్యం కూడా ఇదే!

***

మర్నాడు ముగ్గురం అన్నవర సత్యదేవుని పుణ్యక్షేత్రానికి బయలుదేరాము.

చీకటి ముదురుతుండగా, కారు ఎటుపోతోందో ఆడవాళ్ళిద్దరికి తెలియడo లేదు.

ఓ మూడంతస్తుల మేడ ముందు కారాగింది.

కారు దిగకుండానే ఫోన్ చేశాను.

“ఏంట్రా ఈ వేళప్పుడు కాల్ చేశావు. నేనే నీకు చేద్దామనుకున్నాను”

“సరే! నేను మీ ఇంటి గేటు ముందున్నాను”

“ఆఁ!”

“ఆఁ!!”

పండక్కి డెకోరేట్ చేసున్నట్టుగా, బిల్డింగు మొత్తo పైనుండి కిందివరకూ లైట్లు వెలిగాయి.

రావడం రావడం నన్ను చుట్టేశాడు సత్తిగాడు. పరిచయాలయ్యాయి. భోజనాలయ్యాయి.

తమలపాకులకు సున్నం రాస్తూ, వక్కల్ని ముక్కలుగా చేస్తూ కాస్తంత చక్కెరను చల్లుతూ అన్నాడు, “ఇంటి ఇల్లాలు లేక నేనే పనులన్నీ చేసుకోవాల్సి వస్తోందిరా” నవ్వేస్తూ.

నేను తమలపాకును సమోసా షేపులోకి చుట్టి, “తాంబూలాలను మార్చుకోడానికే మేము వచ్చాము రా” అంటూ, వాడి నోటికి అందించాను.

వాడితో బాటు మా ఆవిడ కూడా ఆశ్చర్యంగా నన్ను చూసింది.

అప్పటివరకూ చూసుకోని సత్యం సరోజా, అరవిరిసిన కళ్ళతో ఒకరినొకరు చూసుకున్నారు.

మాటల్లో పడి రాత్రి పన్నెండు దాటింది.

“ఇక పడుకొoడి. త్వరగా లేచి బయలుదేరాలి. తెలతెలవారే సరికి అన్నవరపుణ్యక్షేత్రం చేరుకుంటే, రత్నగిరి కొండల్ని పావనం చేస్తూ పారే పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని సన్నిధిలో పూజాదికాలు పూర్తి చేసుకుంటే, ఆ పూజాఫలాలు జన్మ జన్మలకు మనలను దీవిస్తూనే ఉంటాయి”

***

మేమిద్దరమూ బాల్కనీలో కాఫీ తాగుతున్నాము. ఇంతలో మొబైల్ ఫోను మోగింది.  స్క్రీన్ మీద సరోజా సత్యం పేరు కనిపించింది.

“అన్నయ్యా! ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకునే రోజు. మీరు మాకు పెళ్లి జరిపించాక, ఇది నాలుగో సంవత్సరం”

“అట్లాగా! మెనీ మోర్ హేపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా!”

“మీ జంటకు కూడా అన్నయ్యా!”

సరోజ పలికిన మాటతో అప్పటి రోజులన్నీ మాకు వరుసగా గుర్తుకు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here