రంగుల హేల 21: ఆదత్ సే మజ్‌బూర్

1
2

[box type=’note’ fontsize=’16’] “మన అలవాట్లు అతిగా అటుగానీ, అతిగా ఇటు గానీ కాకుండా మధ్య మార్గం లో ఉండేలా మనమీద మనమే ఒక కన్నేసి నిఘా పెట్టుకోవడం తప్పనిసరి” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]W[/dropcap]E ARE WHAT WE REPEATEDLY DO… మనమేంటో మనం మళ్ళీ మళ్ళీ చేసే పనులు చెబుతాయట. మనుషులందరికీ చదువుకున్నా, చదువుకోకపోయినా, ఉద్యోగాలు చేసినా, చెయ్యకపోయినా అలవాట్లనేవి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. మనిషి మనిషికీ ఇవి మారతాయి. ఒకేలా ఉండవు.

కొన్ని అలవాట్లు కుటుంబ వారసత్వంగా, కొన్ని జన్యు పరంగా, మరి కొన్ని సజ్జన సాంగత్యపరంగా, మరి కొన్ని ఉత్తమ గురు బోధల వల్ల రావచ్చు. అనుభవాల పరంగా కూడా అలవాట్లు వస్తాయి. అన్నీ కలిసిన మిశ్రమంగా ప్రతి మనిషికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి వ్యక్తీ విభిన్నమైన ముద్ర. అతనిలా మరొకరు ఉండరు.

అనేక ప్రభావాల వల్ల మనిషి కొన్ని అలవాట్లు సంతరించుకొని వాటినే అతను మరీ మరీ చేస్తుంటాడు. అవి అతని వ్యక్తిత్వంలో మిళితమై ఉంటాయి. అవి లేకుండా అతను ఉండలేడు. ఒకోసారి అతను వాటిని ప్రయత్నించినా మార్చుకోలేడు కూడా. అతని అలవాట్లకు అతను బానిసైపోతాడు. అవి దురలవాట్లు కానీ మంచివైనా కానీ ఏ ప్రతేకత లేని వైనా కానీ.

చుట్టుపక్కల ఉన్న సన్నిహితులు, పెద్దలు అనారోగ్యకరమైన అలవాట్లు మార్చుకోమని సలహా ఇచ్చినపుడు వివేకవంతులు తమని తాము చక్కదిద్దుకుంటారు. అయితే వీరి శాతం తక్కువే. అలవాట్లని మార్చుకోవడం మహా కష్టం ఎంతటివారికైనా కానీ.

ఇక వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా కొన్ని అలవాట్లు వస్తాయి. టీచర్లు పిల్లలకి సుద్దులు చెప్పే అలవాటు చొప్పున తరచూ అందరికీ బోధలు చెయ్యడానికి నడుం కడతారు. కవిత్వం ఎక్కువ రాసే కవి కథ రాస్తే అది లయాత్మకంగా సాగి సాగి అతి క్లుప్తత చెంది పాఠకుడికి అర్థం కాకుండా పోయికూర్చుంటుంది.

అలాగే కథా రచయత కవిత రాస్తే పాఠకులని వారి ఊహకు వదలకుండా ముగింపు కూడా రాసేస్తాడు. ఇక ఫీచర్స్ రాసే జర్నలిస్టులు కథ రాస్తే పాత్రల వృత్తి, జీవనసరళిఫై వివరణాత్మక రిపోర్టులు పేజీలకు పేజీలు రాసి విసుగెత్తించే ప్రమాదం ఉంటుంది. అలవాటు వారి బండినలా లాగేస్తూ వుంటుంది. కొసమెరుపు ఆనవాలు దొరకదు.

నవలలు రాసే వారికీ, టీ.వీ. సీరియల్స్ కి రాసే వారికీ మొదలు పెట్టడం వస్తుంది తప్ప ముగించడం రాదు, ఆ పత్రికా ఎడిటరో, సీరియల్ ప్రొడ్యూసరో ” ఇక చాలు పూర్తి చెయ్యండి ” అనేవరకూ.

రిటైరయిన హీరోయిన్లని ఛానల్సులో ఇంటర్వ్యూకి పిలిచినపుడు తమ గురించి చెప్పేదాని కన్నా కెమెరా యాంగిల్లో అందంగా కనబడేలా కూర్చొని నవ్వులు కురిపించడం పైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తుంటారు. ఏ ప్రశ్నలడిగినా ఆవుకథలా ఒకటి రెండు సరదా అనుభవాలు అలవాటుగా చెప్పేసి వెళ్ళిపోతారు.

మాకు వరసకు బాబాయి ఒకాయన ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. మహా పిసినారి. పొదుపలవాటు ఉగ్గు పాలతోనే నేర్చాడు. పిల్లలు లేరు. ఆఖరి దశలో మంచం పట్టాడు. నీరసించి కోమాకి దగ్గర పడ్డాడు. అప్పుడప్పుడూ మెలకువ వచ్చేది. వచ్చిన వెంటనే “ఈ సెలైన్ బాటిల్ ఎంత? డాక్టర్ ఎంత తీసుకున్నాడు?” లాంటి వివరాలు అడిగి “నేనంత కష్టపడి సంపాదించింది వీడికి పొయ్యడానికా?” అని బాధపడేవాడు. మళ్ళీ మత్తులోకి జారిపోయేవాడు. ఆయనకి ఖర్చు పూర్తిగా చెప్పకుండా సగం సగం చెప్పినా తట్టుకోలేక కాలం చేసాడు చివరికి.

కొందరు ఆడవాళ్ళకి చీటికీ మాటికీ పట్టుచీరలు కట్టుకోవడం ఇష్టం. ఆ అలవాటులో ‘ఎవరో అనారోగ్యంతో ఉన్నారు హాస్పిటల్‌కి వెళ్దాం’ రమ్మన్నా ఒక పట్టుచీర కట్టుకుని బయలుదేరిపోతుంటారు. ఇక పోతే కొంతమంది పొదుపు పార్వతులుంటారు. వాళ్ళకి మంచి చీరలన్నీ కట్టుకోకుండా చక్కగా బీరువాలో దాచుకుంటే గొప్ప సంతోషం. వీళ్ళు పెళ్ళికి కూడా అదే అలవాటు చొప్పున ఓ పాతచీర కట్టుకునొచ్చి మనమేదైనా సలహా చెబుదామనుకునేలోగానే పసిగట్టేసి “ఈ చీర బానే ఉంది కదా! ఇది కొత్తదే! ఈ మధ్యే నాలుగేళ్ళ క్రితం కొన్నదే!” అని దబాయించి మరీ నిలబడతారు. ఈ అలవాటు యుక్తా యుక్త విచక్షణని చంపేసి నలుగురూ వెనక నవ్వుకుంటున్నా వాళ్ళ ని పట్టించుకోనివ్వదు.

కొంత మంది కొన్న వస్తువుల రేట్లు కొన్న రేట్ కంటే ఎక్కువగా చెబుతూవుంటారు. అది వారి అలవాటు. కొన్నాళ్లకి అసలు రేటు అందరికీ తెలిసిపోతుంది. ఎవరయినా నిలదీస్తే వీరు కోపగించుకుంటారు తప్ప అలా చెప్పడం మాత్రం మానరు. ఇంకొంత మంది ఒక జరిగిన సంఘటన చెబుతున్నపుడు ఎడాపెడా కల్పనలు చేర్చి ఎవరూ చెప్పని డైలాగులు చెప్పినట్టు చెప్పేసి ఇవాళ ఒకలాగా మరునాడు ఇంకొకలాగా చెబుతూ వుంటారు. అది ఒక అలవాటు అంతే! అబద్దాలు చెప్పే ఉద్దేశం కాదు. క్రమంగా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని నమ్మడం మానేస్తారు. ఏం జరిగిందో ఇంకెవరినైనా అడిగి తెలుసుకుంటూవుంటారు.

కొందరికి ఎక్కువ మాట్లాడే అలవాటు జనానికి ఠారెత్తేలా. కొందరికి తక్కువ మాట్లాడే అలవాటు ఎదుటివారికి అర్ధం అయీ అవకుండా. ఈ విషయాన్ని వారి దృష్టికి తెచ్చినా వారి వరస మారదు.

మన అలవాట్లు అతిగా అటుగానీ, అతిగా ఇటు గానీ కాకుండా మధ్య మార్గంలో ఉండేలా మనమీద మనమే ఒక కన్నేసి నిఘా పెట్టుకోవడం తప్పనిసరి. ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here