Site icon Sanchika

ఆధునిక శాకుంతలం

[‘ఆధునిక శాకుంతలం’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నారు శ్రీ పారుపల్లి అజయ్‍ కుమార్.]

[dropcap]ఆ[/dropcap] రోజు
బస్ స్టాపులో నన్ను చూసి
హలో హలో అన్నాడు
అందంగా నవ్వాడు
మౌనంగా చూసాను
మారు మాట్లాడక..

మరోరోజు
మోముపై
విరిసీ విరియని
దరహాసాలు
ముఖ పరిచయాలు
మురిసాయి..

తరువాత రోజు
కనులతో కనులు
భాషించుకున్నాయ్
చూపులు విరితూపులై
ఎద లోపల
ఏదో అలజడి..

తరువాత్తరువాత
మౌనం మటుమాయమయింది
కాలక్షేపం కబుర్లు
కుదిరితే కప్పు కాఫీ..

పార్కుల వెంట
బీచుల చెంత
నడక నేర్పిన ముచ్చట్లు
ముసినవ్వుల ముద్దబంతులు..

స్వచ్ఛమైన స్నేహమన్నాడు
కల్తీ లేని ప్రేమన్నాడు
నను చూడక ఉండలేనన్నాడు
నేలేక పోతే బతుకలేనని
నా ఒడిలో తలపెట్టి
బావురుమన్నాడు..

మోహావేశంలో
ననుముంచి
వలపుపాశంతో
నను బంధించాడు..

ఊహల లోకంలో ఓలలాడించి
ఆశల పల్లకీలో నన్నూరేగించి
మనసంతా మీటాడు
మధుర సంగీతం మేళవించి..

మాపటివేళ మసక చీకట్లో
ముద్దులతో మొదలెట్టి
తనువంతా తడిమాడు
తేనెజల్లై కురిసాడు..

తన్మయత్వమో
తెలియని మైకమో
విరిపానుపు శయ్యపై
మేనంతా పరిచాను
నువ్వే నేనో
నేనే నువ్వో
ఒకే దేహమై
ఒకటే శ్వాసై
నను నేనే మరిచాను
అనందం అర్ణవమై
అనుభూతుల హద్దులు దాటి
రసలోకపుటంచులు చూసి
నాకేమౌతుందో
తెలియని వివశత్వం
కాలం ఘనీభవించిన
ఘడియలవి..

మత్తు వీడింది
మది చెదిరింది
విజయ గర్వంతో అతడు
విషణ్ణ వదనంతో నేను..

బై బై అన్నాడు
మరిక సెలవా అన్నాడు
మాటరాక మౌనంతో
మిన్నకుండి పోయాను
వెనుతిరిగి చూడకుండా
వెళ్లి పోతున్న అతని
అడుగులను చూస్తూ
రేపొస్తాడుగా
అన్న ఆశనే
ఆలంబనగా చేసుకుని
నిర్వేదంగా
నిలుచుండిపోయాను..

ఎదురుచూపులన్నీ
ఎండమావులయ్యాయి
కన్న కలలన్నీ
కన్నీరుగా మారాయి
మనసు వికలమై
తనువు శకలమై
జీవశ్చవాన్నై
ఆకులు రాల్చిన శిశిరంలో
ఎండిన మోడులా
నిదుర రాని నిశిరాత్రులలో
నిట్టూర్పుల సుడిగుండంలో
ఒంటరిగా వగచాను
అరణ్య రోదనలా
నా వేదన మిగిలింది
ఆశల అడుగులు తడబడి
నిరాశ మాటున నిలిచాయి..

కడలిలా పొంగే శోకాన్ని
కనురెప్పల మాటున దాచి
అతనికై వెతికాను
అంతటా చూసాను
అతని జాడ పసిగట్టాను
ఎదురెళ్లి అడిగాను
బాగున్నావా?
అని
ఎవరు నువ్వు అన్నాడు
విస్మయంగా చూస్తూ
ఎవరో పిచ్చిది అన్నాడు
ప్రక్కనున్నవారితో
ననుదాటుకెళ్ళాడు
నా వంక చూడకుండా..

యుగాలు మారినా
తరతరాలుగా
మారని కథ ఇది
అలనాటి శకుంతల నుండి
నేటివరకు
తీరని వ్యథ ఇది
మతిలేని మనిషిలా
స్తంభించి పోయాను
ఉంగరం లేదు
నా దగ్గర
జ్ఞాపకాల నీడలను
పరచటానికి
సౌమిత్రి లేడు ప్రక్కన
అగ్గిచితి పేర్చటానికి
భూమాత రాలేదు
నను తీసుకెళ్ళటానికి
అయోనిజను కానుగా..

చావాలని లేదు నాకు
నాలో ఊపిరి
పోసుకుంటున్న
ప్రాణిని
నాచేతులారా
చంపలేను
చంపాలని వుంది
నను వంచించిన
వంచకుడిని
కానీ..
వాడు చస్తే సుఖపడిపోతాడు
వాడు చావకూడదు
నిరంతరం
క్షణక్షణం
చస్తూ బతకాలి..

మౌన పోరాటం కాదు
చెయ్యాలిసింది
అవమానితదగ్ధ ద్రౌపదిలా
క్రోధారుణ నేత్రాలను
జ్వాలలుగా రాజేసి
పాంచజన్యం పూరించి
పాశుపతాస్త్రం సంధించి
కామాంధుల కుత్తుకలు
కరవాలంతో తెగనరికే
కురుక్షేత్ర సమరమే
జీవితరంగంలో
మొదలెట్టాలి..

ఏం చేయాలి?
ఆలోచనల మథనంలో
దొరికిందో దారి..

మా కథనే
ఆవేదనతో
ఆక్రోశంతో
అందంగా మలిచాను
మరో ప్రేమ కథలా
వాడు రాసిన ఉత్తరాల
జిరాక్స్ కాపీలు ప్రేమకథకు
నిలువెత్తు నిదర్శనంలా నిలిపాను
పేర్లను మార్చి రాయలేదు
కల్పిత గాథలా చెక్కలేదు
ఉన్న నిజాలే తెలిపాను
భావాలను పొదిగాను
భావుకత సొగసులద్ది
అక్షరాలను మలిచాను
అందమైన కావ్యంలా..

పేపర్లకెక్కాను
పత్రికలకిచ్చాను
పుస్తకావిష్కరణ చేసాను
స్నేహితుల వాట్స్ అప్ లలో
ఫేసుబుక్‌లో
అంతర్జాల పత్రికల్లో
పోస్టులు పెట్టాను
వాస్తవాలను
వాడికత్తులు చేసి
కలకత్తా కాళికలా కన్నెర్ర చేసి
నిప్పులాంటి నిజాలన్నీ
తేటతెల్లం చేసాను
తెగించిన చండికలా..

వాడి బందుగులందరు
వాణ్ణి చీదరించుకున్నారు
స్నేహితులందరూ
వాణ్ణి దూరం బెట్టారు
పరువంతా తీసాను
పదిమందిలో
నిలువునా కడిగేస్తూ
వాడి బతుకు
బస్ స్తాండయింది
పరుగెత్తుకు వచ్చాడు
పెళ్లిచేసుకుంటానన్నాడు
కాళ్లపై బడి
కనికరించమన్నాడు
చేసిన తప్పు కాయమని
కన్నీళ్లేట్టుకున్నాడు
ఎడమ కాలితో నెట్టేసి
ఛీ చీ అని చీదరించుకున్నాను
వాడి మొఖాన ఉమ్మేసి
పోరా పో అన్నాను
తలుపులన్నీ వేసాను
తలపులన్నీ మూసాను..

తనువంతా గాయమైనా
మనసంతా ఛిద్రమైనా
ఏ తోడు లేకున్నా
నా నీడే నాకు తోడుగా
జీవన పొరాటంలో
అలసిపోక
బెదిరిపోక
మనోస్తైర్యం సడలనీక
ధైర్యంగా నిలబడ్డా
అబలను కాను సబల నంటూ..

మోడువారిన జీవితంలో
వాసంత సమీరంలా
ముద్దులమూటగట్టే
చిన్నారికి తల్లినయ్యా
వెన్నెల సోనకు అమ్మనయ్యా
వసంతం విరబూసింది
నా జీవితంలో
వెలుగుల దీపాలే
ఇక నా కంట్లో..

Exit mobile version