Site icon Sanchika

ఆధునిక యుగంలో ఆటవిక జాతి

[dropcap]అ[/dropcap]వును…!
నేనెప్పుడూ రాక్షస జాతిని చూడలేదు!
దెయ్యాలు, భూతాలు, రాక్షసులు…
వీళ్ళందర్నీ నేను
ఇతిహాసాలలో…
పురాణాలలో…
మాత్రమే చదివాను!

మారాం చేసే పసి బిడ్దలు
భయంతో మిన్నకుండేదానికి…
అమ్మమ్మలు, బామ్మలు చెప్పే కథల్లో
వినిపించే జాతి ఇది…!

ఆ జాతికి ఓ రూపం
ఈనాడు…
కాందహార్ గడ్డపై
ఆవిష్కృతమై…
వికృత విన్యాసాలు చేస్తూ
విశ్వం యవనికపై
రక్తపుటేరులను ప్రవహింపజేస్తోంది!

జీహాద్ పేరుతో
దేవుణ్ణి అడ్దం పెట్టుకొని…
మత ఛాందసంతో
మానవజాతిని మట్టుపెడుతోన్న
ముష్కరమూకలు…

ఒకనాడు…
బౌద్ధం నడయాడిన
శాంతి భూమిని
రక్తసిక్తం చేస్తోన్న వేళ…

క్షణక్షణం
భయం నీడలో
బ్రతుకు దుర్భరమై
ప్రాణభీతితో
గుండెను అరచేతిలో పెట్టుకొని…

ఆపన్న హస్తం కోసం
కన్నీళ్ళు ఇంకిపోయిన చూపులతో
ఆశగా ఎదురుచూస్తోన్న…
మూడున్నర కోట్ల జీవచ్ఛవాలు!

విశృంఖలంగా జరుగుతున్న మారణహోమాన్ని
అమాయకంగా చూస్తోన్న
పసికూనల బిక్కు బిక్కు చూపులు…!
జీవించాలనే ఆశను చంపుకొని
బావితరం బ్రతికితే చాలనుకొనే
నిర్లిప్త హృదయాల మనోవేదన…!

కడుపుతీపిని చంపుకొని
కన్నబిడ్డలను
ముళ్ళ కంచెలపై విసిరేస్తోన్న
పేగు బంధాల ఆక్రందనలు…!

వింటుంటే…
చూస్తోంటే…
నా రక్తం ఉడికిపోతోంది!
ఏఁవీ చేయలేని నిస్సహాయత
నా గుండెను పిండి చేస్తోంది!

ప్రపంచ మానవులారా…
ఏకం కండి!
ముష్కర మూకను మట్టుబెట్టి
మానవ జాతిని కాపాడి
విశ్వశాంతిని నెలకొల్పగ
కదం తొక్కుతూ…
ముందుకు…
మున్ముందుకు సాగమని…
మూగబోయిన నా గొంతు
విప్లవ చైతన్యంతో…
ఎలుగెత్తి అరుస్తోంది…!

 

 

 

 

Exit mobile version