Site icon Sanchika

ఆధ్యాత్మికత : తిరుమల రామచంద్ర

[box type=’note’ fontsize=’16’] మహా పండితులు, బహుభాషావేత్త అయిన డా. తిరుమల రామచంద్ర గారి రచనలలోని ఆధ్యాత్మిక భావనలను ప్రస్తావిస్తూ వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు విశ్వర్షి వాసిలి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]”భా[/dropcap]రతి సేవను గురించి మాత్రమే వంద సిద్ధాంత గ్రంథాలు వెలువడవచ్చు. దానికోసం తెలుగునాట ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రయత్నిస్తే బాగుండును” అని దాదాపు పాతికేళ్ల క్రితం ఆధ్యాత్మిక మహిమాలయం, పరిశోధక మానస సరోవరం, మహామహోపాధ్యాయ డా. తిరుమల రామచంద్ర గారు అంటే విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు ఎంత దృష్టి సారించాయో అందరికీ తెలిసిన నేపథ్యంలో కనీసం ఆ మాటలన్న తిరుమల రామచంద్రగారి సాహిత్యం, జీవితం, వ్యక్తిత్వం పైన కాశీ హిందూ విశ్వవిద్యాలయం వంద పరిశోధనా పత్రాలతో అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నాలుగు రోజుల పాటు నిర్వహిస్తుండటం ఆ పరిశోధక బ్రహ్మకు ఇస్తున్న నిజమైన నివాళిగా భావిస్తూ ఆ సాహితీ సుగతునికి హృదయపూర్వకంగా ఆత్మవందనం చేస్తూ – వారి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అటనట పరిచయం చేస్తూ, వారి ఆధ్యాత్మిక రచనలు అనేకం ఉన్నా కనీసం నాలుగింటిని తలస్పర్శిగా నైనా అవలోకించే ప్రయత్నమే నా ఈ పత్ర సమర్పణ.

ఈరోజు తిరుమల రామచంద్ర గారిపై నాలుగు అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు నాకున్న అర్హత ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ‘అర్హత’ అనే పద అర్థంలో ఇమడతానో లేదో అన్న సంశయం నుండి బయటపడ్డ తర్వాత వారితో నాకున్న అనుబంధం చిన్నదేమీ కాదని అర్థమైంది. 1956 లో నేను పుట్టేనాటికే మా నాన్నగారు శార్వరిగారు తిరుమల రామచంద్ర గారు ఆంధ్రప్రభ వారపత్రికలో ఉప సంపాదకులుగా ఉద్యోగస్తులు. అప్పటినుండి 1978 లో నేను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టాపొందేవరకు అదృశ్యంగా వారి అక్షరాలతో, వారి వ్యాసాలతో అదృశ్య స్నేహం. 79, 80 లలో వారు ఆంధ్రభూమి సంపాదక వర్గంలో ఉంటుండగా ఆ పత్రికలో నా వ్యాసప్రచురణల సందర్భంగా ప్రత్యక్షంగా వారితో నా మైత్రి ప్రారంభమయ్యింది. వారు హైదరాబాద్ లోని న్యూ బాకారంలో ఉండటం, ఒక రెండు మూడు ఫర్లాంగుల దూరంలోనే మేము ఉండటంతో మా మైత్రి అక్షరాలా దిన దిన ప్రవర్థమానమైంది. ఆ తర్వాత నేను ‘తెలుగు పరిశోధన’ పత్రికను ప్రారంభించటం, ఆ ఆవిష్కరణ సభకు వారు విశిష్ట అతిథిగా రావటం నాకు లభించిన అదృష్టం. ఆ పిమ్మట వేటూరి ఆనందమూర్తి గారు ‘మణిమంజరి’ పత్రికను ప్రారంభించటం ఆ పత్రిక సంపాదక మండలిలో తిరుమల రామచంద్ర గారు ఉండటం, ఆ పత్రిక నా మాస్టర్ ఆర్ట్ ప్రింటర్స్ లోనే ముద్రితం అవుతుండటంతో మరింత దగ్గరితనం పెరిగింది. ఆ తర్వాత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శతజయంతి ఉత్సవాల కమిటీలో నేను సహకార్యదర్శిగా ఉండటమూ వారు అదే కమిటీలో ఉండటమూ … ఇలా అనేక విధాల సన్నిహితత్వం మా ఇద్దరి మధ్యా ఉండేది. ఈ నేపథ్యంతో వారిని గురించి, వారి వ్యక్తిత్వాన్ని గురించి, వారి ఆధ్యాత్మిక రచనల గురించి కొంతవరకైనా చెప్ప ప్రయత్నిస్తున్నాను.

***

తిరుమల రామచంద్ర అన్న పేరు తెలీని తెలుగు సాహిత్యకారుడు, భాషాశాస్త్రజ్ఞుడు, పరిశోధకుడు ఉండడు. అయితే “తి.రా., రా.చ., తా.రా. (తాడిమర్రి రామచంద్ర), అనే పొడి అక్షరాల పేర్లు; చంద్ర, తాతాచార్య, ఆచార్య, పరిశోధక, పరిశీలక, సంచారి, యాత్రికుడు” అనే చిరు నామాలు నాటి భారతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక మొదలైన పత్రికలలో చూసినవారు ఉండవచ్చు కానీ ఇవన్నీ తిరుమల రామచంద్ర గారి పర్యాయ పేర్లని తెలిసినవారు బహుకొద్దిమంది మాత్రమే. “తెలుగునాట ఇన్ని కలంపేర్లు కల రచయితలేడని నా విశ్వాసం” అని వారే ప్రకటించుకున్నారు. ఎందుకు ఇన్ని కలం పేర్లతో రాయాల్సివచ్చింది అంటే జవాబు ఒకే పత్రికలో అన్ని వ్యాసాలు రాయటం వల్ల, శీర్షికలు నిర్వహించటం వల్ల. ముఖ్యంగా భారతి వంటి సాహిత్య పత్రికలో సగం కంటే ఎక్కువే తిరుమల రామచంద్రగారి కలం జోక్యం ఉండేది. అంటే తిరుమల రామచంద్ర అక్షరాలా బహుముఖీన సాహిత్యమూర్తి కాబట్టే భారతి పత్రిక వారిని అద్వితీయ పరిశోధకుడిగా తీర్చిదిద్దింది. వారు సైతం “భారతి కార్యాలయంలోకి ప్రవేశించటమే భారతీదేవి గర్భాలయంలోకి ప్రవేశించినంత మహాపుణ్యంగా” పరిగణించిన భాషాసేవకులు. ఇటువంటి పరిశోధక వ్యక్తిత్వం కల తిరుమల రామచంద్ర తెలుగువారు కావటం మనం గర్వించదగ్గ అంశం.

త్రిజ్యేష్ఠంలో అంటే జ్యేష్ఠ మాసాన, జ్యేష్ఠ నక్షతంలో, జ్యేష్ఠ పుత్రునిగా పుట్టిన రామచంద్ర ఆరుగురు తల్లుల చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగినప్పటికీ కలం నడవనిదే కడుపు నిండని జీవనయానం వారిది.

“డాక్టర్ తిరుమల రామచంద్ర విచిత్ర వ్యక్తి; వైరుధ్యాల పుట్ట; వైపరీత్యాల మెట్ట. పాదరసాన్ని పరిహసించే పరుగు; మెరుపును మించిన చాంచల్యం.”

“ఇంతటి వైరుధ్యాల వైవిధ్యంలో, వైపరీత్యాల వైరూప్యంలో రచయిత కనిపిస్తాడు; విమర్శకుడు తొంగిచూస్తాడు; భాషావేత్త భాసిస్తాడు; ప్రతిదాని పుట్టుపూర్వోత్తరాలు పరిశీలించే పరిశోధకుడు పలుకరిస్తాడు; కనిపించిన దాన్నంతా కలంతో కబళిద్దామనే భావుకుడు గోచరిస్తాడు; తెలిసినదాన్ని తేటమాటలతో అందించే పత్రికా రచయిత తారాట్లాడుతాడు. ఉపనిషత్కాలపు స్వర్ణయుగం అవతరించాలనే దురాశాపరుడు ప్రత్యక్షమవుతాడు.” అని ‘హంపీ నుంచి హరప్పా దాక’ అనే తమ స్వీయచరిత్రలో చెప్పుకుంటారు.

అవును, తిరుమల రామచంద్ర దురాశాపరుడే… కాకపోతే ఉపనిషత్కాలపు స్వర్ణయుగం రాదని తెలిసీ దురాశపడ్డ ఒక సామాన్య మానవుడే కాదు, ఒక ఆధ్యాత్మిక వారసుడు కూడా.

తమ స్వీయ చరిత్రలో ఒకచోట “సత్యం, తపస్సు, జ్ఞానం, అహింసాగుణం, విద్వాంసులను సేవించడం, ఉత్తమశీలం – ఈ గుణాలున్నవాడే విద్వాంసుడు. వట్టి చదువుతో విద్వాంసుడు కాడు” అని అంటారు. అందుకే ఈ ఆరుగుణాలున్న ఈ దురాశాపరుడ్ని మూర్తీభవించిన ఆధ్యాత్మిక వారసుడు అని అంటున్నది.

***

“మన జీవితంలో అచ్చోత్తిపోయిన ముద్ర పరిసర జీవితం మీద పరిణామం కలిగించనే కలిగిస్తుంది. చావుకు పాల్పడిన ఏ బ్రతుకూ వ్యర్థం కాదు. అది చాలినంత సార్థకం అయ్యేట్టు సాగిపోతే చాలునని నా మనస్సు చెబుతున్నది.” 1960 లో సుప్రసిద్ధ నవలాకారులు శివరామ కారంతగారు తమ కన్నడ నవల “అళిద మేలె”కు రాసుకున్న మున్నుడిలోని మాటలు ఇవి. ఈ నవలను తిరుమల రామచంద్ర గారు తెలుగులోకి “మరణానంతరము” పేర అనువాదం చేశారు. కన్నడ భావాలు శివరామ గారివే అయినా తెలుగులో అవి రామచంద్ర గారివి అయ్యాయి. ఒకవిధంగా శివరామగారి ఇటువంటి నిర్వచనాలు తిరుమల రామచంద్రగారిని ఆకట్టుకుని ఈ నవలానువాదానికి సమాయత్తపరచి ఉంటాయి. మనస్కరించనిదే ఏ రచయితా అనువాదానికి పూనుకోడు. ఎంతో ప్రభావితం చేస్తే తప్ప ఒక భాషలోని సాహిత్యం మరొక భాషలోకి అనువాదానికి నోచుకోదు. రామచంద్రగారు ఇష్టపడి చేసిన నవల ఇది కాబట్టి ఈ “మరణానంతరము” నవల వారికి నచ్చిన విషయ ప్రాధాన్యంగల నవలగా పరిగణించాలి.

ఆధ్యాత్మికవేత్తలకు పరము, మరణానంతరము అనే రెండు విషయాలు రెండు నేత్రాలు. భౌతికం నుండి అభౌతికమైన ఈ రెంటినీ చూస్తూ అదృశ్యంగా ఉన్న మూడోకన్ను చూపేదంతా అధిభౌతిక జగత్తు సంపదే. అది ఆధ్యాత్మిక సంపద.

ఈ నవలలో ఒక చోట శివరామ గారి మాటలకు తిరుమల రాచంద్రగారి తెలుగు భావధార చూడండి “మన పూర్వ ఋషులు కొందరు జగత్తు, సృష్టి విషయంలో – ఇది ఇలా, ఇదే సత్యం; ఇదే చివరి మాట – అనే రీతిగా చెప్పారు కదా! వాటిని మీరు వేదాలనండి, ఉపనిషత్తులనండి, మరేమైనా అనండి, తపస్సుతో తెలుసుకొన్నదనండి, భగవంతుడే ఒక చెవిలో ఊదినాడనండి, నాకొక సంశయం. ఈ విశ్వం, సృష్టి వీని విషయంలో కొద్దిగా నేనూ చదివితెలుసుకొన్నాను. జీవకోటి ఈ యాత్ర ఎప్పుడో ఆరంభమయింది. ఎక్కడికో సాగుతున్నది; ప్రయాణం ప్రారంభమయిన ఎంతో కాలం తర్వాత, దారిలోని రైలుస్టేషనులో బండి ఎక్కే ప్రయాణికునిలాగ, మనుష్యుడనే ప్రాణి లోపల ప్రవేశించాడు; ప్రవేశించినవాడు ప్రవేశించినట్టు దిగిపోనూ పోయాడు. జీవిత ప్రయాణ మేమో ఇంకా ముందుకు సాగింది. దాని లక్ష్యం ఇంతవరకూ తెలియలేదు; ముందు దారి లెక్కపెట్టలేనంత దూరం, అలాటి సమయంలో ఎవరైనా సరే ‘నేను దీని రహస్యం తెలుసుకున్నాను’ ‘ఇదే సత్యం’ అని ఘటాపథంగా చాటితే నగుబాటు కాదా?”

ఈ భావలయ తిరుమల రామచంద్రగారి తాత్విక జీవనాన్నిజల్లెడపడుతోంది. నాకు తిరుమల రామచంద్ర గారు 1978 నుండి బాగా సన్నిహితం. అంతకు పూర్వం వారి అక్షరాలు పరిచయమే కానీ, వారి మాటా నడకా పరిచయం కాదు. 78 తర్వాత వారి పాత్రికేయ జీవనంతో, వారి సాహిత్య జీవనంతో, వారి పరిశోధక జీవనంతో బాగా ముడిపడిపోయాను. వారి దైనందిన జీవన శైలీ, వారి వ్యవహార సరళీ సహృదయతను పరీమళించేది. ప్రాపంచిక జీవనంలో వారు నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయికానీ వారు నొప్పించిన సందర్భాలు మచ్చుకైనా కానరావు. ఎదిగిన మనిషిలో ఒదిగిన తత్వం అనటానికి వారే నిలువెత్తు సాక్ష్యం. వారితో నాకున్న రెండు దశాబ్దాల సాన్నిహిత్యంతో వారు పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. ఒకరిని విమర్శించటం చూడలేదు. నిజం చెప్పాలంటే తిరుమల రామచంద్రగారు సాహిత్యంతో స్నేహం చేసారే తప్ప సాన్నిహిత్యంతో స్నేహం చేయలేదు. అంటే వారికి వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తుల వర్తనాలు ముఖ్యం కాదు. వారు స్నేహించింది వ్యక్తుల తత్వాలతో… అందుకే వారు సాహిత్య ప్రపంచంలో అజాతశత్రువుగా నిలిచిపోయారు. వారు అజాతశత్రువుగా చిరయశస్వి కావటానికి వారి ఆధ్యాత్మిక జీవితం వెన్నెల పరచింది.

తిరుమల రామచంద్ర గారు తన ఇంటిని గౌరవించారు, ఇంటి ఆచారవ్యవహారాలను ఆదరించారు, దేహాన్ని దేశాన్ని కాదనలేదు… దేహ దేశ వర్తనాలను తమ వర్తనంగా చేసుకున్నారు. తన పుట్టింటి బొట్టు కట్టును కడదాకా తల దాల్చారు. మాతృదేశ సంస్కృతిని సమున్నత రీతిన తమ సాహిత్య వీధులలో ఊరేగించి సమ్మానించారు. అందుకే వారు ముతకఖద్దరు వస్త్రధారణతోను, నుదుట నిలువు తిలకం (శ్రీచూర్ణం) తోనూ, కనపడితే చాలు నమస్కరించాలన్న రూపంతో నడిచే విజ్ఞాన సర్వస్వంలా చరిస్తుండేవారు. ముక్కుసూటిగా మాట్లాడేవారు… చక్కటి వాగ్ధాటి. ఇలా చూడటానికి ఎంతో సంప్రదాయవాదిలా కనిపించే తిరుమల రామచంద్ర గారు అంతే అర్వాచీనుడు కూడా. వారు అక్షరాన్ని ఆశ్రయించిన జీవితంలో ఏనాడూ పాతను కాదనలేదు, కొత్తను ఈసడించుకోలేదు. సమకాలీన సాహిత్యాన్ని, వర్తమాన ధోరణులను ఆయన సమాదరించినంతగా మరొక తెలుగు సాహిత్యకారుడు ఆదరించలేదేమో అనిపిస్తుంటుంది. ఇది అతిశయోక్తి కాదు. వారు 1978, 79, 80 లలో ఆంధ్రభూమి దినపత్రికలో అనుబంధ పేజీలకు సంపాదకులుగా ఉంటుండేవారు. అప్పుడు నేను ఏడు వారాలపాటు దిగంబర కవిత్వోద్యమంపైనా, ఆరుగురు దిగంబరకవులపైనా రాసిన వ్యాసాలను వారు ప్రచురించారు. అప్పుడు తెలిసింది వారి పాత్రికేయ దృష్టి. అది అనితర సాధ్యం. అందుకే కాబోలు భారతి పత్రిక వారిని పరిశోధక బ్రహ్మను చేసింది.

“జీవితం నుంచి రిటైరయ్యాను” (పేజీ 31) అన్నది ఈ నవలలోని ఒక సంభాషణ.

“వాస్తవమయిన సూర్యుడు అస్తమించాడు; రేపు మళ్ళీ వస్తాడనేది మా అనుభవం. అందువల్లనే మానవుడు ఒకనాడు మరణించినా, మరొక దేహం ధరించివస్తాడు అనే భావన పుట్టివుంటుంది మానవుని మనస్సులో. చావడానికే ఇష్టం లేని మనస్సు అలాంటి కల్పనలను తానే పేని ఉంటుంది. ఈ సూర్యుడయితే, తన దేహంతో రేపూ వస్తాడు; ఎల్లుండీ వస్తాడు. దినదినమూ వస్తూవుంటాడు. మనం? శరీరం వదలుకొని, వెళ్లే మానవ జీవులం. పునర్జన్మలో మరొక శరీరం ధరించి వస్తామట. ఈ ‘సూర్యుడు’ తిరిగే వస్తే, ‘నిన్న వచ్చి పోయిన సూర్యుడు వీడే’ అన్నది మనం గుర్తిస్తాము. మానవుడు పునశ్శరీరం ఐవస్తే, గుర్తించగలమా? ఎన్నటికీ గుర్తించలేము. గుర్తించినవారు లేరు. అయినా అలాటి ఒక కోరిక నమ్మకమై మన భావనలలో వేళ్ళు నాటింది. మనం పూర్వం ఏ అవతారం దాల్చాము, రేపు ఏ అవతారం తాల్చగలం – అని తెలుసుకోలేక పోయినా, మన దేవుని జన్మలన్నీ మనం గుర్తించాము. భావనా ప్రపంచంలో దేవుని అవతారాలన్నీ గుర్తిస్తున్నాడు ఈ మానవుడు! శాశ్వతంగా బతకాలనే ఆశతో అతడు ఇలా చేస్తున్నాడు కదూ?” (పేజీ 160)

“ఋణాల చెల్లింపుల లెక్కాచారంలో ఎవరు ఎవరికి ఋణి?” (పుట 196) అన్నది ఈ నవల చివరలో వచ్చే ఒక సంభాషణ. ముగింపువాక్యం “ఎన్నటికీ లేదు అని అనిపిస్తుంది నాకు”.

అవును, తిరుమల రామచంద్రగారు తాము సాగించిన జీవనయానంలో ఎవరికీ ఋణిగా మిగలలేదు. “ఎన్నటికీ లేదు అని అనిపిస్తుంది నాకు” అన్నవిధంగానే మన తిరుమల రామచంద్రగారు కూడా “ఋణాల చెల్లింపుల లెక్కాచారంలో ఎవరు ఎవరికి ఋణి?” అని తమను తామే ప్రశ్నించుకుని ఎన్నటికీ ఎవరికి ఎవరూ ఋణి కాదు అన్న ఆత్మవిశ్వాసంతో భౌతికాన్ని వీడివుంటారు.

(వచ్చేవారం “తిరుమల రామచంద్ర: ఆధ్యాత్మిక రచనలు”)

Exit mobile version