[dropcap]సా[/dropcap]గిపోతున్న కాలప్రవాహాన్ని అక్షరబద్ధం చేసి ముందు తరాలకు అందించ వలసిన బాధ్యతతో చివుకుల శ్రీలక్ష్మి గారు 116 కవులతో 129 అంశాలపై కవితలు వ్రాయించి ‘వచనకావ్య రచనా వేదిక’ ద్వారా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆ పుస్తకంలోని ఆరు అధ్యాయాలలోని కవితలపై కోరాడ నరసింహారావు గారు అందిస్తున్న విశ్లేషణలో ఇది మూడవ భాగం. మొదటి భాగం ఇక్కడ, రెండవ భాగం ఇక్కడ చదవవచ్చు.
***
పంచమాధ్యాయ గుణ ప్రశంస
ఏ దేశచరిత్ర చూసినా
యేమున్నది గర్వ కారణం అన్నట్లుగానే
బలహీనుల భుజాలపై … బలవంతులెక్కి స్వారీ చెయ్యటమే చరితం …!
నిర్బంధింపబడ్డవాళ్ళు…
స్వేచ్ఛకోసం చేసే పోరాటాలే అన్నీ ఐతే…మనభారతదేశ స్వేచ్ఛాస్వాతంత్ర్య
పోరాటాలు విలక్షణమైనవి!యివి చరిత్రలో నూతనాధ్యాయానికి తెరతీశాయి
తొమ్మిది దశాబ్దాల
అవిశ్రాన్త పోరాటం ఊపందుకుని…
నలు దిశలనుండీ
కార్చిచ్చులా వ్యాపించి …
ప్రాణాలకు లెక్క చేయని
ఎందరో దేశభక్తుల బలిదానాలతో …
కాలం కర్మం కలిసిరాగా
చివరకు గాంధీజీ అహింస, సత్యాగ్రహాలతో …
ఆంగ్లేయుల కుయుక్తి దేశవిభజనకు దారితీసి…
అఖండభారతం రెండుముక్కలై స్వాతంత్య్రం ప్రకటించుకున్న విషయాలనన్నిటినీ సవివరంగా అందమైన పదాల అక్షరీకరణతో
జాతీయ గీతాలాపనలు,
జెండా రెపరెపలతో సాక్షాత్కరింప జేశారు
భారత స్వాతంత్ర్య పోరాటం
వెంకట స్వామి గారు ….!
యుద్దాల పర్యవసానం… రక్తపాతం, అణచివేత, అరాచకం, అతలాకుతలం యుద్దాలతో సమస్యలెన్నటికీ పరిష్కారంకావు
బలమున్నవాడిదే
రాజ్యమవుతుంది
ఆ బలం నేడు వొకరిదైతే
రేపు మరొకరిదవుతుంది
యిది రావణకాష్టంలా
రాజుకుంటుంది తప్ప
చల్లారదు…ఈసత్యాన్ని గ్రహించిన గాంధీ మార్గానికి యావత్ భారతం మద్దతుపలికి…
అతని వెంట నడవగా…
ఆంగ్లేయుల కుయుక్తులింక పారక…
గాంధీజీ సత్యాగ్రహానికి
తలవంచి ఆంగ్ల ప్రభుత్వం పలాయనం చిత్తగించింది !
మానవేతిహాసానికి
ధ్రువతారగా భారతావని పోరాటం నిలిచింది అంటూ యుద్దాల పరిణామం శీర్షికన సుబోధకం చేశారు
బాలకృష్ణ గారు!
ఏ దేశ చరిత్ర ఎలా వున్నా… నాదేశచరిత్ర
నాకు గర్వకారణం …
ఎన్నెన్ని నెత్తుటి మరకలున్నా నాతల్లి మనసు మీగడ తరకే
అని మన జాతీయ జెండా వినీలాకాశంలో
రెపరెపలాడేటందుకు
దేశవ్యాప్తంగా ధీరోదాత్తులైన దేశభక్తుల రక్తతర్పణలే… ఈదేశచరిత్ర …అంటూ ఆంగ్లేయుల రాక మొదలు
జరిగిన పరిణామాలతో ప్రధానమైన తిరుగుబాట్లను… సంక్షిప్తంగా చక్కని పదచిత్రాలతో అందంగా కవిత్వీకరించి అందించారు నా దేశ చరిత్ర శీర్షికన గౌరునాయుడుగారు!
ప్రపంచాన్ని పరికించి పరిశీలిస్తేనే పరిస్థితులు అవగతమవుతాయి…
పరిష్కారాలకు దారి దొరుకుతుంది
మనలో స్వార్ధం చోటు
చేసుకున్న తరువాత
మనం ఆదినుండీ థియరీల్లో హీరోలమే అయినా ప్రాక్టీకల్స్లో
జీరోలమైపోయాం…
సుస్థిర సమసమాజ నిర్మాణం కోసం మనం పడ్డ చిరకాల తపన స్వరాజ్యం చేకూరే
పిమ్మట తీరే అవకాశం కనిపించింది
ప్రపంచంలోని సోషలిస్టు
కమ్యూనిష్టు విధానాలకు ప్రభావితమై
సంక్షేమ రాజ్య స్థాపన…
అంతరాలులేని
సమసమాజనిర్మాణం
ధ్యేయంగా…
ఆ కలల తీరం చేరే దాకా
ఈపయనం సాగాలి అంటూ భారతదేశంలో సోషలిజం శీర్షికన ఆకాంక్షిస్తున్నారు
సూర్యలక్ష్మిగారు …!
ఎన్ని ముక్కలు,చెక్కలు చేసి విడగొట్టిన మనది అఖండభారతావనియే…
రెండవ ప్రపంచ యుద్దానంతం వరకూ ఆంగ్లేయుల ఆగడాలు సాగినా
వాళ్ళ వేర్పాటువాద చిట్కాలు యిక పనిచెయ్యక… తోకముడిచి పోతూ పోతూ వారు మళ్ళీ పెట్టిన వేర్పాటు చిచ్చు ఆ పరిణామాలు యెంత ప్రభావం చూపినా
పలు పొరుగురాజ్యాలతో సత్సంబంధాలనేర్పరచుకుని అభివృద్ధి పధంలో సాగుతూ…
ప్రపంచదేశాలకే మార్గదర్శకమైనామని ప్రశంసించారు సత్యవతి గారు….!
అరుణాచల్, అస్సాo,
మేఘాలయ, మిజోరo… నాగాల్యాండ్ ,మణిపూర్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లోని చీకటి వెలుగులను
మాదకద్రవ్యాల మత్తు, వివాదాలు, తిరుగుబాట్లు, పొత్తులతో పతనానికి ప్రాణంపోస్తోందంటూ వాపోయారు
ఈశాన్యపు వెలుగు నీడలలో లక్ష్మీ నారాయణ గారు…..!
ఎన్నో యుద్దాలతో
రాటు దేలిన వారు భారతీయులు, వాయుసైన్యాలతో… పటిష్టమైన రక్షణ వలయంగాఏర్పడి
కుల,మత,రాజకీయాల కతీతులై దేశాన్ని
కంటికి రెప్పలా కాపాడుతున్న మన త్రివిధ దళాల ప్రత్యేకతలను సవివరంగా విశ్లేషించి అభినందిస్తూ వీరిని తిరుగులేని త్రివర్ణ పతాక రక్షక త్రిమూర్తులన్నారు
శ్రీనివాసులు గారు ….,!
ప్రణాళికాబద్దమైన విధానాలే ప్రగతికి దోహదపడతాయి
పురోభివృద్ధికి ప్రణాళికలే
పట్టుకొమ్మలు…
అనేక పోరాటాలతో సాదించుకున్న స్వాతంత్య్రం సుస్థిర శాంతి సౌఖ్యాలతో విలసిల్లటం కోసం
పంచవర్ష ప్రణాళికలతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలను సాధించి దేశాన్ని ప్రగతిపధంలో నడిపిస్తున్న
మహానుభావులందరికీ వందనాలంటున్నారు ప్రణాళికాభారతంలో…
నాగేంద్రప్రసాద్ గారు….!
దేశం పరతంత్రం నుండి స్వాతంత్రానికొచ్చిందన్న ఆనందం అచిరకాలంలోనే ఆవిరైపోయింది
రాజకీయానికి రంగు మారి స్వార్ధపు తెగులు సోకి
తర తరాల పరిహాసం మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించింది దగాలూ, దోపిడీలు నిత్యకృత్యమై
వికృత రూపం దాల్చుతున్న
ఈ దుస్థితిని దూరం చేసి ప్రపంచానికి ఆదర్శమయ్యేలా ఆ పూర్వ వైభవాన్ని
తీసుకురమ్మని ప్రార్థిస్తున్నారు ప్రజాస్వామ్య మధుర క్షణాలను తలచుకుంటూ
కే జి వేణుగారు ….!
సృష్ఠి లోనే విశిష్ట ప్రాణిగా ఖ్యాతి గడించిన మానవుడు అక్షరాల వెలుగులో మరింత
మిన్నయైనాడు అంటూ… అక్షరం విప్లవాలకు
బాట వేసింది…
అరాచకాల కోటలు
కుదిపింది అని
అక్షరం యొక్క
గొప్పతనాన్ని చెపుతూ
అక్షరం జాతిని
ప్రగతిపధంలో
వడివడిగా నడిపిస్తుంది అన్నారు
సుబ్బారావు గారు !
మన కళలకు మూలాలు
ఆదిమానవుల
జనపదాలలోనే వున్నాయి వారు అరిచే అరుపులు ,
వేసే అడుగులతోనే
కళాత్మకత రూపు దిద్దుకుంది…
ప్రకృతిసిద్దమైన
సహజ నాద శబ్ద పరికారాల ప్రతిరూపాలే
జంత్ర వాద్యాలు…
అమ్మ పాడిన లాలి పాటలూ జోలపాటలు
శ్రామికుల పనిపాటలు
సంగీత, సాహిత్యాలుగా… రూపుదిద్దుకున్నాయి
వివిధ ప్రాంతాలలో
వివిధ కళారూపాల ఆవిర్భావానికి, వికాసానికీ యివి దోహదపడినాయంటూ.
జానపదగాయకులే
జాతివైతాళికులైనారని విడమర్చి వివరించారు యెల్లభాషలకు తల్లి జానపదంలో
కూర్మారావుగారు !
“వాక్యం రసాత్మకం కావ్యం …
కావ్యేషు నాటకం రమ్యం” అన్నారు…
సంగీత, సాహిత్య, నటనావైశిష్ట్యాలతో ఆకట్టుకుంటుంది
నాటక రంగం దీనికి ముసలితనం రాదు చావులేదు…
యిది అజరామరం !
ఈ జగమే ఒక నాటక రంగం .. మనమంతా పాత్రధారులం
అంటూ
ఆ దేవుని రచన గొప్ప దైతే…
ఈ మనిషి ప్రదర్శన మరీ గొప్పది
వీనుల విందొనరించి మానసికప్రశాంతతను చేకూరుస్తుంది అని కొనియాడారు
లక్ష్మీ ప్రసాద్ బాబు గారు !
కవిత్వం
సాంప్రదాయ పంజరాల్లో అందాలు చిందుతూ చాలాకాలమే గడిపేసింది పెంచుకోగలిగిన
కొందరికే ఆనందాన్ని పంచుతూ…పడమటి చూపుతో నవ్య సాహిత్య పరిషత్తు ఆవిర్భవించి వచనానికి పురుడుపోసింది
కాలానుగుణంగా అనేక మార్పులకు లోనై
అనేకానేక రూపాలతో నేడు విరాజమానమవుతుందంటూ
అందుకు దోహద పడిన వారి నందరినీ పేరు పేరునా
అభినందించారు
వచనం కవితయిన తీరు శీర్షికన
శ్రీరామూర్తి గారు…!
సహనం చచ్చిన వేళ
ఉద్యమం పుట్టుకొస్తుంది సామాజిక ప్రయోజనమే
ద్యేయంగా సామూహిక చైతన్యమే ఉద్యమం
అణచి వేసేకొద్దీ
పైకి లేస్తూనే ఉంటుంది
అనేక ఉద్యమాలకు ఊపిరిలూదింది ఆయా ఉద్యమ సాహిత్యమే…
అక్షరమే ఆయుధమై అడుగేస్తుంది
సాహిత్యమే సైనికుడై పోరాడుతుంది
అంటూ ఉద్యమాల
తీరుతెన్నులను వాటి వైశిష్ట్యాన్నీ వివరించారు శ్యామల గారు !
వ్యక్తులను…ప్రాంతాలను…
చివరకు దేశాలనూ
దగ్గరకు తెచ్చి కలపగల శక్తి
సమాచార రంగానిదే
ప్రాధమిక స్థాయిలో ఈ గురుతర బాధ్యతను పత్రికలు
పోషించాయి పాఠకులను పెంచుకు నరులకు ప్రోత్సాహాన్నందిస్తూ
ఆన్లైన్, వెబ్ పత్రికల స్థాయికి ఎదిగింది సమాచార వ్యవస్థ
వందేళ్లలో రాని మార్పులు యిరవయ్యేళ్లలో వచ్చాయంటూ
సమాచార రంగాన్ని
విపులంగా సమీక్షించి విస్తృత విషయ పరిచయం చేశారు రాజేంద్ర ప్రసాదవర్మగారు!
సింధు నాగరికతతో
నవీనీకరణలో ముందడుగు వేసిన భారత దేశం
మొఘల్ చక్రవర్తుల
మహా కట్టడాలు
కళా ఖండాలకు ఊపిరిలూదింది
ఆంగ్లేయుల పాలనలో ఈ నవీనీకరణ మరింత ముందంజ వేసి అన్ని రంగాలలో తన ప్రత్యేకతను చాటుకున్నప్పటికీ యిదంతా మన సుఖం కోసం కాదని వారి స్వార్దానికని అర్ధమైన తరువాత స్వరాజ్య స్థాపనతో స్వీయ పాలనలో వ్యవస్థలన్నింటినీ మెరుగు పరచి అభివృద్ధిలో
వున్న స్థితి నుండి ఉన్నత స్థితికి దూసుకు వెళుతోంది భారత్ అంటూ జయ జయధ్వానాలు పలికారు
లక్ష్మణరావు గారు …!
అన్నిరంగాలనూ
అభివృద్ధి చెందించిన ఆధునికత
విద్య,వైద్య,ఉద్యోగ రంగాలలో విప్లవాత్మకమార్పులను
తీసుకు వచ్చింది …
భౌతికాభివృద్ధితో పాటు మానసిక ఆందోళన, అశాంతి ,వత్తిడుల
ముళ్ళ పరుపులను గూడా పరిచిందంటూ ఆధునికత అన్నిరంగాలలోనూ కలిగించిన లాభ నష్టాలను వివరిస్తూ
ఏది ఏమైనా కాలాన్నీ దూరాన్నీ జయించి
ప్రపంచాన్ని పోకెట్లోకి
తెచ్చేసిందంటూ ఆధునికతకు జోహార్లన్నారు అమ్మాజీ గారు !
ఇంతై, అంతై, వటుడoత అన్నట్టుగా
ఈ ఆధునికతను ఎంత పొగిడినా కొంత మిగిలే ఉంటుంది
యిది అభివృద్ధికి ఎంత దోహద పడిందో
అవినీతికి అంత తోడ్పాటునందించింది
ఆర్ధికనేరాలకు, మోసాలకు అవకాశాన్నిచ్చింది
లాభనష్టాల సమాహారమై హద్దులను చెరిపేసి విస్తృతంగా విస్తరించి
అన్నిరంగాలనూ పరుగులు తీయిస్తుందని
రంగుల హంగులతో ఆధునికత పేరిట ఆధునికతను
అభివర్ణించారు నారంశెట్టివారు …!
ఆరవ అధ్యాయ గుణ ప్రశంస
సాంకేతిక విప్లవంతో
ఈ ప్రపంచమంతా
ఒక యిల్లయిపోయింది !
దేశాల మధ్య ఎల్లలు చెరిగిపోయాయి
ప్రపంచీకరణతో
జగతి పరుగులెత్తింది !
అభివృద్ధి చెందుతున్న
మన భారత దేశం
ఈగలేదు గెలవలేదు అన్నట్టు తటపటాయింపులతో…
సతమతమవుతూనే
నిలదొక్కుకోగా
దేశీయత దెబ్బతిని
పల్లెలు వెలవెలబోయినా,
సంస్కృతీ సాంప్రదాయాలు
గత సంస్కృతీ వైభవాలు తరగని ఆధ్యాత్మిక ధార్మికసంపద మేల్కొల్పగా
భారతీయీకరణయే గొప్పదని దానిని నిలబెట్ట
నడుం బిగించారు భారతీయులు అంటూ
ప్రపంచీకరణ నేపథ్యంలో
అనే శీర్షికన తేట తెల్లం చేశారు శ్రీవాణీ శర్మ గారు ….!
చుట్టూ మూడొంతుల
నీటితో ద్వీపములు
ద్వీప కల్పములుగా
ఏర్పడ్డ భూగోళంలో జలమార్గాలనేర్పరచుకున్న
తరువాతే
ఒకరిగురించి ఒకరు తెలుసుకోవటం,కలుసుకోవటం రవాణా వ్యవస్థను
అభివృద్ధి పరచి వ్యాపారలావాదేవీలు వేగవంతం చేసుకోవటం
అనేవి జరిగాయి
ఇది నాటు పడవలనుండి బోట్లు స్టీమర్లవరకూ
అత్యాధునిక హంగులు
సమకూర్చుకున్నాయని పోర్టుల అభివృద్ధితో
వాణిజ్య రంగంలో మేటి కీర్తిని
భారత దేశం గడించిందంటూ
జలమార్గాలు ప్రగతి సూత్రాలు శీర్షికన చక్కని సమాచారాన్నందించారు
నాగ జ్యోతి గారు …!
యెంతదూరమైనా
కాలినడకనే ప్రయాణం చేసే మనిషి పశువులను మచ్చికచేసి రవాణాకు వినియోగించినా…
చక్రాన్ని కనుగొన్న తరువాత ప్రయాణాలలో వేగం పెరిగింది వికసించిన విజ్ఞానంతో ఆటోమొబైల్ రంగంలోకి అడుగిడిన మనిషి అన్నిరంగాలలోనూ అభివృద్ధిని వేగవంతం చేయగలిగాడు
మేన్ పవర్ కి
వందింతల శక్తివంతమైన మిషన్ పవర్ తో
దూసుకుపోయాడు మనిషి అంటూ వివిధరకాల మోటారువాహనాలు వాటి ఉపయోగాలను సవివరంగా అక్షరబద్దం చేసి అందించారు ఆటో మొబైల్ రంగము
శీర్షికన
వంజరాపు శేషు గారు !
ఆవిరి యంత్రాలను ఉపయోగించటం
తెలుసుకున్న ఆంగ్లేయులు రైలు మార్గాలను నిర్మించి బొగ్గుతో బండ్లను నడపటం మొదలుపెట్టి
యిటు సరకుల రవాణా
అటు మనుషుల ప్రయాణాలకు ఈ రంగంలో అనేకరకాల
అభివృద్ధితో
బులెట్ ట్రైన్ల స్థాయికి ఎదిగారని
సుమారు అరవై డెబ్భై లారీలు బస్సులు చేసే పనిని కేవలం ఒక గూడ్స్ ట్రైన్ తోనో…
పాసింజెర్ ట్రైన్ తోనో
చేయించగలుగు తున్నారని విశ్వవ్యాప్త రవాణాసాధనాల్లో మేలైనది చవకైనది రైలు అoటూ రైల్వేల విశిష్టతను కొనియాడారు చక్రభ్రమణం శీర్షికన
జోగారావుగారు !
రోకలిబండను చూసి
మనము రైలు బండి కనుగొన్నాము…
ఎగిరేపక్షిని చూసీ మనము విమానాన్ని కనిపెట్టాము… అన్నట్టు
ప్రకృతిలోని వింతలుచూసి అచ్చెరువొందిన మనిషి అలా మనమెందుకు చేయలేము?
అనే పట్టుదలతో ఎన్నోవిజయాలను సాధించాడు అలాగే
రైట్ సోదరుల ఊహాసుందరిగా విమానం రూపుదిద్దుకుంది
అంటూ నెలలు పట్టు ప్రయాణాలను గంటలలోనికి మార్చింది
అని విమానాల వైశిష్ట్యాన్ని ఆ ప్రయాణాల్లోని ఆనందాన్ని చక్కగా వివరించారు
వైమానిక రంగం శీర్షికన శ్రీరాములు గారు …!
విమానాల్లో విహరించటమే గొప్పనుకుంటే జిజ్ఞాశాపరుడైన
మనిషి అంతరిక్షయానంతో గ్రహాంతరాల గలిగే స్థాయికి చేరుకున్నాడు
అంతరిక్ష విజ్ఞానపితామహుడు
విక్రమ్ సారాభాయ్ పరిశోధనావ్యవస్థ పితామహుడు
హోమీబాబాలను స్థుతిస్తూ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్థాపన
ఎన్నో ఉపగ్రహాల
విజయవంత ప్రయోగాలతో సహా
104 ఉపగ్రహాలతో ప్రయోగం విజయవంతం చేసి
ప్రపంచం రికార్డ్ నెలకొల్పిన ఘనత మనదేనని
సవివరమైన విశ్లేషణలతో ఎలుగెత్తి చాటారు
అంతరిక్షయానం శీర్షికన
రామశర్మ గారు …!
వికసించిన విజ్ఞానంలో
మరో మహాద్భుతం కంప్యూటర్ మొట్టమొదట లెక్కలకోసం కనిపెట్టబడ్డ కంప్యూటర్
మనిషి జీవితలెక్కల్నే మార్చేసిందంటూ
మనిషికి మనసెలాంటిదో కంప్యూటర్ కి ప్రోగ్రామ్ అలాంటిదని
కంప్యూటర్ని గురించి సవివరంగా విపులీకరిస్తూ ప్రోగ్రామ్
మీదే ఈ సాఫ్టువేరు ఉద్యోగ పర్వమంతా నడుస్తోందని యిది
మనకెంతో మంచితో పాటు
ఆడపిల్లల్ని వేధించటం ఆటంబాంబులు లాంటి
ఎంతో చెడును కూడా కలిగిస్తుందని సవివరంగా నిత్య జీవితంలో కంప్యూటర్ శీర్షికన తెలియజేసారు
రమణీ వర ప్రసాదుగారు!
ఈ కంప్యూటర్ కంటే సరళమైనదీ అరచేతిలో యిమిడిపోయేది
చరవాణి ఎన్నో
అద్భుతాలను సృష్టించిన
అత్యద్భుతశక్తి యిది పిన్నలకూ పెద్దలకూ
వీడలేని తోడు యిది
విజ్ఞానవినోదాలతో సహా సర్వస్వాన్నీ అందివ్వగల అద్భుత సాధనం వినియోగించుకో గలిగినవారికి వినోదిని లేకుంటే
తానె వినాశిని అంటూ చరవాణి శీర్షికన
చక్కని పద చిత్రాలతో అక్షరీకరించారు
ఈ వేమనగారు…!
సాoకేతిక విజ్ఞాన వివిధ రూపాలలో డిజిటలైజేషన్ గొప్పతనాన్ని తెలియజేస్తూ
పూర్తిగా యాంత్రికతలో
ఈ లోకం ఎలా మునిగిపోయిందో
వివరిస్తూ
ట్యాబ్లేట్లు మమ్మీలాయే
గ్యాడ్జెట్లే గురువులాయె
ఆట పాట లేక విద్యార్థులు గదులలోనే అలసిపోయే
అని ఆవేదన చెందుతూ కాగితరహితకలాపాల కార్యరూపదర్శినై పోయిందని మానవాళినేకం చేయగల మంత్రంగా మనం దాన్ని మలచుకోవాలని ఆకాంక్షను అక్షరీకరించారు శ్రీకర్ గారు…!
తిండి ఎట్టిదో త్రేపు అట్టిది అంటారు సత్య సాయిబాబా ఆహారాలలో సాత్వికాహారమే శ్రేష్ఠ మైనది
గంజి అంబల్ల నుండి మన ఆహారపుటలవాట్లు
పిజ్జాలు, బర్గర్లు, మేగీలు,
నూడిల్స్ వైపు మళ్లిపోయాయి దుమ్ము పట్టిన వాటిని అమితంగా నోట్లో కుమ్ముతూ అవివేకంతో నమ్ముతూ
అంటూ చక్కని పదచిత్రాలతో
చిక్కని భావాన్ని అందిస్తూ అనారోగ్యాలపాలై
ఆసుపత్రుల చుట్టూ తిరగొద్దంటున్నారు
ఆహారం – ఆరోగ్యం శీర్షికన కమలాకరరావు గారు …!
మనిషి ప్రస్థానం
రాతియుగం నుండి రాకెట్ యుగానికి కొనసాగింది
ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న దానితోనే జీవిస్తూ …
అవసరాలకు ఆలోచనలు తోడై అన్వేషణ మొదలై ఈ వామనుడు త్రివిక్రముడుగా మారిపోయాడు
విజ్ఞానంతో పరిపూర్ణ వికాసం పొందాడు ఐతే అవినీతి ,అధర్మం
దుష్టబుద్ధి లాంటి ఎన్నో వికృతరూపాలను దాల్చాడు
భస్మాసురుడై తనను తానే హతమార్చుకునే స్థితికి చేరాడంటూ
నేటి ఆధునిక మానవుడుగా మానవత్వాన్ని , ప్రేమతత్వాన్ని అలవరచుకుని
విశ్వశాంతి పరిమళాలను వ్యాప్తి చేయాలంటున్నారు
రాతియుగం నుండి రాకెట్ యుగం శీర్షికలో
పెంచల నరసింహం గారు ….!
నాగరికులుగా భావించే ఆదివాసీల నుండి ఆనందమయ జీవన విధానాలను మనం నేర్చుకోవలసిందే కొండాకోనల్లోని గిరిజనులపద్దతులే వేరు
సుమారు 450 కి పైగా
ఆదిమజాతి తెగలు
భారతదేశ దేహమై ఉన్నాయని మూఢవిశ్వాసాలను మోస్తూ
దోపిడీ,మోసాలకు గురవుతూ సంప్రదాయాలను వదలక
గిరిజనసంస్కృతికి వారసులైరి అంటూ గిరిజన జీవితచిత్రాన్ని
సవివరంగా బొమ్మ కట్టించారు నాగ జ్యోతి గారు ….!
అందాలు చిందే
అడవివర్ణనలతో
వారి బ్రతుకు చిత్రాలను అక్షరీకరించి ప్రకృతిసోయగాలతో
పరవశింపజేసి
అనాదిగా వారి
ఆవాసమనుకున్న కొండలను
ఏనాటికీ వారిసొంతమేననుకున్న ఆకొండలనేచ్ఛలేని
మరణసమాన బతుకులు చేసేసారు అంటూ
కన్నెదార కొండల్లో
కోయిలలు కూయవుగావాల…
బయ్యారం కొండల్లో
రేలపాట మరి
వినబడదు గావాల…
అరకులోయలో
నెమలి పింఛాల
ధింసా నాట్యాలు మరి కనబడవు గావాల అని వాపోతున్నారు…
అడవులను అరుణపతాకాలు జేసీ అనే శీర్షికన
స్వామినాయుడు గారు !
అవి కేవలం చెట్లు కావు
కల్ప తరువులు…
మనిషి ఎదుగుదలంతా చెట్టునీడనే కదా
మన కోసం
విశాలంగా విస్తరించిన ప్రాణబంధువు కదా చెట్టు
ఏ పురుగులకు ఆశ పడో
మనం చెట్టు మీంచి ఎగిరిపోయి చాలాకాలమే అయింది పచ్చని నునువెచ్చని చెట్టు కౌగిలిని దూరం చేసు కోవటం వివేకమా …
అంటూ చక్కని ప్రతీకాత్మకతతో కవిత్వీకరించారు
చెట్టు గొప్పతనాన్ని… అప్పలనాయుడు గారు…!
పచ్చదనానికి,
పాడి పంటలకూ
ఆలంబనగా నిలిచిన
సెలయేటి గల గల లను
సుందర స్వరనాదాలతో
గానం చేస్తూ
ఏ కార్ఖానాల జలగలు ఈ నదీమతల్లుల తడి ధారల్ని
రక్త పింజరులై పీల్చేసాయో…
ఏ రసాయనాల విషకణాలు మేఘాల వర్షాల మాలల్ని
తన్నుకుపోయాయో
ఏ నిర్దాక్షిణ్యాల కాకులు తడిలేని నా ఏరమ్మ
యిసుక గర్భాన్ని దోచి పోయాయోనంటూ
దుర్మార్గాల్ని సహించలేని ప్రకృతి ఆత్మ వికృతరూపం దాల్చుతుందంటూ వాపోయారు
చిదంబరరెడ్డి గారు !
ప్రకృతి మనిషి ఏకమై
ప్రేమను పంచుతూ యివ్వాలి విశ్వశాంతి శ్రీకార ఆకారం అంటూ
సవ్యాలన్నీ
అపసవ్యాలై పోయిన
ఈ మానవ జగతిలో మరల ఈ అపసవ్యాలనన్నిటినీ
సవ్యాలుగా మనమే మార్చుకోవాలి జరుగుతున్న కాస్త మంచి పరివర్తననూ మెచ్చు కుంటూ ….
యువత మత్తుకు బానిసలై అరాచకాలు సృష్టిస్తూ…
తుపాకీలు చేతబట్టి
అడవిదారి పట్టకుండా పెరుగుతున్న వైజ్ఞానిక సాంకేతికతను వినాశానికి
వినియోగించకుండా మనదైన
చరిత్రకు మట్టి మనుషులమై
విశ్వశాంతికి శ్రీకారమైన
ఆకారము మనమే అంటున్నారు
చక్కని భావ చిత్ర కవిత్వీకరణతో
చిమ్మపూడివారు …!
లాలిపాటలతో,
జోలపాటలతో
బామ్మలు తాతల కథాకాలక్షేపాలతో ఆటపాటలతో
హాయిగా సాగిపోయే బాల్యం జీవితానికే ఒకవరం…
ఆ చిన్నారిలోకాన్ని
రమణీయ వర్ణనలతో పురాణేతిహాసాల పరిచయాల అందాలతో ఆహ్లాదకరంగా అందించారు
చిన్నారి లోకం చిరంజీవి లోకం అమాయకలోకం ఆనందలోకం అంటూ
రొంగలి లక్ష్మి గారు !
కొత్తమోజులో పాత రోతైపోయింది
యిది విద్యావ్యవస్థలో మరీ వికృతరూపం దాల్చుతోంది ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదము కలగలిసిన విజ్ఞానాన్ని సాంప్రదాయతను జోడించి అందించే విధానాలు పోయి
కాన్వెంట్, కార్పొరేట్
విద్యా విధానాలతో
యాంత్రిక చదువుల వలయంలో చిక్కుకుని ఒడ్డునపడ్డ చేప ల్లా… విలవిల్లాడుతున్నారంటూ…
తాము మైనములా కరిగిపోయి ఆస్తుల్ని ఫీజుల హారతి
కర్పూరం చేసేసినా…
రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాయి
విద్యా పక్షులు అని మధనపడుతూ అందరూ ప్రభుత్వబడులను
ఆదరణతో గౌరవించి
ఆ సంస్కార సాగరంలో విలువల వలువలు తొడిగి మన జ్ఞాన సరస్వతీ దేవి వొడిలో సేద దీరనిస్తే
మంచి సంతానంగా దేశప్రతిష్టను యినుమడింపజేసి దేశాభివృద్ధికి పాటుపడతారని తన చక్కని కవితతో సందేశాన్నందించారు
జనార్దన్ గారు…!
మహిళ లేని చరిత్ర
ఆత్మలేని శరీరంలాంటిది
ఈ ప్రత్యేకత కేవలం
భారతీయ మహిళదే!
అనాదిగా భారతీయమహిళ జీవితం మహోన్నతం ‘మహిళలు నేర్వగరాని విద్యగలదే ముదమార నేర్పించినన్’ అన్నారు
ఆ చదువుల సరస్వతికి
మనం నేర్పించటం కాదు ప్రోత్సహిస్తే చాలు
ఎన్నో కావ్యాలకు మగువలే మూలవిరాట్టులు వారు వీరవనితలు వీర మాతలుగా వన్నె కెక్కారు
యేరంగంలోనూ
మగవారికి తీసిపోమని నిరూపించి
చరిత్ర సృష్టించారు…
ఆ విషయాలనన్నీ
సవివరంగా అక్షరీకరించారు మహోన్నత
మహిళలను గన్నది నా దేశం అంటూ గొర్తి వాణి గారు …!
విశిష్టమైన
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు
పాశ్చాత్య నాగరికతలో
రూపుమాసిపోరాదు
ఆసేతు హిమాచల పర్యంతమూ
మనందరిలో జాతీయభావం పుష్కలంగా
ప్రతిబింబించాలని అందుకోసం
ఉన్న చెడును దూరంచేసి మంచిని పెంచాలని
జై జవాన్ జై కిసాన్ నినాదానికి ప్రతిఒక్కరూ
చేయూతనివ్వాలని కుటుంబబాంధవ్యాలను
మానవతా విలువలనూ ఆనందమయంగా
మెరుగుపరుచుకోవాలని అన్నికోణాలనూ
సంస్కరించుకుని యివన్నీ సాధిస్తామన్న ఆశతో
భారతమాత చల్లగా నవ్వుతోంది
అంటున్నారు విజన్ 20-20తో
భ్రమరాంబ గారు!
విశ్వరహస్యాలను
పరికించి, పరిశీలించి
తర్కించి, శోధించి,
సాధింపజేసింది
వేద నాదమే …
మనఋషులు
దార్శనికులు తాత్వికులు… ఫలితాలను పొంది ఆనందిస్తున్నందుకుగాను
ఆ ప్రకృతి శక్తులను ఆరాధించి ఋణం తీర్చుకోవాలన్నారు ఎవరికి వారు వేరు వేరు కోణాలనుండి దర్శించినా సత్యమేకం… విప్రబాహుదా వదంతి యిది సత్యం
అత్యంత ఉత్కృష్టమైనది నిత్య సత్య జ్ఞాన మిది!
ఆధునికవిజ్ఞాన శాస్త్రానికి మూలాధారం మన సనాతన భారతీయ వేదవాఙ్మయమే…
అందుకే మనం
భారతీయునిగా జీవిద్దాం…
హిందువుగా గర్విద్దాం
అంటున్నారు
వీర రాఘవ మాస్టారు !
ప్రణవనాదం నుండే ధ్వని, స్వరము, వేదము,
సంగీతము పుట్టుకొచ్చాయి… భక్తిసంగీతమే ముక్తికి సోపానము…
జీవన్ముక్తిమార్గమని మూలాధార
సహస్రారములతో కూడుకున్న
సప్త చక్రములు సప్తస్వరముల జన్మస్థానములని
కేవల సంగీతచక్రమే కాదిది మానవాళికి సహాయపడే ధర్మచక్రం అంటూ
శ్రీసరస్వతీ సంగీతచక్రంలో సవివరంగా వివరించారు
డా.రమేశ్ గారు…!
యువతే దేశ భవిత
అన్నారు
మారుతున్న కాలంలో యువత
మంచిని మాత్రమే గ్రహించి చెడుకు దూరంగా ఉండాలి …
మన పురాణపురుషులు
జాతి నేతలు ఖ్యాతి గడించిన త్యాగధనుల నిత్య స్ఫురణతో
సజ్జన ప్రవృత్తి అభ్యసించి ఆచరించాలని
సంఘసంస్కర్తలను
మహాపురుషులను
వీరనారీ మణులను
తలచుకుంటూ…
జ్ఞాన వైరాగ్యాగ్రగణ్యుల
గన్నదీ భరతధరిత్రి
అని జోహార్లర్పిస్తున్నారు హైమావతి గారు !
ఇంతవరకూ మనిషి ఆలోచనలు, ఆచరణలు, వికారాలు స్వరూపాలను చూసాం. ఇప్పుడు ఆ సర్వేశ్వరుని సత్యవాక్కులను వింటున్నాం… బద్ధులైన జీవులు తమ సత్కర్మలతోనే ఈ భువిలో ఆనందమయ జీవితాలననుభవిస్తున్నారని పాపాచరణతో నరక బాధలను కొని తెచ్చుకుంటున్నారని జ్ఞానమే మోక్షానికి మార్గమని ప్రకృతి దేవోభవ అని ప్రకృతిని ఆరాధించినవారు సద్గతిని పొందెదరని సకల ప్రాణులూ ఆనందంగా ఉండటానికే ఈ మత గ్రంధాలు మానవ గ్రంథాలంటూ జన్మకు పరమార్థాన్ని తెలియజేస్తూ
ముగించారు భగవాన్ ఉవాచతో…! ఎస్సెస్సెస్ రాజుగారు
మనల్నందరినీ ఈవిధంగా ఆదినుంచి …అనంతందాకా నడిపిస్తున్న మననాయికామణి శ్రీమతి చివుకుల శ్రీ లక్ష్మి గారు మనందరి జన్మలకూ ధన్యత చేకూర్చారనుట అతిశయోక్తి కాదు !
సర్వే జనాః సుఖినో భవంతు ..
లోకాస్సమస్తాస్సుఖినోభవంతుసర్వేప్రాణినాఃసుఖినోభవంతు.!
ఓమ్ శాంతి
(సమాప్తం)
***
(వచన కావ్యం)
నిర్వహణ: చివుకుల శ్రీలక్ష్మి
పుటలు: 546, వెల: ₹ 500
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి
20-24-18, వెంకటేశ్వర కాలనీ, వసంత్ విహార్ దగ్గర,
విజయనగరం ఆంధ్రప్రదేశ్ 535002, ఫోన్: 9441957325