Site icon Sanchika

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-1

[వాల్మీకి జయంతి సందర్భంగా సంచిక అందిస్తున్న సరికొత్త శీర్షిక… వేదాంతం  శ్రీపతిశర్మ రచిస్తున్న ఆదికావ్యంలోని ఆణిముత్యాలు]

[dropcap]త్యా[/dropcap]గయ్య అంటారు  –  ‘తారసారతర తారక నామము, పేరిది, నిన్ను పెంచినవారెవరె ? వారిని చూపవే?’

తారసార ఉపనిష్తతు ‘నారాయణాయేతి పంచాక్షరం పరంబ్రహ్మ స్వరూపమ్, ఇతి య ఏవం వేద, సోమృతోభవతి’ అంటుంది.

(ఋ.వే.ప్ర.పా)

యజుర్వేదం ‘కళాతీతా భగవతీ స్వయం సీతేతి సంజ్ఞతా, తత్పరః పరమాత్మా చ శ్రీరామః పురుషోత్తమః’ అంటుంది.

సామవేదం ‘కళాస్వరూపో లక్ష్మణః, కళాతీతా భగవతీ సీతా చిత్స్వరూపా.. పరమాత్మా బ్రహ్మైవైహం రామోస్మి భూర్భువః సువస్తేస్మై నమో నమః’ అంటుంది.

ఈ మూడింటిని పరిశీలించి చూస్తే తారసార ఉపనిషత్తు శ్రీరాముని పరబ్రహ్మతత్వాన్ని వేదాంతర్గతంగా ఆవిష్కరించి మనకు చూపినట్లు కనిపిస్తుంది. త్యాగరాజు అదే తత్వాన్ని ఆయన కీర్తనలో వ్రాసి యున్నాడు. అందుచేత బాధలోనో, ఆనందంలోనో, మరో ఎటువంటి అనుభూతిలోంచో రామా రామా అన్నప్పుడు మనం కేవలం రెండు అక్షరాలను పలకటం లేదు! సగుణోపాసన, నిర్గుణోపాసన రెండినీ కలబోసి చేసుకునే సాధన ఇది!

సృష్టికి సృష్టికర్తకి, కాలగమనానికి గల అద్భుతమైన వ్యూహం సత్యం, ధర్మం, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను అంశాల ద్వారా ఎక్కడ పరిశీలించినా తేటతెల్లగా కనిపిస్తుంది.

మహానారాయణీయ ఉపనిషత్తు ‘ఋతం తపః, సత్యం తపః, శృతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపో, యజ్ఞం తపో భూర్భవస్సువః బ్రహ్మై తదుపాస్యై తత్తపః’ అంటుంది.

విష్ణు సహస్రనామాలలో ‘భూర్భువస్సువః సవితా ప్రపితామహః.. యజ్ఞోయజ్ఞపతి..’ అంటుంది.

తపస్సు అనే ప్రక్రియ అన్నింటికి కీలకమని నేరుగా చెప్పనక్కరలేదు. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రి మహా మంత్రం, 24 శ్లోకాల గాయత్రి రామాయణం, 24 వేల శ్లోకాల శ్రీమద్వాల్మీకి రామాయణం అనితరసాధ్యమైన మహర్షి తపస్సుకు ప్రతిఫలం.

‘ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశకం’ అన్న అక్షర సత్యాన్ని మననం చేసుకుంటూ ఆదిగ్రంథంలోంచి ఆణిముత్యాలను ఒక సరళిలో ఆకళింపు చేసుకుందాం.

ఇందులోని ఏ శ్లోకం అణిముత్యం కాదు? అయినప్పటికీ ముందరకి వెళదాం..

***

నారద మహర్షి సంక్షిప్తంగా రామాయణ కథను మహర్షి వాల్మీకికి వినిపించి వెడలిన తరువాత తన చిత్తములో ఆ అద్భుతమైన చరిత్రను ధారణ చేసిన వాడై శిష్యులతో కూడి తమసానదీ తీరానికి మధ్యాహ్నిక సంధ్యావందన మాచరించుటకు చేరుకున్నాడు. చుట్టూతా వాతావారణం యావత్తూ ఎంతో మనోహరంగా ఉంది. నారదుని పలుకుల ప్రభావం నుండి తమసానదీ తీర్ధాన్ని ఒకసారి పరికించాడు వాల్మీకి. శ్రీరామ కథ అనునది అంతరంగాన్ని విద్యుత్ తరంగంలా పూర్తిగా జాగృతం చేసి ఎవరినైనా క్రొత్తగా తీర్చిదిద్దే ప్రభావం కలదన్నది మనకు తొలుత వాల్మీకి అనుభవం ద్వారానే తెలుస్తుంది. ఆయన ఒక మాట అన్నాడు. ‘అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ, రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా’ – ఏ మాత్రం బురద లేని ఈ తీర్థం నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సువలె స్వచ్ఛమై రమణీయంగా నున్నది!

కావ్య నిర్మాణంలో ఒక నేపథ్యాన్ని ఆవిష్కరించి దానికి విరుద్ధంగా కనిపించే ఒక సంఘటనను దాదాపు ఒక విస్ఫోటనంలాగా దర్శింపచేయటం మహర్షికే చెందినది. ఈ ప్రక్రియ యావత్ వాల్మీకి రామాయణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనినే వైపరీత్యంగా మనం భావిస్తాం. ఇలా అనుకుంటున్న సమయంలో ఆ నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అకస్మాత్తుగా ఒక సంఘటన ముందరికి వచ్చింది. ఒక చెట్టు మీద క్రౌంచ పక్షులు రెండు అన్యోన్యంగా మిథునంలో ఉన్నారు. ఒక ఆటవికుడు బాణం వేసి మగ క్రౌంచ పక్షిని క్రింద పడేసాడు. ఆడ క్రౌంచ పక్షి దాని దగ్గర కూర్చుని రక్తసిక్తమైన ఆ మగ క్రౌంచ పక్షిని చూస్తూ భోరు భోరున విలపించసాగింది.

మహర్షి హృదయం ద్రవించింది. అనుకోకుండా ఆయన హృదయం నుండి ఒక శ్లోకం శబ్దరూపం దాల్చి బయటకు వచ్చింది. ఆ ఆవేదన ఆపౌరుషేయములైన వేదపురుషార్థములకు కావ్యరూపమైన స్వరూపంగా నిలచింది..

శ్లో:

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః

యత్ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్

ఓ నిషాదా! మిథునంలోనున్న, కామమోహితమైన జంటను (మగ పక్షిని వధించి) విడదీసినందుకు శాశ్వతమైన అపకీర్తిని పొందగలవు అన్నది సామాన్యమైన భావార్థం.

‘మా’, ‘నిషాద’ అని విడదీసినప్పుడు కలుగు అర్థం ఒక లాగ, కలిసినప్పుడు పూర్తి విపరీతంగానూ కనిపిస్తుంది.

(శ్రీ – మా- లక్ష్మి నిరంతరం నివసించు)

ఓ శ్రీనివాసా! కామమోహితుడైన రావణుని సంహరించుట వలన నీ కీర్తి శాశ్వతంగా నిలచి పోగలదు అన్నది అంతరార్థం.

ఈ శ్లోకాన్ని శిష్యుడైన భరద్వాజుని పరిశీలించుమన్నాడు వాల్మీకి. వ్యాకరణం, వేదవేదాంగాలు ఎరిగిన వాడు కావటంతో దానినే మననం చేసుకుంటూ ఒక విషయాన్ని గమనించారు వారు –  ఆ శ్లోకం ఛందోబద్ధంగా ఉన్నదని, జనరంజకంగా గానం కూడా చేయవచ్చని తేలింది. ఇరవైనాలుగు అక్షరాలు (8*3) గాయత్రి ఛందస్సు అయితే మరో ఎనిమిది కలుపుకుంటే వేదాంతర్గతమైన 32 అక్షరాల అనుష్టుప్ చందస్సు అవుతుంది. అందుచేత రామాయణం ‘వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా’ అని చెప్పబడింది.

ఆశ్రమంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ శ్లోకం స్వయం సరస్వతీదేవి చేత తానే పలికింపచేసెనని చెప్పాడు మహర్షితో. అదే రీతిలో శ్రీరామ కథను ఎలా అయితే నారదుని వద్ద వినినావో, సంపూర్ణంగా రచించమని ఆశీర్వదించి అంతర్థానమైనాడు. అందులో ఒక రహస్యం, ఒక వ్యూహం దాగి యున్నందుకు చిరునవ్వు నవ్వి ఈ మాట చెప్పాడు బ్రహ్మదేవుడు. ఏమిటి ఆ వ్యూహం? రామాయణంలో అడుగడుగునా ఒక చక్కని సంఘటనకు నాంది కనిపించటం, అకస్మాత్తుగా విరుద్ధమైన సంఘటన జరగటం, అది అమంగళకరంగా తోచటం, కానీ తరువాత అదే శుభ పరిణామాలను ఇవ్వటం మనం చూస్తాం..

ఒక విధంగా ఆలోచిస్తే ‘మా’ ‘నిషాద’ అని వేరు చేసినప్పుడు లక్ష్మిని (సీతను) విష్ణుమూర్తి నుండి వేరు చేసే ప్రయత్నంలో శాశ్వతమైన ‘అప’కీర్తిని రావణుడు పొందియున్నాడు.

ఈ శ్లోకం శ్రీరాముని గూర్చి అని రూఢిగా చెప్పటానికి బలమైన కారణాలున్నాయి. అలాగే ఆ క్రౌంచ పక్షిజంట రావణమండోదరులు అని అనుటకు కారణం ఉన్నది. ముఖ్యంగా ఒక ఆటవికుడు పక్షులను ఆహారం కోసం వేటాడేటప్పుడు అతని ‘ప్రతిష్ఠ’ అనేది సందర్భంలోకి రాదు! అది అతనికి దాదాపు దినచర్య. ‘మానిషాద ప్రతిష్ఠాం’ అన్నది ఒక వీరుడికి, శ్రీరామునికి చెందినది అవుతుంది. ఈ శ్లోకంలో క్రౌంచమిథునాదేకమవధీః – అన్నప్పుడు కేవలం మిథునంలో అన్న జంట అని చెప్పటం కాకుండా ‘కామమోహితమ్’ అన్న మాట సూటిగా రావణుడికి వర్తిస్తుంది. పతివ్రత అయిన మండోదరితో జంటగా ఉన్న రావణుడు అనేక మంది స్త్రీలతో కామమోహితుడై చివరకు సీతను చెరబట్టగా తెచ్చుకున్న మృత్యువు పాలైనప్పుడు అక్కడకు చేరుకుని ఈ ఆడ క్రౌంచ పక్షి విలపించిన రీతిగా విలపిస్తూ మండోదరి అన్న మాట ఇక్కడ ఉటంకించటం ఎంతైనా సముచితం –

ఇంద్రియాణి పురాజిత్వ జితం త్రిభువనం త్వయా।

స్మరద్భిరివ తద్వైరమ్ ఇంద్రియై రేవ నిర్జితః॥

నాథా! గతంలో ఇంద్రియాలను నిగ్రహించి తపమాచరించుట ద్వారా మహాశక్తిమంతులై ముల్లోకములను జయించితివి. ఇప్పుడు ఇంద్రియంబులు ఆ వైరమును స్మరించుచున్నవా యనునట్లు నీపై పగ దీర్చుకొనినవి!

రచనలో వ్యూహం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఇది యుద్ధకాండలోని 114వ సర్గలోని 18వ శ్లోకం.

‘ఏ మాత్రం బురద లేని ఈ తీర్థం ఒక సత్పురుషుని మనస్సు వలె నిష్కల్మషంగా, స్వచ్ఛమై రమణీయంగా’ ఉన్నది అనుకుంటూ అకస్మాత్తుగా దానికి విరుద్ధమైన హింసాత్మకమైన (సం)ఘటనను దర్శించి కరుణరసాన్ని ద్రవింపచేసాడు మహర్షి.

ఒక జంట కలవాలంటే ఒక జంట మరి విడిపోవాలి కదా!

సీతాదేవి దూరమైనప్పుడు శ్రీరాముడు అనుభవించిన వేదన, అశోకవనంలో శోకించిన సీత, అందాలరాముని అయోధ్య నుండి పంపివేసినప్పుడు దశరథుడు అనుభవించినది, ఇలా అలోచిస్తూపోతే కరుణరసం ఒక జలపాతంలా ఒక దివ్యానుభూతి ద్వారా ఈ శ్లోకంలో జాలువారటం మనం చూస్తాం. తులసీదాసు అంటాడు –

శ్లో:

సీతారామగుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ।

వన్దే విశుద్ధవిజ్ఞానే కవీశ్వర కపీశ్వరౌ॥

శ్రీ సీతారాముల గుణములను, వారి విరహవేదనను ప్రత్యక్షంగా చూసి, అనుభవించి తరించిన విశుద్ధవిజ్ఞాన సంపన్నులైన కవీశ్వరులు వాల్మీకి మహర్షికి, కపీశ్వరుడైన ఆంజనేయునికి వందనములన్నాడు.

వాల్మీకి రామాయణం కరుణా సముద్రం అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.

‘కమవాప్తకుల, కలశాబ్ధిచంద్ర

కావవయ్య నన్ను, కరుణాసముద్ర’

అన్నాడు త్యాగయ్య!

ఆ కరుణాసముద్రం లోంచి సత్యము, ధర్మము అను గుణాలను ఆవిష్కరించగల్గటమే శ్రీరామ కథలోని సాధన!

(ఇంకా ఉంది)

Exit mobile version