[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
64. శ్లో.
అభిద్రుతమివారణ్యే సింహేన గజయూథపమ్।
ప్రచ్ఛాద్యమానం రామేణ భరతం త్రాతుమర్హసి॥
దర్పాన్నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా।
రామమాతా సపత్నీ తే కథం వైరం న శాతయేత్॥
(అయోధ్యకాండ, 8. 36, 37)
అడవిలో సింహము వలన భయముతో పారిపోవుచున్న గజరాజు వలె శ్రీరామునిచే తిరస్కృతుడు కానున్న భరతుని నీవే రక్షింపవలెను.
‘పతియైన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను’ అను గర్వం వలన నీవు రాజమాత యగు కౌసల్యను లోగడ హీనంగా చూసి యున్నావు. ఆమె ఆ పగను ఇప్పుడు తీర్చుకోకుండా ఉంటుందా?
(ఇక్కడ ‘రాజమాత’ అన్న పదం ఎంతో కీలకం).
65. శ్లో.
యదా హి రామః పృథివీమవాప్స్యతి
ప్రభూతరత్నాకరశైలపత్తనామ్।
తదా గమిష్యస్యశుభం పరాభవం
సహైవ దీనా భరతేన భామిని॥
(అయోధ్యకాండ, 8. 38)
ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభువైనప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలగుతావు!
..ఈ మాటలకు కైకేయి బుద్ధి పూర్తిగా ఇటు నుండి అటు మారిపోయింది. స్వాభిమానం అనే నిలువుటద్దంలోనే ప్రేమ, వాత్సల్యం, ధర్మాధర్మాలు, అన్నింటినీ బేరీజు వేసుకున్నప్పుడు, భావోద్రిక్తతలలో సమత్వం లోపించటం సహజం.
కౌసల్యను అవహేళన చేస్తూ శ్రీరాముని లాలించటం ఏ పాటి ధర్మం? అటువంటి మనస్తత్వంలోకి దూరి విధి తన విలాసాన్ని ఏర్పరుచుకుంటుందా?!
66. శ్లో.
అనర్థమర్థరూపేణ గ్రాహితా సా తతస్తయా।
హృష్టా ప్రతీతా కైకేయీ మంథరామిదమబ్రవీత్॥
సా హి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథం గతా।
కైకేయీ విస్మయం ప్రాప్తా పరం పరమదర్శనా॥
(అయోధ్యకాండ, 9. 36, 37)
మంథర ఈ విధంగా తన మాటల చాతుర్యంతో అనర్థదాయకమైన విషయమును గూడ ప్రయోజనకారిగా భావించునట్లు కైకేయి బుద్ధిని మార్చివేసెను. ఆ కారణంగా కైకేయికి ఆమె మాటల మీద విశ్వాసం కలిగెను. లోలోపల సంతోషించింది కైకేయి. ఆమె సహజంగా ప్రజ్ఞావంతురాలైనప్పటికీ మంథర (కుబ్జ) మాటల్లో ఇరుక్కుని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యం చేయటానికి సిద్ధపడినది!
67. శ్లో.
అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః।
అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతామ్॥
నవ పంచ వర్షాణి దండకారణ్యమాశ్రితః।
చీరాజినజటాధారీ రామో భవతు తాపసః॥
(అయోధ్యకాండ, 11. 25, 27)
కైకేయి కోరిన వరాలు –
ఓ నాథా! శ్రీరాముని కొరకై ఏర్పాటు చేయబడిన సామగ్రితో, సన్నాహములతో, నేడే భరతునికి యువరాజ పట్టాభిషేకం గావింపుము.
శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మమును ధరించి, జటాధారియై, దండకారణ్యమునకు వెళ్ళి, తాపస వృత్తిలో అచట పదునాలుగు సంవత్సరములు నివసించవలెను.
శ్రీరాముడు తాపసునిగా ఎందుకు వనవాసం చేయాలి, నారచీరెలను ఎందుకు ధరించాలి, దండకారణ్యమునకే ఎందుకు వెళ్ళాలి అనే మాటలకు ఇక్కడ సమాధానం లభిస్తుంది. కైకేయి అడిగిన రెండవ వరంలో అది సుస్పష్టంగా ఉన్నది.
68. శ్లో.
స రాజరాజో భవ స్త్యసంగరః
కులం చ శీలం చ హి రక్ష జన్మ చ।
పరత్ర వాసే హి వదంత్యనుత్తమం
తపోధనాః సత్యవచో హితం నృణామ్॥
(అయోధ్యకాండ, 11. 30)
కైకేయి: రాజులకే రాజువైన నీవు సత్యమునకు, ప్రతిజ్ఞకు కట్టుబడి యుండి నీ వంశమును, శీలమును రక్షించుకొనుము. నీ జన్మను సార్థకము చేసికొనుము. మానవులకు ఈ లోకమందును, పరలోకమందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు సత్యవాక్పరిపాలనమే అత్యుత్తమ సాధనమని తపోధనులు చెబుతారు!
69. శ్లో.
కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమపి వా శ్రియమ్।
జీవితం వాత్మనో రామం న త్వేవ పితృవత్సలమ్॥
(అయోధ్యకాండ, 12. 11)
దశరథుడు: కౌసల్యనైనను, సుమిత్రనైనను, నా రాజ్యలక్ష్మినైనను త్యజిస్తాను. అంతే కాదు, చివరకు నా ప్రాణాలనైనను త్యజిస్తాను. కానీ పితృవత్సలుడైన శ్రీరాముని మాత్రము విడువజాలను.
70. శ్లో.
సాగరః సమయం కృత్వాన వేలామతివర్తతే।
సమయం మానృతం కార్షీః పుర్వవృత్తమనుస్మరన్॥
(అయోధ్యకాండ, 12. 44)
కైకేయి: దేవతల ప్రార్థనను మన్నించి, వారి యెదుట చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సముద్రుడు నేటికిని చెలియలి కట్టను దాటుట లేదు. అలాగే నీవును పూర్వులైన శిబి చక్రవర్తి, అలర్కుడు మొదలగు వారి వృత్తాంతములను స్మరిస్తూ నీవు చేసిన ప్రతిజ్ఞను వమ్ము చేయవద్దు.
71. శ్లో.
భరతేనాత్మనా చాహం శపే తే మనుజాధిప।
యథా నాన్యేన తుష్యేయమ్ ఋతే రామవివాసనాత్॥
(అయోధ్యకాండ, 12. 49)
కైకేయి: రాముని వనవాసమునకు పంపుటకు దప్ప దేనికీ నేను తృప్తి చెందను. ఈ మాటలను భరతుని మీదను, నా మీదను ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను.
72. శ్లో.
న కథంచి దృతే రామాద్భరతో రాజ్యమావసేత్।
రామాదపి హి తం మన్యే ధర్మతో బలవత్తరమ్॥
(అయోధ్యకాండ, 12. 62)
దశరథుడు: శ్రీరాముని కాదని భరతుడు ఏ విధముగను, ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాధికారమును అంగీకరింపడు. వాస్తవముగా భరతుడు రాముని మించిన ధర్మపరాయణుడని నేననుకొందును.
73. శ్లో.
యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ।
భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి॥
సతతం ప్రియకామా మే ప్రియపుత్రా ప్రియంవదా।
న మయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ॥
(అయోధ్యకాండ, 12. 69, 70)
దశరథుడు: పట్టపురాణి యయ్యును దాసివలె నాకు కౌసల్య పరిచర్యలు చేయుచుండును. భార్య వలె, భగిని వలె, తల్లి వలె వాత్సల్యమును చూపినది. ఎల్లప్పుడూ నా హితమునే కోరునది. నాకు శ్రీరాముని వంటి ప్రియపుత్రుని ప్రసాదించినది. సర్వదా నాతో ప్రియముగా మాట్లాడునది. ఇన్ని సద్గుణములు గల ఆమెను సత్కరించుట దూరం, నీ కారణముగా (కైకేయి) ఉపేక్షించినాను.
74. శ్లో.
యది మే రాఘవః కుర్యాద్వనం గచ్చేతి చోదితః।
ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్సః కరిష్యతి॥
(అయోధ్యకాండ, 12. 87)
‘వనవాసమునకు వెళ్ళు’ అని ఆదేశించినపుడు ‘నేను వెళ్ళను’ అని రాముడు పలికినా బాగుండును. నాకు అదే కావాలి. కానీ రాముడు అలా అనడు (నిష్కల్మషుడు).
75. శ్లో.
ప్రియం చేద్భరతస్యైతద్రామప్రవ్రాజనం భవేత్।
మా స్మ మే భరతః కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః॥
(అయోధ్యకాండ, 12. 94)
దశరథుడు: (కైకతో) రాముని వనవాసము నిజంగా (నీవనుకున్నట్లు) భరతునుకు కూడా ప్రియమే యగుచో నేను మరణించిన పిమ్మట నా ఉత్తరక్రియలను అతడు చేయరాదు.
76. శ్లో.
ధిగస్తు యోషితో నామ శఠాః స్వార్థపరాః సదా।
న బ్రవీమి స్త్రియః సర్వా భరతస్యైవ మాతరమ్॥
(అయోధ్యకాండ, 12. 103)
దశరథుడు: ‘ఛీ! స్త్రీలందరును కపట బుద్ధితో హాని గూర్చువారే. ఎల్లప్పుడునూ పూర్తిగా స్వార్థపరాయణులే!’ అని లోకంలో ప్రతీతి. అయితే స్త్రీలందరూ ఇటువంటివారే అని నేననను. కానీ భరతుని తల్లియైన కైక విషయంలో మాత్రము ఇది నిజము!
77. శ్లో.
స భూమిపాలో విలపన్ననాథవత్
స్త్రియా గృహీతో హృదయేతిమాత్రయా।
పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారితా
ఉభావ సంస్పృశ్య యథాతురస్తథా॥
(అయోధ్యకాండ, 12. 115)
భూమిపాలుడైన దశరథుడు అనాథుని వలె కైకేయి పాదాలకు నమస్కరింపబోయాడు. ఆమె కాళ్ళను దూరం చేసింది. రాజు పాదాలను స్పృశించకయే రోగి వలె నేలపై పడిపోయాడు!
78. శ్లో.
న ప్రభాతం త్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే।
క్రియతాం మే దయా భద్రే మయాయం రచితోంజలిః॥
అథ వా గమ్యతాం శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణామ్।
నృశంసాం కైకేయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్॥
(అయోధ్యకాండ, 13. 18, 19)
దశరథుడు: నక్షత్రాలలో భూషితమైన ఓ రాత్రీ, తెల్లవారనీయకుము. నన్ను కనికరింపుము. లేదా త్వరగా తెల్లవారనిమ్ము. ఈ కైకేయి ముఖం ఇక నేను చూడదలచుకోలేదు.
సాహిత్యంలో ఈ ప్రక్రియ అద్భుతమైనది. జరుగుతున్న విషయంలోని చీకటిని, దానిని తట్టుకోలేని స్థితిని ఎంతో హృద్యంగా చెప్పిన తీరు ఇది!
79. శ్లో.
ఆశీర్వాదాన్ బహూన్ శృణ్వన్ సుహృద్భిః సముదీరితాన్।
యథార్హం చాపి సంపూజ్య సర్వానేవ నరాన్ యయౌ॥
(అయోధ్యకాండ, 17. 7)
శ్రీరాముడు దశరథుని వద్దకు మరల వెళుతున్నప్పుడు దారిలో జనం ‘ఓ రామా! నీవు రాజ్యపట్టాభిషిక్తుడవై, మీ తాతముత్తాతలు వేసిన బాటలలో సాగుచూ, మమ్ము పరిపాలింపుము’ అని పలికారు!
(ఇంకా ఉంది)