ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-11

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

80. శ్లో.

న హి తస్మాన్మనః కశ్చిచ్ చక్షుషీ వా నరోత్తమాత్।

నరః శక్నోత్యపాక్రష్టుమ్ అతిక్రాంతేపి రాఘవే॥

యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి।

నిందితః స వసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే॥

(అయోధ్యకాండ, 17. 13, 14)

శ్రీరాముడు చూపులకు అందనంత దూరంగా ముందుకు వెళ్ళినప్పటికీ పురుషులలో ఏ ఒక్కడునూ తన మనస్సును గాని, చూపులను గాని ఆయన నుండి మరల్చలేకపోయారు. ఇక స్త్రీల విషయం ఏమి చెబుతాం?

శ్రీరాముని చూడని వాడును, రాముని దృష్టికి రాని వాడును నిజంగా దురదృష్టవంతుడు. అట్టి వానిని లోకము నిందించును. అట్టి స్థితిలో తనను తానే నిందించుకుంటాడు.

81. శ్లో.

తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదాభికాంక్షితమ్।

కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే॥

(అయోధ్యకాండ, 18. 30)

శ్రీరాముడు: ఇన్ని మాటలెందుకు? ఓ దేవి! (కైకేయి) రాజు కోరిక ఏమిటో చెప్పు. దానిని తప్పక ఆచరిస్తాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు రెండు మాటలు వాడడు.

82. శ్లో.

ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।

సత్యేన మహతా రామ! తారయస్వ నరేశ్వరమ్॥

ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం

నచైవ రామః ప్రవివేశ శోకమ్।

ప్రవివ్యథే చాపి మహానుభావో

రాజా తు పుత్రవ్యసనాభితప్తః॥

(అయోధ్యకాండ, 18. 40, 41)

కైకేయి: ఓ రఘునందనా! ఈ మహారాజు మాటను నిలబెట్టుము. నీ సత్యవ్రత ప్రభావముతో ఈ నరేశ్వరుని అసత్య దోషము నుండి తరింపజేయుము.

ఇలాంటి మాటలు వింటున్నప్పటికీ శ్రీరాముడు శోకవశుడు కాలేదు. అలా నిశ్చలుడై యున్న శ్రీరాముని చూసి మహారాజు పుత్రునికి కలుగనున్న ఆపదలను తలచుకుని శోకపరితప్తుడై కుమిలిపోయాడు.

83. శ్లో.

నాహమర్థ పరోదేవి! లోకమావస్తు ముత్సహే।

విద్ధి మామ్ ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమా స్థితమ్॥

(అయోధ్యకాండ, 19. 20)

శ్రీరాముడు: నాకు రాజ్య కాంక్ష లేదు. నేను ఇక్కడే ఉండిపోవాలని ఆశించుట లేదు. కేవలం ధర్మమునే ఆశ్రయించి యున్న నన్ను ఋషితుల్యునిగా ఎరుగుము.

శ్రీరాముడు ఆయన వ్యక్తిత్వాన్ని రెండు మాటలలో చెప్పాడు కైకేయికి. మొదటిది – ధర్మమునే ఆశ్రయించి యున్నవాడు; రెండవది – ఋషితుల్యుడు!

అరణ్యవాసం ముందరే చెప్పిన మాట ఇది. వనవాసంలో మాంసాహారం ముట్టనని గుహునికి చెప్పిన మాట మనం ముందు చూస్తాం. కాకపోతే సామాన్యమైన సమయంలో కూడా అయన నడవడి, అలవాట్లు ఋషులు మాదిరిగానే ఉన్నవని స్పష్టమవుతున్నది. వశిష్ఠ విశ్వామిత్రుల సమిష్టి రూపమైన ప్రభావం మనకు ఆయన మీద కనిపిస్తున్నది.

84. శ్లో.

భరతః పాలయేద్ రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా।

తథా భవత్యా కర్తవ్యం స హి ధర్మః సనాతనః॥

(అయోధ్యకాండ, 19. 26)

ఈ రాజ్యమును భరతుడు పాలింపగలడు. అలాగే తండ్రిగారికి సేవలు చేయునట్లు చూడు. ఇదే సనాతన ధర్మము – అని శ్రీరాముడు కైకేయితో చెప్పాడు.

రాజ్యం పట్ల ఉన్న అనురక్తిని రాజు గారి ఆరోగ్యం పట్ల కూడా చూడవలసి ఉన్నదని ఎంతో సున్నితంగా హెచ్చరించాడు శ్రీరాముడు.

85. శ్లో.

ఆభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణమ్।

శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రావిచాలయన్॥

న చాస్య మహతీం లక్ష్మీం రాజ్య నాశోపకర్షతి।

లోక కాంతస్య కాంతత్వాత్ శీతరశ్మేరివ క్షపా॥

(అయోధ్యకాండ, 19. 31, 32)

ఈ సంభారములతోడనే ప్రియమైన సోదరునకు పట్టాభిషేకం జరగాలని భావిస్తూ పట్టాభిషేకం కోసం అక్కడ ఉంచిన ద్రవ్యములకు ప్రదక్షిణం చేసి, వాటి వైపు చూడకుండానే అక్కడి నుండి కదిలాడు.

ఆయన యొక్క శోభ ఏ మాత్రం తగ్గలేదు. శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు. చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకము జరుగకపోవుట వలన ఆయన ముఖకాంతి ఏ మాత్రము తరగలేదు.

లోకనాయకుడైన ఒక కావ్య నాయకుని తేజస్సును ఇటువంటి పరిస్థితులలో చేసిన వర్ణన అనితర సాధ్యం!

లక్ష్మణుడు కూడా సుఖదుఃఖాలను సమానంగా భావించేవాడు. తనను తాను నిగ్రహించుకుని ముందుకు సాగాడు..

ప్రతిషిద్ధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే।

విసర్జయిత్వా స్వజనం రథం పౌరాంస్తథా జనాన్॥

ధారయన్ మనసా దుఃఖం ఇంద్రియాణి నిగ్రేహ్యచ।

ప్రవివేశాత్మవాన్ వేశ్మ మాతుర ప్రియ శంసివాన్॥

అప్పటి వరకు జేజేలు కొట్టిన ఆత్మీయులను చూసి ఛత్రాన్ని, వింజామరలని వద్దని చెప్పి వారిని పంపించేసి దుఃఖాన్ని తనలోనే దిగమ్రింగాడు. ఇంద్రియాలను నిగ్రహించుకొన్నాడు. తల్లికి అప్రియమైన వార్త చెప్పటానికి అంతఃపురం లోనికి ప్రవేశించాడు.

86. శ్లో.

అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్య మతంద్రితా।

పరివారేణ కైకేయ్యాః సమా వాప్యథవావరా॥

(అయోధ్యకాండ, 20. 42)

కౌసల్య శ్రీరామునికి స్పష్టం చేసింది –

ఇంతవరకును నేను భర్త యొక్క గద్దింపులకును, ఉపేక్షలను మాత్రమే గురియైనాను. ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానముగనో, వారికంటెను హీనముగనో చూచెను.

యో హి మాం సేవతే కశ్చిత్ అథవాప్యమనువర్తతే।

కైకేయ్యాః పుత్ర మన్వీక్ష్య స జనో నాభిభాషతే॥

(అయోధ్యకాండ, 20. 43)

కౌసల్య: ఇప్పుడు నన్ను సేవించు వారును నాతో ప్రియముగా మాట్లాడువారును నీవు వెళ్ళిన పిమ్మట భరతుని చూసి భయపడి వారు కూడా ఇక మాట్లాడజాలరు!

87. శ్లో.

నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే।

పూర్వైరయ మభిప్రేతో గతో మార్గో నుగమ్యతే॥

తదేతత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా।

పితుర్హి వచనం కుర్వన్ న కశ్చిన్నామ హీయతే॥

(అయోధ్యకాండ, 21. 35, 36)

శ్రీరాముడు: నేను అనుసరించుచున్న ఈ పద్ధతి (పితృవాక్య పరిపాలన) పూర్వులు ఆచరింపనిదియూ గాదు, పూర్వాచరమునకు విరుద్ధమూ కాదు. నీ మాటను కాదనుటయూ గాదు – ధర్మాత్ములైన ప్రాచీనులందరును దానిని అంగీకరించారు. వారి మార్గముననే నేను అనుసరిస్తున్నాను.

జననీ! ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. తండ్రి మాటను శిరసావహించిన వాడెవ్వడును ధర్మము నుండి పతనము కాడు.

88. శ్లో.

ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్।

ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచన ముత్తమమ్॥

(అయోధ్యకాండ, 21. 40)

లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము. సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది.

89. శ్లో.

తీర్ణ ప్రతిజ్ఞశ్చ వనాత్ పునరేష్యామ్యహం పురీమ్।

యయాతిరివ రాజర్షిః పురా హిత్వా పునర్ధివమ్॥

(అయోధ్యకాండ, 21. 46)

యయాతి స్వర్గమును వీడి, మరల స్వర్గమును జేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుని (వనవాసం తరువాత) తిరిగి అయోధ్యకు వచ్చెదను.

90. శ్లో.

స మాతరం చైవ విసంజ్ఞకల్పామ్

ఆర్తం చ సౌమిత్రి మభిప్రతప్తమ్।

ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం

యథా స ఏవార్హతి తత్ర వక్తుమ్॥

ధర్మార్థకామాః ఖలు తాత! లోకే

సమీక్షితా ధర్మఫలోదయేషు।

తే తత్ర సర్వే స్యురసంశయం మే

భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా॥

(అయోధ్యకాండ, 21. 54, 56)

నిస్పృహకు లోనైయున్న తల్లి తోను, ఆర్తితో పరితపించుచున్న లక్ష్మణునితోను ధర్మవచనములను పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునికే చెల్లెను.

ధర్మార్థకామ ఫలములన్నియును ధర్మమును ఆచరించుట వలననే సిద్ధించును. ఇందులో సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతియైన భార్య వలన ధర్మార్థ కామములను మూడును నెరవేరుతాయి. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు, ధర్మకార్యాచరణములలో తోడ్పడును. ప్రియ పత్నిగా ఆయన కోరికలను తీర్చును. పుత్రవతియై ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును.

91. శ్లో.

యశో హ్యహం కేవలరాజ్యకారణాత్

న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్।

అదీర్ఘకాలే న తు దేవి జీవితే

వృణేవరామద్య మహీమధర్మతః॥

(అయోధ్యకాండ, 21. 62)

శ్రీరాముడు: మాతా! కేవలము రాజ్యాధికారము కొరకు మహాఫల స్వరూపమైన కీర్తిప్రతిష్ఠలను పోగొట్టుకొనజాలను. జీవితము క్షణికము. ధర్మము శాశ్వతము. అందువలన నేడు అధర్మ మార్గమున తుచ్ఛమైన ఈ రాజ్యమును నేను కోరను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here