[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
104. శ్లో.
వివృద్ధం బహుభిర్వృక్షైః శ్యామం సిద్ధోపసేవితమ్।
తస్మై సీతాంజలిం కృత్వా ప్రయుంజేతాశిషశ్శివాః॥
(అయోధ్యకాండ, 55. 7)
భరద్వాజ ముని శ్రీరామునికి చిత్రకూటం వైపు దారి చెబుతూ ప్రయాగ తీర్థం గురించి చెబుతూ ‘యమునకు ఆవలి తీరమున శ్యామము అను ఒక మర్రిచెట్టు ఉన్నది, దాని చుట్టూ ఎన్నో వృక్షాలున్నవి, ఆ వృక్షం నీడలో పెక్కు మంది సిద్ధులు నివసిస్తూ ఉంటారు. సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి శుభాశీస్సులను పొందవలెను’ అని చెప్పాడు.
105. శ్లో.
ఇతి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలిః।
అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిమ్ అభివాదయన్॥
(అయోధ్యకాండ, 56. 16)
చిత్రకూటం దగ్గర శ్రీ సీతారామలక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరి ఆయనను దర్శించుకున్నారు (భరతుని ఆగమనం వరకు వాల్మీకి ఇక్కడ ఉన్నాడు. తరువాత తమసా నదీ తీరానికి చేరాడు. అక్కడ శ్రీమద్రామయణాన్ని రచించాడు. వాల్మీకి శ్రీరాముని సమకాలీనుడు అని చెప్పటానికి ఇది నిదర్శనం).
106. శ్లో.
ఐణేయం మాంసం ఆహృత్య శాలాం యక్ష్యామహే వయం।
కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే! చిరంజీవిభిః॥
మృగం హత్వానయ క్షిప్రం లక్ష్మణేహ శుభేక్షణ।
కర్తవ్యః శాస్త్రదృష్టో హి విధిర్దర్మమనుస్మర॥
భ్రాతుర్వచన మాజ్ఞాయ లక్ష్మణః పరవీరహా।
చకార స యథోక్తం చ తం రామః పునరబ్రవీత్॥
ఇణేయం శ్రపయస్వైతత్ శాలాం యక్ష్యమహే వయమ్।
త్వరసౌమ్య ముహూర్తోయం ధ్రువశ్చ దివసోప్యయమ్॥
(అయోధ్యకాండ, 56. 22-25)
చిత్రకూటంలో పర్ణశాల ఏర్పరుచుకున్నాక శ్రీరాముడు లక్ష్మణునితో ‘వాస్తు పూజ అనివార్యం’ అని చెప్పాడు. ఇక్కడ ‘మృగం’ అన్న పదం గజకందమును సూచిస్తుంది. మాంసం ముట్టనని గుహునికి చెప్పి ఇక్కడ మృగాన్ని చంపి మాంసం తెమ్మని శ్రీరాముడు చెప్పడు. గజకందం అనేది ఒక దుంప. కృష్ణమృగం అంటే త్రవ్వి తీయబడిన గజకందము అని అర్థం. తరువాత శ్లోకాలలో ‘నిక్షిప్తం ఛిన్నశోణితమ్’ అని కూడా చెప్పాడు. రక్తక్షీణతని నిర్మూలించే దుంప అని అర్థం (బీట్‌రూట్ లాంటిది).
ఆ తరువాత ‘ఈ దినము ధ్రువసంజ్ఞకము – సుముహూర్తము కాబట్టి గృహ శాంతి చేయాల’ని శ్రీరాముడు లక్ష్మణునితో చెప్పాడు. శ్రీరామునికి జ్యోతిషంతో పాటు అన్ని విద్యలు చేతవును. తరువాతి శ్లోకాలలో ఎన్నో జపాలు, యాగాలు కూడా జరిపించినట్లు తెలుస్తున్నది!
(కొందరి హాస్యాస్పాదమైన కల్పనలలో శ్రీరాముడు యుద్ధం నిమిత్తం ముహూర్త నిర్ణయానికి రావణుని సంప్రదించినట్టు చెప్పియున్నారు. పండితుల మూర్ఖత్వం ఎగురగలిగే తారాస్థాయికి హద్దులుండవు!)
107. శ్లో.
గతిరేకా పతిర్నార్యా ద్వితీయా గతిరాత్మజః।
తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థీ నేహ విద్యతే॥
తత్ర త్వం చైవ మే నాస్తి రామశ్చ వనమాశ్రితః।
న వనం గంతుమిచ్ఛామి సర్వథా ని హతా త్వయా॥
(అయోధ్యకాండ, 61. 24, 25)
కౌసల్య దశరథునితో అంటున్నది – రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసింది కుమారుడే. పుత్రుని వలనను రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకోవలసినవారు జ్ఞాతులే. ఆ తరువాత దారి లేదు.
(ఇది మనుస్మృతిలోని మాట)
శ్రీరాముడు అడవుల పాలైనాడు. దూరమైపోయినందున నాకు జ్ఞాతులే లేరు. నిన్ను విడిచి వనములకు వెళ్ళలేను. నీవు అన్ని విధములుగా నన్ను మృతప్రాయను చేశావు.
పరుషంగా మాట్లాడినందుకు కౌసల్య చింతిస్తూ..
108. శ్లో.
జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదినమ్।
పుత్ర శోక ఆర్తయా తత్తు మయా కిం అపి భాషితమ్॥
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం।
శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమః రిపుః॥
(అయోధ్యకాండ, 62. 14, 15)
కౌసల్య: నాకు ధర్మము తెలియకపోలేదు. మీరు సత్యసంధులనీ ఎరుగుదును. బాధలో అలా పలికాను. శోకంలో మునిగినవారు ధైర్యం కోల్పోతారు. జ్ఞానం అడుగంటును. శోకమును మించిన శత్రువు లేదు!
చివరి దశలో దశరథుడు శ్రవణకుమారుని వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటాడు.
109. శ్లో.
సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్।
బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్॥
న ద్విజాతిరహం రాజన్ మా భూత్ తే మనసో వ్యథా।
శూద్రాయామస్మి వైశ్యేన జాతో జన పదాధిప॥
(అయోధ్యకాండ, 63. 49, 50)
శ్రవణకుమారుడు: ఓ మహారాజా! నా మాటను ఆలకించండి. నేను ధైర్యం వహించి శోకం నిగ్రహించుకుని స్థిరచిత్తుడనైనాను. నేను బ్రాహ్మణుడను కాను. వైశ్యుని వలన శూద్ర స్త్రీ యందు జన్మించినవాడను. కనుక బ్రహ్మహత్యా పాపం మీకు అంటదు.
శ్రీరాముడు వనమునకేగిన తరువాత అయిదు రోజులు గడిచాయి. ఈ కథను (శ్రవణకుమారుని కథను) కౌసల్య, సుమిత్ర సమక్షంలో గుర్తు చేసుకుని శ్రీరామునికై పరితపిస్తూ మహారాజు తనువు చాలించాడు.
110. శ్లో.
నారాజకే జనపదే ప్రభూత నట నర్తకాః।
ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్ర వర్ధనాః॥
(అయోధ్యకాండ, 67. 15)
రాజు లేని రాష్ట్రమున – ప్రజలకు మనోవికాసమును కలిగించుట ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడునటువంటి నటన, నాట్యము, నృత్యము, సంగీత సాహిత్యములు మొదలగు లలితకళలు అడుగంటుతాయి.
111. శ్లో.
ధన్యస్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీ తలే।
అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమిహ ఇచ్ఛసి॥
శాశ్వతీ ఖలు తే కీర్తిః లోకాననుచరిష్యతి।
యస్త్వం కృచ్ఛ్రగతం రామం ప్రత్యానయితు మిచ్ఛసి॥
(అయోధ్యకాండ, 85. 12, 13)
గుహుడు భరతునితో: నిజముగా నీవు ధన్యుడవు. అప్రయత్నముగా ప్రాప్తించిన మహారాజ్యమును త్యజించుటకు సిద్ధపడుచున్నావు. వాస్తవముగా ఈ భూమండలమున నీతో సాటి యగువాడు ఎవ్వడునూ లేడు. ఓ భరతా! కష్టాల పాలైన శ్రీరాముని అయోధ్యకు తీసికొని వచ్చుటకు అభిలషించుచున్నావు. దీని వలన నీ కీర్తి చిరస్థాయిగా నుండును!
112. శ్లో.
న దోషేణావవగంతవ్యా కైకెయీ భరత! త్వయా।
రామ ప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి॥
దేవానాం దానవానాం చ ఋషేణాం భావితాత్మనామ్।
హితమేవ భవిష్యద్ధి రామప్రవ్రాజనాదిహ॥
(అయోధ్యకాండ, 92. 29, 30)
భరద్వాజ మహర్షి భరతునితో: ఓ భరతా! నీవు కైకేయిని తప్పు పట్టవద్దు. ఆమె దోషము ఏమియూ లేదు. శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో ఎల్లరకును సుఖశాంతులు వర్ధిల్ల జేయును. శ్రీరాముడు దండకారణ్యమును చేరుట వలన దేవతలకును, దానవులకును, భగవద్ధ్యాన నిరతులైన మహర్షులకును, ఈ జగత్తునకు హితమే జరుగును.
113. శ్లో.
అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయమ్।
పితుశ్చానృణాతా ధర్మే భరతస్య ప్రియం తథా॥
(అయోధ్యకాండ, 94. 17)
శ్రీరాముడు సీతతో: ఓ జానకీ! వనవాసము చేయుట వలన, తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా పితృ ఋణమును దీర్చుకొనుట, తమ్ముడైన భరతునకు ప్రియమును చేకూర్చుట అను రెండు ఫలములు నాకు దక్కినవి.
శ్లో.
ఇమం తు కాలం వనితే! విజహ్రివాన్
త్వయా చ సీతే! సహ లక్ష్మణేన చ।
రతిం ప్రపత్స్యే కుల ధర్మ వర్ధినీం
సతాం పథి స్వైర్నియమైః పరైః స్థితః॥
(అయోధ్యకాండ, 94. 27)
ఓ ప్రాణేశ్వరీ! శ్రేష్ఠములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతోనూ, లక్ష్మణుని తోడను ఈ పదునాలుగు సంవత్సరముల కాలమును సంతోషముగా గడిపెదను. దాని వలన మన వంశ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించును.
శ్లో.
విధూత కలుషైః సిద్ధైః తపోదమశమాన్వితైః।
నిత్య విక్షోభిత జలాం విగాహస్వ మయా సహ॥
త్వం పౌర జనవద్వ్యాళాన్ అయోధ్యా మివ పర్వతం।
మన్యస్వ వనితే! నిత్యం సరయూవదిమాం నదీమ్॥
(అయోధ్యకాండ, 95. 13, 15)
ఓ రమణీ! జితేంద్రియలును, పుణ్యాతుములును, తపస్సంపన్నులును, ఐన సిద్ధపురుషులు ఈ నదీ జలాల యందు స్నానములు ఆచరించుచుండుటచే ఇవి మిగుల పునీతములైనవి. కనుక నీవు నాతో గూడి ఈ పవిత్ర జలములలో స్నానమాచరింపుము.
ఈ వనము నందు సంచరించు జంతువులను పురజనుల వలె భావింపుము. ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము. ఈ మందాకినీ నదిని సరయూ నదిగా చూచుకొనుము.
(ఇంకా ఉంది)