ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-17

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

146. శ్లో.

విషేదుర్దేవగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః।

ఏకం సహస్రైర్భహుభిః తదా దృష్ట్వా సమావృతమ్॥

తతో రామః సుసంక్రుద్ధో మండలీకృతకార్ముకః।

ససర్జ విశిఖాన్ బాణాన్ శతశోథ సహస్రశ॥

దురావారాన్ దుర్విషహాన్ కాలదండోపమాన్ రణే।

ముమోచ లీలయా రామః కంకపత్రాన్ అజిహ్మగాన్॥

తే శరాః శత్రుసైన్యేషు ముక్తా రామేణ లీలయా।

అదదూ రక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతా ఇవ॥

(అరణ్యకాండ, 25. 15-18)

ఒంటరిగానున్న శ్రీరాముని పదునాలుగు వేలమంది రాక్షస యోధులు చుట్టుముట్టారు. అది చూచి దేవతలందరూ ఖిన్నులైనారు.

శ్రీరాముడు క్రుద్ధుడై ధనువును మండలాకారంగా జేసి ఆ రాక్షసుల మీద వేలకొలది బాణాలను వదిలాడు. అవి భయంకరములుగా ఉన్నాయి. వాటిని శ్రీరాముడు అవలీలగా ప్రయోగించాడు. శత్రువులు తట్టుకోలేకపోయారు. ఆ అస్త్రములు యముని కాలపాశముల వలె రాక్షసుల ప్రాణములు హరించెను.

147. శ్లో.

ఏతదర్థం మహాతేజా మహేంద్రః పాకశాసనః।

శరభంగాశ్రమం పుణ్యమ్ ఆజగామ పురందరః॥

ఆనీతస్త్వమిమం దేశమ్ ఉపాయేన మహర్షిభిః।

ఏషాం వధార్థం క్రూరాణాం రక్షసాం పాపకర్మణామ్॥

తదిదం న కృతం కార్యం త్వయా దశరథాత్మజ।

సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః॥

(అరణ్యకాండ, 30. 30-32)

ఖరుని సంహారం తరువాత రాజర్షులు, బ్రహ్మార్షులు కలసి శ్రీరాముని ఆరాధించి ఇలా అన్నారు:

“ఓ రామా! మహాతేజస్వియు, పాకశాశనుడు అయిన దేవేంద్రుడు ఈ ఖర సంహారమునకై పవిత్రమైన శరభంగాశ్రమమునకు విచ్చేసెను. ఈ రాక్షస సంహారం కోసం మహర్షులు ఉపాయంగా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. మునీశ్వరులు అందరునూ ఈ దండకారణ్యమునందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు.”

148. శ్లో.

న హి రామో దశగ్రీవ! శక్యో జేతుం త్వయా యుధి।

రక్షసాం వాపి లోకేన స్వర్గః పాపజనైరివ॥

న తం వధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరపి।

అయం తస్య వధోపాయః తం మమైకమనాః శృణు॥

భార్యా తస్యోత్తమా లోకే సీతా నామ సుమధ్యమా।

శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషితా॥

నైవ దేవీ న గంధర్వీ నాప్సరా నాపి దానవీ।

తుల్యా సీమంతినీ తస్యా మానుషీషు కుతో భవేత్॥

(అరణ్యకాండ, 31. 27-30)

జనస్థానంలో పదునాలుగు వేల రాక్షసులను శ్రీరాముడు ఒక్కడే సంహరించిన దృశ్యాన్ని రావణుని గూఢచారులలో ఒకరైన అకంపనుడు జాగ్రత్తగా చూస్తూ వచ్చాడు. ప్రాణాలతో బయటపడి లంకకు చేరి శ్రీరాముని పరాక్రమాన్ని రావణునికి పలురీతుల వివరించాడు. రావణుడు తొలుత తన గురించి ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ అకంపనుడు చివరగా పలికిన మాటలకు లొంగాడు. ఇది కీలకంగా మారింది. రావణుని స్త్రీలోలత్వం ఒక అడుగు ముందుకు వేసింది. శ్రీరాముని వంచించాలనే ఉద్దేశ్యంలో ఈ అంశం వ్యూహంలోకి బలంగా చోటు చేసుకుంది!

ఆ మాటలు చూద్దాం:

అకంపనుడు: ఓ మహారాజా! యుద్ధము నందు శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము. పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు, రాక్షస వీరులెవ్వరును అతనిని జయింపజాలరు.

దేవాసురులు సైతము అతనిని వధింపలేరని నా విశ్వాసము. కానీ అతనిని వధించుటకు తగిన ఉపాయమొకటి నాకు తోచుచున్నది.. దయతో జాగ్రత్తగా (ఏకమనాః శృణు) వినుము!

సీతాదేవి అతని భార్య. ఉత్తమురాలు, లోకోత్తర సౌందర్యవతి. నిండు జవ్వని. చక్కని అవయవముల పొంకము గలది, రత్నాభరణములను ధరించి యున్నది, స్త్రీరత్నం! గంధర్వులలో గాని, అప్సరసలలో గాని దానవ యువతులలో గాని యెవరూ అందచందములలో ఆమె కొనగోటికి చాలరు. ఇక మనుష్య కాంతలలో ఆమెకు సాటి ఎవరుందురు?

149. శ్లో.

తస్యాపహర భార్యాం త్వం ప్రమథ్య తు మహావనే।

సీతయా రహితః కామీ రామో హాస్యతి జీవితమ్॥

(అరణ్యకాండ, 31. 31)

అకంపనుడు: ఓ ప్రభూ! సీత యనిన శ్రీరామునకు ప్రాణము. అందువలన ఒక ఉపాయము చేత అతనిని వంచింది ఆమెను అపహరించుకు రమ్ము. భార్యా వియోగమునకు తట్టుకొనలేక అతడు జీవితమును చాలించును.

సీతారామలక్ష్మణులను అడవిలో గమనించిన తీరు గొప్పదే. సీత పక్కన ఉన్నంత సేపు శ్రీరాముడు నరశార్దూలంగానే కనబడతాడు. ప్రక్కన లేకపోతే నీరు కారిపోయినట్లు కనిపించటం చేత ఆ ఆలోచనకు వచ్చాడు అంకపనుడు. అంతేకాదు, సీత యొక్క సౌందర్యం నిరుపమానం కావటం రాక్షసుల విశ్లేషణాశక్తికి ఒక సవాలు కావటం కూడా మనకు కనిపిస్తుంది. ఇక రావణునికి – అతని గల బలహీనతల దృష్ట్యా ఇది సంక్లిష్టమైన అంశంగానే మారింది.

150. శ్లో.

ఆరక్షో మే హతస్తాత! రామేణాక్లిష్టకర్మణా।

జనస్థానమ్ అవధ్యం తత్ సర్వం యుధి నిపాతితమ్।

తస్య మే కురు సాచివ్యం తస్య భార్యాపహారణే॥

(అరణ్యకాండ, 31. 41)

రావణుడు మారీచుని ఆశ్రమానికి వెళ్ళి చెప్పిన మాట:

దండకారణ్యమునకు నా ప్రతినిధిగా నున్న ఖరుని అసహాయ శూరుడైన శ్రీరాముడు హతమార్చెను. అజేయులనుకున్న మన రాక్షస యోధులందరును యుద్ధంలో ఆ మహావీరుని చేతిలో మరణించారు. దీనికి ప్రతిక్రియగా నేను అతని భార్యను అపహరించాలని అనుకుంటున్నాను. ఈ పనిలో నీవు నాకు సహాయపడవలెను!

151. శ్లో.

ఆఖ్యాతా కేన సీతా సా మిత్రరూపేణ శత్రుణా।

త్వయా రాక్షసశార్దూల! కో న నందతి నందితః।

సీతామ్ ఇహానయస్వేతి కో బ్రవీతి బ్రవీహి మే॥

అసౌ రణాంతః స్థితిసంధివాలో

విదగ్ధరక్షో మృగహా నృసింహః।

సుప్తస్త్వయా బోధయితుం న యుక్తః

శరాంగపూర్ణో నిశితాసిదంష్ట్రః॥

ప్రసీద లంకేశ్వర! రాక్షసేంద్ర!

లంకాం ప్రసన్నో భవ సాధు గచ్ఛ।

త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం

రామః సభార్యో రమతాం వనేషు॥

(అరణ్యకాండ, 31. 42, 47. 49)

మారీచుడు శ్రీరాముని తత్వాన్ని, పరాక్రమాన్ని చక్కగా వివరించి ఇలా అన్నాడు:

సీతను గూర్చిన సమాచారం చెప్పి ఈ విధంగా నిన్ను ప్రేరేపించిన వాడు మిత్రుని రూపంలో నీకు శత్రువే! సమస్త రాక్షసుల వైశిష్ట్యమును దెబ్బదీయదలచిన వాడెవ్వడు?

శ్రీరాముడు సింహం వంటివాడు. నిద్రించుచున్న సింహం జోలికి పోవుట ప్రమాదకరము. అట్లే పరద్రోహ చింత లేక ప్రశాంతంగా నున్న శ్రీరాముని కవ్వించుట తగదు.

ఓ లంకాధిపా! రాక్షస ప్రభూ! అనుగ్రహింపుము. దయ చేసి శాంతింపుము. తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతో గూడి సుఖింపుము. శ్రీరాముడు తన భార్యతో గూడి వనములలో హాయిగా ఉండగలడు!

ఈ మాటలు విని రావణుడు లంకకు వెనక్కి వెళ్ళిపోతాడు. కొన్ని అంశాలు ఈ ఘట్టంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి –

  1. ‘అసహాయ శూరుడు’ అని శ్రీరాముని రావణుడే పేర్కొన్నాడు. అలా పలుకుతూనే అటువంటి వాని భార్యను అపహరించాలనుకున్నాడు! దీని వెనుక అలా చేస్తేనే శ్రీరాముడు బలహీనుడవుతాడు అనే ఆలోచన కనిపిస్తున్నది. బలహీనుడైన శ్రీరాముడు లంక జోలికి రాడని అనుకున్నాడు!
  2. మారీచుడు శ్రీరాముని గురించి గొప్ప అవగాహన గలవానిగా కనిపిస్తాడు. ముఖ్యంగా ఆయన ఎవరి జోలికే వెళ్ళడని తేల్చి చెప్పాడు. ఆ మాట రావణునికి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుచేత సీతను అపహరించటం అంత అవసరమా అనుకుని వెనుదిరిగాడు..!

152. శ్లో.

మన్త్రైరభిష్టుతం పుణ్యమ్ అధ్వరేషు ద్విజాతిభిః।

హవిర్ధానేషు యః సోమమ్ ఉపహంతి మహాబలః॥

ఆప్తయజ్ఞహరం క్రూరం బ్రహ్మఘ్నం దుష్టచారిణమ్।

కర్కశం నిరనుక్రోశం ప్రజానామ్ అహితే రతమ్॥

రావణం సర్వభూతానాం సర్వలోక భయావహమ్।

రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలమ్॥

(అరణ్యకాండ, 32. 19, 20, 21)

శూర్పణఖ అన్న అయిన రావణునికి తనకు జరిగిన అవమానాన్ని మింగుకోలేక ప్రతీకార వాంఛతో రావణునికి ఎంతో యుక్తిపూర్వకంగా రాజధర్మాన్నీ, ఇతర అంశాలను మేళవించి చెప్పిన మాటలు కథాపరంగా ఆసక్తికరంగా ఉంటాయి. రావణుని కొలువుకు శూర్పణఖ ప్రవేశించినప్పుడు రావణుని చరిత్రను క్లుప్తంగా చెబుతూ మహర్షి చెప్పిన మాటలలో ఇవి కొన్ని –

యజ్ఞములను ఆచరించినప్పుడు ద్విజులు వేదమంత్రములను పఠిస్తూ సోమలతల నుండి రసాన్ని పిండుతారు. అక్కడికి చేరి రావణుడు అలా సిద్ధించిన సోమరసాన్ని నాశనం చేస్తూ ఉండేవాడు.

యజ్ఞములు పరిసమాప్తి అగుచుండగా వాటిని ధ్వంసం చేసేవాడు. బ్రహ్మహత్యలకు చేసేవాడు (బ్రహ్మఘ్నం). దుష్ట చరిత్ర గలవాడు. కఠినాత్ముడు, దయారహితుడు, సమస్త ప్రాణులను బాధించువాడు, అందరినీ భయపెట్టేవాడు, ప్రజలకు హాని చేకూర్చేవాడు. అసాధారణ బలశాలి, శూరుడు ఐన తన సోదరుడగు రావణుని ఆ శూర్పణక దర్శించెను.

(ఈ గుణాలతో ఉన్నవాడిని ‘రావణ బ్రహ్మ’ అని, అతనిని వధిస్తే బ్రహ్మహత్యా పాతకం కలిగెనని ఎలా భావించటం? పైగా నిజమైన శివభక్తి కలవాడా?)

మారీచుని మాటలలో శ్రీరాముని వలన రావణునికి ఏ ముప్పూ లేదని స్పష్టం అయినది. దానిని రావణుడు అంగీకరించినట్లు తెలుస్తున్నది – శ్రీరాముడు అనవసరంగా ఎవరి జోలికీ వెళ్ళడన్నది ఇక్కడ ప్రధానాంశంగా ముందుకు వచ్చినది. కానీ శూర్పణఖ చెప్పిన మాటలు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించటం అవసరం..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here