ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-2

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

గాయత్రీ రామాయణం

[dropcap]వి[/dropcap]ద్యారణ్యులు రచించిన ‘రామాయణ రహస్యం’, అలాగే ‘తత్వసంగ్రహ రామాయణం’ లోని బాలకాండ లోని అయిదవ సర్గలోనూ, గోవిందరాజుల వారు రచించిన ‘భాషణ’ అనే టీకాలో రామాయణాన్ని గాయత్రి స్వరూపంగా పేర్కొనటం జరిగింది. వీటిల్లో ఒక విషయాన్ని ప్రతిపాదించారు. వాల్మీకి రామాయణంలోని 24 వేల శ్లోకాలలో ప్రతి వేయి శ్లోకాలకు గల మొదటి శ్లోకాన్ని తీసుకుని 24 శ్లోకాల సంకలనం చేసి ఈ 24 శ్లోకాలను గల మొదటి అక్షరాలను వరుసగా వ్రాసుకుంటే అది గాయత్రి మంత్రం అని చెప్పటం జరిగింది.

దీని భావమేమిటంటే గాయత్రి మంత్రం యొక్క విస్తారమే వాల్మీకి రామాయణం.

ఋగ్వేదంలోని 10వ మండలంలో ‘వభ్ర’ అనే ఋషి గురించి ప్రస్తావన యున్నది. ఈయనే వాల్మీకి మహర్షి. ఈయనతో పాటుగా, ఇంద్రుడు, శ్రీరాముడు, రుద్రగణాలు, హనుమంతుడు ఆయన సహచరుల గురించి వర్ణన కలదు. గాయత్రి మహామంత్రం నుండి రామాయణం విస్తరించింది అనటానికి మహర్షి మాధ్యాహ్నిక సంధ్యోపాసన నుండి ‘మానిషాద’ శ్లోకం ఉద్భవించటం, రామాయణంలో సంధ్యోపాసనకు సంబంధించిన అంశాలు, 24 సంఖ్య, గాయత్రి ఛందస్సు నుండి వచ్చిన అనుష్టుప్ ఛందస్సు, రవి, రవి యొక్క తేజస్సును విడదీయ వీలుకాదు అని సీతాదేవి నొక్కి వక్కాణించుట అనునవి బలమైన తార్కాణాలు. ఇవన్నీ ఒక ప్రక్క అయితే మహర్షి రామాయణాన్ని కుశలవులకు అధ్యయనం కోసం ఉపదేశిస్తూ చెప్పిన మాట – ‘వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః’ (వాల్మీకి రామాయణం, 1.4.6).

‘రామాయణ రహస్యం’లో ‘ప్రతిశ్లోక సహస్రాదౌ మంత్రవర్ణాః సమృద్ధృతాః’ అని సూటిగా చెప్పడం జరిగింది. విద్యారణ్యుల వారు వాల్మీకి రామాయణం లోని మొదటి సర్గని గాయత్రి స్వరూపంగా పేర్కొన్నారు – ‘గాయత్ర్యాశ్చ స్వరూపం తద్రామాయణమితి స్మృతమ్’. వాల్మీకి రామాయణం ‘తపస్సు’తో ప్రారంభం అవుతున్నది.

మొదటి శ్లోకం:

1.శ్లో.

ఓం తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం।

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం॥

తపస్సు, స్వాధ్యాయంలో నిరతుడై యుండు బ్రహ్మర్షి నారదుడిని మునిపుంగవుడైన వాల్మీకి ఒక మాట అడిగాడు..

ఎన్నో ప్రధానమైన గుణాలను చెప్పి – ఇవన్నీ గల మహాపురుషుడు ప్రస్తుతం ఈ భూమి మీద ఎవరు? – అని అడిగినప్పుడు నారద మహర్షి అద్భుతమైన శ్రీరామ కథను 100 శ్లోకాలలో చెప్పి గగన మార్గాన వెళ్ళిపోయాడు.

ఈ నూరు శ్లోకాలు చదివిన ద్విజులు వేదవేదాంగములందు, శాస్త్రములందు పండితులవుతారని, క్షత్రియులు రాజ్యాధికారం పొందుతారని, వైశ్యులకు వ్యాపార లాభమని, ఇతర వర్గాల వారికి తోటివారితో ఉన్నత స్థానాన్ని పొందటం జరుగుతుందని స్వయంగా నారదుడు 100వ శ్లోకంలో చెప్పియున్నాడు.

98వ శ్లోకంలో ‘ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్’ అన్నాడు. వేదార్థమును ప్రతిపాదించును కావున ఇది సర్వవేద సారం అని అర్థం. అందుచేత ఈ సర్గ గాయత్రి స్వరూపమని విద్యారణ్యుల వారు చెప్పారు. ఈ సర్గనే విస్తారంతా తరువాత మనకు రామాయణంగా అందించాడని తెలుసుకోవాలి. మంత్ర జపం సూక్ష్మాతి సూక్ష్మమైన అంతఃకరణను ఎలా జాగృతం చేస్తుందో, ఈ సర్గ 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణానికి సూక్ష్మ స్వరూపమని స్పష్టమవుతున్నది.

2.శ్లో.

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞ ఘ్నాన్ రఘునందనః।

ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా॥

(బాలకాండ, 30.24)

ఈ విధముగా రఘునందనుడు యజ్ఞమునను విఘ్నముల నొనరించు రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు ఋషీశ్వరులచే పూజలనందుకొనెను.

3.శ్లో.

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితమ్।

వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవ మబ్రవీత్॥

(బాలకాండ, 67.12)

ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని “వత్సా! రామా! ఈ ధనస్సును (ఓ) చూపు చూడుము” అన్నాడు.

లౌకిక వ్యవహారంలో ‘శివధనుర్భంగము’ అనే మాట వాడుక లోకి వచ్చినది. అది సరి అయినది కాదు.

శివధనుస్సును ఎక్కుపెట్టాలి అన్నది నియమము కానీ దానిని భంగం చేయుట కాదు. వీరుడైన శ్రీరాముడు ఎక్కుపెట్టినపుడు అది విరగటం జరిగింది. ఆ గొప్ప ధనుస్సును విరగ కొట్టండి అని జనక మహీపతి చెప్పలేదు.

మరొక విషయం ఏమిటంటే ఈ ధనువు గురించి వివరంగా జరిగినది చెప్పి గతంలో స్వయంవరం నిర్వహించినప్పుడు రాజాధిరాజులెవరూ దీనిని ఎక్కుపెట్టలేకపోవటం వలన కుమార్తె సీత అవివాహితురాలిగా ఉండి పోగలదేమో అన్న ఆలోచన ఆయనను బాధిస్తున్నట్లు జనకుడు చెప్పాడు. ఆ సందర్భంలో మిథిలా నగరం పొలిమేరలో బస చేసిన శ్రీరామలక్ష్మణ విశ్వామిత్రుల సమక్షంలోకి ఆ బరువైన ధనుస్సును ఎంతోమంది బలం కల సైనికులు తోసుకుంటూ వచ్చారు. ఆ సన్నివేశంలో శివధనువును శ్రీరాముడు ఎక్కుపెట్టాడు. సీతాస్వయంవరంలో ఇది జరుగలేదు. ఈ ఘట్టాన్నే అనసూయతో సంవాదం జరిపినప్పుడు సీత ‘స్వయంవరం’గా పేర్కొన్నట్లు అర్థం చేసుకోవాలి.

సీతాస్వయంవరానికి రావణుడు రావటం, ధనువును ఎక్కుపెట్టలేకపోవటం, లేదా శివభక్తుడు కావటం వలన ఆ ధనువుని స్పృశించనని చెప్పి వెళ్లిపోవటం వంటివి వాల్మీకి రామాయణంలో లేవు. రావణుని వ్యవహారమంతా శూర్పణఖ భంగపడి లంకకు చేరుకుని మొరపెట్టిన తరువాతనే మనకు కనిపిస్తుంది.

4.శ్లో.

తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య స విశాం పతేః।

శయనీయం నరేంధ్రస్య తదా సాద్య వ్యతిష్ఠత॥

(అయోధ్యకాండ, 15.20)

అతడు (సుమంత్రుడు) మహారాజు యొక్క వంశావళిని కీర్తించాడు. క్రమముగా ఆయన శయన మందిరమునకు జేరి అచట నిలుచున్నాడు.

ఇక్కడ సందర్భమేమిటంటే దశరథుడు కైకకు ఎన్నో విధాల నచ్చజెప్పే ప్రయత్నం చేసి విఫలుడై ఏమీ చేయలేని పరిస్థితిలో సుమంత్రునికి కబురుపెట్టి శ్రీరాముని ఆయన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. కొన్ని ఘడియల క్రితమే శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం అని చెప్పి, అన్నీ సిద్ధం చేయించమని చెప్పిన మహారాజు సుమంత్రుని మరల పిలిచినప్పుడు ఆయన ఏమి జరిగి యుండునా అన్న ఆలోచనతో అక్కడికి చేరుకుని కైకేయితో కూడియున్న దశరథ మహారాజుని జాగ్రత్తగా గమనిస్తూ నిలుచున్నాదు. సుమంత్రుడు మహారాజుకి ఆంతరంగికుడు.

5.శ్లో.

వనవాసం హి సంఖ్యయ వాసాంస్యాభరణాని చ।

భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ॥

(అయోధ్యకాండ, 40.15)

భర్తను అనుసరించి వనములకు వెళ్లుచున్న సీతాదేవి కొఱకు దశరథ మహారాజు పదునాలుగు సంవత్సరముల వఱకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను, ఆభరణములను ఇచ్చి యుండెను. వాటిని సుమంత్రుడు రథముపై చేర్చెను.

6.శ్లో.

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం।

రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం॥

(అయోధ్యకాండ, 67.34)

సత్యధర్మములకు రాజే మూలస్థంభము. అతడే కులాచారములను చక్కగా ప్రవర్తిల్ల చేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వహితమును గూర్చువాడు ప్రభువే!

శ్రీ సీతారామలక్ష్మణులు వనవాసానికి వెడలిన తరువాత అయోధ్య భోరుమన్నది. దశరథ మహారాజు పుత్రునికి దూరమై స్వర్గస్థుడైనాడు. రాజ్యము రాజు లేకుండా ఉన్నది. ఆ సమయంలో అలా ఉండటానికి వీలు లేదని మార్కండేయాది ఋషులు రాజు లేకపోతే రాజ్యానికి కలుగు హాని గురించి, రాజు ఏ విధంగా అన్నింటికీ మూలస్తంభమో అనునవి అనేకములైన విషయాలను వశిష్ఠ మహామునికి వివరించు సందర్భం ఇది.

‘అరాజకం’ అన్న పదం ఇక్కడి నుండే వచ్చింది. ఒక్క క్షణమైనా సింహాసనం రాజు లేకుండా ఉండటానికి వీలు లేదు. అది రాజధర్మంలో ప్రధానమైన విషయం.

7.శ్లో.

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో కురుమ్।

ఉటజే రామ మాసీనాం జటా మండల ధారిణమ్॥

(అయోధ్యకాండ, 99.25)

..అంతట భరతుడు ఒక క్షణకాలము పాటు పర్ణశాలను పరికించి చూసి అచట పూజ్యుడును, జటామండలధారియు అగు శ్రీరాముడు ఆశీనుడై యుండగా దర్శించెను.

ఎంతో బాధలో, ఆవేదనలో, ఆరాటంలో అన్న శ్రీరాముని కలుసుకొని ఆయన పాదాల మీద ఎప్పుడు వాలిపోవాలా అని భరతుడు ఒక్కసారి ఆ పర్ణశాలను చూసినపుడు పరుగులు తీస్తాడు. భరతుడి పరిస్థితిని వర్ణించిన తీరు మన హృదయాలను ద్రవించి వేస్తుంది.

8.శ్లో.

యది బుద్ధిః కృతా ద్రష్టుమ్ అగస్త్యం తం మహామునిమ్।

అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః॥

(అరణ్యకాండ, 11.45)

శ్రీ సీతారామలక్ష్మణులు పది యేండ్లు అరణ్యంలో అనేకమంది మహర్షుల ఆశ్రమాలలో ఉంటూ గడిపిన తరువాత మరోసారి సుతీక్ష్ణుల వారి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనతో శ్రీరాముడు అగస్త్య మహాముని గురించి అడిగినప్పుడు ఆయన “మిక్కిలి ప్రశస్తి గల ఓ శ్రీరామా! ఆ అగస్త్య మహామునిని దర్శించుటకు కుతూహల పడుచున్నచో మీరు నేడే వెళ్లుటకు సిద్ధపడండి” అన్నాడు.

9.శ్లో.

భరతస్యార్య పుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో।

మృగ రూప మిదం దివ్యం విస్మయం జనయిష్యతి॥

(అరణ్యకాండ, 43.17)

సీతాదేవి బంగరు జింకను కోరుతూ శ్రీరామునితో అన్న మాట – “మీకును, భరతునకును, నాకును, నా అత్తగార్లకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము ఆశ్చర్యమును కలిగించును”.

10.శ్లో.

గచ్ఛ శీఘ్ర మితో రామ! సుగ్రీవం తం మహాబలం।

వయస్యం తం కురు క్షిప్రమ్ ఇతో గత్వాద్య రాఘవ॥

(అరణ్యకాండ, 72.17)

కబంధుని సంహరించిన తరువాత అతనికి అగ్నిసంస్కారం కావించినప్పుడు అందులోంచి ఒక దివ్యదేహం బయటకు వచ్చింది. శాపవిముక్తుడయిన కబంధుడు ఇలా పలికాడు –

“ఓ శ్రీరామా! వెంటనే ఇక్కడ నుండి బయలుదేరుము. మహా పరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుని నేడే కలసుకొని, అగ్నిసాక్షిగా ఆయనతో మైత్రి చేసికొనుము”.

సుగ్రీవుని వృత్తాంతం, అతని ప్రతిభ గురించి శ్రీరామలక్ష్మణులు కబంధుని నోట వినియున్నారు. అతను దారి చూపించాడు. వానరుడని తలపక చులకన చేయవద్దన్నాడు. సుగ్రీవుడు మహావీరుడు, కామరూపి అని వర్ణించాడు.

11.శ్లో.

దేశ కాలౌ ప్రతీక్షస్వ అద్య క్షమమాణః ప్రియాప్రియే।

సుఖ దుఃఖ సహః కాలే సుగ్రీవ వశగో భవ॥

(కిష్కింధకాండ, 22.19)

వాలి అతని చివరి క్షణాలలో కుమారుడైన అంగదునకు ఇలా చెప్పాడు – “నాయనా! నీ పినతండ్రి యగు సుగ్రీవుడు చెప్పినట్లు నడుచుకొనుము. దేశకాల పరిస్థితులను అనుసరిస్తూ సుఖములకు పొంగిపోకుండా, అప్రియములకు క్రుంగిపోకుండా సమానంగా భావిస్తూ వ్యవహరించుము”.

(వాలి వధ విషయం కిష్కింధకాండ లోని ఆణిముత్యాలను చర్చించునపుడు విపులంగా చూడగలరు).

12.శ్లో.

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తాపసా వీత కల్మషాః।

ప్రష్టవ్యా చాపి సీతాయాః ప్రవృత్తిర్వినయాన్వితైః॥

(కిష్కింధకాండ, 43.34)

సుగ్రీవుడు వానరవీరులను జట్టులుగా విభజించి నలుదిశల వైపు పంపించాడు. వాళ్ళకు సమస్త భూమండలం యొక్క భౌగోళిక పరమైన వివరాలను చెబుతాడు. ఎక్కడ ఏమి చేయాలో వివరిస్తాడు. ఆ క్రమంలో మైనాక పర్వతం గురించి చెప్పి దానిని దాటి ముందుకు సాగిన తరువాత “..ఒక పవిత్ర్రమైన ఆశ్రమం వచ్చును, దానిని సిద్ధులు సేవిస్తూ ఉంటారు, వారితో పాటు ఎందరో మునులుంటారు, వారందరు తపస్సిద్ధులు, వారిని వినయపూర్వకంగా సేవించి సీతామాత యొక్క జాడను గూర్చి అడగండి” అని చెబుతాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here