ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-20

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

166. శ్లో.

సుదుష్టత్వం వనే రామమ్ ఏకమ్ ఏకోనుగచ్ఛసి।

మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా॥

ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీ మమ।

వాక్యమ్ అప్రతిరూపం తు న చిత్రం స్త్రీషు మైథిలి॥

స్వభావస్త్వేష నారీణామ్ ఏవం లోకేషు దృశ్యతే।

విముక్తధర్మాశ్చపలాః తీక్ష్ణా భేదకరాః స్త్రియః॥

(అరణ్యకాండ, 45. 24, 28, 29)

సీత లక్ష్మణునితో: ఓ లక్ష్మణా! నీవు పూర్తిగా దుష్టుడవు. శ్రీరాముడు ఒంటరిగా వనములకు వచ్చుట చూసి నన్ను పొందాలని ఆయన వెంట వచ్చినట్లున్నావు లేదా మాకు హాని చేయాలని భరతుడు నిన్ను నియమించినట్లున్నాడు!

లక్ష్మణుడు: అమ్మా! నీవు నాకు పూజ్యురాలైన దేవతవు. ఇక నీ ముందు మాట్లాడను. స్త్రీలు ఇలా అనుచితముగా మాట్లాడుట ఆశ్చర్యం కాదు. ఇది లోక సహజము! కొన్ని సందర్భాలలో వారు వినయాది ధర్మ మార్గములు అనుసరింపరు. వారి మనస్సులు చాంచల్యమునకు లోనవును. క్రౌర్యంతో ఆప్యాయతకును, బంధుభావనకు విఘాతం కల్గిస్తారు!

167. శ్లో.

ధిక్ తామ్ అద్య ప్రణశ్య త్వం యన్మామ్ ఏవం విశంకసే।

స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితమ్॥

గమిష్యే యత్ర కాకుత్స్థః స్వస్తి తేస్తు వరాననే।

రక్షంతు త్వాం విశాలాక్షి! సమగ్రా వనదేవతాః॥

నిమిత్తాని చ ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే।

అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః న।

వేత్యేతన్న జానామి వైదేహి! జనకాత్మజే॥

(అరణ్యకాండ, 45. 32, 33, 34)

లక్ష్మణుడు: నా సహజ స్వభావమును బట్టి నేను అన్నగారి ఆజ్ఞను పాలించుటయందే నిరతుడానై యుంటిని. అలాంటి నన్ను దుష్ట స్వభావముగల సాధారణ స్త్రీ వలె శంకిస్తున్నావు. అమ్మా! పొరబడుచున్నావు. దీని వలన ఏ కీడు రానున్నదో?

శ్రీరాముని కడకు నేను బయలుదేరుచున్నాను. నీకు భద్రమగు గాక. తల్లీ! వనదేవతలందరూ నిన్ను రక్షించుదురు గాక! నాకు భయంకరమైన అపశకునములు కన్పించుచున్నవి. ఈ పరిస్థితులలో నీవు, మా అన్నయగు శ్రీరాముడు కలసియుండగా చూసే భాగ్యం నాకు కలుగునో? లేదో? నాకు తెలియడం లేదు!

సీతాదేవిని శ్రీరాముడు ‘బాల’గా పేర్కొంటాడు. ఆందోళన, ఆవేదన కలిసి ఆమె సహజమైన బాల స్వభావంతో ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది – లక్ష్మణుడు వెనువెంటనే శ్రీరాముడి సహాయం కోసం వెళ్ళాలి! అంతే. మిగతావన్నీ ఆమెకు ఆలోచించే పరిస్థితి లేదు.

45వ సర్గ చివర లక్ష్మణుడు సీత మాటలకు నొచ్చుకుని నమస్కారం చేసుకుంటూ ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటూ మనస్సును దృఢపరుచుకుని సీత వైపే చేస్తూ శ్రీరాముని సమీపమునకు బయలుదేరెను అని చెప్పబడింది.

‘లక్ష్మణరేఖ’ గురించి వాల్మీకి మహర్షి పేర్కొనలేదు. ఈ ఉదంతం వాల్మీకి రామాయణ కాలం తరువాత ఇటీవలి రచనల (13వ శకం) ద్వారా వ్యాప్తి చెందినట్లు తెలుస్తున్నది. ఉదాహరణకి తెలుగులోని ‘ద్విపద రామాయణం’. ఇందులో లక్ష్మణుడు కుటీరం చుట్టూ ఏడు రేఖలు గీసినట్లు చెప్పబడినది.

సూరదాస్ యొక్క సుర్ సాగర్‍లో కొన్ని రామాయణానికి సంబంధించిన అంశాలను పేర్కొంటూ లక్ష్మణుడు నాలుగు వైపులా కుటీరానికి రేఖలు గీసినట్లు ఉంటుంది!

168. శ్లో.

అభవ్యో రూపేణ భర్తారమనుశోచతీమ్।

అభ్యవర్తత వైదేహీం చిత్రామివ శనైశ్చరః॥

(అరణ్యకాండ, 46. 9)

పతిధ్యాసలో మునిగియున్న సీతాదేవి కడకు దుర్జనుడైన రావణుడు సాధుపురుషుని రూపములో శనిగ్రహము చిత్తా నక్షత్రమును వలె సమీపించెను.

ఇక్కడ చిత్తా నక్షత్రము అనగా తుల రాశి యని భావించవచ్చు. ఈ రాశిలో శని ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈయన రాక్షస గురువు. ఈ పోలిక చేత రాక్షస బలం ఈ సందర్భంలో అభివృద్ధి చెందినదని చేసిన వర్ణనలా కనబడుతున్నది. బాలకాండలో ఇదే పోలిక శ్రీరాముడు సిద్ధాశ్రమంలో ప్రవేశించినప్పుడు ‘చంద్రుడు పునర్వసు నక్షత్రం చేరినట్టు’ అంటాడు మహర్షి. ‘ఇది నీ ఆశ్రమం కూడా’ అని విశ్వామిత్రుడు శ్రీరామునితో పలికాడు – అది శ్రీమన్నారాయణుడు తపస్సు ఆచరించిన ఆశ్రమం కాబట్టి. కర్కాటక లగ్నం, రాశి, రెండూ శ్రీరాముని చెందినవి కాబట్టి చంద్రుడు అధిపతి కాబట్టి పునర్వసు ఆయన జన్మ నక్షత్రం కాబట్టి స్వస్థానానికి చేరుకున్నాడు శ్రీరాముడు అన్న భావన అక్కడ ఉన్నది! ఇక్కడ చిత్త కుజుని నక్షత్రం కాబట్టి శని బలం పుంజుకుని పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సూచన. ఈ సర్గ చివర ‘సమర్పయత్ స్వాత్మవధాయ రావణః’ అంటాడు! (తన మృత్యువును కొని తెచ్చుకొనుటకు..)

169. శ్లో.

తతస్త్రయోదశే వర్షే రాజామంత్రయత ప్రభుః।

అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః॥

మమ భర్తామహాతేజా వయసా పంచవింశకః।

అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే॥

త్వం పునర్జంబుకః సింహీం మామిచ్ఛసి సుదుర్లభామ్।

నాహం శక్యా త్వయా స్ప్రష్టుమ్ ఆదిత్యస్య ప్రభా యథా৷॥

(అరణ్యకాండ, 47. 5, 10, 36)

రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని ఆమె వివరములు గోరు వాడై ప్రశ్నలు వేశాడు. అప్పుడు సీతాదేవి చెప్పిన కొన్ని వివరములు:

వివాహం తరువాత అయోధ్యలో 12 సంవత్సరములున్నాము. పదమూడవ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకై ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను.

మిగుల పరాక్రమశాలి యగు నా భర్త యొక్క అప్పటి వయస్సు ఇరువది అయిదు సంవత్సరములు. నా వయసు పదునెనిమిది సంవత్సరములు.

రావణుడు తన గురించి చెప్పి లంకకు పట్టమహిషివి కాగలవు అని చెప్పాడు.

సీత: నేను ఆడ సింహమును. ఎవ్వరికీ అందను. నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు. సూర్యకాంతిని పట్టుకొనలేనట్టు నన్ను నీవు తాకజాలవు.

170. శ్లో.

వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సః।

ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా॥

తతస్తాం పరుషైర్వాక్యైః భర్త్సయన్ స మహాస్వనః।

అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తత్ తదా॥

జటాయో! పశ్య మామర్య! హ్రియమాణామ్ అనాథవత్।

అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణా॥

నైష వారయితుం శక్యః తవ క్రూరో నిశాచరః।

సత్త్వవాన్ జితకాశీ చ సాయుధశ్చైవ దుర్మతిః॥

రామాయ తు యథాతత్త్వం జటాయో! హరణం మమ।

లక్ష్మణాయ చ తత్సర్వమ్ ఆఖ్యాతవ్యమ్ అశేషతః॥

(అరణ్యకాండ, 49. 17, 20, 39, 40, 41)

రావణుడు పద్మాక్షి అయిన సీతాదేవి జుట్టును ఎడమ చేతితోను, ఆమె పాదములను కుడి చేతి తోనూ పట్టుకొనెను.

..అనంతరం పరుష వాక్యములతో భయపెట్టుచు, ఆమెను ఒడిలోనికి తీసుకొని రథంపై ఉంచెను.

(ఈ రథం మాయా రథం. గాలిలో ఎగురగా..)

..చెట్టు మీద కూర్చొని ఉన్న జటాయువుతో సీతాదేవి:

పూజ్యుడైన ఓ జటాయూ! పాపకర్ముడైన ఈ రాక్షసరాజు ఒక దిక్కులేని దాని వలె నన్ను అపహరించుకొని పోతున్నాడు. దయచూడు! ఈ రాక్షసుడు క్రూరుడు, బలశాలి, విజయగర్వంతో ఉన్నాడు. సాయుధుడు, దురాత్ముడు. ఇతనిని నీవు ఎదుర్కొనలేవు. అందుచేత నన్ను అపహరించుకొని పోవుచున్న విషయమును పూసగుచ్చినట్లు పూర్తిగా రామలక్ష్మణులకు వివరింపుము!

171. శ్లో.

దశగ్రీవ! స్థితో ధర్మే పురాణే సత్యసంశ్రయః।

జటాయుర్నామ నామ్నాహం గృధ్రరాజో మహాబలః॥

షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య రావణ।

పితృపైతామహం రాజ్యం యథావదనుతిష్ఠతః॥

వృద్ధోహం త్వం యువా ధన్వీ సశరః కవచీ రథీ।

తథాప్యాదాయ వైదేహీం కుశలీ న గమిష్యసి॥

న శక్తస్త్వం బలాద్ధర్తుం వైదేహీం మమ పశ్యతః।

హేతుభిర్న్యాయసంయుక్తైః ధ్రువాం వేదశ్రుతీమివ॥

అవశ్యం తు మయా కార్యం ప్రియం తస్య మహాత్మనః।

జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ॥

(అరణ్యకాండ, 50. 3, 19, 20, 21, 26)

జటాయువు రావణునితో:

ఓ దశగ్రీవా! నా పేరు జటాయువు, సనాతన ధర్మనును పాటించువాడను, భగవంతుడిని నమ్మినవాడను. నేను బలశాలియైన గ్రద్దను!

నా వయస్సు అరువది వేల సంవత్సరములు. తాత ముత్తాతల నుంచి వచ్చిన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తున్నాను. వృద్ధుడను, ధనుర్బాణాలు లేని వాడను. నీవు యువకుడవు (జటాయువు కంటే చాలా చిన్నవాడు), ఆయుధములు, కవచము, రథం కలిగియున్నావు. ఐనప్పటికీ నేనుండగా వైదేహిని దీసికొని క్షేమంగా వెళ్ళజాలవు.

వేదము పరమ ప్రమాణమైనది. న్యాయ సమ్మతమైన హేతువుల చేత దాని ప్రామాణ్యం నిరూపింపబడినది. వేదమును ఎవ్వరునూ నిరాకరింపజాలరు. అట్లే నేను చూచుచుండగా సీతాదేవిని బలవంతంగా అపహరించుకుని వెళ్ళజాలవు!

172. శ్లో.

నిమిత్తం లక్షణజ్ఞానం శకునిస్వరదర్శనమ్।

అవశ్యం సుఖదుఃఖేషు నరాణాం ప్రతిదృశ్యతే॥

ప్రహృష్టా వ్యథితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః।

దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః।

రావణస్య వినాశం చ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా॥

ఉత్పన్నవాతాభిహతా నానాద్విజగణాయుతాః।

మాభైరితి విధూతాగ్రా వ్యాజహ్రురివ పాదపాః॥

(అరణ్యకాండ, 52. 4, 14, 36)

రెండు గంటల సేపు భీకరమైన పోరాటం సలిపి జటాయువు క్రింద పడ్డాడు. పక్షులన్నీ అటూ ఇటూ పరుగులు తీసాయి, ఎగురసాగాయి. సీతాదేవి జటాయువును అక్కున జేర్చుకుని ఇలా ఏడ్చింది –

కన్నులు అదురుట, పక్షుల యొక్క కూతలు వినబడుత్ మొదలగు శకునములు మనుష్యులకు కలుగనున్న సుఖదుఃఖములను సూచిస్తాయి.. ఓ రామా! ఈ శకునములను చూసి ఏమీ గ్రహించుట లేదా..!

ఈ లోపల దివ్యదృష్టితో బ్రహ్మదేవుడు తెలుసుకుని ‘శ్రీమహా విష్ణువు గతంలో దేవతలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం త్వరలో రావణ వినాశనం కలుగనున్నదని ఎరిగినాడు. మహర్షులు ముందర కలత చెందినప్పటికీ తరువాత సంతోషింపసాగిరి..’

సీతాదేవిని తీసుకొని రావణుడు ఆకాశంలో (రథంలో) ఎగిరాడు.

ఇక్కడ మహర్షి వర్ణన గమనార్హం –

ఆ గమన వేగము వలన ఏర్పడిన ఉత్పాత సూచకములగు గాలుల యొక్క తాకిడికి చెట్ల పై భాగములు కదులుతున్నాయి. అక్కడ పలు రకాల పక్షులు కోలాహలం చేస్తున్నాయి.

ఆ వృక్షములు తమ శిరః కంపనములతో, పక్షుల కలవరములతో ‘భయపడకుము’ – అని సీతాదేవికి అభయము నిచ్చునట్లు ఉండెను!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here