ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-22

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

177. శ్లో.

చంద్రే లక్ష్మీః ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమా।

ఏతచ్చ నియతం సర్వం త్వయి చానుత్తమం యశః॥

యేన రాజన్! హృతా సీతా తమన్వేషితుమర్హసి।

మద్ద్వితీయో ధనుష్పాణిః సహాయైః పరమర్షిభిః॥

సముద్రం చ విచేష్యామః పర్వతాంశ్చ వనాని చ।

గుహాశ్చ వివిధా ఘోరా నదీః పద్మవనాని చ॥

దేవగంధర్వలోకాంశ్చ విచేష్యామః సమాహితాః।

యావన్నాధిగమిష్యామః తవ భార్యాపహారిణమ్॥

న చేత్ సామ్నా ప్రదాస్యంతి పత్నీం తే త్రిదశేశ్వరాః।

కోసలేంద్ర! తతః పశ్చాత్ ప్రాప్తకాలం కరిష్యసి॥

శీలేన సామ్నా వినయేన సీతాం

నయేన న ప్రాప్స్యసి చేన్నరేంద్ర్ర।

తతః సముత్సాదయ హేమపుంజై

మహేంద్రవజ్రప్రతిమైః శరౌఘైః॥

(అరణ్యకాండ, 65. 5, 12-16)

శ్రీరాముని ఆగ్రహం గమనించి లక్ష్మణుడు చెప్పిన మాటలను పరిశీలిద్దాం:

సీతాదేవిని అపహరించిన దుష్టుని అన్వేషించుటకై నీవు ధనుర్ధారివై సిద్ధపడుము. నేను నీకు తోడు. తపస్సంపున్నులైన మహర్షులు మనకు సహాయపడుతారు. సీతాదేవిని కనుగొనవరకును సముద్రమును, పర్వతములను, అరణ్యములను, వివిధ గుహలను, నదులను, పద్మసరస్సులను, దేవ గంధర్వ లోకములను దీక్షతో గాలిద్దాం.

ఓ కోసల ప్రభూ! దేవతలు సామోపాయముచే నీ ప్రేమ పెన్నిధిని నీకు అప్పగించనిచో అప్పుడు నీవు సమయోచితముగా తగిన కార్యములను నిర్వహింపవచ్చును.

ఓ నరేంద్రా! సత్స్వభావముచే, సామోపాయముతో, వినయముతో న్యాయమార్గమున ప్రయత్నించినప్పటికినీ సీత జాడ తెలియనిచో అప్పుడు నీవు బంగారు పిడులు గలిగి, ఇంద్రుని వజ్రాయుధముతో తుల్యమైన శరములను వర్షించి సమస్త లోకములను రూపుమాపవచ్చును!

..ఇక్కడ ఒక అంతర్లీనమైన సందేశం మహర్షి మనకు ఇస్తున్నాడు – సుగ్రీవుడు, ఆంజనేయుడు ఇత్యాదులు శ్రీరాముని ధర్మనిరతికి, ధర్మకార్యానికి సహాయపడుటకు పరమేశ్వరుడు నియోగించినాడు! ధర్మబద్ధులను ఈ విధంగా దైవం ఆశీర్వదిస్తుందన్నది సారాంశం!

178. శ్లో.

యేన యాతో ముహూర్తేన సీతామ్ ఆదాయ రావణః।

విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామీ ప్రతిపద్యతే॥

విందో నామ ముహూర్తోయం స చ కాకుత్స్థ! నాబుధత్।

త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వరః।

ఝషవద్బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి॥

(అరణ్యకాండ, 68. 12-13)

జటాయువు: రావణుడు సీతను అపహరించుకొని పోయిన ముహూర్తమును బట్టి, నీకు కనబడకుండా పోయిన సీతారూపధనము యజమానివైన నీకు మరల త్వరలోనే లభించును. ఇది నిశ్చయము. రావణుడు నీ ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని అపహరించుకొని పోయిన సమయము ‘వింద’ ముహూర్త కాలము. ఆ విషయము అతనికి తెలియదు. ఆ ముహూర్తము అతనికి మరణాంతకము. కనుక అతడు గాలమునకు చిక్కుకొనిన చేప వలె వెంటనే నశించిపోవుట నిజము!

..కొందరు రావణుడు గొప్ప జ్యోతిష విద్వాంసుడని, చివరకు శ్రీరాముడు యుద్ధానికి అతని వద్ద ముహూర్తం పెట్టించుకున్నాడని వ్యర్థపు మాటలు మాట్లాడుతారు! ఇది ఎంత హాస్యాస్పదమో ఇక్కడ స్పష్టమగుచున్నది!

శ్లో.

ప్రతిలభ్య చ కాకుత్స్థ! పితృపైతామహీం మహీమ్।

తత్ర మాం రామ! రాజ్యస్థః స్మర్తుమర్హసి సర్వదా॥

(అరణ్యకాండ, 69. 41)

కబంధుని చేతిలో చిక్కిన తరువాత లక్ష్మణుడు శ్రీరామునితో – ఓ రామా! తాతముత్తాతల నుండి మనకు సంక్రమించిన కోసల రాజ్యాధికారమును నీవు తిరిగి పొందుము! ఆ రాజ్యపాలనలో మునిగిపోయినను నన్ను మాత్రము ఎల్లప్పుడును గుర్తుంచుకొనుము! (లక్ష్మణుడు తనను ఆ విచిత్రమైన రాక్షసునికి ఆహారం అయి శ్రీరాముని బయటపడడానికి యోచన చేస్తాడు!)

శ్లో.

తేన సఖ్యం చ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవ।

కల్పయిష్యతి తే ప్రీతః సహాయ్యం లఘువిక్రమః॥

న హి తస్యాస్త్యవిజ్ఞాతం త్రిషు లేకేషు రాఘవ।

సర్వాన్ పరిసృతో లోకాన్ పురాసౌ కారణాంతరే॥

(అరణ్యకాండ, 71. 32, 33)

రామ! షడ్యుక్తయో లోకే యాభిః సర్వం విమృశ్యతే।

పరిమృష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే॥

(అరణ్యకాండ, 72. 8)

కబంధుడు శ్రీరామునితో:

న్యాయవర్తనుడై మాటకు కట్టుబడి యుండు వానితో మీరు సఖ్యము చేయవలసి యున్నది. అట్టి వాడు సద్యఃస్ఫూర్తితో తన పరాక్రమము చూపి, సంతోషముగా మీకు తోడ్పడగలడు. అతనికి ఈ ముల్లోకములలో తెలియని విషయమే లేదు. ఏదో కారణము వలన అతను సమస్త లోకములను తిరిగి వచ్చెను (సుగ్రీవుడు).

ఓ ప్రభూ! లోకమున సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, సమాశ్రయము – అను ఆరు ఉపాయముల ద్వారా సమస్త కార్యములు సాధ్యములగును.

శ్లో.

తేషాం గతానాం అద్యాపి దృశ్యతే పరిచారిణీ।

శ్రమణీ శబరీ నామ కాకుత్స్థ! చిరజీవినీ॥

(అరణ్యకాండ, 73. 25)

కబంధుడు శ్రీరామునితో:

ఓ కాకుత్స్థ! మతంగ మహర్షి శిష్యులందరూ వెళ్ళిపోయిననూ వారికి సేవలు చేయుచుండెడి ఒక సన్యాసిని మాత్రము నేటికిని అచటనే యున్నది. ‘శబరి’ అను పేరుతో ప్రసిద్ధికెక్కినా అమె దీర్ఘాయువు.

శ్లో.

తౌ చ దృష్ట్వా తదా సిద్ధా సముత్థాయ కృతాంజలిః।

రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః।

పాద్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యథావిధి॥

తామువాచ తతో రామః శ్రమణీం సంశితవ్రతామ్।

కచ్చిత్ తే నిర్జితా విఘ్నాః! కచ్చిత్ తే వర్ధతే తపః।

కచ్చిత్ తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే॥

(అరణ్యకాండ, 74. 6, 7, 8)

యోగసిద్ధిని పొందిన ఆ శబరి రామలక్ష్మణులను గాంచి, లేచి కృతాంజలియై, వారికి పాదాభివందన మొనర్చెను. తరువాత ఆమె వారికి అర్ఘ్యపాదాదులతో యథావిధిగా అతిథి మర్యాదలను కావించెను.

శ్రీరాముడు: ఓ తపస్సంపన్నురాలా! నీ తపోవిధులు ఎట్టి ఆటంకములు లేకుండా వర్ధిల్లుచున్నవి గదా? కామక్రోధాదులు నీ దరి చేరుట లేదు గదా! నీ ఆహారాది నియమములకు భంగము వాటిల్లుట లేదు కదా?

రెండు విషయములు: 1. శబరి ఎంగిలి యనునది వాల్మీకి రామాయణంలో లేనిది. యథావిధి అన్నది అతిథి సత్కారం చేయు విధి. తపస్సంపన్నురాలైన ఆమె ఆ విధంగా అతిథి సత్కారం (ఎంగిలి వ్యవహారం) చేయటం అసందర్భం, హాస్యాస్పదం కూదాను. ఇది కవుల కల్పన మాత్రమే. 2. శ్రీరాముడు తపస్సంపనులను గూర్చి అడుగు ప్రశ్నలు గమనార్హం – కామక్రోధాలు దరి చేరుట లేదు కదా? ఆహారాది నియమములకు భంగము వాటిల్లుట లేదు కదా?!

శ్లో.

పశ్య మేఘఘనప్రఖ్యం మృగపక్షిసమాకులమ్।

మతంగవనమిత్యేవ విశ్రుతం రఘునందన॥

ఇహ తే భావితాత్మానో గురవో మే మహావనే।

జుహవాంచక్రిరే తీర్థం మంత్రవన్మంత్ర పూజితమ్॥

(అరణ్యకాండ, 74. 21, 22)

శబరి: ఓ రఘువీరా! దట్టమైన మేఘ సముదాయము వలె ఒప్పుచు మృగములతో, పక్షులతో నిండియున్న ఈ వనమును చూడుము. ఇది ‘మతంగ వనము’గా ప్రసిద్ధి గాంచినది. సర్వదా పరమాత్మ ధ్యానమునందే నిరతులై యుండెడి మా గురువులు మంత్రపూతములైన గంగానదీ జలములను ఆహ్వానించి ఈ పంపా సరోవరమును రూపొందించిరి.

శ్లో.

అశక్నువద్భిస్తైర్గంతుమ్ ఉపవాసశ్రమాలసైః।

చింతితే భ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్॥

తామువాచ తతో రామః శ్రమణీం సంశిత వ్రతామ్।

అర్చితోహం త్వయా భక్త్యా గచ్ఛకామం యథాసుఖమ్॥

(అరణ్యకాండ, 74. 25, 31)

శబరి: ఏడు సముద్రాల జలములు కలిసిన ఈ తీర్థమును గాంచుము. దీనిని ‘సప్తసాగర తీర్థము’ అని పిలుతురు.

(అనంతరము ఆమె పరంధామమును చేరుటకు అనుమతి కోరినది. శ్రీరామలక్ష్మణులు ఆ ఆశ్రమానికి రాగలరని ముందరే గురువుల నుండి విని ఒంటరిగా నిరీక్షిస్తూ ఉన్నది).

శ్రీరాముడు: ఓ శబరీ! భక్తితో నీవొనర్చిన పూజలకు నేను ఎంతయో సంతసించితిని. నీ ఇష్టానుసారము హాయిగా వెళ్లుము.

శ్లో.

సప్తానాం చ సముద్రాణామ్ ఏషు తీర్థేషు లక్ష్మణ!।

ఉపస్పృష్టం చ విధివత్ పితరశ్చాపి తర్పితాః॥

ప్రణష్టమ్ అశుభం తత్తత్ కల్యాణం సముపస్థితమ్।

తేన తత్త్వేన హృష్టం మే మనో లక్ష్మణ! సంప్రతి॥

హృదయే హి నరవ్యాఘ్ర! శుభమావిర్భవిష్యతి॥

(అరణ్యకాండ, 75. 4, 5, 6)

శ్రీరాముడు: ఓ లక్ష్మణా! ఇచటి సప్తసాగర తీర్థములలో స్నానములనొనర్చి, పితృదేవతలకు విధ్యుక్తముగా తర్పణములను ఆచరించినాము. అందువలన మన అశుభములన్నియును నశించినవి. శుభములు కలుగనున్నవి. ఆ కారణము వలన ఇప్పుడు నా మనస్సు మిగుల ఊరట చెందినది. ఓ నరశ్రేష్ఠా! నా హృదయమున శుభ సూచకములైన సంకల్పములు కలుగుచున్నవి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here