ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-26

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

కిష్కింధకాండ లోని ప్రధానాంశాలు:

  1. హనుమంతుని ప్రవేశం
  2. శ్రీరామ సుగ్రీవ మైత్రి
  3. వాలి వధ
  4. జాంబవంతుడు హనుమంతుని స్తుతించటం
  5. సముద్ర లంఘనానికి ఆంజనేయుడు పూనుకోవటం

కావ్యనాయకుని బేలతనాన్ని చూసి (సీతాదేవి దూరమైనందులకు) ఆయన సార్వభౌమత్వాన్ని, అమితమైన పరాక్రమాన్ని విస్మరించటం మనం చూసాం.

తమ్ముని భార్యను చెరబట్టి అతన్ని రాజ్యం లోంచి బహిష్కరించటం అనే అధర్మానికి సూటిగా బాణం వేసి మరణశిక్షను (వధించటం) విధించిన శ్రీరామునికి చెట్టుచాటు వ్యవహారం కొందరు ఆపాదించటం మనం చూస్తాం. మహర్షి ఈ దూరదృష్టితోనే వాలి వధ ముందర సుగ్రీవుడు రెండు పద్ధతులలో శ్రీరాముని బలాన్ని పరీక్షించటం చూపించాడు.. వాలికి, శ్రీరామునికి బల పరాక్రమాలలో పోలిక!

వాలిని పిలిపించి శ్రీరాముడు సుగ్రీవుని భార్యను సుగ్రీవునికి అప్పజెప్పమని చెప్పటం సందర్భోచితం కాదు. వాలి ఆచరించిన అధర్మానికి అతన్ని వధించటమే విధానం. మరొకటి లేదు. ఈ మాట శ్రీరాముడు వాలికే స్పష్టం చేసి యున్నాడు. ఆ మార్గంలో వెళ్ళాలంటే సుగ్రీవునికి, వాలికి మధ్య యుద్ధం అనివార్యమైనది. ఈ నేపథ్యంలో రెండు అంశాలు ముందుకు వస్తున్నాయి. మొదటిది – ఇన్ని సంవత్సరముల తరువాత తమ్ముడు మరల వచ్చినప్పుడు అన్న మనసు మార్చుకున్నాడా? లేదు. గతంలో కూడా తమ్ముని చంపే ప్రయత్నమే చేసాడు. సుగ్రీవుడు ఋష్యమూకం మీద తల దాచుకున్నాడన్నది సత్యం. లేకపోతే అన్న చేతిలో మరణించే పరిస్థితి యున్నది. శ్రీరామ లక్ష్మణులు అటు వచ్చినపుడు వాలియే పంపాడని కూడా భయపడ్డాడు సుగ్రీవుడు.

మొదటిసారి తలపడ్డప్పుడు ప్రాణాలను మిగుల్చుకుని పారిపోయి వచ్చాడు సుగ్రీవుడు. ఇక్కడ నాటకీయత దాగియున్నట్లు కనిపిస్తుంది. వాలికి పరోక్షంగానే ఒక అవకాశం శ్రీరాముడు కల్పించాడా అనే ఆలోచన వస్తుంది! పునశ్చరణ చేయలేదు వాలి. తార వారించినప్పటికీ, శ్రీరామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి యున్నారని చెప్పినప్పటికీ, సుగ్రీవుని వధించాలనే నిర్ణయించుకొని దర్పంతో మరల తలపడ్డాడు.

‘ఎదురుగా వచ్చినా, చాటుగా నిలబడ్డా నిన్ను వధించటం అనివార్యం. తద్వారా పాలకునిగా నాకు పాపం అంటదు, నీకునూ పాపవిముక్తి కలిగింది’ అని శ్రీరాముడు చాలా వివరంగా వాలికి చెప్పటం మనం చూసాం. దానికి వాలి పూర్తిగా అంగీకరించటం కూడా మనం చూసాం. శ్రీరామునిలో దోషం లేదని సూటిగా చెప్పాడు వాలి.

తమ్ముని భార్యను చెరపట్టి అతన్ని రాజ్యం నుండి బహిష్కరించటం వలన నీకు ఈ దుఃస్థితి పట్టినదని తార విలపిస్తూ చెప్పటం కూడా గమనార్హం.

దీనిని పూర్తిగా అవహాగన చేసుకున్న వాలి సుగ్రీవునితో ‘శ్రీరాముని ఆజ్ఞను పాటించు. ఆలా చేయనిచో అది అధర్మం కాగలదు. అలా జరిగితే శ్రీరాముడు నిన్ను శిక్షించగలడు’ అని చెప్పటంలో గూఢార్థం ఉన్నది. ‘ఇక్ష్వాకూణాం ఇయం భూమిః’ అని చెప్పిన శ్రీరాముని సార్వభౌమత్వం ఆయన భార్యను అన్వేషించు నిమిత్తం సహాయం కోరినందుకు ఏ విధంగానూ దెబ్బతినదు, ఆయన అసహాయ శూరుడు, కనులకు కనిపిస్తున్న దానిని బట్టి తక్కువగా అంచనా వేయవలదన్నది వాలి చెబుతున్న విషయం.

ఈ శిక్షించే క్రమంలోనే రావణ వధ కూడా జరిగింది! రావణునితో సీతాదేవి ఇప్పటికైనా మించిపోయినది లేదు. శ్రీరామునికి మ్రొక్కి శరణు వేడితే నిన్ను ఆయన వదిలివేస్తాడు అని చెప్పటం మనం చూస్తాం. తార వారించినప్పుడు శ్రీరాముని వద్దకు వచ్చి పశ్చాత్తాపపడి వాలి శరణంటే వదిలేనేమో! ఆ అవకాశం పరోక్షంగా శ్రీరాముడు ఇచ్చినట్లే కదా?!

‘నేను ఇంకొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు చాటుగా వేటాడావు’ అన్నాడు వాలి.

వాలితో యుద్ధం శ్రీరామునికి అసందర్భం. బలబలాల విషయానికి వస్తే ద్వంద్వయుద్ధం మరింత అసహజం. బాలకాండలో పరశురాముడు వైష్ణవ ధనువును ఎక్కుపెడితే ద్వంద్వయుద్ధానికి అవకాశాన్నిస్తానన్నాడు. ఆ అవకాశంతో పనే లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. ద్వంద్వ యుద్ధానికి గల నేపథ్యం అంత గొప్పగా ఉంటుంది. దానికి ఒక యోగ్యత అనేది ఉంటుంది.

కాంచనమాల గురించి మహర్షి కేవలం వర్ణనప్రాయంగా ఎక్కువ చెప్పినట్లు కనిపిస్తుంది. ఆ మాలను సుగ్రీవునికి ఇస్తూ ‘ఉదారా, శ్రీ స్థితా’ అని మాత్రమే వాలి చెప్పాడు. ఈ మాలకి ఎదుట పోరాడుతున్న వారి శక్తిలో సగం హరించే మహిమ ఉన్నట్లు వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదు. అదే నిజమైతే సుగ్రీవుడికి కూడా ఆ విషయం తెలిసే ఉండవచ్చు. ఆ పక్షంలో సుగ్రీవుడు వాలితో ఎందుకు తలపడాలి, లేదా ఆ సంగతి శ్రీరాముడికి చెప్పాలి. అదలా ఉంచి ఒకవేళ అదే నిజమైతే, శ్రీరాముడు ఆ మాలను ఒక్క బాణంతో తీసేసి యుద్ధం చేయవచ్చు (చేయాలనుకుంటే!). బాలకాండలో విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులకు బల, అతిబల అనే అస్త్రాలతో పాటు ‘తేజప్రభ’ అఏ అస్త్రం కూడా ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఎదుటివారి పూర్తి శక్తిని హరించ వచ్చును. అందుచేత ఈ మాలకు ఏదైనా ప్రభావం ఉంటే దానికి భయపడి ఎదురుగా యుద్ధం చేయలేదన్న ఆలోచన సరైనది కాదు. ఈ మాల ధరించిన సుగ్రీవుడు ఒక్కడే రావణునితో తలపడతాడు. కానీ అదేమీ అటువంటి ప్రభావం చూపలేదు. రావణుని చేతిలో చిక్కబోతున్నాడు అనుకున్నప్పుడు తెలివిగా తప్పించుకుని వెనక్కి వచ్చేసాడు సుగ్రీవుడు!

ఇటువంటి అస్త్రాలు, వరాలు చాలా ఉండవచ్చు. అయినప్పటికీ యుద్ధం యుద్ధమే!

రాజధర్మ పరిపాలనలో ఒక వానర వీరునికి మరణ దండన విధించి సూటిగా గుండెలోకి పంపించాడు శ్రీరాముడు తన బాణాన్ని!

అడవులలో వాలికి ఎందరో శత్రువులుండవచ్చు గాక! చాటుగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఉండవచ్చును కూడా! సూటిగా కొట్టబడినా, చాటుగా కొట్టబడినా కేవలం ఒక్క బాణానికి సూటిగా స్వర్గం చేరిన వాలి శ్రీరాముని ముందు ఏమంత బలశాలి అన్న ఆలోచన కూడా రావచ్చును. వాలి వధను సత్యం, ధర్మం అనే విషయాలతో వివరించవలసి యుంటుంది కానీ కాంచనమాల వంటి పిచ్చి పిచ్చి అంశాలను జోడించి శ్రీరాముని చులకన చేయటం సరైన పని కాదు. తన సంవాదంలో శ్రీరాముడు ఆయన అంతరాత్మ గురించి ప్రస్తావించినప్పుడు ‘ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి’ అన్న వేదవాక్కులు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నేను అంతఃకరణతో రాజధర్మాన్ని పాటించానని చెప్పటమే ఇది. దీనికి కొందరు ‘అంతరాత్మ పిలుపు’ అని సూర్యోపాసనకు ముడిపెట్టి వివరించే ప్రయత్నం చేసారు. నా అంతరాత్మకు ఇలా అనిపించింది, వారి అంతరాత్మకు అలా అనిపించింది అని చెప్పి ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చా అనే ప్రశ్న ఎదురవుతుంది. అది హాస్యాస్పదంగా ఉంటుంది!

‘సర్వం ప్రియం భవతి’ అనునది శ్రీరాముడే తేల్చాడు – నీవూ పరిశుద్ధుడవైనావు, నేను ఈ వధతో పాపిని దండింపలేనందుకు ప్రాప్తించే పాపం నుండీ విముక్తుడనైనానని మనుస్మృతి లోని కథను కూడా ఉదహరించాడు శ్రీరాముడు!

ఈ ఘట్టంలో రాజధర్మాన్ని వివరించాలి. మరొకటేది చెప్పినా కావ్యలక్షణాన్నీ, శ్రీరామతత్వాన్నీ భిన్నం చేసినవారవుతారు!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here