ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-29

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

ప్రణిపాతప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా।

అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్॥

(సుందరకాండ, 27. 46)

త్రిజట: ఓ రక్కసులారా! జనక సుతయైన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రముననే ఈమె ప్రసన్నురాలగును. ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామయురాలైన ఈమెయే సమర్థురాలు!

శ్లో.

అర్థసిద్ధిం తు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితామ్।

రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ॥

నిమిత్తభూతమేతత్తు శ్రోతుమస్యా మహత్ప్రియమ్।

దృశ్యతే చ స్ఫురచ్చక్షుః పద్మపత్రమివాయతమ్॥

పక్షీ చ శాఖానిలయం ప్రవిష్టః పునః పునశ్చోత్తమసాంత్వవాదీ।

సుస్వాగతాం వాచముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః॥

(సుందరకాండ, 27. 49, 50, 53, 54)

నా స్వప్నమున విమాన దర్శనము అగుటను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు, రావణునికి వినాశనమూ, శ్రీరామునికి విజయమూ, తప్పక కల్గి తీరునని నాకు తోచుచున్నది.

పద్మపత్రము వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుట ఒక శుభ శకునము. దీనిని బట్టి త్వరలోనే ‘ఈమె ఒక శుభవార్త వినబోతున్నద’ని ఇది సూచించుచున్నది.

ఒక పక్షి చెట్టుకొమ్మ పై నున్న గూటిలోకి ప్రవేశించి, మాటిమాటికీ మధురముగా కూయుచున్నది. ఆ కూజితము “సీతా! నీవు భయపడకుము. శ్రీరాముడు నీ యెదుటనే ఉన్నాడు. ఆయనకు ‘సుస్వాగతం’ అని స్వాగత వచనములను పలుకుము” అని ఊరడించుచూ, సంతోషముతో సీతాదేవికి ఉత్సాహము కలిగించునట్లున్నది.

శ్లో.

తతస్సా హ్రీమతీ బాలా భర్తుర్విజయ హర్షితా।

అనోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివః॥

(సుందరకాండ, 27. 54)

ఆ మాటలు విని సీతాదేవి తన భర్తకు విజయము సిద్ధించునని ఎరిగి, సంతసించి, స్త్రీకి సహజాలంకారమైన బిడియముతో ఇట్లనెను – త్రిజట చెప్పిన స్వప్న విశేషాలు నిజమైనచో మీ అందరికిని శరణమును (అభయమును) ఒసగెదను!

..ఆంజనేయుడు సీతాదేవిని బాధించిన రాక్షస స్త్రీలను వధించుటకు ముందరికి వచ్చినప్పుడు సీతాదేవి వారిస్తుంది – వాళ్ళు రావణుని ఆజ్ఞను పాలించారు. అంత మాత్రము చేత వారిని వధించుట సమంజసం కాదని చెబుతుంది! ఇప్పటికే సీతాదేవి అభయం ఇచ్చేసింది – ఒక స్వప్నం గురించి విన్నందుకే.. శరణాగత రక్షకుడు అనిపించిన శ్రీరాముడు సీతాదేవి కరుణను గని ఏమి సమాధానం చెబుతాడు?

శ్లో.

యుక్తం తస్యాప్రమేయస్య సర్వసత్త్వదయావతః।

సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనకాంక్షిణీమ్॥

మయా చ స మహాబాహుః పూర్ణచంద్రనిభాననః।

సమాశ్యాసయితుం న్యాయ్యః సీతాదర్శనలాలసః॥

యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్।

రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి।

వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణమ్॥

అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్।

మయా సాంత్వయితుం శక్యా నాన్యథేయమనిందితా॥

సేయమాలోక్య మే రూపం జానకీ భాషితం తథా।

రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి॥

కథం ను ఖలు వాక్యం మే శృణుయాన్నోద్విజేత వా।

ఇతి సంచిత్య హనుమాన్ చకార మతిమాన్ మతిమ్॥

రామమక్లిష్టకర్మాణం సుబంధుమనుకీర్తయన్।

నైనాముద్వేజయిష్యామి స్వబంధుగతమానసామ్॥

(సుందరకాండ, 30. 6, 10, 18, 19, 20, 40, 41)

సమస్త ప్రాణులపై దయ చూపువాడును, అపరిమితములైన బలపరాక్రమములు గలవాడును ఐన ఆ శ్రీరామునకు భార్య యగు సీతాదేవి తన పతి దర్శనముకై ఆరాటపడుచున్నది. ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును.

ఆజానుబాహువు, చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు, సీతాదేవిని గాంచుటకై తహతహలాడుచున్నవాడు అగు ఆ శ్రీరాముని గూడ నేను ఓదార్చుట న్యాయము, సముచితము.

నేను ద్విజుని వలె సంస్కృతమునందు మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణునిగా తలంచి భయపడును. ‘ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృతములో మాట్లాడుట ఎట్లు సంభవము?’ అని సీతాదేవి సందేహపడవచ్చును.

నేను సరియైన రీతిలో సామన్య మనుష్య భాషలో అర్థవంతముగా మాట్లాడుటయే యుక్తము.

అట్లు కానిచో ‘అన్నెం పున్నెం’ ఎరుగని ఈమెను అనునయించుట ఎలాగ?

ఇంతకు ముందే రాక్షసుల వలన ఈమె భయకంపితయై యున్నది. ఇప్పుడు నా వానర రూపము జూచి, నా మానవ భాషను బట్టి, ఈమె ఇంకను భీతిల్లగలదు.

‘సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండునట్లుగా ఈమెకు నా మాటలను ఎట్లు వినిపింపవలెను?’ అని ఆలోచించి, ప్రజ్ఞాశాలియైన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చాడు.

శ్రీరాముడు ఎట్టి క్లిష్ట కార్యమునైనను అవలీలగా నెరవేర్చువాడు. ఆయన నాకు స్వామి. ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమై యున్నది. కావున ఆయనను కీర్తించుచు ఈమె భయ సందేహములకు లోనుకాకుండా చూస్తాను (కంటబడకుండా శ్రీరామ గుణకీర్తనము గావించుచు ఈమెను ప్రసన్నురాలిగా చేసుకుంటాను).

శ్లో.

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా।

రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః॥

(సుందరకాండ, 31. 7)

ఆంజనేయుడు శ్రీరామ కథను ఆశ్రయించి సీతాదేవిని ఓదార్చటం అద్భుతం. రామకథ అంత గొప్పది.

శ్రీరాముడు స్వధర్మమును పాటించువాడు, ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకును, సమస్త ధర్మములకును సంరక్షకుడు, పరంతపుడు!

శ్లో.

అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతమ్।

అస్యా హేతోర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ ప్లుతః॥

(సుందరకాండ, 31. 14)

సంపాతి సూచన మేరకు నేను విశాలాక్షి యగు ఆ సీతాదేవి నిమిత్తమై నూరు యోజనములు పొడవు గల మహాసముద్రమును వేగముగా లంఘించితిని!

శ్లో.

సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తాత్

నిరీక్షమాణా తమచింత్యబుద్ధిమ్।

దదర్శ పింగాధిపతేరమాత్యం

వాతాత్మజం సూర్యమివోదయస్థమ్॥

(సుందరకాండ, 31. 19)

సీతాదేవి నలుప్రక్కలను, పై భాగములను, అలాగే క్రిందను పరిశీలించెను. అప్పుడు ఆమె బుద్ధిశాలియు, సుగ్రీవుని సచివుడును, ఉదయాద్రిపై బాలభానుని వలె శోభిల్లుచున్నవాడును అగు మారుతిని గాంచెను.

శ్లో.

స్వప్నే మయాయం వికృతోద్య దృష్టః

శాఖామృగశ్శాస్త్రగణైర్నిషిద్ధః।

స్వస్త్యస్తు రామాయ స లక్ష్మణాయ

తథా పితుర్మే జనకస్య రాజ్ఞః॥

స్వప్నోపి నాయం నహి మేస్తి నిద్రా

శోకేన దుఃఖేన చ పీడితాయాః।

సుఖం హి మే నాస్తి యతోస్మి హీనా

తేనేందుపూర్ణప్రతిమాననేన॥

రామేతి రామేతి సదైవ బుద్ధ్యా

విచింత్య వాచా బ్రువతీ తమేవ।

తస్యానురూపాం చ కథాం తదర్థమ్

ఏవం ప్రపశ్యామి తథా శృణోమి॥

అహం హి తస్యాద్య మనోభవేన

సంపీడితా తద్గతసర్వభావా।

విచింతయంతీ సతతం తమేవ

తమేవ పశ్యామి తథా శృణోమి॥

మనోరథస్స్యాదితి చింతయామి

తథాపి బుద్ధ్యా చ వితర్కయామి।

కిం కారణం తస్య హి నాస్తి రూపం

సువ్యక్తరూపశ్చ వదత్యయం మామ్॥

నమోస్తు వాచస్పతయే సవజ్రిణే

స్వయంభువే చైవ హుతాశనాయ చ।

అనేన చోక్తం యదిదం మమాగ్రతో

వనౌకసా తచ్ఛ తథాస్తు నాన్యథా॥

(సుందరకాండ, 32. 9-14)

సీతాదేవి దీనిని కల అనుకున్నది.. ‘స్వప్నమున వానరమును జూచుట మంచిది కాదు’ అని శాస్త్రములు తెలుపుచున్నవి! శ్రీరామునకు, లక్ష్మణునకు, మా తండ్రియైన జనక మహారాజునకును శుభములు కలుగు గాక

పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగా వున్న నాకు సుఖమే లేదు. శోకపీడితురాలినైన నాకు నిద్రయే పట్టుట లేదు కదా! ఇక స్వప్నము ఎలా వచ్చును? కనుక ఇది కల ఏ మాత్రమూ కాదు.

నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరించుచు ‘రామా! రామా!’ అని పల్కుచుంటిని. ఆ కారణమున తదనురూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను. ఆయన రూపమునే చూచుచున్నాను.

శ్రీరాముని విరహముతో బాధపడుచున్నాను. మనస్సంతా రాముడే నిండియున్నాడు.

నిత్యం ఆయన ఆలోచనలలోనే ఉన్నందున ఆయన రూపమునే చూస్తున్నాను. బహుశః ఇది నా మనోరథమే కావచ్చును. జాగ్రత్తగా ఆలోచిస్తే మనోరథం కాదు. మనోరథానికి రూపం ఉండదు కదా? ఈ వానరుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను.

బృహస్పతికి నమస్కారములు. మహేంద్రునకు ప్రణతులు. బ్రహ్మదేవునికి నమస్కారములు. అగ్నిదేవునికి వందనములు. ఈ వానరుడు నా ముందర పలికిన వచనములు తథ్యములగు గాక! అన్యథా కాకుండు గాక!

(సీతాదేవి స్మరించుకొన్న వారిని గమనించండి! ఆవిడ తనలో తాను చేసుకున్న తర్కం కూడా ఆసక్తికరమైనది! ఇటువంటి పరిస్థితులలో ఇలాంటి అన్వయం ఎంతో అవసరం!).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here