ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-31

0
15

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

క్షిప్రమేష్యతి కాకుత్స్థో హార్యృక్షప్రవరైర్వృతః।

యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి॥

న హి పశ్యామి మర్త్యేషు నా సురేషు సురేషు వా।

యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుముత్సహతేగ్రతః॥

అప్యర్కమపి పర్జన్యమ్ అపి వైవస్వతమ్ యమమ్।

స హి సోఢుం రణే శక్తస్తవ హేతోర్విశేషతః॥

స హి సాగరపర్యంతాం మహీం శాసితుమీహతి।

త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని॥

(సుందరకాండ, 39. 14, 15, 16, 17)

హనుమంతుడు: శ్రీరాముడు భల్లూక వానర యోధులతో గూడినవాడై శీఘ్రముగా ఇచటికి రాగలడు. ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి, నీ దుఃఖమును రూపుమాపగలడు.

శ్రీరాముడు బాణములు వేయునప్పుడు ఆయనకు ఎట్టఎదుట నిలబడుటకు సాహసింప గలవానిని మనుష్యులలో గాని, సురాసురులలో గాని నేను ఇంత వరకు చూడలేదు. ఇక ముందు చూడబోను.

ఆ ప్రభువు రణరంగమున తీక్ష్ణ కిరణుడగు సూర్యునైనను, ఇంద్రునైనను, సూర్యపుత్రుడైన ఆ యముని సైతము ఎదిరింపగల సమర్థుడు. ఇక నీ నిమిత్తముగా ఐనచో చెప్పవలసిన పని ఏమి?

శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త భూమండమును పాలింపగోరుచున్నాడు. ఓ జానకీ! నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును!

..సీతాదేవికి శ్రీరాముడి వ్యవహారాన్ని నాలుగు మాటలలో తేల్చి చెప్పాడు. ఆయన ఎందుకు రావటం లేదో? ఏం జరుగుతోందో అనేవి చిన్న ప్రశ్నలు! వానర యోధులతో రాగలడన్నది స్పష్టం చేసి ఆవిడకు విశ్వాసాన్ని కల్పించాడు.

ఇక పోతే, ఆ స్వామి శౌర్య పరాక్రమాలను విశేషంగా వర్ణించాడు (ఇంత వరకు చూడలేదు – ఎవరి దగ్గరా – చూడబోను). నీ కోసం గరికను బ్రహ్మాస్త్రం చేసిన వాడు నీ నిమిత్తం ఏమైనా చేయగలడని సీతాదేవి గుర్తు చేసుకున్న ఉదంతాన్నే పునరుద్ఘాటించాడు! చివరి మాట మామూలుగా కనిపిస్తున్నప్పటికీ అది యావత్ రామాయణంలో గల కథా ప్రస్థానానికి సారభూతమైనది –

‘త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని’ – నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కల్గును!

సీతాదేవికి అప్పటి వరకూ గల ఆందోళన, ఆవేదన పూర్తిగా తొలగిపోయాయి! ‘త్వన్నిమిత్తో’ అన్న మాట ఎంత గొప్ప మాట? నీ అపహరణ కారణంగా శ్రీరాముడు శ్రీరాముడు! నీకు కలిగిన ఈ ఆపద మహత్తరమైన కార్యానికి నాంది!

ఈ సూక్ష్మ బుద్ధి, తీక్ష్ణ బుద్ధి, వాక్చాతుర్యం అనేవి ఆంజనేయునికే చెల్లినది!

శ్లో:

కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్।

పూర్వకార్యావిరోధేన స కార్యం కర్తుమర్హతి॥

న హ్యేకస్సాధకో హేతుః స్వల్పస్యాపీహ కర్మణః।

యో హ్యర్థం బహుధా వేద స సమర్థోర్థసాధనే॥

(సుందరకాండ, 41. 5, 6)

హనుమంతుడు (స్వగతం): అప్పగించిన కార్యమును సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరియెన్ని కార్యములనైనను సాధింపవచ్చును. అట్టివాడే నిజముగా కార్యదక్షుడు.

కార్యం ఎంత స్వల్పమైనదైనను దానిని సాధించుటకు పలు ఉపాయములు ఉండవచ్చును. వాటినన్నింటిని తెలిసి యుండుటయే సామర్థ్యం!

శ్లో:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః।

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః।

హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః॥

న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్।

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః॥

అర్దయిత్వా పురీం లంకామ్ అభివాద్య చ మైథిలీమ్।

సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥

(సుందరకాండ, 42. 33, 34, 35, 36)

రావణుడు హనుమంతుడితో యుద్ధం కోసం ఎనభై వేల మంది రాక్షసులను పంపినప్పుడు కాయాన్ని పెద్దది చేసి హనుమంతుడు చెప్పిన మాట:

మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునికి విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము – అసహాయ శూరుడు, కోసల దేశ ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను, వాయు పుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపువాడను.

వేయి మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు. వేలకొలది శిలల తొను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదము. రాక్షసులందరును ఏమీ చేయలేక చూస్తూ ఉంటారు – నేను వచ్చిన పనిని ముగించుకొని, సీతాదేవికి నమస్కరించి వెళతాను.

.. ‘రామదాసు’ అయిన ఆంజనేయుడు ఆయనెవరో ఈ విధంగా ప్రకటించాడు. వాస్తవానికి ఇక్కడే యుద్ధం ప్రారంభమైపోయింది.

శ్లో:

మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనామ్।

బలినాం వానరేంద్రాణాం సుగ్రీవవశవర్తినామ్।

అటంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః॥

దశనాగబలాః కేచిత్ కేచిత్ దశ గుణోత్తరాః।

కేచిన్నాగసహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః॥

సంతి చౌఘబలాః కేచిత్ కేచిద్వాయుబలోపమాః।

అప్రమేయబలాశ్చాన్యే తత్రాసన్ హరియూథపాః॥

ఈదృగ్విధైస్తు హరిభిః వృతో దంత నఖాయుధైః।

శతైశ్శతసహస్రైశ్చ కోటీభిరయుతైరపి॥

ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః।

నేయమస్తి పురీ లంకా న యూయం న చ రావణః॥

యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా।

(సుందరకాండ, 43. 20, 21, 22, 23, 24, 25)

ఆంజనేయుడు: నా వంటి మహా పరాక్రమశాలురైన వానర యోధులు వేలకొలది పంపబడినారు. అందరూ సుగ్రీవాజ్ఞను పాటించేవారే!

మాలో కొందరు ఐదు ఏనుగుల బలము గలవారు, కొందరు పది రెట్లు గలవారు, కొందరు వేయి ఏనుగుల బలము గలవారు. కొందరు కోట్ల ఏనుగుల బలము గలవారు. మరికొందరు వాయువేగ బల సంపన్నులు. కొందరి బలాన్ని ఊహించలేరు.

అందరూ సుగ్రీవునితో కలసి వచ్చి మిమ్మల్నందరినీ తుదముట్టింపగలరు. మహాత్ముడైన శ్రీరామునితో వరం పెట్టుకొన్నారు గావున మీరు ఎవరూ ఇక ఉండరు. మీకు ఆధారభూమియైన లంకానగరమూ ఉండదు, చివరకు మీ ప్రభువైన దుష్ట రావణుడు సైతం మిగలడు!

శ్లో:

స వీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ।

విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞా మనువర్తతే స్మ॥

అస్త్రేణాపి హి బద్ధస్య భయం మమ న జాయతే।

పితామహమహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ॥

గ్రహణే చాపి రక్షోభిః మహన్ మే గుణదర్శనః।

రాక్షసేంద్రేణ సంవాదః తస్మాద్గృహ్ణంతు మాం పరే॥

(సుందరకాండ, 48. 42, 43, 44)

ఇంద్రజిత్తు బ్రహ్మాస్తం సంధించినప్పుడు హనుమంతుడు స్వగతంలో (బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొను శక్తి తనకున్నదని తెలిసి కూడా బ్రహ్ర్మదేవుని ఆజ్ఞను శిరసావహించెను)-

నేను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినను, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షించుచున్నందున నేను భయపడవలసిన పని లేదు. దీని వలన నాకు లాభమే! స్వయంగా అక్కడ రావణునితో మాట్లాడవచ్చును. అందువలన శత్రువులు తీసుకుని వెళ్ళుదురు గాక!

శ్లో:

స బద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్।

అస్త్రబంధస్స చాన్యం హి న బంధమనువర్తతే॥

అథేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమం తమ్।

విముక్తమస్త్రేణ జగామ చింతాం నాన్యేన బద్ధో హ్యనువర్తతేస్త్రమ్॥

అహో మహత్కర్మ కృతం నిరర్థకం న రాక్షసైర్మంత్రగతిర్విమృష్టా।

పునశ్చ నాస్త్రే విహతేస్త్ర మన్యత్ ప్రవర్తతే సంశయితా స్స్మసర్వే॥

(సుందరకాండ, 48. 48, 49, 50)

మహావీరుడైన హనుమంతుడు వల్కములచే బంధింపబడిన వెంటనే బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విముక్తుని గావించెను. ఏలనన తనచే బంధింపబడిన వానిని ఇతర సాధనములచే మరల బంధించినచో బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విడిచిపెట్టును.

ఇది గమనించిన వీరుడైన ఇంద్రజిత్తు ఇలా అనుకున్నాడు – ‘అయ్యో! నా శక్తియంతయును ధారపోసి చేసిన ఈ ఘనకార్యము బూడిదలో పోసిన పన్నీరైనది గదా! పద్ధతి తెలియక రాక్షసులు తెలివి మాలిన పనిని చేసారు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తరువాత మరి యొక అస్త్రం ఏదీ పని చేయదు. బ్రహ్మాస్తం మరల ప్రయోగించలేము. ఈ బంధనమలను తెంపుకొనినచో ఇతను మనందరినీ ఇరుకున పెట్టగలడు. ఇపుడు ఏం చేయాలి?’

(ఆంజనేయుడు కావాలనే ఈ బంధనాలను తెంపుకొన లేదు!)

శ్లో:

యథాక్రమం తైః స కపిర్విపృష్టః కార్యార్థమర్ధస్య చ మూలమాదౌ।

నివేదయామాస హరీశ్వరస్య దూతస్సకాశాదహమాగతోస్మి॥

(సుందరకాండ, 48. 61)

రావణుని మంత్రులు కపివరుని వచ్చిన పని గురించి క్రమంగా ప్రశ్నించారు. మారుతి ‘ఆకాశ మార్గమున వచ్చిన దూతను’ అని చెప్పాడు.

శ్లో:

యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః।

స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితా॥

(సుందరకాండ, 49. 18)

రావణుని చూసి హనుమంతుడు అనుకున్నాడు:

అధర్మానికి ఒడిగట్టకున్నచో ఈ రావణుడు దేవేంద్రునితో గూడిన సురలోకమునకు సైతము ప్రభువై యుండెడివాడు.

..ధర్మం పట్ల అనురక్తి మనిషిని ఎంత బలవంతునిగా చేస్తుందో, అధర్మం అనేది అమితమైన బలవంతుని కూడా బలహీనుడిని చేయునన్నది సారాంశం. రామాయణ తత్వ సారం ఇక్కడ ప్రతిబింబిస్తున్నది!

శ్లో:

శంకాహతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసావృతమ్।

కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాదిహాగతః॥

యేన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా।

సోయం వానరమూర్తిస్స్యాత్ కింస్విద్బాణో మహాసురః॥

(సుందరకాండ, 50. 2, 3)

రావణుడు హనుమంతుని పరిశీలనగా చూసాడు. హనుమంతుని మేధస్సు సామాన్యమైనది కాదు. ఎంతో అనుభవజ్ఞుడైన రావణునికి ఒక అనుమానం కలిగింది. ఎంతో కాలంగా ఇలాంటి తేజోమూర్తి ఆయనకు తారసపడలేదు.

‘పూర్వం నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా లేక వానర రూపంలో వచ్చిన బాణాసురుడా?’ అని అనుకున్నాడు. ప్రహస్తుని ఏ సంగతీ కనుక్కోమన్నాడు.

..అధర్మం ఆచరించి కూర్చున్నాడు రావణుడు. కాకపోతే ఈ మాటల వలన అతను ప్రశాంతంగా ఐతే లేడని అర్థమవుతున్నది. యుద్ధం జరుగుతుందని తెలుసు! రెండవ విషయం – ఉత్తరాకాండలో గల రావణ చరిత్రకు ఇది ఒక ఆధారంగా కనిపిస్తున్నది (ఉత్తరకాండ పూర్తిగా అప్రామాణికం అని అనటానికి వీలు లేదనటానికి ఇది ఒక ఉదాహరణ. యుద్ధకాండలో మరి కొన్ని సందర్భాలుంటాయి).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here