Site icon Sanchika

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-32

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః।

ధర్మార్థోపహితం వాక్యమ్ ఇహ చాముత్ర చ క్షమమ్॥

(సుందరకాండ, 51. 3)

హనుమంతుడు: మహాత్ముడు, నీకు సోదరతుల్యుడు ఐన సుగ్రీవుని సందేశమును వినుము. ఇది ధర్మార్థములతో గూడినది, ఇహపరలోకముల యందు శ్రేయస్సు గూర్చునది.

శ్లో:

అహం తు హనుమాన్నామ మారుతస్యౌరసస్సుతః।

సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజన మాయతమ్॥

సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః।

భ్రమతా చ మయా దృష్టా గృహే తే జనకాత్మజా॥

తద్భవాన్ దృష్టధర్మార్థః తపఃకృతపరిగ్రహః।

పరదారాన్ మహాప్రాజ్ఞ! నోపరోద్ధుం త్వమర్హసి॥

(సుందరకాండ, 51. 15, 16, 17)

నా పేరు హనుమంతుడు. వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొరకై నూరు యోజనాలు పొడవగు సముద్రమును లంఘించి తీవ్రవేగముతో ఈ లంకకు వచ్చాను. ఆమె ఇక్కడ నాకు కనిపించింది.

నీవు (రావణుడితో) ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు. తీవ్ర తపస్సు నొనర్చి గొప్ప వరములు పొందినవాడవు. అట్టి నీవు పరసతులను బంధించుట తగదు.

శ్లో:

తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మపరిగ్రహః।

న స నాశయితుం న్యాయ్య ఆత్మప్రాణపరిగ్రహః॥

అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి।

ఆత్మన స్సాసురైర్దేవైః హేతుస్తత్రాప్యయం మహాన్॥

సుగ్రీవో న హి దేవోయం నాసురో న చ రాక్షసః।

న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః॥

మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః।

తస్మాత్ ప్రాణపరిత్రాణం కథన్ రాజన్ కరిష్యసి॥

న తు ధర్మోపసంహారమ్ అధర్మఫలసంహితమ్।

తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః॥

ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయః।

ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే॥

(సుందరకాండ, 51. 25-30)

హనుమంతుడు రావణునితో:

నీవు ధర్మమును ఆచరిస్తూ ఎన్నో కష్టములకు ఓర్చి తపస్సు చేశావు. ఆ ఫలితంగా మరణము లేని వరమును పొందావు. ఆ తపః ప్రభావమును చేతులారా నాశనం చేసుకోవటం యుక్తం కాదు.

దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికీ చెందినవాడు కాడు (ఇప్పుడు నీకు సందేశము చెబుతున్నది సుగ్రీవునిది). శ్రీరాముడు మానవుడు. సుగ్రీవుడు కపీశ్వరుడు. కాబట్టి ఓ రాక్షస రాజా! నీ ప్రాణములను ఎలా కాపాడుకుంటావు?

ధర్మఫలము, అధర్మఫలము, ఎప్పుడూ కలిసి యుండవు. నీవు ఆచరించిన ధర్మఫలము పూర్తిగా నీకు లభించినది. ఇందులో సందేహం లేదు. ఇప్పుడు నీ అధర్మ ఫలం శీఘ్రంగానే పొందగలవు!

శ్లో:

రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యృక్షగణసన్నిధౌ।

ఉత్సాదనమమిత్రాణాం సీతా యైస్తు ప్రధర్షితా॥

(సుందరకాండ, 51. 33)

సీతాదేవిని అవమానపరిచిన శత్రువులను హతమార్చి తీరుతాను అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతిజ్ఞ చేసియున్నాడు (ఆ కార్యమును నేను చేసినచో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగమగును).

..శ్రీరాముడు భరతునికి కబురు పంపి సైన్యాన్ని ఎందుకు తెప్పించుకోలేదు అనే ప్రశ్న కొందరు వేస్తూ ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు స్పష్టం – ఆయన అసహాయ శూరుడు, వానర సైన్యం సామాన్యమైనది కాదు. కోట్లలో వీరులున్నారు. కొద్దిసేపు రావణునికి ఉన్న వరం ప్రక్కన పెట్టండి. కావ్యనాయకుడు వానరులను కూడగట్టుకొని అద్భుతమైన యుద్ధం చేయటం ఇక్కడ విశేషం!

యుద్ధకాండలో ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించిన తరువాత వానరవీరులందరూ శ్రీరాముని, ఆయన చరిత్రనూ కొనియాడుతూ నృత్యం చేయటం మనం చూస్తాం! శ్రీరామ నామములలో ఉన్న శక్తి అది అన్నది మనం మరువకూడదు!

శ్లో:

యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః।

యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః॥

యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః।

యది వా భాగ్యశేషో మే శీతో భవ హనూమతః॥

యది మాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసామ్।

స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః॥

యది మాం తారయేదార్యః సుగ్రీవస్సత్యసంగరః।

అస్మాద్ధుఃఖాంబు సంరోధాత్ శీతో భవ హనూమతః॥

తతస్తీక్ష్ణార్చిరవ్యగ్రః ప్రదక్షిణశిఖోనలః।

జజ్వాల మృగశాబాక్ష్యాః శంసన్నివ శివం కపేః॥

(సుందరకాండ, 53. 28, 29, 30, 31, 32)

సీతాదేవి: నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచరించి యున్నచో, నేను నిష్కళంక పతివ్రతనైనచో, ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

దేవా! నేను ఏ మాత్రమైనను ధీమంతుడైన శ్రీరామప్రభువు యొక్క దయకు నోచుకొనియున్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలి యున్నచో మారుతిని చల్లగా చూడుము.

ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్ఛీల సంపన్నగా భావించినచో, తన సమాగమమునకై నేను వేయి కన్నులతో ఎదురు చూచుచున్నట్లు ఎరింగినచో, ఓ హవ్యవాహనా! వాయుసుతుని చల్లగా చూడుము.

పూజ్యుడు, సత్యసంధుడు ఐన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడేని ఓ వైశ్వానరా! ఆంజనేయుని చల్లగా చూడుము.

సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అన్నట్లు తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపుర్వకముగా ప్రజ్వలింపసాగెను.

..ఈ సందర్భంలోనే జరుగబోవు శుభపరిణామానికి నిదర్శనం కనిపిస్తున్నది. లౌకికం, అలౌకికం, తాత్వికం – ఈ క్రమంలో అగ్ని, సూర్యుడు – ఈ ఇరువురి పాత్ర వాల్మీకి రామాయణంలో తత్వదర్శనం చేయించునప్పుడు ఎంతో నాటకీయంగాను, హృద్యంగానూ కనిపిస్తుంది!

‘అగ్నిం నారీం వీరకుక్షిం పురంధిమ్.. వీరం శృత్యం కర్మనిష్ఠామ్’ అనే అగ్నిసూక్తంలోని మాటలు గుర్తుకొస్తాయి!

శ్లో:

శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః।

అథవా తదిదం వ్యక్తం యద్దృష్టం ప్లవతా మయా॥

రామప్రభావాదాశ్చర్యం పర్వత స్సరితాం పతౌ।

యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః॥

రామార్థం సంభ్రమస్తాదృక్ కిమగ్నిర్న కరిష్యతి।

సీతాయాశ్చానృశంస్యేన తేజసా రాఘవస్య చ॥

పితుశ్చ మమ సఖ్యేన న మాం దహతి పావకః।

భూయస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః॥

(సుందరకాండ, 53. 36-39)

హనుమంతుడు (స్వగతం):

నా వాలము చివర ఒక మంచురాశి పెట్టబడినట్లున్నది. లేదా దానికి కారణం – సముద్రం మీద ఎగురుచున్నప్పుడు శ్రీరాముని పైగ గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను. ఇది ఆశ్చర్యకరమైన దృశ్యము. ధీమంతుడైన మైనాకునకును, శ్రీరామునకు సహాయపడుటకు అంతగా ఉత్సాహమున్నప్పుడు సీతాదేవి కనికరము వలనను, శ్రీరాముని తేజః ప్రభావమునను ఇలా జరిగి యుండవచ్చును. లేదా! నా తండ్రి యైన వాయుదేవునకు మిత్రుడగుట వలన అగ్నిదేవుడు నన్ను దహింపకయుండవచ్చును. మరల క్షణకాలంలో ఆలోచనలో పడ్డాడు.

శ్లో:

యో హ్యయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహనః।

అస్య సంతర్పణం న్యాయ్యం కర్తుమేభిర్గృహోత్తమైః॥

(సుందరకాండ, 54. 5)

నన్ను చల్లగా చూసి తోడ్పడినందుకు ఈ అగ్నిదేవునకు ఈ మహాభువనములను ఆహుతిగా సమర్పించుట న్యాయమగును!

శ్లో:

అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనమ్।

అగ్నిం తత్ర స నిక్షిప్య శ్వసనేన సమో బలీ॥

వర్జయిత్వా మహాతేజా విభీషణ గృహం ప్రతి।

క్రమమాణః క్రమేణైవ దదాహ స మహాకపిః॥

తతస్తు తం వానరవీరముఖ్యం మహాబలం మారుతతుల్యవేగం।

మహామతిం వాయుసుతం వరిష్ఠం ప్రతుష్టువుర్దేవగణాశ్చ సర్వే॥

(సుందరకాండ, 54. 9, 16, 47)

వాయువేగము గల ఆ హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించాడు (ప్రహస్తుడు ప్రధానమంత్రి).

గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రాసాదమును మాత్రము తాకనైనా తాకలేదు.

వానర వీరులలో ప్రముఖుడును, మహాబాలిశాలియు, వాయుతుల్య పరాక్రముడును, మిక్కిలి ధీమంతుడును, సర్వశ్రేష్టుడును ఐన ఆ మారుతిని దేవతలందరును వేనొళ్ళ ప్రస్తుతించారు.

శ్లో:

య స్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి।

యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే॥

(సుందరకాండ, 55. 7)

హనుమంతుడు: సర్పము జీర్ణమైన చర్మనును విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతము ఓర్పుతో అణచుకొనిన వాడే యథార్థముగా పురుషుడు.

(సీత ఉన్న అశోకవనం కూడా మంటల్లో ఉన్నదని గ్రహించి)

శ్లో:

ఇతి చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే।

పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్॥

అథవా చారుసర్వాంగే రక్షితా స్వేన తేజసా।

న నశిష్యతి కల్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే॥

న హి ధర్మాత్మనస్తస్య భార్యామమితతేజసః।

స్వచారిత్రాభిగుప్తాం తాం స్ప్రష్టుమర్హతి పావకః॥

నూనం రామ ప్రభావేణ వైదేహ్యాస్సుకృతేన చ।

యన్మాం దహనకర్మాయం నాదహత్ హవ్యవాహనః॥

త్రయాణాం భరతాదీనాం భ్రాత్రూణాం దేవతా చ యా।

రామస్య చ మనః కాంతా సా కథం వినశిష్యతి॥

యద్వా దహనకర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః।

న మే దహతి లాంగూలం కథమార్యాం ప్రధక్ష్యతి॥

(సుందరకాండ, 55. 22-27)

ఇంతలో హనుమంతునకు శుభ శకునములు కనిపిమ్చాయి. మరల ఆలోచించాడు. మంగళ స్వరూపిణి, సర్వాంగ సుందరి ఐన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును. అగ్నిని అగ్ని దహింపదు. సీతాదేవి మిక్కిలి తేజశ్శాలియైన శ్రీరాముని భార్య! ఆమె ప్రాతివత్యమే భద్రకవచమై ఆమెను రక్షించును. ఈ జగత్తునందు దేనికైనను దహించువేయగల అగ్ని కేవలం శ్రీరాముని ప్రభావము చేతనే సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహించలేదు. ఇది ముమ్మాటికినీ సత్యము. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు. శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి యగుట అసంభవము. ఈ అగ్ని అంతటను దహన స్వభావము గలిగి యుండువాడు, సర్వసమర్థుడు, నాశము లేనివాడు ఐనప్పటికీ నా వాలమునే కాల్చలేదు. ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎలా దహించును?

శ్లో:

తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి।

అపి సా నిర్దహేదగ్నిం న తామగ్నిః ప్రధక్ష్యతి॥

దగ్ధేయం నగరీ సర్వా సాట్టప్రాకారతోరణా।

జానకీ న చ దగ్ధేతి విస్మయోద్భుత ఏవ నః॥

(సుందరకాండ, 55. 29, 33)

తన తపోబలము చేతను, సత్యభాషణ ప్రభావము వలనను ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయగు శ్రీరాముని ధ్యానించునది అగుట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు. కనుక ఆమెను అగ్ని దహింపజాలదు.

చారణులు: ప్రాకారములతో కూడిన ఈ లంకా నగరమంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రం దగ్ధం కాలేదు. ఎంత అద్భుతం? ఆశ్చర్యం! (చారణులు హనుమంతుని ‘నేర్పు’ను మెచ్చుకొంటున్నారు!)

శ్లో:

ఇతి శుశ్రావ హనుమాన్ వాచం తామమృతోపమామ్।

బభూవ చాస్య మనసః హర్షస్తత్కాలసంభవః॥

(సుందరకాండ, 55. 34)

అమృతతుల్యములైన ఈ వచనములను హనుమంతుడు విన్నాడు. వెంటనే పరమానంద భరితుడయ్యాడు!

శ్లో:

సర్వథా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయః।

న హ్యస్యాకృతకార్యస్య నాద ఏవంవిధో భవేత్॥

స తాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః।

దృష్టా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్॥

తతో దృష్టేతి వచనం మహార్థమమృతోపమమ్।

నిశమ్య మారుతేస్సర్వే ముదితా వానరాభవ॥

(సుందరకాండ, 57. 23, 36, 40)

జాంబవంతుడు: ఈ హముమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇక్కడికి వస్తున్నాడు. అందులో సందేహం లేదు. వెళ్ళిన కార్యము సఫలము కానిచో ఇలా మహానాదమొనర్చడు.

పరాక్రమశాలియు, పూజ్యుడు ఐన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించారు. వానరోత్తములందరూ మెచ్చుకొన్నారు. మారుతి ‘కనుగొంటిని సీతమ్మను’ అని సంక్షేపంగా చెప్పాడు.

‘కనుగొంటిని’ అను అమృతతుల్యము, విశేషార్థాలోకము ఐన హనుమంతుని వచనమును విని వానరులంతా పరమానందమొందారు.

..ఇది విశేషార్థం, అమృతతుల్యము అని మహర్షి నొక్కి చెబుతున్నాడు! చూడటం, దర్శించటం, కనుగొనటం – ఈ ప్రక్రియలు లౌకిక, అలౌకిక, తాత్విక పరంగా గుర్తించటం ద్వారా శ్రీమద్రామయణ తత్వ రహస్యం దర్శనమవుతుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version