[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
రాఘవో నృపశార్దూలః కులం వ్యపదిశన్ స్వకమ్।
ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రతః॥
సర్వేషాం కపిముఖ్యానాం కథం మిథ్యా కరిష్యతి।
విఫలం కర్మ చ కృతం భవేత్ తుష్టిర్న తస్య చ।
వృథా చ దర్శితం వీర్యం భవేద్వానరపుంగవాః॥
(సుందరకాండ, 60. 11, 12)
అంగదుడు అక్కడున్న వీరులతో కలసి స్వయంగా రాక్షస ప్రముఖులను వధించి సీతాదేవిని తీసుకురావాలనే ఆలోచనను చేసినప్పుడు జాంబవంతుడు చెప్పిన మాట:
శ్రీరాముడు రాజసింహుడు. అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకొని వచ్చును గాని ఇతరుల పరాక్రమముపై ఆధారపడడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున ‘శత్రువును జయించి సీతను గొని వచ్చెదను’ అని తన వంశముపై ఒట్టు పెట్టుకుని ప్రతిజ్ఞ చేసి యున్నాడు. అందుచేత మనం అలా చేయకూడదు..
శ్లో:
దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్య తత్త్వతః।
అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాః॥
న చాప్యదృష్ట్వా వైదేహీం విశ్రుతాః పురుషర్షభ।
వనం దత్తవరం దివ్యం ధర్షయేయుర్వనౌకసః॥
తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణస్సహ రాఘవః।
శ్రుత్వా కర్ణసుఖాం వాణీం సుగ్రీవవదనాచ్చ్యుతామ్॥
ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః।
శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవస్తు ప్రహృష్య చ॥
(సుందరకాండ, 63. 26, 27, 28, 29)
శ్రీరామలక్ష్మణులకు శుభవార్త అందిన విధానం ఎంతో ఆసక్తికరం. మధువనంలో హనుమంతునితో సహా అందరు వానరవీరులూ వీరవిహారం చేసారని సుగ్రీవునికి విన్నవించేందుకు దధిముఖుడు కిష్కిందకు వచ్చినప్పుడు సుగ్రీవుడు శ్రీరామలక్ష్మణులతో అన్న మాటలు:
సీతాదేవి కనబడినది అన్నమాట ముమ్మాటికీ సత్యము. అంగదాదులు వనమున సంతోషమున మధువులు గ్రోలుట ప్రబల నిదర్శనము.
ఋక్షరజసునకు బ్రహ్మదేవుడు వరముగా నిచ్చిన ఈ దివ్యవనమును వారి ఇలా ఊరకే ధ్వంసం చేయరు.
ఈ మాటలు విని ధర్మాత్ములైన రామలక్ష్మణులు మహదానంద భరితులైరి.
సుగ్రీవుడు కూడా హర్షించాడు.
శ్లో:
హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసా తతః।
నియతా మక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్॥
దృష్టా దేవీతి హనుమద్వదనాదమృతోపమమ్।
ఆకర్ణ్య వచనం రామో హర్షమాప సలక్ష్మణః॥
నిశ్చితార్థం తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే।
లక్ష్మణః ప్రీతిమాన్ ప్రీతం బహుమానాదవైక్షత॥
ప్రీత్యా చ రమమాణోథ రాఘవః పరవీరహా।
బహుమానేన మహతా హనుమంతమవైక్షత॥
(సుందరకాండ, 64. 42, 43, 44, 45)
హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేసాడు. ‘సీతా మహాసాధ్వి క్షేమముగా నున్నది’ అని శ్రీరాముని నివేదించాడు.
‘కనుగొంటిని సీతమ్మను’ (దృష్టా దేవీ) అను అమృతతుల్యములైన వచనములను ఆయన నోట విని శ్రీరామలక్ష్మణులు మహదానందభరితులైనారు.
‘హనుమంతుడే కార్యమును సాధింపగలడు’ అను విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై తన చూపులతో సుగ్రీవుని సంతోషపెట్టాడు.
(ఇరువురి అంచనా సరైనది అన్న సంతోషం!)
శ్రీరాముడు సంతోషంతో ఓలలాడుతూ అత్యంత గౌరవభావంతో హనుమంతుని చూసాడు.. హనుమంతుని బ్రహ్మానందమునకు అవధులు లేవు.
శ్లో:
శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్మారుతాత్మజః.।
ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి॥
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయా దర్శనం యథా।
తం మణిం కాంచనం దివ్యం దీప్యమానం స్వతేజసా।
దత్త్వా రామాయ హనుమాన్ తతః ప్రాంజలిరబ్రవీత్॥
సముద్రం లంఘయిత్వాహం శతయోజన మాయతమ్।
అగచ్ఛం జానకీం సీతాం మార్గమాణో దిదృక్షయా॥
తత్ర లంకేతి నగరీ రావణస్య దురాత్మనః।
దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే।
తత్ర దృష్టా మయా సీతా రావణాంతః పురే సతీ॥
సన్న్యస్య త్వయి జీవంతీ రామా రామ మనోరథమ్।
దృష్టా మే రాక్షసీమధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః॥
(సుందరకాండ, 65. 7-12)
క్లుప్తంగా ‘దృష్టా సీతా’ అని చెప్పిన తరువాత వివరంగా – హనుమంతుడు దక్షిణ దిక్కుకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లెను. తదుపరి వాక్చతురుడైన మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని చెప్పాడు.
కాంచనమయము, తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజల్లుచున్నదియు, ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించాడు. అంజలి ఘటించి ఇలా చెప్పాడు:
నేను నూరు యోజనములు పొడవు గల సముద్రమును లంఘించి, జనకుని కూతురైన సీతాదేవిని చూడగోరిన వాడనై ఆమెను వెదుకుచు వెళ్ళితిని.
దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణుని యొక్క ‘లంక’ అను నగరము గలదు. అచట ‘అశోక’ వనము నందు నేను సీతా సాధ్విని జూచితిని.
ఓ రామా! ఆ సాధ్వి తన ఆశలన్నింటిని నీ మీదనే పెట్టుకుని జీవించుచున్నది. ఆమె చుట్టును రాక్షస స్త్రీలు చేరియున్నారు.
శ్లో:
ఏష నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారి సంభవః।
ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వామివానఘ॥
జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ।
ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగతా॥
ఇతి మామబ్రవీత్ సీతా కృశాంగీ ధర్మచారిణీ।
రావణాంతః పురే రుద్ధా మృగీవోత్ఫుల్లలోచనా॥
ఏతదేవ మయాఖ్యాతం సర్వం రాఘవ యద్యథా।
సర్వథా సాగరజలే సంతారః ప్రవిధీయతామ్॥
తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా
తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ।
దేవ్యా చాఖ్యాతం సర్వమేవానుపూర్వ్యాత్
వాచా సంపూర్ణం వాయుపుత్ర శ్శశంస॥
(సుందరకాండ, 65. 24-28)
హనుమంతుడు విన్నవించిన సీతాదేవి మాటలు:
జలములో జన్మించి, కాంతులును చిమ్ముచున్న ఈ చూడామణిని నేను నీ వద్దకు పంపుతున్నాను. ఓ అనఘా! దుఃఖ సమయము నందు దీనిని చూస్తు నిన్ను చూస్తున్నట్లు ఆనందిస్తున్నాను.
మాసము గడువు ముగియు వరకు నేను జీవించి ఉంటాను. రాక్షసుల అధీనంలోనున్న నేను ఒక నెల పూర్తి అయిన పిమ్మట జీవించి యుండను.
ధర్మచారిణియు, కృశాంగియు ఐన సీతాదేవి నాతో చెప్పిన మాట ఇది. అశోకవనమున సీతాదేవి నిర్బంధంలో నున్నది.
ఓ రఘువంశోత్తమా! విషయములను యథాతథముగా విన్నవించాను. సాగరమును దాటు ఉపాయమును గురించి ఆలోచించాలి. శ్రీరామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి, సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునకు సమర్పించాడు. క్రమం తప్పకుండా సీతాదేవి సందేశాన్ని విన్నవించాడు.
శ్లో:
తతో మయావాగ్భిరదీన భాషిణా
శివాభిరిష్టాభిరభి ప్రసాదితా।
జగామ శాంతిం మమ మైథిలాత్మజా
తవాపి శోకేన తథాతి పీడితా॥
(సుందరకాండ, 68. 29)
సీతాదేవికి ధైర్యమును గూర్చితిని. నా తల్లి మైథిలీదేవికి నేను నీ బలపరాక్రమముల గురించి చెప్పితిని. ఆమెకు తృప్తికరములైన, శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలిని గావించితిని. అప్పుడు ఆ తల్లి నా సమక్షములోనే మనశ్శాంతిని పొందినది.
(ఇంకా ఉంది)