Site icon Sanchika

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-37

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

విమానేనాపి సీతా తు గత్వా త్రిజటయా సహ।

దదర్శ వానరాణాం తు సర్వం సైన్యం నిపాతితమ్॥

ప్రహృష్టమనసశ్చాపి దదర్శ పిశితాశనాన్।

వానరాంశ్చాపి దుఃఖార్తాన్ రామలక్ష్మణపార్శ్వతః॥

తతః సీతా దదర్శోభౌ శయానౌ శరతల్పయోః।

లక్ష్మణం చాపి రామం చ విసంజ్ఞౌ శరపీడితౌ॥

విధ్వస్త కవచౌ వీరౌ విప్రవిద్ధశరాసనౌ।

సాయకైచశిన్న సర్వాంగౌ శరస్తంబమ యౌక్షితౌ॥

(యుద్ధ కాండ, 47. 16, 17, 18, 19)

సీతాదేవి త్రిజటతో గూడి విమానముపై వెళ్ళి రణభూమిపై పడియున్న వానర సైన్యమును అంతయును వీక్షించెను. ఆమె సంతోషముతో పొంగిపోవుచున్న రాక్షసులను చూచెను. శ్రీరామలక్ష్మణుల ప్రక్కన దుఃఖార్తులై యున్న వానరులను కూడా చూచెను. ధనుర్బాణములు వేర్వేరుగా పడియున్నాయి. కవచములు బ్రద్దలైయున్నాయి. అవయములు పూర్తిగా గాయపడియున్నాయి.

శ్లో:

నశోచామి తథా రామం లక్ష్మణం చ మహాబలమ్।

వాత్మానం జననీం వాపి యథా శ్వశ్రూం తపస్వినీమ్॥

సాతుచింతయతే నిత్యం సమాప్త వ్రతమాగతమ్।

కదా ద్రక్ష్యామి సీతాం చ లక్ష్మణం చ స రాఘవమ్॥

(యుద్ధ కాండ, 48. 20, 21)

సీతాదేవి: మిగుల బలశాలియైన లక్ష్మణుని కొరకు గాని, గొప్ప పరాక్రమవంతుడు, నా పతిదేవుడు ఐన శ్రీరామచంద్ర ప్రభువు కొరకు గాని, నా కొరకు గాని, కడకు నను గన్న తల్లి కొరకు గాని నేను చింతించుట లేదు. కానీ మహా తపస్విని, మా అత్తగారు ఐన కౌసల్యాదేవి ఇందుకు ఎంతగా బాధపడునో అనునదియే నా చింత!

శ్లో:

ఇదం విమానం వైదేహీ పుష్పకం నామ నామతః।

దివ్యం త్వాం దారయన్నైవం యద్యేతౌ గత జీవితౌ॥

(యుద్ధ కాండ, 48. 26)

త్రిజట: వైదేహీ! ‘పుష్పకము’ అను ఈ దివ్య విమానము భర్తను కోల్పోయిన స్త్రీని తీసికొనిరాదు. ఇది నిన్ను తీసికొని వచ్చినది గావున నీ భర్త సజీవుడే యనుట సత్యము!

శ్లో:

ఇయం పునరసంభ్రాంతా నిరుద్విగ్నా తరస్వినీ।

సేనారక్షతి కాకుత్స్థౌ మయా ప్రీత్యా నివేదితౌ॥

సా త్వం భవ సువిస్రబ్ధా అనుమానైః సుఖోదయైః।

అహతౌ పశ్య కాకుత్స్థౌ స్నేహాదేతద్బ్రవీమితే॥

అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన।

(యుద్ధ కాండ, 48. 28, 29, 30)

త్రిజట: బలమైన ఈ వానరసేన ఎట్టి తొట్రుపాటు గానీ, ఉద్వేగము గాని లేక శ్రీరామలక్ష్మణుల రక్షణలో నిమగ్నమై యున్నది. కనుక వీరు ‘సజీవులే’ అని సంతోషముతో తెలుపుచున్నాను. దేవీ! సంతోషకరములైన ఈ కారణములను బట్టి నీవు నిశ్చింతగా ఉండుము. సజీవులైయున్న ఈ శ్రీరామలక్ష్మణులను చూడుము. ఈ విషయములన్నింటినీ నీ మీది ప్రేమాభిమానములతో తెలుపుతున్నాను.

నేను ఇంతవరకు అబద్ధమాడి ఎరుగను. ఇక మీదను గూడ ఎన్నడనూ అసత్యమును పలుకను. నీ పాతివ్రత్య ప్రభావము, నిష్కళంకమైన నీ స్వభావము నా మనస్సును ఆకట్టుకొన్నవి.

శ్లో:

కిన్నామే సీతయా కార్యం కిం కార్యం జీవితేనవా।

శయానం యోద్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితమ్॥

శక్యా సీతాసమా నారీ మర్త్యలోకే విచిన్వతా।

నలక్ష్మణ సమోభ్రాతా సచివః సాంపరాయికః॥

(యుద్ధ కాండ, 49. 5, 6)

శ్రీరాముడు మూర్ఛ నుండి లేచి లక్ష్మణుని చూసి –

శ్రీరాముడు: తమ్ముడగు లక్ష్మణుడు యుద్ధమున నిర్జితుడై (గాయపడి) ఇప్పుడిక్కడ పడియుండుట ప్రత్యక్షముగా చూస్తున్నాను. అతడే లేనినాడు నాకిక సీతతో పని యేమి? అంతే గాదు; నేను సైతము బ్రతికియుండుట వలన ప్రయోజనమేమిటి? పట్టుబట్టి గట్టిగా వెదికినచో నాకు ఈ లోకమున సీతాదేవితో సమానురాలగు నారి కనబడవచ్చును. కానీ కుడిభుజము వంటి సహాయకుడు, ధర్మయుద్ధ సమర్థకుడు ఐన లక్ష్మణుని వంటి సోదరుడు లభించుట మాత్రము కష్టము.

శ్లో:

తమాగతమ్ అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదుద్రువుః।

యైస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలౌ॥

తతః సుపర్ణః కాకుత్స్థౌ దృష్ట్వా ప్రత్యభినందితః।

విమమర్శ చ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే॥

వైనతేయేన సంస్పృష్టాః రయోః సంరురుహుర్వ్రణాః।

సువర్ణే చ తనూస్నిగ్ధే తయోరాశు బభూవతుః॥

తేజోవీర్యం బలం చౌజ ఉత్సాహశ్చ మహాగుణాః।

ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః॥

(యుద్ధ కాండ, 50. 37, 38, 39, 40)

గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు..

బలశాలులు, సత్పురుషులు ఐన శ్రీరామలక్ష్మణులను అస్త్రరూపములలో బంధించిన సర్పములు అన్నియు ఆ గరుత్మంతుని రాకను గమనించి, ఆయన రెక్కల వాయువేగమునకు భయపడి పరుగులు తీశాయి.

గరుత్మంతుడు శ్రీరామలక్ష్మణులను అభినందించాడు. వారి ముఖాలను చేతులతో నిమిరాడు. ఆ గాయములు వెంటనే మాయమయ్యాయి. శరీరములు చక్కని కాంతులతో విరాజిల్లాయి. తేజస్సులు, బలపరాక్రమములు, కాంతులు, అద్భుత కార్యములను నిర్వహింపగల ఉత్సాహము, దివ్యగుణములు, దృష్టి శక్తి, సూక్ష్మబుద్ధి పరిజ్జానము, వేగము, జ్ఞాపకశక్తి రెట్టింపు అయ్యాయి.

శ్లో:

నేమం మోక్షయితుం శక్తాః శరబంధం సుదారుణమ్।

మాయా బలాదింద్రజితా నిర్మితం క్రూరకర్మణా॥

(యుద్ధ కాండ, 50. 48)

గరుత్మంతుడు: క్రూరకర్ముడైన ఇంద్రజిత్తు తన మాయాశక్తిచే ఏర్పరిచిన ఈ నాగాస్త్రబంధము మిక్కిలి దారుణమైనది. (దీనిని వేరెవరూ నిర్మూలించలేరు)

శ్లో:

ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కూటయోధినః।

శూరాణాం శుద్ధభావానాం భవతామ్ ఆర్జవం బలమ్॥

తన్న విశ్వసితవ్య వో రాక్షసానాం రణాజిరే।

ఏతేనైవోపమానేన నిత్యం జిహ్మా హి రాక్షసాః॥

(యుద్ధ కాండ, 50. 53, 54)

గరుత్మంతుడు: కదనరంగమునందు కపటయుద్ధమునకు పాల్పడుట రాక్షసులందరికిని సహజ లక్షణము. నిర్మల స్వభావులైన మీ వంటి వీరులకు సరళవర్తనమే మహాబలము (ఋజుమార్గము). అందువలన యుద్ధభూమి యందు ఆ రాక్షసులను మీరు ఎన్నడును నమ్మరాదు! ఈ సంఘటనను బట్టి ఆ రాక్షసులు సర్వదా కుటిలురని గ్రహింపవచ్చును!

..ఈ రెండు శ్లోకాలు ఈ ఘట్టాన్ని అర్థం చేసుకోవటానికి కీలకం. గరుత్మంతుడు శ్రీరామలక్ష్మణులను బంధ విముక్తులను చేయటానికి దిగి రావటం ఏమిటి అన్న ఆలోచన ఎందరికో కలుగుతుంది.

యుద్ధం కేవలం అస్త్రశస్త్రాలతో, బల పరాక్రమాలతో ఉండదు. కుయుక్తులు, వంచన, మోసం, దగా వంటివి విచ్చలవిడిగా ప్రయోగంలోకి వస్తాయి. అందునా రాక్షస మాయలో నిష్ణాతుడు ఇంద్రజిత్తు. శ్రీరామలక్ష్మణులు సహజమైన, నిర్మలమైన ఋజు స్వభావం కలవారు. సత్యం, ధర్మం, ప్రధానమని ఎంచి సూటిగా వ్యవహరిస్తున్న మానవులుగా మన ముందున్నారు. ఆ విధంగానే యుద్ధం చేస్తున్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ వ్యవహారంలో గల ప్రమాదాన్ని గుర్తు చేసి ఈ కోణంలో కూడా శత్రువుని అర్థం చేసుకుని యుద్ధం చేయమని సూచించాడు గరుత్మంతుడు.

ఈ సందేశం ధర్మాత్ములైన మానవులందరికీ అని తెలుసుకోవలసిన అవసరం యున్నది.

అలా అని చెప్పి ఒక్కసారిగా మీరు కూడా కుటిలంగా మారండి అని చెప్పటం లేదు –

‘శూరాణాం శుద్ధభావానాం భవతామ్ ఆర్జవం బలమ్’ అన్నది గొప్ప మాట – సరళవర్తనమే మహాబలం! దీని భావమేమి?

దైవబలం అనుకూలించి చిక్కుముడి విప్పుతుంది, విప్పాలి అంటే అదే కీలకం.

మహావీరులు, యుద్ధకళలో సమర్థులు ఐన శ్రీరామలక్ష్మణులకు అర్థం కాలేనిది ఏ మాయ చేసాడు ఇంద్రజిత్తు?

ఇంద్రజిత్తు చాలా గొప్ప నిపుణుడు – వీరి ఋజువర్తనమును ఎంచి సూటిగా నాగాస్త్రం ప్రయోగించ లేదు. అలా జరిగినప్పుడు వీరు గరుడాస్త్రాన్ని సంధించేవారు.

అలా కాకుండా బాణాల రూపంలో దాగియున్న సర్పాల సమూహాన్ని పంపించి తికమక చేసాడు.

‘సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలౌ’ అన్నది గమనించాలి. ‘శరముల రూపంలో బంధించిన సర్పములవి.’

మరో చోట ‘శరబంధం సుదారుణమ్’ అన్నాడు.

‘శరజాలచితౌ వీరౌ.. శరతల్పే’ అని కూడా చెప్పాడు మహర్షి.

సత్యము, ధర్మము, దైవబలనునకు దోహదములు. ఎంతటి మాయనైనా ఛేదించునవి అవియే. వాటిని ఆచరించువారు కుటిలత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని జాగ్రత్త వహించాలి కానీ స్వల్పలాభం కోసం లేదా స్వల్పమైన కాలంలోనే ఎంతో లాభాన్ని ఆర్జించాలని అనుకుని దానిని అకస్మాత్తుగా ఆచరించి సత్యధర్మాన్ని, దైవాన్ని దూరం చేసుకోకూడదన్నది ఇక్కడ స్పష్టమవుతున్నది.

మానుష రూపంలో ఉన్న శ్రీరాముడు మహావిష్ణువు యొక్క అవతారమన్నది ఇక్కడ మరోసారి యుద్ధభూమిలో చెప్పడమైనది. స్వస్థానానికి వెళ్ళటానికి గరుత్మంతుడు అనుమతి తీసుకుని శ్రీరామునికి ప్రదక్షిణ చేసి అక్కున చేర్చుకుని అప్పుడు ఆకాశంలోకి ఎగిరాడు.

శ్లో:

తేషు లంకాం ప్రవిష్టేషు రాక్షసేషు మహాబలాః।

సమేత్య హరయః సర్వే హనూమంతమ్ అపూజయన్॥

సోపి ప్రహృష్టస్తాన్ సర్వాన్ హరీన్ ప్రత్యభి పూజయత్।

హనుమాన్ సత్త్వసంపన్నో యథార్హమ్ అనుకూలతః॥

(యుద్ధ కాండ, 56. 35, 36)

హనుమంతుడు అకంపనుని సంహరించాడు. రాక్షసులందరును లంకకు వెళ్లిపోయిన తరువాత మహాబలశాలురైన వానరయోధులెల్లరును హనుమంతుని చుట్టూ చేరి ఆ మహాత్మునకు జేజేలు పలికారు. అప్పుదు వాయుసుతుడు సంతోషంతో ఆ వానర వీరుల గూర్చి మీ సహకారము తోడనే మనకు విజయము దక్కినది అని పల్కుచు, వారి యథోచితముగా పేరు పేరుగా అభినందించాడు.

శ్లో:

ప్రత్యువాచ తతో రామో విభీషణమరిందమ్।

అహో దీప్తో మహాతేజా రావణో రాక్షసేశ్వరః॥

ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణః।

సువ్యక్తం లక్ష్యతే హ్యస్య రూపం తేజః సమావృతమ్॥

దేవదానవ వీరాణాం వపుర్నైవం విధం భవేత్।

యాదృశం రాక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే॥

(యుద్ధ కాండ, 59. 26, 27, 28)

రావణుడు రణభూమి యందు ప్రవేశించినప్పుడు  విభీషణుడు శ్రీరామునికి అతని గురించి వర్ణిస్తూ చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు..

శ్రీరాముడు: రాక్షసేశ్వరుడైన రావణుడు మహాతేజస్సుతో వెలుగొందుచున్నాడు. ఇతడు చూడశక్యము గాని కాంతులతో సూర్యుని వలె విరాజిల్లుతున్నాడు. తేజోమహితమైన ఇతని రూపము స్పష్టముగా కనబడుచున్నది. ఈ రావణుని శరీర శోభా వైభవము ముందు దేవదానవ వీరుల యొక్క దేహకాంతులు తీసికట్టే.

శ్లో:

దిష్ట్యాయమద్య పాపాత్మా మమ దృష్టిపథం గతః।

అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవమ్॥

(యుద్ధ కాండ, 59. 31)

శ్రీరాముడు: దైవికముగా ఈనాడు ఈ పాపాత్ముడు నా కంటబడినాడు. సీతను అపహరించిన ఈ దుర్మార్గుని నేడే (ఇప్పుడే) వధించి నా కోపమును చల్లార్చుకుంటాను!

శ్లో:

తమబ్రవీన్మహాతేజా రామః సత్యపరాక్రమః।

గచ్ఛ! యత్నపరశ్చాపి భవ లక్ష్మణ! సంయుగే॥

రావణోహి మహావీర్యో రణేద్భుత పరాక్రమః।

త్రైలోక్యేనాపి సంక్రుద్ధో దుష్ప్రసహ్యో న సంశయః॥

(యుద్ధ కాండ, 59. 48, 49)

యుద్ధంలో రావణుడు ముందుగా సుగ్రీవుని దెబ్బ తీసాడు. ఆ తరువాత ఎందరో వానర యోధులను నేలకూల్చాడు. అందరూ శ్రీరాముని శరణు వేడారు. శ్రీరాముడు కోదండాన్ని పట్టుకుని యుద్ధానికి సిద్ధమైనప్పుడు లక్ష్మణుడు ముందరికి వచ్చి – నీవెందుకు, వీడి సంగతి నేను చూస్తానన్నాడు.

శ్రీరాముడు: సోదరా! వెళ్ళు. కానీ అతనిని సామాన్యునిగా భావింపవలదు. యుద్ధమున విజయము సాధించుటకు గట్టిగా పూనుకొనుము! రావణుడు మహావీరుడు. రణమునందు అతని పరాక్రమము అత్యద్భుతము. అతడు క్రుద్ధుడైనచో ముల్లోక వీరులును అతడిని ఎదుర్కొనలేరు.

శ్లో:

తస్యచ్ఛిద్రాణి మార్గస్య స్వచ్ఛిద్రాణి చ లక్ష్య।

చక్షుషా ధనుషా యత్నాత్ రక్షాత్మానం సమాహితః॥

(యుద్ధ కాండ, 59. 50)

శ్రీరాముడు: ముందు రావణుని లోపములను గమనించుము. నీలోని లోపములు కూడా సవరించుకో. ఏకాగ్ర చిత్తుడవై ధనస్సును చేబూని జాగరూకతతో నిన్ను నీవు రక్షించుకొనుచూ ఉండు.

(ఇంకా ఉంది)

Exit mobile version