[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
[dropcap]ఇ[/dropcap]ది ఇలా ఉండగా హనుమంతుడు రావణుని రథం వద్దకు వెళ్ళి –
శ్లో.
దేవదానవగంధర్వైః యక్షాశ్చ సహ రాక్షసైః।
అవధ్యత్వం త్వయా ప్రాప్తం వానరేభ్యస్తు తే భయమ్॥
(యుద్ధ కాండ, 59. 55)
హనుమంతుడు: రావణా! బ్రహ్మదేవుని వర ప్రభావమున దేవ, దానవ, గంధర్వుల నుండి గాని, యక్షరాక్షసుల నుండి గాని నీకు మృత్యుభయం లేకపోవచ్చును. కానీ నీకు నరవానరుల నుండి ముప్పు తప్పదు.
ఇలా ఒకనొకకరు అరచేతితో కొట్టుకున్నారు – ఒకసారి రావణుడు, ఒకసారి హనుమంతుడు చలించారు. ఆ తరువాత రావణుడు యుద్ధభూమిలోకి ప్రవేశించి వానర వీరులను భయకంపితులను చేసాడు.
శ్లో:
తమాహ సౌమిత్రిరవిస్మయానో గర్జంతముద్వృత్త సితాగ్రదంష్ట్రమ్।
రాజన్ న గర్జంతి మహాప్రభావా వికత్థసే పాపకృతాం వరిష్ఠ॥
జానామి వీర్యం తవ రాక్షసేంద్ర! బలం ప్రతాపం చ పరాక్రమం చ।
అవస్థితోహం శరచాపపాణిః ఆగచ్ఛకిం మోఘవికత్థనేన॥
(యుద్ధ కాండ, 59. 97, 98)
రావణుడు లక్ష్మణుడితో ఎన్నో ప్రగల్భాలు పలికాడు. అప్పుడు లక్ష్మణుడు:
పాపాత్ములలో మేటివైన ఓ రాజా! నిన్ను గూర్చి నీవే గొప్పలు చెప్పుకుంటావెందుకు? సత్పురుషులు ఇట్లు ప్రగల్భములు పలుకరు సుమా! దొంగతనంగా సీతాదేవిని అపహరించిన ఈ పరాక్రమం తెలుస్తూనే ఉంది. నేను ఇప్పుడు ధనుర్బాణాలను ధరించి యున్నాను. వ్యర్థ ప్రగల్భాలు మాని నాతో పోరాటానికి రమ్ము!
చాలా గట్టి పోరు జరిగిన తరువాత బ్రహ్మదత్తమైన ‘శక్తి’ ఆయుధమును ప్రయోగించాడు రావణుడు. లక్ష్మణుడు భూమి మీద పడ్డాడు. రావణుడు లక్ష్మణుని తన చేతులతో లేవనెత్తే ప్రయత్నం చేసాడు కానీ అతని వల్ల కాలేదు.
శ్లో:
శక్త్యా బ్రాహ్మ్యాహి సౌమిత్రిః తాడితాస్తు స్తనాంతరే।
విష్ణోరచింత్యం స్వం భాగమ్ ఆత్మానం ప్రత్యనుస్మరత్॥
తతో దానవ దర్పఘ్నం సౌమిత్రిం దేవకంటకః।
తం పీడయిత్వా బాహుభ్యాం అప్రభుర్లంఘనేభవత్।
అథైవం వైష్ణవం భోగం మానుషం దేహమాస్థితమ్॥
(యుద్ధ కాండ, 59. 112, 113)
లక్ష్మణుడు ఊహించనలవి కాని శ్రీ మహావిష్ణువు యొక్క నాల్గవ అంశ ఐన తనను గుర్తుకు తెచ్చుకున్నాడు.
మానవ దేహమును ఆశ్రయించిన వైష్ణవాంశ ఐన, దానవుల దర్పమును అణచినవాడును ఐన లక్ష్మణుని రావణుడు తన రెండు చేతులతో అటునిటు కదల్చుటకు యత్నించిననను ఆ స్వామిని లేవనెత్తలేకపోయాడు.
శ్లో:
అథ వాయుసుతః క్రుద్ధో రావణం సమభిద్రవత్।
ఆజఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టినా॥
తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వరః।
జానుభ్యామ్ అపతద్భూమౌ చచాల చ పపాతచ॥
(యుద్ధ కాండ, 59. 114, 115)
హనుమంతుడు విజృంభించి బలమైన పిడికిలితో రావణుని వక్షస్థలం మీద దెబ్బతీసాడు. ఆ ముష్టి ప్రహారానికి తట్టుకోలేక రావణుడు మోకాళ్ళమీద చతికిలబడ్డాడు. తరువాత కంపించుచూ రణభుమి మీద పడిపోయాడు.
(నోటి నుండి, కనుల నుండి, చెవుల నుండి రక్తం కారింది. తిన్నగా రథం మీదకి వెళ్ళి నిశ్చేష్టుడై కూలబడి చాలా కాలానికి స్పృహలోకి వచ్చి కూడా బలం పుంజుకోలేదు. దేవతలు హర్షించారు.)
శ్లో:
హనూమానపి తేజస్వీ లక్ష్మణం రావణార్ధితమ్।
అనయద్రాఘవాభ్యాశం బాహుభ్యాం పరిగృహ్యతమ్॥
(యుద్ధ కాండ, 59. 119)
అనంతరం లక్ష్మణుని బాహువులతో లేవనెత్తుకుని శ్రీరాముని సమీపమునకు తీసుకొని వచ్చాడు హనుమంతుడు.
(అదీ మన హనుమంతుడు!)
శ్లో:
అథైవమ్ ఉపసంగమ్య హనూమాన్ వాక్యమబ్రవీత్।
మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి।
విష్ణుర్యథా గరుత్మంతం బలవంతం సమాహితః॥
తచ్ఛ్రుత్వా రాఘవో వాక్యం వాయుపుత్రేణ భాషితమ్।
ఆరురోహ మహాశూరం బలవంతం మహాకపిమ్॥
(యుద్ధ కాండ, 59. 125, 126)
శ్రీరాముడు రావణునితో యుద్ధానికి సిద్ధమైనాడు.
హనుమంతుడు: ప్రభూ! శ్రీమహావిష్ణువు మహాబలశాలియైన గరుత్మంతునిపై ఆశీనుడై అసురులను వధించినట్లు, నీవు నా భుజములపై చేరి, రావణుని శిక్షింపదగును!
శ్రీరాముడు ఆ వానరోత్తముని భుజములపై ఆశీనుడైనాడు.
శ్లో:
యశ్చైవ శక్త్యాభి హతస్త్వ యాద్య ఇచ్ఛన్ విషాదం సహసాభ్యుపేత్య।
స ఏవ రక్షోగణరాజమృత్యుః సపుత్ర దారస్య తవాద్య యుద్ధే॥
ఏతేన చాత్యద్భుతదర్శనాని శరైర్జన స్థానకృతాలయాని।
చతుర్ధశాన్యాత్త వరాయుధాని రక్షః సహస్రాణి నిషూదితాని॥
(యుద్ధ కాండ, 59. 133, 134)
శ్రీరాముడు: రాక్షసరాజా! నీవు ప్రయోగించిన ‘శక్తి’ ప్రహారము వలన లక్ష్మణుడు విషాదమునకు లోనైనాడు (గాయపడ్డాడు).
అందువలన అతనే నేనుగా ప్రతిజ్ఞ పూని నిన్ను చంపుటకు వచ్చాను. భార్యాపుత్రాది పరివారములతో గూడిన నీ పాలిటి మృత్యువును నేనే. ఇదిగో నా శస్త్రములను ఒక్కసారి చూడు. భయంకరమైన రూపములు గలవారు, దండకారణ్య నివాసులు, శ్రేష్ఠమైన ఆయుధములను ధరించినవారు ఐన పలునాలుగు వేలమంది రాక్షసులను హతమార్చినవి ఈ శస్త్రములే!
శ్లో:
యోవజ్రపాతశనిసన్నిపాతాన్
న చక్షుభేనాపిచచాలరాజా।
స రామబాణాభిహతో భృశార్తః
చచాల చాపం చ ముమోచ వీరః॥
(యుద్ధ కాండ, 59. 140)
వజ్రాయుధ ప్రహారములు, పిడుగుపాటులు మొదలగు ఉపద్రవములు ఎన్ని వచ్చి మీద పడినప్పటికినీ ఆర్తిని పొందని, ఏ మాత్రం చలించని మహావీరుడగు రావణుడు శ్రీరాముని బాణధాటికి తట్టుకొనలేక మిగుల ఆర్తుడై కంపించిపోయాడు. అతని ధనుస్సు చేతిలో నుండి జారిపోయింది.
శ్లో:
కృతం త్వయా కర్మమహత్ సుభీమం హతప్రవీరశ్చ కృతస్త్వయాహమ్।
తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య న త్వాం శరైర్మృత్యువశం నయామి॥
గచ్ఛానుజానామి రణార్ధితస్త్వం ప్రవిశ్య రాత్రించ రరాజ! లంకామ్।
ఆశ్వస్య నిర్యాహి రథీ చ ధన్వీ తదాబలం ద్రక్ష్యసి మే రథస్థః॥
(యుద్ధ కాండ, 59. 143, 144)
శ్రీరాముడు: రావణా! ఇతరులకు అసాధ్యమైన రీతిలో నీవు ఘోరయుద్ధము చేసి యున్నావు. ఫలితముగా నా పక్షమునందలి పెక్కుమంది గట్టి వీరులు నేలకొరిగారు. ఇప్పుడు బాగా అలసియున్నావు. అందువలన ఇప్పుడు నేను నిన్ను నా బాణములకు గురి చేసి మృత్యుముఖమునకు పంపను. ఇది నిశ్చయము. రాక్షసరాజా! ఇంక లంకకు వెళ్లి సేద దీర్చుకొనుము. తరువాత ధనుర్ధారివై రథముపై తిరిగిరమ్ము. అప్పుడు నా బలమెంతటిదో తెలిసివచ్చును.
రావణుడు (స్వగతం) అంతఃపురానికి తిరిగి వెళ్లి –
శ్లో:
విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్।
ఇక్ష్వాకు కులనాథేన అనరణ్యేన యత్ పురా॥
(యుద్ధ కాండ, 60. 8)
(మా వంశంలో జన్మించే వాని చేతిలో సర్వనాశనమవుతావని రావణుని అనరణ్యుడు శపించియున్నాడు)
దశరథుని కుమారుడైన ఈ శ్రీరాముడే అతను తెలిపిన మానవ వీరుడని నాకిప్పుడు స్పష్టమగుచున్నది.
శ్లో:
శప్తోహం వేదవత్యా చ యదా సా ధర్షితా పురా।
సేయం సీతా మహాభాగా జాతా జనకనందినీ॥
ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణ కన్యకా।
యథోక్తాస్తపసా ప్రాప్తం న మిథ్యా ఋషిభాషితమ్॥
(యుద్ధ కాండ, 60. 10, 11)
రావణుడు: పూర్వము నేను వేదవతిని అవమానించి ఆమె శాపమునకు గురి అయినాను. ఆ మహాత్మురాలే జనకుని కూతురై ‘సీత’గా జన్మించినది. ఉమాదేవియు, నందీశ్వరుడు, దేవకన్యయైన రంభయు, వరుణుని కూతురైన పూజికస్థలయునన్ను శపించి యున్నారు. మహాత్ముల శాపములు వ్యర్థములు కావు కదా!
(ఈ ఘట్టములు ఉత్తర కాండలో వస్తాయి. అక్కడ వివరంగా చెప్పటం జరిగింది. ఉత్తర కాండ మహర్షి కృతమనటానికి ఇది తార్కాణం – కవి ఒక పాత్ర ద్వారా కొన్ని విషయాలను ప్రస్తావించిన తరువాత వాటి గురించి పూర్తిగా చెప్పకుండా కథను ముగించటం జరుగదు. ఉత్తర కాండ శ్రీరామావతారానికి గల నేపథ్యాన్ని రావణుని చరిత్ర ద్వారా విస్తరింపజేసే వివరం. యుద్ధ కాండలోనూ, ఇతరత్ర ప్రస్తావించిన అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తర కాండలో ఏవి అనవసరైన కల్పనలు, ఏవి కావు అని తెల్చుకునే అవకాశం ఉన్నది. కావ్య లక్షణాన్ని పాత్రల నిష్కర్షని చూసుకుని ఉత్తర కాండ ఇంత వరకే అని కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ఆ కాండ లేనే లేదనటం హ్రస్వదృష్టితో పాటు కించిత్ బుద్ధిలోపం కూడా అవుతుంది. ఈ వివరం ఆ సందర్భంలో చూద్దాం.)
కుంభకర్ణుని నిద్ర లేపారు.
శ్లో:
ఏకేనాహ్నాత్వసౌవీరః చరన్ భూమిం బుభుక్షితః।
వ్యాత్తాస్యో భక్షయేల్లోకాన్ సంకృద్ధ ఇవపావకః॥
(యుద్ధ కాండ, 61. 29)
వరుసగా ఆరు నెలల కాలం నిద్రించి ఒక్కరోజు మేల్కొంటాడు. ఆ ఒక్క రోజులోనే ఈ వీరుడు అంతులేని ఆకలితో లోకములోని ప్రాణులను ఆవురావురమని భక్షిస్తాడు.
శ్లో:
ఉచ్యంతాం వానరాః సర్వేయంత్రమేతత్ సముచ్ఛ్రితమ్।
ఇతి విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయాః॥
(యుద్ధ కాండ, 61. 33)
‘ఈ వచ్చుచున్నది కల్పితమైన ఒక యంత్రము మాత్రమే’ అని ఇప్పుడు వానరులకు తెలుపవలెను. దానితో వారి భయము పోతుంది.. అని విభీషణుడు తెలిపాడు.
కుంభకర్ణుడు రావణునికి ఎంతగానో హితవు తెలిపాడు.
శ్లో:
ధర్మం అర్థం చ కామం చ సర్వాన్ వా రక్షసాం పతే।
భజతే పురుషః కాలేప్రాణి ద్వంద్వాని వాపునః॥
త్రిషు చైతేషు యశ్శ్రేష్ఠం శ్రుత్వా తన్నావ బుధ్యతే।
రాజా వా రాజ మాత్రో వా వ్యర్థం తస్య బహు శ్రుతమ్॥
(యుద్ధ కాండ, 63. 9, 10)
కుంభకర్ణుడు: ధర్మము, అర్థము, కామము అను పురుషార్థములను వాటికి తగిన కాలము యందు అనుసరించాలి. అర్థకామముల విషయములో ధర్మమును విస్మరించకూడదు. అలా విస్మరించిన వాడు అథముడు. మూడిటిలో ధర్మమే శ్రేష్ఠమైనది. అందుచేత ప్రత్యేకమైన పరిస్థితులలో అర్థకామములను ఉపేక్షించి కూడా ధర్మమునే ఆచరించాలి. రాజు గానీ, రాజసదృశ్యుడు గానీ ఈ విషయమూలో విజ్ఞుల నుండి ఎరిగి వాటిని మనస్సున నిలుపుకొననిచో, ఆచరించనిచో అతని శాస్త్ర జ్ఞానము వ్యర్థము.
శ్లో:
ఉపప్రదానం సాంత్వం వా భేదం కాలే చ విక్రమమ్।
యోగం చ రక్షసాం శ్రేష్ఠ! తావు భౌ చ నయానయౌ॥
కాలే ధర్మార్థకామాన్ యః సంమంత్ర్య స సచివైః సహ।
నిషేవేతాత్మవాన్ లోకే న స వ్యసనమాప్నుయాత్॥
(యుద్ధ కాండ, 63. 11, 12)
ధీశాలియైన ప్రభువు మంత్రులతో బాగా ఆలోచించి సమయానుసారంగా సామ, దాన, భేద, దండోపాయములను ఏదో విధములైన పద్ధతుల ద్వారా న్యాయాన్యాయములను అనుసరించి సమయోచితంగా ధర్మార్థకామములను ఆచరించును. అట్టివారికి ఆపదలు రావు.
శ్లో:
హితానుబంధమ్ ఆలోచ్య కార్యాత్కార్యమిహాత్మనః।
రాజా సహార్థత త్త్వజ్ఞైః సచివైః సహి జీవతి॥
(యుద్ధ కాండ, 63. 13)
ఉత్తముడైన రాజు అర్థశాస్త్రములను బాగుగా ఎరిగిన ప్రజ్ఞాశాలురైన మంత్రులతో తన కార్యాకార్యములను బాగా చర్చించాలి. తరువాత మేలు గూర్చెడి కార్యములనే ఆచరించాలి. హానికారములైన వాటిని వర్జించాలి. అటువంటివాడే కలకాలము మన్నగలడు.
శ్లో:
యదుక్తమిహ తేపూర్వం క్రియతా మనుజేన చ।
తదేవ నోహితం వాక్యం యదిచ్ఛసి చ తత్కురు॥
(యుద్ధ కాండ, 63. 21)
ఇదివరకు సోదరుడైన విభీషణుడు చెప్పిన రీతిగా సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపుము. దాని వలన మనకు మేలు కలుగును. ఇది నీకు నచ్చినచో ఆ విధముగా చేయుము.
శ్లో:
విభ్రమాచ్చిత్త మోహాద్వా బలవీర్యా శ్రయేణ వా।
నాభిపన్నమిదానీం యత్ వ్యర్థాతస్య పునః కథాః॥
అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం।
గతం తు నానుశోచంతి గతం తు గతమేవహి॥
(యుద్ధ కాండ, 63. 24, 25)
రావణుడు: భ్రాంతితో నీ మాటలు (గర్వంతో కూడా) చెవికెక్కించుకొనలేదు. పాత కథలను త్రవ్వటం వ్యర్థం. తెలివిగల వారు, జరిగిపోయిన వాటిని తలంచి చింతింపరు.
(ముందు పని చూడు)
శ్లో:
అహముత్సాదయిష్యామి శత్రూంస్తవ మహాబలః
(యుద్ధ కాండ, 63. 42)
కుంభకర్ణుడు: నీ ఇష్టానుసారము ఇప్పుడైనను నన్ను యుద్ధానికి పంపు!
శ్లో:
నన్విదం త్రిదివం సర్వమ్ అహరస్య న పూర్యతే!
(యుద్ధ కాండ, 63. 56)
ఈ ముల్లోకములలోని ప్రాణులు అన్నింటిని భక్షించినను నా ఆకలి చల్లారదు.
(ఇంకా ఉంది)