[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
అన్యోన్యం చ సమాశ్లిష్య కపయో హృష్టమానసాః।
చక్రురుచ్చావ చ గుణా రాఘవాశ్రయ జాః కథాః॥
(యుద్ధ కాండ, 91. 97)
వానర వీరులు నాట్యం చేసారు. పరస్పరం కౌగిలించుకున్నారు. శ్రీరాముని ఉత్తమ గుణములను, ఆయన పవిత్ర కథలను కొనియాడారు!
శ్లో:
న తే దదృశిరే రామం దహంతమ్ అరివాహినీమ్।
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా॥
(యుద్ధ కాండ, 94. 26)
గాయత్రి రామాయణంలో గల శ్లోకం ఇది.
శ్రీరాముడు ప్రయోగించిన దివ్యమైన గాంధర్వాస్త్ర ప్రభావమునకు రాక్షస యోధులెల్లరు సమ్మోహితులయ్యిరి. గొప్ప అస్త్రం ఇది. ఒక్కోసారి 100 మంది శ్రీరాములు, ఆ ధనువును మెరుస్తున్న చక్రం గానూ.. రకరకాలుగా భ్రమించారు.
శ్లో:
దివ్యాస్త్రగుణ పర్యంతం నిఘ్నంతం యుధి రాక్షసాన్।
దదృశూ రామచక్రం తత్ కాల చక్రమివ ప్రజాః॥
(యుద్ధ కాండ, 94. 30)
మహర్షి రూపకల్పనలో అత్యద్భుతమైనది –
ప్రజలకు ప్రళయ కాలమునందు కాలచక్రము వలె రాక్షసులు యుద్ధరంగమున తమను పరిమార్చుతున్న శ్రీరాముడు చక్రాకృతిలో కనిపిస్తున్నాడు. ఆయన నాభిస్థానమే ఆ చక్రము యొక్క మధ్య భాగము. ఆయన పరాక్రమమే ఆ చక్ర జ్వాలలు, బాణములే చువ్వలు, మండాలాకృతిలో నున్న ధనుస్సే అంచులు, ధనుష్టంకారములే చక్రధ్వనులు, ఆయన శరీర కాంతులు బుద్ధిబలము, గుణములే ఆ చక్రము యొక్క కాంతులు, దివ్యాస్త్ర ప్రభావములే చక్రధారలు – ఇట్లు కాలచక్రాకృతిలో నున్న శ్రీరామచక్రమును వారు దర్శించిరి.
కాలచక్రం – జ్యోతిష్చక్రం – రామచక్రం!
శ్రీరామ ఉపాసనలో ఉన్నవారికి అంతా జ్యోతిర్మయమైన చక్రమే! కాలచక్రం లోని సమస్యలు వారికి ఉండవు! ఈ రాక్షసులు ఎంత అదృష్టవంతులో కదా!
శ్లో:
అబ్రవీచ్ఛ తదారామః సుగ్రీవం ప్రత్యనంతరమ్।
విభీషణం చ ధర్మాత్మా హనూమంతం చ వానరమ్॥
జాంబవంతం హరిశ్రేష్ఠం మైందం ద్వివిదమేవ చ।
ఏతదస్త్రబలం దివ్యం మమ వా త్ర్యంబకస్యవా॥
(యుద్ధ కాండ, 94. 37, 38)
దివిలో శ్రీరాముని వీరవిహారాన్నీ, విన్యాసాన్నీ అందరూ కొనియాడారు. శ్రీరాముడు కూడా దృశ్యాన్ని అలా చూస్తూ ఒక మాట అన్నాడు – విభీషణాదులతో – ఈ దివ్యాస్త్ర బలం నాకును, త్ర్యంబకుడైన ఆ పరమశివునికి మాత్రమే కలదు!
..ఇది మరో అద్భుతం – శివుడు కాలగ్నిరుద్రుడు! నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటాడు! అసలు సృష్టియే శ్రీరామ చక్రం! శ్రీరామ కథాగమనమే కాలగమనం!
శ్లో:
తామను వ్యాహరచ్ఛక్తిమ్ అపతంతీం స రాఘవః।
స్వస్త్యస్తు లక్ష్మణాయేతి మోఘా భవ హతోద్యమా॥
రావణేన రణేశక్తిః క్రుద్ధేనా శీవిషోపమాః।
ముక్తా శూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జసా॥
(యుద్ధ కాండ, 101. 33, 34)
రావణుడు లక్ష్మణునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది లక్ష్మణుని చేరే ముందరే శ్రీరాముడు ‘ఓ బల్లెమా! లక్ష్మణునకు శుభమగు గాక! నీలో గల ప్రాణహరణ శక్తి నశించుగాక’ అని పలికెను.
అది లక్ష్మణుని మీద పడింది. కానీ శ్రీరాముని ప్రభావము వలన ప్రాణహనన శక్తిని కోల్పోయింది. లక్ష్మణుడు నేలపై పడ్డాడు.
శ్లో:
అస్మిన్ ముహూర్తే నచిరాత్ సత్యం ప్రతిశృణోమివః।
అరావణం అరామం వా జగద్ధ్రక్ష్యథ వానరాః॥
(యుద్ధ కాండ, 101. 49)
శ్రీరాముడు: వానరులరా! ఇప్పుడే మీ ముందు సత్యప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ జగత్తు నందు రావణుడో, రాముడో మిగిలియుండుట తథ్యము. దీనిని త్వరలోనే మీరు చూడగలరు.
శ్లో:
దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః।
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః॥
(యుద్ధ కాండ, 102. 13)
శ్రీరాముడు: ఏ దేశమునందైనను భార్యా లభింపవచ్చును, బంధువులు ప్రాప్తించవచ్చును. కానీ లక్ష్మణుని వంటి అనుంగు సొదరుడు ఎచ్చటను దొరకడు.
సుషేణుడు ఓదార్చాడు. లక్ష్మణునిలో జీవకళ అలాగే ఉందని చెప్పి హనుమంతుని మరల ఔషధులు తెమ్మన్నాడు.
శ్లో:
దక్షిణే శిఖరే తస్య జాతమ్ ఔషధిమానయ।
విశల్య కరణీం నామ విశల్యకరణీం శుభామ్॥
సవర్ణకరణీం చాపి తథా సంజీవనీమపి।
సంధానకరణీం చాపి గత్వా శీఘ్రమిహానయ।
సంజీవనార్థం వీరస్య లక్ష్మణస్య మహాత్మనః॥
(యుద్ధ కాండ, 102. 22, 23)
హనుమంతుడు మరల సమయం వృథా ఎందుకని ఔషధులను గుర్తు పట్టేందుకు సమయం వెచ్చించక, శిఖరాన్నే ఎత్తుకుని వచ్చాడు (ఈ మెక్కలన్నీ ఒకలాగే ఉండడం, మెరవటం వలన ఆ విద్య తెలిసిన వారే గుర్తుపట్టగలరు – ఎన్ని సార్లు చూసినా అందరికీ ఒకలాగే ఉంటాయి!).
లక్ష్మణునికి చికిత్స జరిగి లేచి కూర్చున్నాడు.
యుద్ధం పునః ప్రారంభమైనది..
శ్లో:
మమ భార్యా జనస్థానాత్ అజ్ఞానాద్రాక్షసాధమ।
హృతా తే వివశా యస్మాత్ తస్మాత్ త్వం నాసి వీర్యవాన్॥
మయా విరహితాం దీనాం వర్తమానాం మహావనే।
వైదేహీం ప్రసభం హృత్వా శూరోహమ్ ఇతి మన్యసే॥
స్త్రీషు శూర! వినాథాసు పర దారాభిమర్శక!।
కృత్వా కాపురుషం కర్మ శూరోహమ్ ఇతి మన్యసే॥
భిన్నమర్యాద! నిర్లజ్జ! చారిత్రేష్వనవస్థిత।
దర్పాన్మృత్యుమ్ ఉపాదాయ శూరోహమ్ ఇతి మన్యసే॥
(యుద్ధ కాండ, 105. 11, 12, 13, 14)
శ్రీరాముడు రావణునితో: రాక్షసాధమా! జనస్థానంలో నేను లేనప్పుడు నా భార్యను అపహరించావు. నీవు పిరికివాడివని అర్థమవుతోంది. ఐనను శూరుడిగా భావించుకుంటున్నావు. నిస్సహాయ స్థితిలో ఉన్న పరసతుల యెడ అమర్యాదగా ప్రవర్తించువాడా! మర్యాదను తప్పినవాడా! సిగ్గు లేని వాడా! సచ్చరిత్రకు దూరమైన వాడా! గర్వముతో ఏదీ కనిపించక నీ మృత్యువునే కొని తెచ్చుకున్నావు.
శ్లో:
యదా చ శస్త్రం నారేభే నవ్య కర్షచ్ఛ రాసనమ్।
నాస్య ప్రత్యకరో ద్వీర్యం విక్లబేనాంతరాత్మనా॥
క్షిప్తాశ్చాపి శరాస్తేన శస్త్రాణి వివిధాని చ।
న రణార్థాయ వర్తంతే మృత్యుకాలేభి వర్తతః॥
సూతస్తు రథనేతాస్య తదవస్థం సమీక్ష్య తమ్!।
శనైర్యుద్ధాసంభ్రాంతో రథం తస్యాపవాహయత్॥
(యుద్ధ కాండ, 105. 28, 29, 30)
రావణుడు శ్రీరాముని యుద్ధ పటిమను తట్టుకోలేకపోయాడు. ధనుస్సు లాగి శస్త్రములను వేయలేకపోయాడు. సారథి అతని దురవస్థను చూసి ప్రక్కకు మళ్ళించాడు.
రావణుడు ఓపిక తెచ్చుకుని సారథిని మందలించి తిరిగి శ్రీరాముని ముందరకు వచ్చాడు.
..ఈ సందర్భంలో ‘ఆదిత్య హృదయం’ అనునది మనకు కనిపిస్తుంది. ఇందులోని మొదటి శ్లోకం ‘తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థిమ్’ – అనగా శ్రీరాముడు అలసి యున్నాడు, చింతాక్రాంతుడై యున్నాడు అని!
అలా జరుగలేదు కదా! అప్పటివరకు ఉటంకించని (యుద్ధంలో) అగస్త్యుడు ఒక్కసారిగా ఉపదేశానికి రావటమేమిటి?
ఇలాంటివి చర్చలోకి రావటం సమంజసమే. బహుశః ఈ సర్గ (107) స్థానం తారుమారైనదా? లక్ష్మణుడు మూర్ఛపోయినప్పటిదా? కానీ అప్పుడు రావణుడు యుద్ధం చేస్తున్నాడు. సిధ్ధపడి వచ్చి నిలబడి యుండలేదు. పోనీ మొదటిసారి తలపడ్డ సందర్భమా? అప్పుడు శ్రీరాముడు వీరవిహారం చేసి, నేడు పోయి రేపు రమ్ము అన్నాడు!
ఈ స్తోత్రం వాల్మీకి రామాయణం లోనిదా అనునది చర్చనీయాంశమే! స్తోత్రం ఎంతో గొప్పది.
శ్లో:
జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమోనమః।
నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః॥
(యుద్ధ కాండ, 107. 17)
జయములను, శుభములను చేకూర్చువాడవు.
శ్లో:
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః।
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్॥
(యుద్ధ కాండ, 107. 23)
సకల ప్రాణులలో సూర్యుడు అంతర్యామిగా నుండును. వారు నిద్రించున్నను తాను మేల్కొనియే యుండును. ఆయనే అగ్నిహోత్రము, ఫలము తానే.
శ్లో:
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి।
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్॥
(యుద్ధ కాండ, 107. 27)
‘ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు’ అని చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు!
..ఒకవేళ ఇందులోనిదే ఐతే –
పలుమార్లు తలపడిన రావణుడికి ఈ సారికిది చివరి యుద్ధం నాయనా, ఇక చిత్తశుద్ధితో, అంతఃకరణ సాక్షిగా ఆ రాక్షసాధముని హతమార్చగలవు అని స్మరణ చేయించేందుకు అగస్త్యుడు ఉపదేశించినట్లు తెలుసుకొనుట సమంజసం!
ఇదే లేకపోతే శ్రీరాముడు రావణ వధ చేసి యుండెడివాడు కాదు అనుకొనుట అసమంజసం! అటువంటి చిత్రీకరణ సంఘటనల ద్వారా గాని, యావత్ యుద్ధకాండలో కానీ మహర్షి చేసి యుండలేదు.
శ్లో:
గగనం గగనాకారం సాగరః సాగరోపమః।
రామ రావణ యోర్యుద్ధం రామరావణ యోరివ।
ఏవం బ్రువంతో దదృశుః తద్యుద్ధం రామరావణమ్॥
(యుద్ధ కాండ, 110. 24)
గంధర్వులు, అప్సరసలు అనుకొన్నారు –
ఆకాశమునకు ఆకాశమే సాటి. మహాసముద్రమునకు మహాసముద్రమే సాటి. అట్లే రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే సాటి!
శ్లో:
అథ సంస్మార యామాస రాఘవం మాతలి స్తదా।
అజానన్నివ కిం వీర త్వమేనమ్ అనువర్తసే॥
విసృజాస్మై వధాయత్వమ్ అస్త్రం పైతామహం ప్రభో।
వినాశకాలః కథితోః యః సురైః సోద్యవర్తతే॥
(యుద్ధ కాండ, 111. 1, 2)
మాతలి: రఘువీరా! ఏమీ తెలియనట్తు అతని బాణాలను నివారిస్తున్నావు గాని అతని వధకు పూనుకోవేమి?
బ్రహ్మాస్త్రము ప్రయోగించు. మానవుని చేతిలోనే ఇతడు అసువులను కోల్పోవునన్నది జ్ఞప్తికి తెచ్చుకో!
శ్లో:
అభిమంత్ర్య తతో రామస్తం మహేషుం మహాబలః।
వేదప్రోక్తేన విధినా సందధే కార్ముకే బలీ॥
(యుద్ధ కాండ, 111. 14)
శ్రీరాముడు వేదమంత్రములతో అభిమంత్రించి బ్రహ్మాస్త్రమును ధనుస్సునందు ఎక్కుపెట్టాడు.
శ్లో:
స విసృష్టో మహావేగః శరీరాంతకరః శరః।
బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః॥
(యుద్ధ కాండ, 111. 18)
ఆ అస్త్రం అతి వేగముగా వెళ్ళి రావణుని హృదయమును చీల్చేసింది.
..రావణుని గర్భంలో అమృతభాండమున్నదని, వాయుదేవుని చర్య వలన శ్రీరామబాణం దారి మళ్ళి ఉదరంలో నాటుకున్నదన్నది ఎంత తప్పుడు ప్రచారమో అర్థమవుతుంది!
(ఇంకా ఉంది)