[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
న కామకారః కామం వా తవ రాక్షస పుంగవ।
దైవం చేష్టయతే సర్వం హతం దైవేన హన్యతే॥
(యుద్ధ కాండ, 113. 23)
రావణ పత్నులు: రాక్షసశ్రేష్ఠా! నీ స్వేచ్ఛా ప్రవృత్తియే నిజముగా ఈ వినాశనమునకు కారణము కాకపోవచ్చు. విధి విలాసం కావచ్చు. దైవోపహతునకు చావు తప్పదు!
శ్లో.
వ్యక్తమ్ ఏష మహాయోగీ పరమాత్మా సనాతనః।
అనాది మధ్యనిధనో మహతః పరమో మహాన్॥
తమసః పరమో ధాతా శంఖచక్రగదాధరః।
శ్రీవత్సవక్షా నిత్యశ్రీః అజయ్యః శాశ్వతోధ్రువః॥
మానుషం రూపమాస్థాయవిష్ణుః సత్యపరాక్రమః।
సర్వైః పరివృతో దేవైః వానరత్వముపాగతైః॥
సర్వలోకేశ్వరః సాక్షాత్ లోకానాం హితకామ్యయా।
సరాక్షస పరీవారం హత వాం స్త్వాం మహాద్యుతిః॥
ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా।
స్మరద్భిరివ తద్వైరమ్ ఇంద్రియైరేవ నిర్జితః॥
(యుద్ధ కాండ, 114. 14-18)
మండోదరి విలపిస్తూ: శ్రీరాముడు మహాయోగి. సనాతనుడైన పరమాత్మ. ఆది మధ్యాంత రహితుడు. మహత్తులకు మించిన మహత్తైన వాడు. జ్ఞాన స్వరూపుడు. సమస్త ప్రాణులను పోషించువాడు. శంఖచక్రగదాధారి. శ్రీవత్స చిహ్నాలు గలవాడు. హృదయము లక్ష్మీనివాసము. అజేయుడు. పరిణామ రహితుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లోకోపకారార్థం మానవుడిగా అవతరించాడు. ఈ వానరులందరూ దేవతల అంశలే. సర్వలోకేశ్వరుడైన ఈ దివ్య తేజస్వి సమస్త రాక్షస పరివారములతో నున్న నిన్ను హతమార్చినాడు.
నాథా! పూర్వం నీవు ఇంద్రియములను నిగ్రహించి మహాశక్తిమంతుడవై ముల్లోకాలను జయించావు. ఇప్పుడు ఇంద్రియములు ఆ వైరమును స్మరిస్తూ నీపై పగ దీర్చుకున్నవి!
.. ఈ చివరి శ్లోకం (18) ‘మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః యత్ క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితమ్’ అను వాల్మీకి మహర్షి హృదయంలోంచి వచ్చిన శ్లోకాన్ని గుర్తు చేస్తుంది.
‘ఆడ క్రౌంచ పక్షి కామమోహితుదైన మగ పక్షి వద్ద కూర్చుని విలపిస్తోందా?’ అన్నది స్ఫురిస్తుంది. రచనలోని వ్యూహం – ఇంద్రియాలను వశం చేసుకున్నందుకు అవి పగ తీర్చుకోవటం – అక్కడ క్రౌంచ పక్షుల దగ్గర అంశం సూక్ష్మాతి సూక్ష్మం. ఇక్కడ స్థూలంగా ముందుకు వచ్చింది!
శ్లో.
పతివ్రతాయా స్తపసా నూనం దగ్ధోసి మే ప్రభో॥
(యుద్ధ కాండ, 114. 23)
మండోదరి: సీతాసాధ్వి తపస్సు ప్రభావముననే నీవు బుగ్గిపాలైనావు!
శ్లో.
మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్।
క్రియతామ్ అస్య సంస్కారో మమాప్యేష యథాతవ॥
(యుద్ధ కాండ, 114. 101)
విభీషణుడు క్రియలు చేయనన్నాడు. వైరమనేది వ్యక్తి మరణించువరకే, అతనికే కాదు, స్వయంగా రామునికి కూడా గౌరవనీయుడే కాబట్టి అంత్యక్రియలు చేయమని చెప్పాడు శ్రీరాముడు.
శ్లో.
వైదేహీ! కుశలీరామః సహ సుగ్రీవలక్ష్మణః।
విభీషణ సహాయశ్చ హరీణాం సహితో బలైః॥
(యుద్ధ కాండ, 116. 6)
హనుమంతుడు సీతాదేవితో: అమ్మా! వైదేహీ! శ్రీరాముడును, లక్ష్మణుడును కుశలమే. సుగ్రీవుడు, విభీషణుడు, వానర వీరులందరునూ క్షేమమే.
శ్లో.
పృష్ట్వాతు కుశలం రామో వీరస్త్వాం రఘునందనః।
అబ్రవీత్ పరమప్రీతః కృతార్థేనాంతరాత్మనా॥
ప్రియమ్ ఆఖ్యామి తే దేవి! త్వాం తు భూయః సభాజయే।
దిష్ట్యా జీవసి ధర్మజ్ఞే! జయేన మమ సంయుగే।
తవ ప్రభావాద్ధర్మజ్ఞే! మహాన్ రామేణ సంయుగే॥
లబ్ధో నో విజయః సీతే స్వస్థా భవ గతవ్యథా।
రావణశ్చ హతః శత్రుః లంకా చేయం వశే స్థితా॥
మయా హ్యలబ్ధనిద్రేణ దృఢేన తవ నిర్జయే।
ప్రతిజ్ఞైషా వినిస్తీర్ణా బద్ధ్వా సేతుం మహోదధౌ॥
సంభ్రమశ్చ న గంతవ్యో వర్తంత్యా రావణాలయే।
విభీషణ విధేయం హి లంకైశ్వర్యమిదం కృతమ్॥
తదాశ్వసిహి విశ్వస్తా స్వగృహే పరివర్తసే।
అయం చాభ్యేతి సంహృష్టః త్వద్దర్శన సముత్సుకః॥
ఏవముక్తా సముత్పత్య సీతా శశినిభాననా।
ప్రహర్షేణా వరుద్ధా సా వ్యాజహార న కించన॥
అబ్రవీచ్చ హరిశ్రేష్ఠః సీతామ్ అప్రతిజల్పతీమ్।
కిం ను చింతయసే దేవి! కిం ను మాం నాభిభాషసే॥
ఏవముక్తా హనుమతా సీతా ధర్మే వ్యవస్థితా।
అబ్రవీత్ పరమప్రీతా హర్షగద్గదయా గిరా॥
ప్రియమ్ ఏతదుపశ్రుత్య భర్తుర్విజయసంశ్రితమ్।
ప్రహర్ష వశమాపన్నా నిర్వాక్యాస్మి క్షణాంతరమ్॥
న హి పశ్యామి సదృశం చింతయంతీ ప్లవంగమ!।
మత్ప్రియాఖ్యానాకస్యేహ తవ ప్రత్యభినందనమ్॥
(యుద్ధ కాండ, 116. 9-19)
శ్రీరాముడు హనుమంతుని ద్వారా సీతకు సందేశం పంపిన సందర్భం ఇది. జనబాహుళ్యంలో తరువాత ఆమె అగ్నిప్రవేశానికి సిద్ధమైనప్పుడు ఏమిటి ఈ శ్రీరాముడు ఇలా వ్యవహరించాడు? అనే ప్రశ్న కలిగితే దానికి ఈ సందర్భంలో పంపిన సందేశాన్ని ముందుగానే అర్థం చేసుకున్న యెడల విషయం స్పష్టమవగలదు.
హనుమంతుడు: అమ్మా! స్వామి నీ కుశలమును గూర్చి సాదరముగా ప్రస్తావించెను. తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారము రావణుని సంహరించి ప్రీతితో నీకు ఈ సందేశాన్ని పంపెను.
‘దేవీ! నీకు మిగుల సంతోషమునిచ్చు ఈ ప్రియ వచనములను తెలుపుచున్నాను. ప్రాతివత్య ధర్మములను పాటించిన ఓ సాధ్వీ! నీవు ఇంతవరకును ప్రాణములను నిలుపుకుని యుండుట నా అదృష్టము. లేకపోతే నా ఈ విజయమునకు అర్థమే యుండదు. నీ ధర్మనిరతి ప్రభావమునను, సమరాంగణం లోన నా పరాక్రమ కారణములుగాను మనకు విజయం ప్రాప్తించినది. సీతా! ఇంక శోకమును విడనాడి, ప్రసన్నురాలవు కమ్ము. లోకకంటకుడైన రావణుడు హతుడైనాడు, ఈ లంక మనకు వశమైనది. రావణుని చెర నుంచి నీకు విముక్తి కలిగించుటకై ఆ దశకంఠుని చంపి తీరెదనని లోగడ ప్రతిజ్ఞ చేసి యున్నాను. నిద్రాహారములని మాని మహాసముద్రముపై సేతువు నిర్మించి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాను. ‘రావణుని మందిరమున ఉన్నాను’ అని భావించి నీవు ఇక భీతిల్లవలదు. ఇప్పుడు ఈ లంకా నగరము, ఐశ్వర్యము అంతయును భక్తి తత్పరుడైన విభీషణుని అధీనములో నున్నది. అందువల నీవు ఇప్పుడు స్వగృహములో నున్నట్లు భావింపుము. నిశ్చింతగా నుండుము. మిగుల సంతుష్టుడైన విభీషణుడు నీ దర్శనాభిలాషియై అక్కడికి రానున్నాడు.’
ఈ సందేశం విని సీతాదేవి సంతోషంతో పొంగిపోయింది. మాటలు రాలేదు.
హనుమంతుడు: అమ్మా! ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు? నాతో మాట్లాడవేమి?
అప్పుడు గద్గద స్వరంలో ఆమె పలికింది:
మారుతీ! నా పతిదేవుడు విజయము పొందినాడు అను ప్రియమైన వార్తను విని సంతోషములో మునిగిపోయాను. క్షణకాలం మాట్లాడలేకపోయాను. ఇంతటి ప్రియమైన సందేశమును తీసుకుని వచ్చిన నిన్ను ఎలా అభినందించాలో ఎంత ఆలోచించినా తెలియటం లేదు.
శ్లో.
న చ పశ్యామి తత్ సౌమ్య పృథివ్యామపి వానర।
సదృశం మత్ప్రియాఖ్యానే తవ దాతుం భవేత్ సమమ్॥
(యుద్ధ కాండ, 116. 20)
నాకు ప్రియమైన వార్తను తెలిపిన నీకు ఇయ్యదగిన బహుమానము నాకు ఈ భూలోకమునందే కాదు, అంతరిక్షము నందును, కడకు దేవలోకము నందును కనబడలేదు.
శ్లో.
హిరణ్యం వాసువర్ణం వా రత్నాని వివిధానిచ।
రాజ్యం వా త్రిషులోకేషు నైతదర్హతి భాషితమ్॥
(యుద్ధ కాండ, 116. 21)
నీకు నాకు ఒనర్చిన మేలునకు వెండి బంగారములు గాని, వివిధములగు రత్నములు గాని, ముల్లోకాధిపత్యము గాని సాటికాజాలవు.
శ్లో.
ఘోర రూప సమాచారాః క్రూరాః క్రూరతరేక్షణాః।
రాక్షస్యో దారుణకథా వరమేతత్ ప్రయచ్ఛ మే॥
(యుద్ధ కాండ, 116. 33)
హనుమంతుడు: ఈ రాక్షసస్త్రీలు ఘోరమైన రూపముల వారు, క్రూర స్వభావము కలవారు. వీరందరినీ హతమార్చుటకై నాకు వరమునిమ్ము.
శ్లో.
రాజసంశ్రయవశ్యానాం కుర్వతీనాం పరాజ్ఞయా।
విధేయానాం చ దాసీనాం కః కుప్యేద్వానరోత్తమ॥
(యుద్ధ కాండ, 116. 39)
సీతాదేవి: ఈ రాక్షసస్త్రీలు రాజును ఆశ్రయించుకొని అతని ఆధీనంలోనున్నవారు. రాజాజ్ఞలను పాటించుచున్నవారు, ఆయనకు విధేయులు, దాసీలు. ఇట్టివారి మిద ఎవరు కుపితులవుతారు? (వారిని వదిలెయ్!)
శ్లో.
ఏవముక్తా హనుమతా వైదేహీ జనకాత్మజా।
అబ్రవీద్ద్రష్టుమిచ్ఛామి భర్తారం వానరోత్తమ॥
(యుద్ధ కాండ, 116. 49)
హనుమంతుడు సీతాదేవి సందేశం చెప్పమన్నాడు. ఆ సాధ్వి – ‘నా పతిదేవుని చూడాలనుకుంటున్నాను’ అని చెప్పింది.
శ్లో.
న గృహాణి న వస్త్రాణి న ప్రాకారాస్తిరస్క్రియాః।
నేదృశా రాజసత్కారా వృత్తమావరణం స్త్రియాః॥
వ్యసనేషు న కృచ్ఛ్రేషు న యుద్ధేషు స్వయంవరే।
న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః॥
సైషా యుద్ధగతా చైవ కృచ్ఛ్రే చ మహతి స్థితా।
దర్శనేస్యా న దోషః స్యాన్మత్సమీపే విశేషతః॥
(యుద్ధ కాండ, 117. 27, 28, 29)
విభీషణుడు సీతాదేవికి పల్లకీని ఏర్పాటు చేసాడు. శ్రీరాముడు వద్దన్నాడు.
శ్రీరాముడు: స్త్రీకి గృహములు, వస్త్రములు, ప్రాకారములు, తెరలు, రాజమర్యాదలు మున్నగునవి ఏవీ రక్షకములు కాజాలవు. నిజంగా ఆమె సద్వర్తనమే ఆమెకు భద్రకవచము – ఆత్మీయులు దూరమైనప్పుడు, శారీరిక, మానసిక బాధలు ఏర్పడినప్పుడు, యుద్ధభూముల యందును, వివాహ సమయములందును, స్వయంవరమందును, యజ్ఞ స్థలమందును స్త్రీలు ఇతరులకు కనబడుట దోషం కాదు. ప్రస్తుతం సీతాదేవి మానసిక సంఘర్షణకి లోనై యున్నది. కనుక నా సమక్షమున ఇతరులకు కనబడుట దోషం కాదు.
(ఇక్కడ ఆయన సంకల్పించిన రాజధర్మం స్ఫురిస్తున్నది)
శ్లో.
తాం తు పాశ్వస్థితాం ప్రహ్వాం రామః సంప్రేక్ష్య మైథిలీమ్।
హృదయాంతర్గతం క్రోధో వ్యాహర్తుమ్ ఉపచక్రమే॥
ఏషాసి నిర్జితా భద్రే! శత్రుం జిత్వా మయా రణే।
పౌరుషాద్యదనుష్ఠేయం తదే తదుపపాదితమ్॥
(యుద్ధ కాండ, 118. 1, 2)
శ్రీరాముడు తన ప్రక్కనే సిగ్గుతో వినమ్రయైయున్న సీతాదేవిని జూచి తన మనస్సులోనున్న నిగూఢమైన స్థితిని ఇలా ప్రకటించాడు:
శుభప్రదురాలా! యుద్ధమున శత్రువును జయించి, నీకు ఆ రాక్షసుని చెర నుండి విముక్తి కలిగించాను. ఒక పరాక్రమశాలి చేయవలసిన పనిని చేసాను గాని నిన్ను పొందుటకు గాదు.
(ఇంకా ఉంది)