[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
ఏషా సా దృశ్యతేయోధ్యా రాజధానీ పితుర్మమ।
అయోధ్యాం కురు వైదేహి! ప్రణామం పునరాగతా॥
తతస్తే వానరాః సర్వే రాక్షసశ్చ విభీషణః।
ఉత్పత్యోత్పత్య దదృశుః తాం పురీం శుభదర్శనామ్॥
తతస్తు తాం పాండురహర్మ్యమాలినీం విశాలకక్ష్యాం గజవాజిసంకులామ్।
పురీమయోధ్యాం దదృశుః ప్లవంగమాః పురీం మహేంద్రస్య యథామరావతీమ్॥
(యుద్ధ కాండ, 126. 52, 53, 54)
శ్రీరాముడు: వైదేహీ! అదిగో అల్లంత దూరాన కనబడుచున్నదే! అది మా తండ్రిగారి రాజధాని యగు ‘అయోధ్య’. మనము తిరిగి వచ్చిన ఈ శుభ సమయమున ఆ అయోధ్యాదేవికి నమస్కరింపుము.
అందరూ విమానము నుండియే నిక్కి నిక్కి చూసారు. గొప్ప గొప్ప హర్మ్యములతో, స్వచ్ఛమైన కాంతులతో ఉన్న అయోధ్య గజములు, అశ్వములతో దాని ఔన్నత్యమును ప్రకటిస్తున్నది. అందరును దేవేంద్రుని అమరావతిని చూసినట్లు ఆశ్చర్యానందములతో తనివిదీర అయోధ్యను చూసారు.
శ్లో.
పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజః।
భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిమ్॥
(యుద్ధ కాండ, 127. 1)
చైత్ర శుద్ధ పంచమి నాడు పదునాల్గు సంవత్సరముల దీక్ష ముగియబోవుచుండగా ఆనాడు శ్రీరాముడు భరద్వాజాశ్రమునకు చేరి వినయముతో ఆ మహామునికి నమస్కరించెను.
శ్లో.
జ్ఞేయాశ్చ సర్వే వృత్తాంతా భరతస్యేంగితాని చ।
తత్త్వేన ముఖవర్ణేన దృష్ట్యా వ్యాభాషణేన చ॥
సర్వకామసమృద్ధం హి హస్త్యశ్వరథసంకులమ్।
పితృపైతామహం రాజ్యం కస్య నావర్తయేన్మనః॥
(యుద్ధ కాండ, 128. 15, 16)
శ్రీరాముడు హనుమంతుని భరతుని వద్దకు నందిగ్రామం పంపాడు.
శ్రీరాముడు: భరతుని స్వభావమును, ముఖ వైఖరిని, చూపులను, సంభాషణలను బట్టి అతని ఆంతర్యమును, తదితర సమస్త విషయములను సమగ్రంగా గమనింపుము. తరిగిపోని సంపదలు గలది, చతురంగ బలములతో సురక్షితముగా నున్నది, వంశపరంపరగా వచ్చినది ఐన మహారాజ్యము చేజిక్కినప్పుడు ఎవరి మనసు మారదు?
..వాస్తవానికి భరతుని మీద ఎట్టి అనుమానమూ శ్రీరామునికి లేదు. లౌకికం, అలౌకికం, తాత్వికం అను మూడింటి మీదుగా చరిత్ర సాగునప్పుడు ఏది ఎక్కడ ముందుకు వస్తున్నది అనేది ప్రధానం. ఇక్కడ లౌకికమైన వ్యవహారం సాగుతున్నది.
శ్లో.
ఏవముక్తో హనుమతా భరతో భ్రాతృవత్సలః।
పపాత సహసా హృష్టో హర్షాన్మోహం జగామ హ॥
(యుద్ధ కాండ, 128. 40)
శుభవార్త వినిన భరతుడు సంతోషంతో పొంగిపోయి నేలపై బడి తనను తాను మరిచిపోయాడు.
శ్లో.
బహూని నామ వర్షాణి గతస్య సుమహద్వనమ్।
శృణోమ్యహం ప్రీతికరం మమ నాథస్య కీర్తనమ్॥
కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే।
ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి॥
(యుద్ధ కాండ, 129. 1, 2)
భరతుడు: ప్రభువైన శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్ళిన తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచినవి. ఇంత కాలానికి ఆ స్వామి సమాచారం వినగల్గినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ‘మానవుడు బ్రతికి యున్నచో కొన్ని వందల సంవత్సరముల తరువాతనైనను అతనికి సుఖ సంతోషములు లభించి తీరును’ అనునది ఒక జనశ్రుతి. శ్రీరామచంద్ర ప్రభువు ఆత్మీయులతో క్షేమంగా వచ్చుచున్నాడు అను శుభవార్తను వినిన నా విషయమున ఆ జనశ్రుతి వాస్తవముగా కనిపిస్తున్నది!
శ్లో.
యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా।
తావత్ త్వమిహ సర్వస్య స్వామిత్వమ్ అనువర్తయ॥
(యుద్ధ కాండ, 131. 11)
భరతుడు శ్రీరామునితో: జ్యోతిశ్చక్రము తిరుగుతున్నంత వరకును, ఈ భూమండలము ఉన్నంత వరకును నీవే ఈ లోకమునకు ప్రభువుగా మనుచుందువు.
శ్లో.
మణి ప్రవరజుష్టం చ ముక్తాహారమ్ అనుత్తమమ్।
సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభమ్॥
అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ।
అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే॥
అవముచ్యాత్మనః కంఠాత్ హారం జనకనందినీ।
అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః॥
తామింగి తజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్।
ప్రదేహి సుభగే! హారం యస్య తుష్టాసి భామిని॥
పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః।
దదౌ సా వాయుపుత్రాయ తం హారమ్ అసితేక్షణా॥
హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః।
చంద్రాంశుచయగౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః॥
(యుద్ధ కాండ, 131. 78-83)
పట్టాభిషేకం తరువాత అందరికీ కానుకలనివ్వటం జరిగింది. శ్రీరాముడు మణులతో గూడిన ఒక ముత్యాల హారమును సీతాదేవి చేతికిచ్చాడు. ఉత్తమమైన ఆ అభరణము చంద్రుని కిరణముల వలె మనోరంజకముగా నున్నది. తరువాత సీతామాత భర్త వైపు చూస్తూ దివ్యమైన వస్త్రములను, ఆ అభరణమును మారుతికి కానుకలుగా ఇచ్చెను. ఆమె మెడలోని కంఠాభరణమును తీసికొని, తన భర్తను, సమస్త వానరులను పదే పదే చూసింది. శ్రీరాముడు ఆమె భావమును గ్రహించాడు.
శ్రీరాముడు: ఓ సుందరీ! సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణములను పూర్తిగా కలిగి, నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపుము!
సీతాదేవి ఆ హారమును వాయుసుతునకు ఇచ్చెను. ఆ హారమును ధరించునంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో గూడియున్న పర్వతము వలె విరాజిల్లాడు.
..హనుమంతుడు ఆ హారాన్ని కొరికి, ఏదేదో విన్యాసాలు చేసి, శ్రీరాముని ప్రేమను పొందిన కారణాన్ని వెదికినట్లు, సీతాదేవి నొసటి సిందూరం గురించి తెలిపినట్లు, హనుమంతుడు శరీరమంతా సిందూరం పులుముకున్నట్లు.. ఇదంతా వాల్మీకి చెప్పలేదు.
శ్లో.
సర్వాత్మనా పర్యనునీయమానో యదా న సౌమిత్రిరుపైతి యోగమ్।
నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యషించద్భరతం మహాత్మా॥
రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః।
శతాశ్వమేధాన్ ఆజహ్రే సదశ్వాన్ భూరిదక్షిణాన్॥
రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథాః।
రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి॥
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ।
భ్రాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్॥
(యుద్ధ కాండ, 131. 94, 96, 103, 107)
యువరాజ పదవిని స్వీకరింపుము అని శ్రీరాముడు లక్ష్మణునికి నచ్చజెప్పినా, లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీరాముడు భరతుని యువరాజుగా చేసాడు.
పదివేల సంవత్సరముల పాటు వందల కొలది అశ్వమేధ యాగములను ఆచరించి రాజ్యం చేశాడు శ్రీరాముడు. ఆ రాజ్యమున ఎవరి నోటను విన్నను రామనామము, రాముని గాథలే వినబడుచుండెను. జగమంతయు రామమయమై ఒప్పుచుండెను.
ఆ విధంగా శ్రీరామచంద్రుడు తన సోదరులతో కూడి పదకొండు వేల సంవత్సరములు కోసల రాజ్యమును పరిపాలించెను.
..ఒక శ్లోకములో పదివేల సంవత్సరములు అని చెప్పి, కొన్ని శ్లోకాల తరువాత పదకొండు వేల సంవత్సరములని చెప్పడంలో విశేషం కనిపిస్తున్నది. చివరి వేయి సంవత్సరములలో జరిగిన దానిని, ఉత్తర కాండలో అవతార సమాప్తి ఘట్టాన్ని వివరించాడు మహర్షి!
శ్లో.
కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ।
శృత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిమ్॥
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ।
శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః॥
ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః।
ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతామ్॥
దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా।
రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా॥
భక్త్యా రామస్య యే చేమాం సంహితామ్ ఋషిణా కృతామ్।
లేఖయంతీహ చ నరాస్తేషాం వాసస్త్రివిష్టపే॥
(యుద్ధ కాండ, 131. 121-125)
ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము. సమస్త ప్రయోజనములను చేకూర్చును. దీని శ్రవణము వలన కుటుంబ వృద్ధియు, ధనధాన్య సమృద్ధియు కలుగును. ముఖ్యముగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును.
ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్ఠలను, సౌభ్రాతృత్వమును, బుద్ధి కౌశలమును, సుఖ శాంతులను, తేజో వైభవములను ప్రసాదించును. కావున సమస్త సంపదలను అభిలషించెడి సత్పురుషులు నియమ నిష్ఠలతో దీనిని శ్రవణము చేయవలెను.
ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక! మీపై శ్రీమన్నారాయణుని ప్రభావము మిక్కిలి ప్రసరించు గాక. ఈ రామాయణమును తమ కడ కలిగియుండి ఇందలి దివ్య గాథలను వినినచో దేవతలును, పితృదేవతలను తృప్తి పడుదురు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ సంహితము భక్తితో రాసినను తప్పక స్వర్గసుఖములను పొందుతారు.
శ్లో.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే।
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్॥
ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి
సర్వం శ్రీరామచంద్ర పాదారవిందార్పణమస్తు!
(ఇంకా ఉంది)