Site icon Sanchika

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-45

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

[dropcap]వా[/dropcap]ల్మీకి రామాయణంలో ఉత్తరకాండ మహర్షి వ్రాయలేదని, అది సంపూర్ణంగా కల్పితమనీ, యుద్ధకాండతో రామాయణం పూర్తి అవుతుందని, అవతార లక్ష్యం రావణ వధ కావున ఇక్కడతో సంపూర్ణం అనేవారు, అనుకునేవారు పెక్కు మంది ఉన్నారు.

ఇది పెద్ద చర్చనీయమైన అంశం కాదు. మామూలుగా ఒక అల్పజ్ఞునిగా కావ్యాన్ని మొదటి నుండి చివరి వరకూ చదివితే అలా అనుకునేందుకు వీలు కనపడదు! ఏదైనా కథలో ఫలనా సుబ్బారావు నన్ను ఇలా కొట్టడం వలన నా దవడ ఇలా వాచింది అని ఒక పాత్ర చెప్పినప్పుడు ఆ సుబ్బారావు ఎవరో, అలా ఎందుకు కొట్టాడో మరల ఎక్కడో అక్కడ చెప్పవలసిన ధర్మం రచయితకు ఉంటుంది. వాల్మీకి రామాయణం ఆదిగ్రంథం. సాహిత్యానికి, వ్యాకరణానికి, కవిత్వానికి, కావ్య లక్షణాలకు, ఈ అధ్యయనానికి, ఇలా అనేకమైన అంశాలకు ఇది మూలం. అటువంటి గ్రంథకర్త అట్టి పొరపాట్లు చేస్తాడా? (పైన ఉదహరించిన అంశాల దృష్ట్యా) అనే ప్రశ్న వేసుకోవాలి.

కుశలవుల గానంతో ప్రారంభమైనది కథ. వీరిరువురూ ఎక్కడి నుండి వచ్చారో చెప్పాలా వద్దా? ఇది ఉత్తరకాండలో చెప్పాడు.

యుద్ధకాండలో రావణుడు వేదవతి గురించి ప్రస్తావించాడు. అతని గల శాపాల గురించి ప్రస్తావించాడు. వీటిని ఉత్తరకాండలో వివరంగా చెప్పటం జరిగింది.

కిష్కింధలో హనుమంతుడు కలిసినపుడు ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆయన గొప్పతనాన్ని శ్రీరాముడు స్వయంగా లక్ష్మణుడికి చెబుతాడు. మరి హనుమంతుని చరిత్రను వివరంగా చెప్పాలి కాబట్టి ఉత్తరకాండలో చెప్పాడు మహర్షి.

కేవలం పౌలస్త్య వధ అవతార లక్ష్యం అనుకుని ముగిస్తే, వాల్మీకి రామాయణం కావ్యలక్షణాన్ని కోల్పోతుంది. చరిత్రగా నిలబడదు. పురాణ గాథగా కనిపిస్తుంది. శ్రీరాముడు రాజ్యస్థాపన చేసి భవిష్యత్తుకు పునాది వేసి అవతార సమాప్తి చేయటం, దానిని వివరించటం అనివార్యం అవుతుంది. అది ఉత్తరకాండలో చెప్పాడు.

బాలకాండలో 24 వేల శ్లోకాలనీ, ఆరు కాండలతో పాటు ‘చ ఉత్తరం’ అని మహర్షి పేర్కొన్నాడు. శ్లోకాల సంఖ్య ఉత్తరకాండతోనే పూర్తి అవుతుంది. ఏడు కాండలని కాకుండా ‘చ ఉత్తరం’ అని ఎందుకు చెప్పాడు?

నారదుడు రావణ వధ, పట్టాభిషేకం వరకు సంక్షిప్త రామాయణంలో వినిపించాడు. అది జరిగిన కథ. వాల్మీకి మహర్షి శ్రీరామునిని సమకాలీనుడు. అందుచేత ఉత్తరకాండను పోస్ట్‌స్క్రిప్ట్‌గా కొన్ని పాత్రలను వివరంగా పునశ్చరణ చేస్తూ వివరించి అవతార సమాప్తిని భవిష్యత్ దర్శనం చేసి (ఆ సమయానికి ఆయన అక్కడ ఉండటం అసమంజసం) కావ్యాన్ని పూర్తి చేసాడు వాల్మీకి మహర్షి.

యుద్ధకాండలో పరమశివుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని నెలకొల్పి 11 వేల సంవత్సరాలు భూమిని పాలించి పరంధామమునకు చేరుము అని శ్రీరామునికి చెప్పాడు. ‘రావణ వధ అయినది కాబట్టి ఇక భూలోకాన్ని విడిచిపెట్టు’ అనలేదు. కాబట్టి ఆ వివరం ఉత్తరకాండలో ఉంటుంది. శ్రీరాముడే కాదు, ఇతర ప్రముఖ పాత్రలన్నీ ఎలా ముగిసాయి అనేది కూడా మనం చూస్తాం.

పట్టాభిషేకం గల సర్గలో ఒక శ్లోకంలో పదివేల సంవత్సరాలని, మరో శ్లోకంలో 11 వేల సంవత్సరాలని మహర్షి ప్రస్తావించి యున్నాడు. ఇది కీలకమైన అంశం. పదివేల సంవత్సరాల చరిత్ర ఆయన సమక్షంలోనే జరిగిందని స్పష్టం. మిగిలిన వేయి సంవత్సరాల చరిత్ర ఆయన దర్శించి వ్రాసినట్లు స్పష్టమవుతున్నది. ఈ దర్శించి వ్రాసిన అంశాన్ని యావత్ రామాయణానికి ఆపాదించటం మూర్ఖత్వమవుతుంది.

(బాలకాండలోని ‘చ ఉత్తరం’ మాటకీ, ఈ వివరణకీ పోలిక చూడవచ్చు).

‘మానిషాద ప్రతిష్ఠాం..’ శ్లోకం మహర్షి హృదయం లోంచి వచ్చిన సంఘటన సీతమ్మ ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు జరిగినదని మహానుభావులు బ్రహ్మశ్రీ కరిపాత్రిస్వామి వారి (అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన కృషి ఆయన రామాయణం అధ్యయానికి చేసి బ్రహ్మలీనులైనారు) అభిప్రాయం. విరహం అనేది అందుచేత కరుణరసంగా ప్రవహించిందనేది వారి విశ్లేషణ. అందుచేత రామాయణమనే మహాకావ్యం యొక్క రచన సమయం ఉత్తరకాండ అని తేల్చారు వారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం.

ఈ చరిత్ర రూపకం (నాటకం), సంగీత మాధ్యమంలో (తంత్రీలయ సమన్వితమ్) గానం చేయవచ్చు అన్నాడు మహర్షి.

దృశ్యకావ్యానికి 1, 3, 5, 7 సంఖ్యలో కాండలు (భాగాలు) ఉండడం సాహితీపరులకు తెలిసినదే. అలా లేకపోతే ‘గర్భానికి’ అటు ఇటూ సమంగా భాగాలుండవు. నాల్గవ కాండ అయిన కిష్కింధ కాండ వాల్మీకి రామాయణానికి గర్భం అని నిర్దేశించడం జరిగింది. అందుచేత ఉత్తర కాండతో కలుపుకుని ఏడు కాండలున్నాయి.

దశావతారాలలో ఏడవది శ్రీరామావతారం. సప్త స్వరాలతో కూడినది. ఆ సంగీతపరమైన అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయం.

సత్యలోకం ఏడవది. సత్యపరాక్రముడైన శ్రీరాముడి కథ ఏడు కాండలలో ఉండటం విశేషం.

కొందరు ఫలశ్రుతి యుద్ధకాండ చివర చెప్పారు కదా! అంటారు. ఫలశ్రుతి ఉత్తరకాండ చివరా చెప్పారు. అది కొది సర్గల చివర కూడా ఉంటుంది. అంత మాత్రం చేత అక్కడితో కథ పూర్తి అయినట్లు కాదు. ఆ ప్రక్రియ మహాభారతంలోనూ చూస్తాం!

మరి ఉత్తరకాండను గూర్చి ఎందుకు ఇన్ని మాటలు? కారణం లేకపోలేదు.

యుద్ధకాండతో పారాయణ గ్రంథం పూర్తి అవుతుంది. ఆ కారణం వలన ఉత్తరకాండలోని శైలి కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది.

శంబుకుని వధ కాలక్రమంలో ఇదేమిటి అన్న ప్రశ్నను రేపుతుంది. ఇది ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు కొన్ని గ్రంథంలో ఇతర కాండలలో కూడా మనం చూసాం!

రామబ్రహ్మానందుల వారు రచించిన తత్వసంగ్రహ రామయణం – రామాయణం యొక్క గాయత్రీ స్వరూపాన్ని వివరిస్తుంది.

నీలకంఠీయ వ్యాఖ్య ‘మంత్ర రామాయణం’ అనే గ్రంథం ఆధారంగా వాల్మీకి రామాయణం లోని బాలకాండ నుండి ఉత్తరకాండ వరకూ ఉంటుంది! నీలకంఠుడు ఋగ్వేదం ఆధారంగా చేసుకుని అందులోని మంత్రాలను ఉదహరిస్తూ ఏడు కాండలను వివరించటం విశేషం. మరో విధంగా ఆలోచిస్తే బాలకాండలో ‘వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః’ (బాలకాండ 1.4.6) వేదాధ్యయన నిమిత్తం మహర్షి కుశలవులకు రామాయణ గాథను అధ్యయనం చేయించాడని చెప్పటం జరిగింది.

విద్యారణ్యుల వారి ‘రామాయణ రహస్యం’, తత్వసంగ్రహ రామాయణం గాయత్రీ రామాయణాన్ని వివరిస్తాయి.

‘ప్రతిశ్లోక సహస్రాదౌ మంత్రవర్ణాః సమృద్ధృతాః’. ప్రతి వేయి శ్లోకాలకు గల మొదటి శ్లోకం యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుని 24 అక్షరాలు చేస్తే అది గాయత్రీ మంత్రమవుతుంది!

విద్యారణ్యుడు వాల్మీకి రామాయణం యొక్క మొదటి సర్గను గాయత్రీ స్వరూపం అన్నాడు.

ఆ క్రమంలో 24 శ్లోకాలను చూస్తే మూదు శ్లోకాలు ఉత్తరకాండలో ఉంటాయి. అర్థాత్ 24,000 శ్లోకాలలో కనీసం 3,000 శ్లోకాలు ఉత్తరకాండలో ఉండాలి కదా? ఆ శ్లోకాలను ఎంచుకుని అవి ఏ ఘట్టాల వద్ద కనిపిస్తాయని పరీక్షిస్తే, మూడు ముఖ్యమైన అంశాలు ముందుకు వస్తాయి.

శ్లోకం 1:

చాలనాత్ పర్వతస్యైవ గణా దేవస్య కింపితాః।

చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరమ్॥

(ఉత్తరకాండ, 16.26)

రావణుడు పర్వతము యొక్క క్రింది భాగమున తన భుజాలను ఆనించి, దానిని ఎత్తటానికి ప్రయత్నించాడు. అప్పుడు శైలము కంపించింది. ప్రమథ గణాలు కంపించారు. పార్వతి కూడా చలించి పరమేశ్వరుని కౌగిలించుకున్నది.

..దీనిని బట్టి రావణుని చరిత్ర ఉత్తరకాండలో మొదటి అంశంగా వాల్మీకి రచన ప్రామాణికము.

శ్లోకం 2:

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగ ఆచ్ఛాదన భోజనమ్।

సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర॥

(ఉత్తరకాండ, 34.41)

రావణుడు వాలితో: వానర ప్రభూ! ఇంక నా భార్యాపుత్రులు నీకును వాత్సల్యపాత్రులు. లంకానగరము, రాజ్యము, భోగభాగ్యములు, వస్త్రాభరణములు మున్నగు వాటిపై మన ఇద్దరికీ సమానమైన అధికారము గలదు.

..వాలి చరిత్ర, హనుమంతుని జన్మ వృత్తాంతము వాల్మీకి రచనగా ప్రామాణికము.

శ్లోకం 3:

యామేవ రాత్రిం శతృఘ్నః పర్ణశాలాం సమావిశత్।

తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయమ్॥

(ఉత్తరకాండ, 66.1)

శత్రుఘ్నుడు పర్ణశాల యందు గడిపిన ఆ రాత్రియందే సీతాదేవికి కవలలు కలిగారు.

..లక్ష్మణ శత్రుఘ్నులు కవలలు. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు కుశలవుల జననం విశేషం. దీనిని బట్టి లవణాసుర వధ, సీతా పరిత్యాగం, తరువాతి తరానికి రాజ్యాభిషేకం, అవతరాం ముగింపు అనునవి వాల్మీకి రచనలుగా ప్రామాణికాలని చెప్పవలసి యుంది!

యావత్ ఉత్తరకాండయే ప్రామాణికం కాదు అనువారు బహుశః నీలకంఠుడు, విద్యారణ్యుడు, తులసీదాసు, వాల్మీకి మహర్షి కంటే కూడా గొప్పవారని చెప్పవలసి యున్నది!

(ఇంకా ఉంది)

Exit mobile version