ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-47

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

శ్లో:

యదా హ్యాకామం కామార్తో ధర్షయిష్యతి యోషితమ్।

మూర్ధా తు సప్తధా తస్య శకలీభవిత తదా॥

(ఉత్తరకాండ, 26. 57)

నలకూబరుడు: కామాతురుడై అకామయైన వనితను బలాత్కరింపజూచినచో అతని తల ఏడు విధములుగా ముక్కలైపోవును.

..ఈమాట యుద్ధకాండలో రావణుడు గుర్తు చేసుకుని సభలో తెలిపాడు. అది ఎలా జరిగిందో ఉత్తరకాండలో వివరించాడు మహర్షి వాల్మీకి.

శ్లో:

అశ్వయుక్తో రథో మహ్యము త్తిష్ఠేత్తు విభావసోః।

తత్‌స్థస్యామరతా స్యాన్మే ఏష మే నిశ్చయో వరః॥

తస్మిన్ యద్య సమాప్తే చ జప్యహోమే విభావసౌ।

యధ్యేయం దేవ సంగ్రామే తదా మే స్యాద్వినినాశనమ్॥

సర్వో హి తపసా దేవ వృణోత్యమరతాం పుమాన్।

విక్రమేణ మయా త్వేతత్ అమరత్వం ప్రవర్తితమ్॥

(ఉత్తరకాండ, 30. 15, 16, 17)

ఇంద్రజిత్తు ఇంద్రుని బంధించినపుడు బ్రహ్మదేవుడు ఇంద్రుని విడిపించుకొనుటకు వరం ప్రసాదించాడు.

ఇంద్రజిత్తు: యుద్ధరంగమున ప్రవేశించు ముందు నేను మంత్రపూర్వక హవ్యములను సమర్పిస్తూ అగ్నిదేవుని ఆరాధిస్తాను. హవ్యవాహనుని యుండి జవనాశ్వములతో గూడిన ఒక దివ్య రథము ఆవిర్భవించవలెను. ఆ రథమును అధిరోహించి అందు ఉన్నంత వరకును నన్ను ఎంతటి వారును చంపజాలకుందురు గాక. అగ్నిని పూజించుట పూర్తి కాకముందే నేను రణరంగమున యుద్ధము చేసినచో అప్పుడు నాకు మరణము ప్రాప్తించు గాక. దేవా! ప్రతి మానవుడును తపస్సు చేసి అమరత్వమును కోరుకుంటాడు. నేను నా పరాక్రమము ద్వారా అమరత్వమును అర్థిస్తున్నాను.

..బ్రహ్మదేవుడు అమరత్వం తప్ప ఏదైనా కోరుకో అన్నప్పుడు ఇంద్రజిత్తు కోరిన కోరిక ఇది. యుద్ధకాండలో ఇంద్రజిత్తుతో యుద్ధం చాలా విస్తారంగా కనిపిస్తుంది. ఆ అభిచార హోమం, దానిని వానర వీరులు భంగపరచటం ఎందుకు అన్నది ఇక్కడ ఉత్తరకాండలో స్పష్టం చేశాడు మహర్షి.

శ్లో:

వాలుకావేదిమధ్యే తు తల్లింగం స్థాప్య రావణః।

అర్చయామాస గంధైశ్చ పుష్పైశ్చామమృతగంధిభిః॥

తతః సతామ్ ఆర్తిహరం పరం వరం

వరప్రదం చంద్రమయూఖభూషణమ్।

సమర్చయిత్వా స నిశాచరో జగౌ

ప్రసార్య హస్తాన్ ప్రణనర్త చాగ్రతః॥

(ఉత్తరకాండ, 31. 42, 43)

రావణుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధానికని నర్మదా నదీతీరానికి వచ్చాడు. అక్కడ బంగారు లింగమును స్థాపించి విశేషంగా శివార్చన చేసాడు. ఆర్తితో కీర్తించు భక్తునకు వరములు ప్రసాదించు పరమశివుని రావణుడు పూజించాడు. ఆ పరమేశ్వరునకు చేతులు చాచి నృత్యమొనర్చెను.

..రావణుడు శివార్చన చేయు సంగతి ఈ సందర్భంలోనే మహర్షి విశేషంగా తెలిపాడు.

శ్లో:

పుత్రకస్య యశః పీతం నామ విశ్రావితం త్వయా।

మద్వాక్యాద్యాచ్యమానోద్య ముంచ వత్స దశాననమ్॥

(ఉత్తరకాండ, 33. 16)

పులస్త్యుడు కార్తవీర్యార్జునుడు రావణుని బంధించినట్లు ఎరిగి – నీ వలన నా మనవడి కీర్తి నశించిందని చెప్పి, ‘బాలుడైన’ ఈతన్ని విడిచిపెట్టమన్నాడు (కార్తవీర్యార్జునుడితో). అలాగే విడిచిపెట్టాడు. తరువాత వాళ్ళిద్దరూ మైత్రి చేసుకున్నారు!

శ్లో:

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభోజనమ్।

సర్వమేవావిభక్తం నౌ భవిష్యతి హరీశ్వర॥

(ఉత్తరకాండ, 34. 41)

వాలి వద్ద పరాభవం పొంది మైత్రి చేసుకున్నాడు.

‘భార్యాపుత్రులు నీకును వాత్సల్యపాత్రులు. లంక, రాజ్యము, భోగభాగ్యములు, వస్త్రాభరణములు మున్నగు వాటిపై మన ఇద్దరికిని సమానమైన అధికారం’ అన్నాడు.

..గాయత్రి రామాయణంలోని శ్లోకం ఇది. అధిక బలశాలులతో మైత్రి చేసుకుంటూ అతని కామ వాంఛను కొనసాగిస్తూ వచ్చిన ‘మహావీరుడు’ ఈ రావణుడు!

శ్లో:

పరాక్రమోత్సాహమతిప్రతాప

సౌశీల్యమాధుర్యనయానాయైశ్చ।

గాంభీర్యచాతుర్యసువీర్యధైర్యై

ర్హనూమతః కోభ్యధికోస్తి లోకే॥

అసౌ పునర్వ్యాకరణం గ్రహీష్యన్

సూర్యోన్ముఖః ప్రష్టుమనాః కపీంద్రః।

ఉద్యద్గిరేరస్తగిరిం జగామ

గ్రంథం మహద్దారయన ప్రమేయః॥

ససూత్రవృత్త్యర్థపదం మహార్థం

ససంగ్రహం సాధ్యతి వై కపీంద్రః।

న హ్యస్య కశ్చిత్ సదృశోస్తి శాస్త్రే

వైశారదే చ్ఛంధగతౌ తథైవ॥

సర్వాసు విద్యాసు తపోవిధానే

ప్రస్పర్ధతే యో హి గురుం సురాణమ్।

సోయం నవవ్యాకరణర్థవేత్తా

బ్రహ్మ భవిష్యత్యపి తే ప్రసాదాత్॥

ప్రవీవివక్షోరివ సాగరస్య

లోకాన్ దిధక్షోరివ పావకస్య।

లోకక్షయే ష్యేవ యథా స్తకస్య

హనూమతః స్థాస్యతి కః పురస్తాత్॥

(ఉత్తరకాండ, 36. 44, 45, 46, 47, 48)

పరాక్రమము, ఉత్సహాము, బహుముఖ ప్రజ్ఞ, తిరుగులేని ప్రతాపము, సౌశీల్యము (సరళ స్వభావము), వచో మాధుర్యము, నీతి-ప్రవృత్తి-నివృత్తి అను వాటి యందు విచక్షణ జ్ఞానము, చిత్త గాంభీర్యం, చాతుర్యం, శౌర్యం, ఆపదల యందు తొణకల యుండుట – ఈ ఉత్తమ లక్షణముల యందు హనుమంతుని మించినవాడు ముల్లోకములలోనే లేడు. ఈ వాయుసుతుడు సూర్యునకు అభిముఖముగా ఉండి సమయోచితముగా ప్రశ్నించుచు, వ్యాకరణ శాస్త్రమును – ఇతడు ఆ మహావ్యాకరణ గ్రంథమును చేబూని పఠిస్తూ, ధారణ చేయుచు ఉదయాద్రి నుంచి అస్తాద్రి వరకు సూర్యభగవానుని అనుసరిస్తూ సాగిపోతూ ఉండేవాడు. తన జిహ్వాగ్రమున నిలుపుకొనిన విద్యావైభవములు అనూహ్యములు. ఈ వానరోత్తముడు సూత్రములను, వృత్తిని, వార్తికములను, భాష్యములను, సంగ్రహములను బాగుగా అధ్యయనము ఒనర్చి ధారణ చేసియున్నాడు. సంగీతాది ఇతర శాస్త్రములనందు పారంగతుడు. ఈ సకల శాస్త్ర పరిజ్ఞానము నందు ఇతనితో సాటి రాగల వాడు మరియొకడు లేడు. సమస్త విద్యలయందు, తపోవిధానములయందు ఇతడు దేవతల గురువైన బృహస్పతి వంటివాడు. నవవ్యాకరణ సిద్ధాంతములను పుక్కిట బట్టినవాడు. రామా! (అగస్త్యుడు చెబుతున్నాడు) నీ అనుగ్రహమున ఇతడు రాబోవు కల్పమున ‘బ్రహ్మ’ కాగలడు. యుగాంతమున భూమండలమున జలప్రళయమున సంవర్తగాగ్ని వలె లోకములను దగ్ధమొనర్చగలవాడు, యుగాంత కాలమున విలయము కలిగించుటలో యముని యంతటి వాడు – ఇంతటి ప్రతిభామూర్తి అయిన హనుమంతుని ఎదుట నిలవగల మొనగాడెవ్వడు?

..కిష్కింధకాండలో శ్రీరాముడు లక్ష్మణునకు హనుమంతుని గురించి కొన్ని విశేషాలు చెబుతూ ఈయనతో జాగ్రత్తగా మాట్లాడమన్నాడు. ఇదేమిటి? ఇలా శ్రీరామునికి ఎందుకు, ఎలా గోచరించింది హనుమంతుని గురించి అనే ఆలోచన కలుగుతుంది. మహర్షి ఇంతకు పూర్వం ఎక్కడా హనుమంతుని గుణగణాలను చెప్పలేదు. సముద్ర లంఘనం యందు జాంబవతాదులు కీర్తించడం కనిపిస్తుంది. ఇంత గొప్ప వీరుని గురించి ఉత్తరకాండలో పూర్తిగా వివరం ఇవ్వటం జరిగింది. ఇది లేకపోతే హనుమంతుని గురించి వాల్మీకి రామాయణం కేవలం కాకతాళీయంగా చెప్పిందా అనే ఆలోచన కలుగుతుంది! ఇది గమనించవలసిన విషయం. ఉత్తరకాండ అందుచేతనే ఒక ప్రధానమైన పోస్ట్‌స్రిప్ట్ అన్న మాట సుస్పష్టం.

శ్లో:

స్మిత్వం కృత్వా తు వైదేహీ రామం వాక్యమథాబ్రవీత్।

తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్ఛామి రాఘవ॥

(ఉత్తరకాండ, 42. 32)

గర్భవతి అయిన సీతాదేవి ‘పవిత్రములైన తపోవనములను దర్శించుటకై వేడుక పడుతున్నాను’ అని శ్రీరామునితో పలికినది.

శ్లో:

అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి।

యథా హి కురుతే రాజా ప్రజా తమనువర్తతే॥

ఏవం బహువిధా వాచో వదంతి పురవాసినః।

నగరేషు చ సర్వేషు రాజన్ జనపదేషు చ॥

తస్సైవం భాషితం శ్రుత్వా రాఘవః పరమార్తవత్।

ఉవాచ సుహృదః సర్వాన్ కథమేతద్బ్రవీథ మామ్॥

సర్వే తు శిరశా భూమౌ అభివాద్య ప్రణమ్య చ।

ప్రత్యూచూ రాఘవం దీనమ్ ఏవమేతన్న సంశయః॥

శ్రుత్వా తు వాక్యం కాకుత్స్థః సర్వేషాం సముదీరితమ్।

విసర్జయామాస తదా వయస్యాన్ శత్రుసూదనః॥

(ఉత్తరకాండ, 43. 19-23)

భద్రుడనే ఆంతరంగికుడు పౌరులు, జానపదులు రాజు యొక్క గుణదోషముల గురించి ఏమి చెప్పుకుంటున్నారని శ్రీరాముడు అడినప్పుడు ‘ఎంతో కాలము పరుల పంచన ఉన్న తన భార్యను రాముడు ఎందుకు ఏవగించుకొనుట లేదు, ఇక మనము కూడా మన భార్యల యందు ఇట్టి సహనమునే చూపవలసి వచ్చును’ అని జనపదులు ఇలా పెక్కు రీతుల అనుకుంటున్నారని తెలిపాడు.

(చాకలివాడు, ఇత్యాదుల గురించి ప్రస్తావన లేదు).

శ్రీరాముడు ఆ మాటలకు దుఃఖించాడు. ముఖ్యమైన వారి ముందు ఈ విషయన్ని ప్రస్తావించాడు. ‘భద్రుడు తెలిపిన విషయములు అపకీర్తికరములుగా ఉన్నవి, మీ అభిప్రాయము ఏమిటి?’ అని అడిగాడు. వారందరూ ‘భద్రుడు చెప్పినది వాస్తవమే, ఇందులో సందేహం లేదు’ అని చెప్పారు.

..శ్రీరాముడు ఒక గొప్ప పుత్రుడు, ఒక పతిదేవుడు, ఒక ఉత్తమమైన సోదరుడు, సత్యవ్రతదీక్షాపరుడు, సత్యపరాక్రముడు. శత్రుసూదనుడు, రాజధర్మం ఎరిగినవాడు. వీటన్నింటినీ అధిగమించిన అంశం – ప్రజాపాలన, సత్యపరిపాలన! అయోధ్యకాండలో వ్యక్తిగత, సాంసారిక విషయలాన్నింటినీ వెనక్కి నెట్తి భరతుని కేవలం రాజధర్మం విషయమై ఎన్నో ప్రశ్నలు సంధించాడు తన కుటీరం అద్దకు అతడు తిరిగి అయోధ్యకు తీసుకుని వెళ్ళేందుకు వచ్చినప్పుడు! అర్థాత్ ఆదర్శవంతమైన ప్రజాపాలన విషయంలో వ్యక్తిగత, సాంసారికపరమైనవి హీనములని తలచే పురుషోత్తముడు శ్రీరాముడు. వ్యక్తిగతమైన నడవడి, స్వధర్మం అనునవి ప్రజలు నూటిని నూరుపాళ్లు గుర్తించి ఆమోదించినంత వరకే రాజుకు సింహాసనం మీద కూర్చునే యోగ్యత అన్నది స్పష్టం. అది ఉన్నదా లేదా అన్నది ప్రముఖుల నోటి ద్వారా నిర్ధారించుకున్నాడు శ్రీరాముడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here