ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-6

0
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

33. శ్లో.

ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన।

మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్॥

అథాబ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్థేనాంతరాత్మనా।

కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్ర మితః ప్రభో॥

ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష మానద।

ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్॥

సుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం॥

ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామోటజాత్ తతః।

స సంభ్రమాత్ త్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి॥

(బాలకాండ, 48. 19-23)

విశ్రామిత్రుడు శ్రీరామునితో చెబుతున్నాడు – అహల్య గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అని తన తపశ్శక్తిచే గుర్తించెను. ఇంద్రుడు సంగమం కోరుతున్నాడేమిటి అని ఆలోచించెను. అతనితో ఇలా అన్నది, “నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుండి వెళ్ళుము. అన్ని విధముల నీ నా గౌరవములను నిలుపుము”.

ఇంద్రుడు వచ్చిన దారినే వెళతాను అని పలికి సంగమించి గౌతమ ముని వస్తున్నాడని గ్రహించి ఆశ్రమం నుండి బయటకు వచ్చి దాక్కున్నాడు.

కొన్ని విషయాలను ఇక్కడ జాగ్రత్తగా గ్రహించాలి. మొదటిది ఏమిటంటే వాల్మీకి రామాయణం కేవలం అహల్యాశాప శమనం మీద క్లుప్తంగా దృష్టిని సారించినట్లు తెలుస్తున్నది. శ్రీరాముని చరిత్ర కనుక ఆ కోణమే ఇక్కడ ప్రధానం. ఈ ఉదంతం వెనుక కథలెన్నో ఉన్నవి.

గౌతముడు తపశ్శక్తిలో ఎంతో మించి పోవటం వలన ఇంద్రుడు ఆయన భార్యను చెరచి, ఆ తపస్సును భంగపరిచినట్లు పలు చోట్లు వ్యాఖ్యనమున్నది.

మరో నేపథ్యంలోకి వెళితే కాని, అవగాహనలోకి వచ్చే అంశం కాదిది. రామాయణ కాలానికి ఎంతో ముందర బ్రహ్మదేవుడు ఎందరినో సృష్టిస్తున్నప్పుడు ఆ ప్రక్రియలో అతిలోక సుందరి అయిన అహల్య ఒక శిల్పంగా ఏర్పడినది. ఆమెను చూసి సృష్టికర్త తానే సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు. ఆయన నేర్పరితనానికి ఆయనకే అభిమానం కలిగింది. ఇంద్రలోకంలో ఈ అమ్మాయిని బ్రహ్మదేవుడు ఇంద్రునికే ఇచ్చేస్తాడని నమ్మారు. కానీ ఆయన మరోలా తలచాడు. అంత గొప్ప సృష్టి – వివాహం చేసి పంపిన తరువాత ఇంక అలా మిగలదు. ఆమెను అలాగే చూడాలంటే ఎలాగ? వివాహం కాకుండా ఉంచాలా? అలా కుదరదు. అంచాత  గౌతముని పిలిచి అతని ఆశ్రమంలో ఆమెను ఉంచాడు. ఏ పురుషుని వద్ద ఆమె ఉన్నప్పటికీ ఆమె సౌందర్యం, తేజస్సు చెక్కు చెదరవో, ఆతనిని (గౌతముని) ఎంచి పరీక్షించాడు. కొద్ది సంవత్సరాల తరువాత నియమానుసారం గౌతముడు ఆమెను తిరిగ బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వచ్చి సమర్పించాడు. బ్రహ్మదేవుడు సంతసించి అహల్యను గౌతమునికే ఇచ్చి వివాహం చేశాడు.

అహల్య అపురూప సౌందర్యవతి. బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయినపుడు ఆమె సౌందర్యం, లావణ్యం ఊహించగల్గటం మనకు సాధ్యం కాదు. లౌకికం, వ్యావహారికం అనునవి ఆమెకు కాలప్రమాణంలో కొన్ని యుగాలు, కొలమానంలో ఎన్నో లోకాలు దూరం. తండ్రి తప్ప మరో ప్రపంచం లేదు. ఇంద్రుడి మాట చెవిని బడి యుండవచ్చు. పురుషుని దృష్టి కూడా పడని పడతి. గౌతముని తపశ్శక్తి వలన ఆయనతో ఉండి కూడా ఆమె లావణ్యం చెక్కు చెదరలేదు. ఆ ఆశ్రమానికి విచ్చేసిన మరో పురుషుడు గౌతముని వేషంలో ఇంద్రుడే! ఆ అమాయకురాలికి శుద్ధ చైతన్యంలో గతంలోని ఇంద్రుని మాటతోనే అనుబంధం ఏర్పడింది. ఈ నిష్కల్మషమైన మానసిక స్థితి మామూలు వ్యావహారిక లోకానికి అవగాహనలోకి రావటమూ కష్టమే. ఈ సందర్భంలో మహర్షి వాడిన పదజాలం చాలా ప్రధానం – ‘దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్..’

అహల్యను ‘మహాభాగా’, తపస్సంపన్నురాలిగానే, దివ్యమైనదిగానే వర్ణించటం జరిగింది.

తైత్తిరీయారణ్యకం లోని అరుణ ప్రశ్నలో ‘ఇన్ద్రా గచ్ఛ హరివ ఆగచ్ఛ మేధాతిథేః మేష వృషణశస్యమేనే గౌరావస్కన్దిన్నహల్యాయై జార, కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రాహ్మణ..’ (58, 59)

అహల్య యొక్క ఆ జారత్వం విషయం, గౌతముడు ఇంద్రుని వృషణములు ఊడిపోవుననే శాపం, మేషం యొక్క వృషణములు ఇంద్రునికి ఏర్పడటం వంటివి ఇక్కడ పేర్కొనటం కనబడుతున్నవి.

అహల్య శాపవిమోచనం ఆమె లోని ఇంద్రుని పట్ల కల్మషం, జారత్వం నుండి విమోచనం అనే అర్థం.

ఇంద్రుడు కూడా గౌతముని తపోభంగమొనర్చి ‘దేవకార్యాన్ని’ సాధించెనని చెప్పాడు! (గౌతముడు ఇంద్ర పదవి వరకు రాకుండా చూచానని)

34. శ్లో.

తథా శప్త్వా స వై శక్రం అహల్యామపి శప్తవాన్।

ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి॥

వాయు భక్షా నిరాహారా తప్యంతీ భస్మ శాయినీ।

అదృశ్యా సర్వ భూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి॥

యదా చైత త్వనం ఘోరం రామో దశరథాత్మజః।

ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి॥

(బాలకాండ, 48. 29, 30, 31)

తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభ మోహ వివర్జితా।

మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి॥

(బాలకాండ, 48. 32)

గౌతముడు అహల్యను శపించాడు – “వేలకొలది సంవత్సరములు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణముతో తపించుచు ఈ ఆశ్రమమునందే పడియుంటావు. భస్మశాయినివై ఎవరికీ కనిపించవు. దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్రురాలవు అయ్యి నిజస్వరూపాన్ని పొందుతావు. శ్రీరామునకు అతిథి సత్కారములు చేసిన తరువాత సంతోషంతో నన్ను చేరుతావు.”

ఈ సందర్భంలో ‘శిల’ అను మాట ఎక్కడున్నది అనే వివాదం కలదు. ‘వపుర్ధారయిష్యసి’ అనునది నిజస్వరూపాన్ని సూచించే మాట అని కొందరి అభిప్రాయం. కాకపోతే ‘వపుః’ అన్న మాట నుండి శిల అన్న మాట వచ్చినట్లు అభిప్రాయం కూడా ఉన్నది. అయితే ‘స్వం వపుః’ అనగా రూపధ్వంసం అగుటకు పూర్వ రూపం అని అర్థం. ఈ శ్లోకం సందర్భం కూడా పూర్వ రూపాన్ని పొందుతావు అని చెప్పటం కాబట్టి, శిల అనునది పూర్వ రూపం కాదు కదా! అగ్నిపురాణం (ఆ మాటకొస్తే అనేక పురాణాలలో, కావ్యాలలో కూడా) ‘పాషాణభూతా రాజేంద్ర తస్య రామస్య దర్శనాత్’ (47వ అధ్యాయం) అన్న మాట ఉన్నది. కాళిదాసు ‘రఘువంశం’లో ‘గౌతమవధూః శిలా మయీ స్వం వపుః స కిల కిల్బిషచ్ఛిదాం రామపాదరజసానుగ్రహః’ అన్నాడు. (11-34).

ఒక విషయం స్పష్టమగుతున్నది. గౌతముని శాపంలో శిలగా మారమని చెప్పటం కనిపించటం లేదు.

‘అదృశ్యా సర్వ భూతానాం’ అన్నాడు. పైగా ‘భస్మశాయినివై’ అన్నాడు. దీనిని బట్టి శిలగా మారినను అందరికీ అదృశ్యరాలిగా ఉన్నదా? భస్మశాయినిగా, వాయుభక్షకురాలిగా ఉన్నదా? ఇది సమంజసంగా లేదు. శ్రీరాముని పాద స్పర్శ వలన శిల అహల్యగా మారితే ఆ శిల అందరికీ కనిపించి ఉండాలి కదా?

కొద్దిగా సూక్ష్మంగా పరిశీలిద్దాం. గౌతముని శాపం వలన అహల్య ఒక స్వరూపం లేని మనిషిలా ఎవరికీ కనిపించకుండా ఆ ఆశ్రమంలో ఒక పొగ లాగా (భస్మశాయిని), చిత్రమైన అవస్థలో యున్నది. శ్రీరాముని రాకతో ఆ ఆకారం ఒక అస్తిత్వాన్ని పొందుతూ వచ్చింది (శిల లాంటి). శ్రీరాముని పాద స్పర్శ వలన ఆ శిల లాంటి స్వరూపం ‘స్వం వపుః’ పునః అహల్య యొక్క దేదీప్యమానమైన సౌందర్య స్వరూపం పొందినది. ఈ ప్రక్రియ వలన ‘దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ సూర అహల్యను చూచి బ్రోచిన రీతి ధన్యు జేయవె, త్యాగరాజ గేయమా, శ్రీరామ పాదమా, నీ కృప చాలునే, చిత్తానికి రావే..’ అన్నాడు త్యాగయ్య కూడా!

సూక్ష్మం నుంచి స్థూలం వైపు శిలగా క్షణకాలం అగుపించినా లౌకికంలో శ్రీరాముడు శిలను అహల్యగా మార్చినట్లే కదా!

35. శ్లో.

త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనమ్।

శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శన మాగతా॥

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా।

స్మరంతీ గౌతమ వచః ప్రతిజగ్రాహ సా చ తౌ॥

పాద్యయర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితా।

ప్రతి జగ్రాహ కాకుత్స్థో విధి దృష్టేన కర్మణా॥

(బాలకాండ, 49. 16, 17, 18)

గౌతమ మహర్షి శాపం వలన శ్రీరాముడు వచ్చు వరకును ఆమె ముల్లోకాలకు కనిపించలేదు. ఆయన రాగానే ఆమెకు శాపవిముక్తి కలిగెను. వారికి కనబడెను.

అక్కడికి వచ్చిన శ్రీరామలక్ష్మణులు ఆమె పాదాలను సేవించారు. తరువాత ఆమె వారిరువురికి పాదాభివందనం చేసి అతిథి సత్కారాలను నిర్వర్తించింది..

దీనివలన అర్థమగునది ఏమిటంటే అహల్య – గౌతముని వేషంలో ఉన్నది ఇంద్రుడని తెలిసే సంగమించినప్పటికీ, ఆ విషయం ప్రసంగించునప్పుడు లోకుల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అహల్య యొక్క ఇంత నేపథ్యాన్ని ఆవిష్కరించి యుంటుంది. ఇది విస్మరించకూడదు. అంతే కాదు, ఆమెది ఎంతో ఉత్కృష్టమైన చరిత్ర. తపస్సంపన్నురాలు. శ్రీరామలక్ష్మణులు ఇరువురు ఆమె పాదాలకు నమస్కరించటం గమనార్హం! వారు అతిథి సత్కారం పొందాకా కదా ఆమెకు శాప విమోచనం అని కొందరు అడగవచ్చు. వారి రాక వలన ఆమె వారికి కనిపించెను అని మహర్షి చెప్పాడు. అందుచేత గౌరవపూర్వకంగా ఆమె పాదాలను సేవించారు. ఆమె వారికి నమస్కరించుకుని అతిథి సత్కారములు ఆచరించిన పిమ్మట సస్వరూపాన్ని పొందగా దేవతలు దుందుభులు మ్రోగించారు.

మహాత్ములకు కొన్ని కనిపిస్తాయి. మనకు కొన్నే కనిపిస్తాయి..

36. శ్లో.

ధిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలమ్।

ఏకేన బ్రహ్మ దండేన సర్వాస్త్రాణి హతాని మే॥

(బాలకాండ, 56. 23)

విశ్వామిత్రుడు వశిష్ఠుని చేతిలో పరాభవం పొంది అంటాడు, “ఛీ! క్షత్రియ బలం కూడా ఒక బలమా? బ్రహ్మతేజమే, బ్రహ్మతేజో బలమే నిజమైన బలము. ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములను అన్నింటిని వమ్ము గావించినది.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here