ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-8

1
2

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

46. శ్లో.

జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణు పరాక్రమైః।

అధికం మేనిరే విష్ణుం దేవాస్సర్షిషి గణాస్తదా॥

(బాలకాండ, 75. 19)

పరశురాముడు శివ, వైష్ణవ ధనువుల గురించి శ్రీరాముడికి తెలుపుతూ బ్రహ్మదేవుడు దేవతలకు విష్ణువు ఎక్కువా లేక శివుడు గొప్పవాడా అని చూపించేందుకు ఇరువురి మధ్య తగువు సృజించిన కథ చెబుతాడు. విష్ణువు హుంకరించగా శివధనువు నిస్తేజమైనట్టు చెప్పాడు. అయితే ఇక యుద్ధం జరుగుతుందీ అనే సమయానికి దేవతలందరూ ఋషీశ్వరులతో కూడి ఇరువురినీ ప్రార్థించి శాంతింపజేశారు. కాకపోతే శివధనువు నిస్తేజం అగుట చూసి వారు ‘విష్ణువే అధికుడు’ అనుకున్నారట.

ఈ శ్లోకాన్ని పణంగా పెట్టుకుని కొందరు ‘మా’ విష్ణువే అధికుడు అని వ్యాఖ్యానాలు చేయటం మనం చూస్తాం. ఇద్దరూ శాంతించి యుద్ధం చేయలేదన్నది స్పష్టంగా యున్నది. ఇరువురూ ఒకటే కాబట్టి ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్లే!

కథాపరంగా చూస్తే పరశురాముడు ఆ సంఘటనలో దేవతలు అలా తలచిరి అన్నాడు కానీ ఆయన స్వయంగా ఆ మాట పలుకలేదు. యుద్ధకాండలో ఈ వివాదానికి శ్రీరాముడు స్వయంగా స్వస్తి చెప్పాడు. గాంధర్వాస్త్రం ప్రయోగించి రాక్షసులందరినీ చెండాడినప్పుడు ఈ అస్త్రం నా వద్ద, మరల త్ర్యంబకుడైన పరమ శివుని వద్దనే యున్నది అని చెప్పాడు!

పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళుతూ రామేశ్వరం క్షేత్రాన్ని చూపించి ‘లంకకు బయలుదేరే ముందు ఇక్కడే మహాదేవుడిని అర్చించుకున్నాము’ అని సీతకు చెప్పాడు శ్రీరాముడు.

ఉత్తరకాండలో రావుణుని వృత్తాంతం వినిపిస్తూ – రావణుడు కైలాస శిఖరాన్ని కంపింపజేసినప్పుడు అతన్ని కాలి బొటన వేలుతో ఆ శిఖరం క్రింద శివుడు తొక్కి పెట్టడం చూస్తాం. వేయి సంవత్సరాలు రావణుడు స్తోత్రం చేసిన తరువాత కానీ రావణునికి ఊరట కలుగలేదు.

47. శ్లో.

తదిదం వైష్ణవం రామ పితృ పైతామహం మహత్।

క్షత్ర ధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్॥

యోజయస్వ ధనుః శ్రేష్ఠే శరం పర పురంజయమ్।

యది శక్నీషి కాకుత్స్థ ద్వంద్వం దాస్యామి తే తతః॥

(బాలకాండ, 75. 28, 29)

పరశురాముడు చెబుతున్నాడు – ఓ శ్రీరామా! తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కు చెదరని ఈ వైష్ణవ మహాధనుస్సును క్షత్రియ ధర్మము ననుసరించి గ్రహింపుము. ఓ రామా! నీకు శక్తి యున్నచో శత్రుపురములను జయించునట్టి బాణమును ఈ మహా ధనుస్సు నందు సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధము చేయుటకు నిన్ను అనుమతిస్తాను.

48. శ్లో.

వీర్య హీన మివాశక్తం క్షత్ర ధర్మేణ భార్గవ।

అవజానాసి మే తేజః పశ్య మేద్య పరాక్రమమ్॥

ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్।

శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘు పరాక్రమః॥

ఆరోప్య సధనూ రామః శరం సజ్యం చకార హ।

జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధో బ్రవీద్వచః॥

(బాలకాండ, 76. 3, 4, 5)

శ్రీరాముడు – ఓ భార్గవా! నన్ను నీవు పరాక్రమము లేని వానిగాను, క్షత్రియ ధర్మము ప్రకారము ధనుస్సు నెక్కుపెట్టుట, యుద్ధము చేయుట మున్నగు విషయములందు అశక్తునిగా భావించి, అవమానించితివి. దీనిని ఒప్పుకోను. ఇదిగో నా పరాక్రమము చూడు – అంటూ క్రుద్ధుడై ధనుర్బాణములను అందుకున్నాడు. ధనుస్సును ఎక్కుపెట్టి బాణమును సంధించాడు.

ప్రముఖమైన విషయాలు:

1.అసలు పరశురామునికి శ్రీరామునితో పంతమేమిటి? అనే ప్రశ్న ముందుకు వస్తుంది. వీర్యశుల్కం క్రింద శివధనువును ఎక్కుపెట్టి సీతాదేవిని వివాహమాడినాడు. పరశురాముని బాధ ఏమిటి?

ఈ భూమి మీద సార్వభౌమత్వానికి, అందరినీ మించిన పరాక్రమము కలవానిగా గుర్తునకు ఒక ధనువు న్యాసంగా (చిహ్నంగా) ఒకరి వద్ద ఉంటుంది (ఒకరి వద్దనే). విష్ణువు వలన శివధనువు నిస్తేజం అయిన తరువాత వైష్ణవ ధనువు చేతబట్టి అప్పటికి జగదేక వీరుడుగా ఉన్న అవతారం పరశురాముడు. ఆ క్రమంలో శివధనువును ఎక్కుపెట్టారు మరెవరో అని గ్రహించి చూద్దామని వచ్చాడు ఆయన. ఆయన స్వభావంలో ఆవేశం ఎక్కువ. క్షత్రియ సంహారం జరిపిన ఆయనను ఒక క్షత్రియుని కార్యకలాపం ఆ విధంగా ప్రవర్తింపజేసింది.

2.వైష్ణవ ధనువును ఎక్కుపెడితే ద్వంద్వ యుద్ధం చేయుటకు అవకాశమిస్తానన్నాడు పరశురాముడు. అందుచేత ఇప్పుడు ఆ పదవి యందు నువ్వుండాలా నేనా అన్న మాట సుస్పష్టం. ఇక్కడే రామాయణంలో తరువాత జరిగిన ఘట్టాలను అర్థం చేసుకోవాలి. వాలి విషయంలో శ్రీరాముడు ద్వంద్వ యుద్ధానికి వెళ్ళటం ఎంత అసందర్భమో ఆలోచించాలి! ఆ యోగ్యత వాలికి లేదు! అసలు ఆ ప్రశ్నే రాదు!

3.శ్రీరాముడు శాంత స్వభావుడైనప్పటికీ క్రోధం ప్రదర్శించి ఇదిగో నా పరాక్రమం చూడు అని ధనువును అందుకున్నాడు. ముల్లోకాల సార్వభౌమత్వం పరశురాముని నుంచి గ్రహించి ఇదిగో ఎవరైనా నా తరువాతనే అని అందరికీ చెప్పకుండానే చాలా గట్టిగా చెప్పాడు శ్రీరాముడు.

శ్రీమహా విష్ణువు అవతారాలలో పరశురాముని తరువాత శ్రీరాముడు మన ముందరికి వచ్చాడన్నది సూటిగా ప్రకటించి అయోధ్యకాండ లోకి వెళ్ళాడు మహార్షి వాల్మీకి!

49. శ్లో.

అక్షయం మధు హంతారం జానామి త్వాం సురేశ్వరమ్।

ధనుషోస్య పరామర్శాత్ స్వస్తి తేస్తు పరంతప॥

(బాలకాండ, 76. 17)

ఓ పరంతపా! ఈ మహా ధనుస్సును ఎక్కుపెట్టుట చేత, నిత్యుడు, దేవదేవుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువే నీవని నేను గ్రహించాను. నీకు మంగళమగు గాక! (పరశురాముని మాట).

50. శ్లో.

న చేయం మమ కాకుత్స్థ వ్రీడా భవితు మర్హతి।

త్వయా త్రైలోక్య నాథేన యదహం విముఖీ కృతః॥

(బాలకాండ, 76. 19)

పరశురాముడు: ఓ కాకుత్స్థా! ముల్లోకములకు ప్రభువైన నీ చేతిలో ఓటమి పాలగుట నాకే మాత్రము లజ్జాకరము కాదు. సచ్చరితుడవైన ఓ రామా!..

ఈ ‘ముల్లోకములకు ప్రభువైన’ శ్రీరామచంద్రమూర్తిని తన రాజ్యానికి యువరాజ పట్టాభిషేకం చేయాలని ఉవ్విళ్లూరాడు వృద్ధుడైన దశరథ మహారాజు. జరగలేదని మహరాజు దుఃఖించాలి గానీ మన లోకనాథుడా?!

***

51. శ్లో.

న చానృతకథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః।

అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురజ్యతే॥

సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః।

దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః॥

కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే।

మన్యతే పరయా కీర్త్య మహత్స్వర్గఫలం తతః॥

నాశ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధకథారుచిః।

ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతి ర్యథా॥

అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత్।

లోకే పురుషసారజ్ఞస్సాధురేకో వినిర్మితః॥

స తు శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః।

బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః॥

(అయోధ్యకాండ, 1. 14-19)

శ్రీరాముడు ఎట్టి పరిస్థితులలోనూ అసత్యమును పలికేవాడు కాదు. సకల విద్యా పారంగతుడు, జ్ఞాన వయోవృద్ధులకు ఎదురేగి వారిని సేవించేవాడు. ప్రజలను ప్రేమతో సంతోషింపజేసేవాడు. వారికి ప్రాణతుల్యుడు.

బాధలో ఉన్నవారిని చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించేది. ఆయన క్రోధాన్ని జయించినవాడు. వేదజ్ఞులను ఎదురుగా వెళ్ళి పూజించేవాడు. దీనులను ఆదుకునేవాడు. సామాన్య ధర్మములను, విశేష ధర్మములను బాగా తెలిసినవాడు, నియమంలో ఉండేవాడు. పరుల సొత్తును ఆశింపనివాడు.

ఇక్ష్వాకులకు సహజములైన దయ, శరణాగత రక్షణము, ధర్మైక దృష్టి, దుష్ట నిగ్రహం, ప్రజాపరిపాలనము ఇత్యాదులు గలవాడు. ద్యూతము లాంటివి ఆయనకు అలవాటు లేవు. నిష్ఠురోక్తులను ఎన్నడూ పలుకలేదు. యుక్తియుక్తముగా మాట్లాడడంలో నేర్పరి.

శ్రీరాముడు మానసికముగా, శారీరకముగా చక్కని ఆరోగ్యము కలవాడు, యువకుడు, చక్కని గాత్రం కలవాడు, నిరంతరం అధ్యయనంలో ఉండేవాడు. ఒక్కసారి చూడగానే పురుషుల హృదయములను తెలుసుకునేవాడు. సాటి లేని సద్గుణములు గల మహాపురుషుడు.

ఇటువంటి గుణములుల వలన ఆయన ప్రజలందరికీ మిక్కిలి ప్రేమాస్పదుడు. వారికి బహిః ప్రాణము.

52. శ్లో.

అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః।

ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాం గారకరాహుభిః॥

(అయోధ్యకాండ, 4. 18)

దశరథుడు చెప్పాడు – ఓ రామా! నా జన్మ నక్షత్రము నందున క్రూరగ్రహములైన సూర్యుడు, కుజుడు, రాహువు చేరి యున్నారని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.

53. శ్లో.

కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః।

జ్యేష్ఠనువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః॥

కింతు చిత్తం మనుష్యాణామ్ అనిత్యమితి మే మతిః।

సతాంతు ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ॥

(అయోధ్యకాండ, 4. 26, 27)

నీ తమ్ముడైన భరతుడు అన్న అడుగుజాడలలో నడచుకొనువాడు, ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, నిస్సందేహంగా అతడు సత్పురుషుల మార్గమునే అనుసరించువాడు. ఐనను శ్రీరామా! సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చంచలములు – ధర్మనిరతులైన సత్పురుషుల మనస్సులు గూడ ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణముల వలన రాగద్వేషములచే ప్రభావితములగు చుండును..

ఈ సందర్భంలో అయోధ్యకాండలోనే 107వ సర్గలోని 3, 4 శ్లోకాలు గమనింపదగ్గవి. భరతుడు చిత్రకూటానికి వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తిరిగి రమ్మని పలు విధాల ప్రాధేయపడ్డాడు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పి శ్రీరాముడు తుదకు ఒక మాట అన్నాడు (ఈ విషయం  మనం దశరథుడు గాని, కైక గాని నోట వినం) –

‘సోదరా! పూర్వము మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహం చేసుకొను సందర్భంలో ‘కైకేయీ దేవి నందు కల్గిన పుత్రునకే రాజ్యాధికారాన్ని ఇస్తాను’ అని మీ మాతామహునకు మాట ఇచ్చెను. ఆ తరువాత దేవాసురులకు జరిగిన యుద్ధమున మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మిగుల సంతుష్టుడై, ఆమెకు రెండు వరములను ఇత్తునని వాగ్దానము చేసెను.’

వరాల సంగతి అటుంచి ఈ వాగ్దానం అనునది సత్యపరిపాలన విషయంలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ మాటను ఎరిగియే మహారాజు శ్రీరామచంద్రునికి యువరాజ పట్టాభిషేకం తలపెట్టి కైకేయికి, భరతునకు ఎట్టి అభ్యంతరమూ ఉండదు కదా అని యోచించాడు. కానీ అది ధర్మ విరుద్ధం, సత్యపరిపాలనకు విరుద్ధం అయి కూర్చుంటుందీ, శ్రీరామునికి పూర్తిగా విరుద్ధమవుతుందని ఎంచలేదు.

పై శ్లోకాలలో ‘కింతు చిత్తం మనుష్యాణామ్ అనిత్యమితి మే మతిః’ అన్న మాట భరతుని విషయంలో చెబుతున్నప్పుడు ఆయన అంతఃకరణలో ఈ గూఢం దాగియున్నట్లు పరోక్షంగా తెలుస్తున్నది. అందుచేతనే భరతుడు మేనమామ ఇంటి నుండి వచ్చే లోపలే యువరాజ పట్టాభిషేకం జరిగిపోవాలని సూటిగా చెప్పాడు. వరాలున్నప్పటికీ ఈ విషయంలో వరాలుండగలవు అని అనుకోలేము కదా! కైకేయి వరాలు కోరుకోవటం – ఈ విధమైన వరాలు కోరుకోవటం సత్యధర్మపరిపాలనలో భాగంగా స్పష్టమగుచున్నది! అందుచేత శ్రీరాముడు సత్యధర్మపరాయణుడు, సత్యపరాక్రముడు అగుట చేత భరతుని ఆయన తల్లి ‘తవ మాతా యశస్వినీ’ – నీ తల్లి ఉత్తమ మహిళని అని, ఆమెను దూషించవలదని చెప్పినట్లు తెలుస్తున్నది! కాకపోతే అయోధ్యలో ఉన్నంత సేపూ ఈ ఘటన దైవ ప్రేరితం, విధి విలాసం అని మాత్రమే శ్రీరాముడు లక్ష్మణునితో చెప్పటం విశేషం!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here