Site icon Sanchika

ఆదిత్య హృదయం స్తోత్రం విశిష్టత

[dropcap]ఆ[/dropcap]దిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడిని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు.

వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో చెప్పబడిన ఈ ఆదిత్య హృదయం అనే అపూర్వ, అతి ప్రభావంతమైన ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్థిక, ఋణ సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది. భక్తి శ్రద్ధలతో, అకుంఠింత దీక్షతో, పూర్తి నమ్మకంతో ఈ స్తోత్ర పారాయణ చేస్తే వైద్యులచే కూడా నయం కాని అనేక దీర్ఘకాలిక వ్యాధులు తక్షణం బాగవుతాయన్నది దశాబ్దాల ఆస్తికుల నమ్మకం.

ఆదివారములందు సూర్యదేవాలయంలో 60 ప్రదక్షిణాలు చేసి 36 సార్లు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యే కోరికను ఆశించకుండా ఈ స్తోత్రంను ప్రతిరోజూ చదివినట్లైతే అన్ని సమస్యలు తొలగి సూర్య సాయుజ్యన్ని పొందుతారు. రథసప్తమి రోజు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇంతటి మహిమాన్విత స్తోత్ర రాజం ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.

మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు, శ్రీ రాముడి వద్దకు వచ్చుట

3 నుండి 5 శ్లోకాలు: ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.

6 నుండి 15 శ్లోకాలు: సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే అన్న అంశం విపులీకరించబడింది.

16 నుండి 20 శ్లోకాలు: మంత్ర జపం

21 నుండి 24 శ్లోకాలు: సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు

25 నుండి 30 శ్లోకాలు: పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయవలసిన విధానం, సూర్యభగవానుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం మొదలైనవి పొందుపరచబడి వున్నాయి.

ఈ మహిమాన్వితమైన ఈ స్తోత్రమును ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి పారాయణ చేస్తే అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. నేత్ర సంబంధ వ్యాధులు తొలగడంతో పాటు వివాహ ఘడియలు కూడా అనుకూలిస్తాయి.

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

Exit mobile version