Site icon Sanchika

ఆగణిత

[dropcap]కా[/dropcap]లం గణనకు అందుతుందా
లెక్కపెడుతున్నామనుకోవటం మన సౌకర్యం
గడియారం మనం తయారుచేసుకున్నదే
అందులో కాలాన్ని కట్టేయగలమా
కొలిచేవన్నీ మారిపోతూనే ఉంటాయి
మారనిది నిత్యమైన కాలమే
అది పరిచ్ఛిన్నం కాలేదు
సెకను, నిమిషం, గంట, రోజు, నెల, ఏడాది
ఏళ్లు, దశాబ్దాలు, శతాబ్దాలు, కల్పాలు, యుగాలు
రాశులు రాసులుగా కాలాన్ని పోగేసుకుంటున్నాం
పుట్టుక ఒక తేదీ, పోవటానికి ఒక తేదీ
కాలలేఖనంతో జననమరణాలకు వారధి కడుతున్నాం
పుట్టగానే మన ప్రయాణం మరణంవైపే అయినప్పుడు
పోతామనే స్పృహతో ఆయువును కొలిచేది కాలంతోనే
కాలగణనకు కొలమానం గ్రహగోళాల పరిభ్రమణమే
భూమి, సూర్యుడు, తారకలు
రాత్రింబవళ్ళు ఉన్నాయని ఒక భ్రమ
కాలాన్ని పగలు రాత్రులుగా విభజిస్తాంగానీ
భూమినుంచి దూరమైతే అన్నీ మాయమే కదా..
ఆగణనీయ కాలాన్ని గణించలేని మనిషీ
అంతులేని కాలంలో నువ్వూ ఒక ఘడియవే సుమా!

Exit mobile version