Site icon Sanchika

ఆగంతకుడు

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘ఆగంతకుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“హ[/dropcap]లో! హలో! శాంతీ! మీరంతా ఎలా వున్నారు? ఇక్కడ షిప్‌లో అంతా బాగానే వుంది. అక్కడ ఇండియాలో మీరు ఎలా వున్నారోనని నాకు చెప్పలేనంత ఆందోళనగా వున్నది. అమ్మ నాన్నా పెద్దవారు. బాగా భయపడుతూ వుండి వుంటారు. నేను ధైర్యం చెప్తూ ఫోన్లు మాట్లాడుతూనే వున్నాను. మీరంతా కరోనా వాక్సిన్ వేయించుకున్నారుగా. నువ్వు ధైర్యంగా వుండి ఇంట్లో పిల్లలకూ, అమ్మ, నాన్నలకూ కూడా నువ్వే ధైర్యం చెప్పాలి. లాక్‌డౌన్ ఇప్పుడప్పుడే ఎత్తేయరు. కావలసిన సరుకులన్నీ ఒకేసారి తెప్పించి పెట్టుకోండి. ప్రొద్దుటిపూట మాల్ తెరిచే సమయానికి వెళ్లి వారానికి సరిపడా కూరగాయిల్ని తెచ్చుకుని ఫ్రిజ్‌లో జాగ్రత్త చేసుకో.”

“ఇక్కడ మేమంతా భద్రంగానే వుంటున్నాం. మీరు దూరంగా ఆ షిప్‌లో ఎలా వున్నారోనని భయపడుతున్నాం. ఇక్కడ మన అపార్ట్‌మెంట్‌లో కూడా చాలా మందికి వచ్చింది. హాస్పిటల్లో కొంతమంది, ఇంట్లోనే మరి కొంతమంది ఐసోలేషన్లో వున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మాట్లాడుకోలేని పరిస్థితి. అత్తయ్య అయితే భయపడిపోతున్నారు, మామయ్య పైకి కనపడటం లేదు. పిల్లలు కూడా ‘నాన్న ఇప్పుడప్పుడే రారుగా!’ అని మరీ మరీ అనుకుంటున్నారు. మీరు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా వాళ్లంతా బెంగగానే మాట్లాడుతున్నారుగా! సరే మీరు జాగ్రత్త. వుంటాను.”

ఆ మాటలు విని ‘కాస్టోరో-1’ షిప్‍లో ప్రయాణించే సుధీర్ బాధగా నిట్టూర్చాడు. ఇలాంటి నిట్టూర్పులు తనొక్కడికే కాదు. ఇక్కడ షిప్‌లో పని చేస్తూ, దూరాన ఉన్న వందలమంది తమ కుటుంటాల కోసం ఆవేదన పడే వివిధ దేశాల వారిది. సముద్రంలో ప్రయాణించే తమ షిప్‌లో ఇంతవరకూ ఎవరికీ ఏ కరోనా సోకలేదు. తామిప్పుడు చేసే ప్రాజెక్టు ఇంకో 15, 20 రోజుల్లో పూర్తి కావస్తున్నది. కానీ ఇంటికి వెళ్లాడనికి మాత్రం మార్గం దొరికేటట్లు లేదు. విమానాశ్రయాలు ఇప్పుడప్పుడే తెరచుకోవు. ఫ్లయిట్స్ లేకుండా తమ ప్రయాణం అసాధ్యం. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు వెళ్లి తమ వారిని కళ్లారా చూసుకుందామా అని ప్రతి వారూ కల్లోల పడుతున్నారు. ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అనుకుంటూ షిప్‌లో తనకు పని వేళ కాగానే అచ్చం అంతరిక్ష వ్యోమగామి లాగానే తలకు, ఒంటికి, కాళ్లకూ, చేతులకూ రక్షణ తొడుగులు తగిలించుకోసాగాడు. ఇక్కడ షిప్‌లో తను చేసేది పైపుల్ని వెల్డింగ్ చేసే పని. కార్బన్ స్టీలుతో చేసిన 14 టన్నుల బరువుండి, 12 మీటర్ల పొడవున్న పైపుల్ని ఒకదానికొకటి అతుకులేసుకుంటూ పోవాలి. అలా అతుకు వేసేటప్పుడు తామంతా చాలా అప్రమత్తంగా వుండాలి. ఆ సమయంలో బయటి గాలి సోకకుండా చూసుకోవాలి. అతుకులో ఏ మాత్రం సూదిమొనంత ఖాళీ కూడా వుండకూడదు. అలా వుంటే ఆ పైపు ద్వారా రవాణా అయ్యే ఏ ఆయిల్ అయినా లీకయ్యే ప్రమాదముంటుంది. అతికిన పైపుల్ని క్వాలిటీ కంట్రోలు వారు పరీక్షించిన తర్వాతే ఐదు రకాల కోటింగులు వేసి వాటిని సముద్రం లోకి జారవిడుస్తూ పోవాలి. పైపులకు జాగ్రత్తే కాదు, తామూ చాలా అప్రమత్తంగా వుండాలి. లేకపోతే ఆ 50, 55 డిగ్రీల వేడిల్లో పైపుల్ని అతికేటప్పుడు వెలువడే హీలియమ్, నైట్రోజన్ లాంటి వాటి బారిన పడటం ఖాయం. ఇలాంటి పరిస్థితులన్నింటిని ఓర్చుకుని, నెలల తరబడి షిప్పులలో పడి తిరుగుతూ, ఆర్థికంగా తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కాలం గడుపుతున్నాడు.

ఏదో ప్రకటన వినబడుతున్నది. నెదర్లాండ్స్ నుండి షిప్ లోని వారికి వాతావరణ రిపోర్టు చెప్తున్నారు. మరో గంటలో తీవ్రమైన గాలులు రాబోతున్నాయి. కాబట్టి ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయని. ‘సో, ఈ పూట పని సాగదు’ అనుకుంటూ సుధీర్ ఒంటికి తొడుక్కున్న తొడుగులన్నీ తీసేయసాగాడు. షిప్ బయల్దేరే ముందు సర్వే నౌక వచ్చి ముందుగా సర్వే చేసి ఇచ్చిన దారి గుండానే తమ ‘కాస్టోరో-1’ ప్రయోగిస్తున్నది. కాని ఎప్పటికప్పుడు నెదర్లాండ్స్ నుండి అందిన వాతావరణ నివేదిక ప్రకారం తమ పనులు సాగుతాయి.

ఆలోచనలతో మనసు కలత పడింది. ఆ పూటకు తిండి మీదకు కూడా ధ్యాస పోలేదు. డైనింగ్ హాల్లో పెట్టి వున్న యాపిల్స్ కంటైనర్ దగ్గర ఆగాడు. నాలుగింటిని చేతిలోకి తీసుకుని చాకుతో పైనున్న తొక్కనంతా తీసి దాన్నే తినసాగాడు. గుజ్జంతా వదిలేశాడు. అదంతా పక్కనుండి చూస్తున్న సలీమ్ నవ్వాడు. “ఏం బాయ్! కేవలం యాపిల్ తోలు తోనే కడుపు నింపుకుంటావా!” అని కూడా అన్నాడు.

“అదేం లేదు భయ్యా. ఆరోగ్యకరమైన పోషకాల కోసమే అలా చేశాను.”

“చూడు సుధీర్ భాయ్! మనం తినేది ఇంటర్‌కాంటినెంటల్ ఫుడ్. ఈ షిప్‍లో పని చేసే అన్ని ఖండాల వాళ్లు తినగలిగే ఫుడ్ మాత్రమే ఇక్కడ వుంటుంది.”

“నిజమే సలీమ్. డబ్బు కోసం అన్నింటినీ ఓర్చుకుంటున్నాం. సముద్రంలో ఈ చివరి పైపును వెల్డింగ్ చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. కాని ఇంకాస్త పైపు లైన్ నైజీరియా లోని చిత్తడి నేలల్లో వెళ్లి అక్కడ వేయాల్సి వుంటుంది. అక్కడి బురదా, నీళ్ళు కన్నా నైజీరియన్లు ఎక్కువ చికాకు పెడతారు. అక్కడ పనిచేయటం కరోనాతో యుద్ధం చేయటం లాంటిదే. వాళ్ల ప్రాంతం మీద మనం కాలు పెట్టి తిరిగిరావటం వాళ్లు ప్రవర్తన మీద ఆధారపడి వుంటుంది. మనందరం చాలా కేర్‌ఫుల్‌గా వుండాలి. నీకూ తెల్సిందేగా. పద వెళ్దాం. కాస్త చాయ్ తాగి వద్దాం.”

చాయ్ తాగుతున్నా ఆలోచనలు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. తనకే కాదు, ఈ షిప్‍లో పనిచేసే 600 మంది సిబ్బందిలో కెప్టెన్ నుండి వంట మనిషి వరకూ అందరూ తమ తమ ఇళ్ల దగ్గర తమ వాళ్లు ఎలా వున్నారోనని కల్లోల పడుతున్నారు. తాను నిరుపేద స్థితి నుండి బయటపడటానికే ఇలా ఈ ఉద్యోగం చూసుకుని షిప్పుల్లో పడి తిరుగుతున్నాడు. ఆరోగ్యకరమైనదంటూ వాళ్లు పెట్టిన దాంట్లో తనకు నచ్చిన కొన్ని మాత్రమే తిని కడుపు కట్టుకుని ఇంటికి డాలర్లు పంపిస్తున్నాడు. తనకిప్పుడు మంచి ఇల్లూ, పొలం నాలుగైదు స్ధలాలూ అన్నీ అమరాయి. ప్రాజెక్టుకూ ప్రాజెక్టుకూ మధ్య విరామ మప్పుడు కొన్ని నెలలు మాత్రమే కుటుంబంతో గడిపి వస్తున్నాడు. ఎప్పటికప్పుడు తన తోటి వాళ్లెవరయినా, మానేసినప్పుడు తనూ ఇంతటితో విరమించుకోవాలని, ఇంటి పట్టున వుండి మరేదైనా చేసుకోవచ్చని అన్పిస్తుంది. కానీ షిప్‍లో ఒక కొత్త ప్రాజెక్టు మొదలైంది అన్న సమాచారం కనబడగానే తాపత్రయం మొదలవుతుంది. డాక్టరు దగ్గరకు పరుగెత్తడం ఫిట్‌నెన్ సర్టిఫికెట్ తీసుకోవడం, కంపెనీల వాళ్లు పెట్టే పరీక్షలకు సిద్ధపడి నెగ్గి వచ్చి మరలా షిప్పెక్కడం అలవాటయిపోయింది. అలా ఈ సంపాదనా చట్రంలో పడిపోయి తిరుగుతూ వున్నాడు.

వాతావరణం అనుకూలించిందని మరలా రిపోర్టు వచ్చింది. ప్రతి 12 మీటర్ల పైపు అతుక్కునే వరకూ షిప్ అక్కడే ఆగి వుంటుంది. నాలుగు రోజుల్లో ఈ పని పూర్తయింది. షిప్ నైజీరియాలో ప్రవేశించింది. నైజీరియిన్లది తీవ్రమైన స్వభావం. వారి కంటికి కనపబడ్డ డస్ట్ బిన్‍ను కూడా వదలరు, “ఇది మా ప్రాంతం. ఇక్కడున్న అన్నింటి మీదా, మాకు హక్కుంటుంది” అని వాదిస్తారు. ఆయుధాలు ధరించి మరీ తిరుగుతారు. షిప్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. చివరకు రిగ్గుల నుండి కూడా చమురును బలవంతాన లూటీ చేసుకుని పోతారు. అడ్డుకున్న వారిని చంపటానికి కూడా వెనుకాడరు. ఇప్పుడసలే పరిస్థితి ఉద్రిక్తంగా వున్నది. ఎవరో నైజీరియన్ ఉగ్రవాదిని అమెరికాలో ఆరెస్టు చేశారట. దానికి ప్రతీకారంగా ఇక్కడి చిత్తడి నేల మీద కనబడిన వారిని కనబడినట్టుగా కాల్చి పారేస్తున్నారు. అలాంటి స్థితిలో ‘కాస్టోరో-1’ షిప్ అక్కడికి వచ్చింది. ఇది ఇటలీ దేశానికి చెందిన సైఫెమ్ కంపెనీకి చెందినది. అయినా వారికదేం పట్టదు.

షిప్ లోని వాళ్ళు భయపడినట్లుగానే నైజీరియన్ల గుంపొకటి ఆయుధాలు ధరించి బిగ్గరగా అరుచుకుంటూ వచ్చి చుట్టుముట్టింది. చాలామందికి పై ప్రాణాలు పైనే పోయాయి.. పపువా న్యూ గినియా, కజకిస్తాన్ లోని కొన్ని ప్రమాదకర దీవుల కన్నా, అమెరికా, బ్రిటన్‌లకు మధ్య ఉన్న సముద్ర భాగంలో అత్యంత భయంకరంగా, విస్మయంగా చెప్పుకునే ‘బెర్ముడా ట్రయాంగిల్’ కన్నా వీళ్ళు ప్రమాదకారులని తమందరికీ తెలుసు. కాని ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా వున్నది. చాలామంది ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు. షిప్పులో జరిగే పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కెప్టెన్‌తో సహా కొంతమంది అధికారులు రంగంలోకి దిగారు. నైజీరియన్లను శాంతపరచటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్షణక్షణం భారంగా గడుస్తున్నది. మధ్య మధ్యలో తుపాకీ మోత వినిపిస్తున్నది. ఎక్కడ ఎవరు నేలకూలారో అన్న ఆందోళన అందరిలో ఎక్కువయింది.

***

ఇంతలో సుధీర్ ఫోన్ రింగయ్యింది. అవతల ఫోన్‌లో శాంతి. కాని శాంతికి ఏడుపు ఎగదన్నుకు వస్తూ మాట్లాడలేకపోయింది.

సుధీర్‌కి ఏం అర్థం కావటం లేదు. మనసు ఏదో కీడును శంకించింది. కొంచెం తెప్పరిల్లుకుని “శాంతీ! ఏడవకు, మన మహితకు పోనివ్వు. నీ ఏడుపుతో ఇక్కడ నాకు కంగారుగా వున్నది” అన్నాడు.

పెద్ద కూతురు మహిత ఫోన్ తీసుకున్నది.

“ఏరా? తల్లీ! అమ్మ ఎందుకలా ఏడుస్తున్నది?”

“తాతయ్య పోయారు నాన్నా” అన్నది ఏడుపు నాపుకుంటూ.

“నిజంగానా? ఎలా జరిగింది? నిన్న కూడా నాతో బాగానే మాట్లాడారుగా.” అన్నాడు కంగారుని అణచుకుంటూ.

“బాగానే వున్నారు నాన్నా. రాత్రి కూడా భోజనం చేశారు. ‘నా కొడుకు దగ్గర లేడు. ఇంట్లో వాళ్లకు ఏదైనా జరిగితే ముసలివాడను నేనేం చేయగలను? ఈ కరోనా ఎప్పుడు ఎవరి వస్తుందో తెలియదుగా’ అని పదేపదే అంటూ దిగులుపడేవారు. రాత్రి నిద్ర లోనే పోయి ఉంటారని బామ్మ అంటున్నది. తాతయ్యకు కరోనా కాదని ఎంత చెప్పినా ఇక్కడ ఎవరూ వినిపించుకోలేదు. అపార్ట్‌మెంట్‌లో పక్క వాళ్లు కూడా సాయానికి రాలేదు. శవాన్ని అపార్ట్‌మెంట్ సెల్లారులో వుంచొద్దు, వెంటనే శ్మశానానికి తీసుకెళ్లామని గొడవ పెట్టుకున్నారు. ఫోన్ చేసి విషయం చెప్తే అత్తయ్య, మామయ్య వచ్చారు. మామయ్యే మున్సిపాలిటి వారికీ, గ్రేవ్ యార్డ్ వారికీ ఫోను చేసి వాళ్లను రప్పించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మమ్మలందరినీ మళ్లీ కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోమని ఇక్కడందరూ ఫోన్లు చేసి గట్టిగా చెబుతున్నారు, చెల్లి బాగా భయపడిపోయింది. నానమ్మ కూలబడిపోయింది.” అని చెప్తూ మహిత బావురుమన్నది. ఆ మాటలు వినగానే సుధీర్ తలంతా మొద్దుబారినట్లు, శరీరమంతా కంపించిపోయినట్లుగా అయింది. కళ్ల వెంట అప్రయత్నంగా నీళ్ళు కారిపోతున్నాయి. తన వాళ్లను ఎలా సముదాయించాలో, ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కావటం లేదు. తన్ను తాను సంబాంళించుకుని “సరే తల్లీ! ఇంకేం కాదులే. మీరంతా ధైర్యంగా వుండండి. జాగ్రత్త.. మామ్మయ్యకు నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను.” అన్నాడు.

“మామయ్య చాలా సార్లు మీ ఫోన్‌కు ట్రై చేశారు. కాని మీకు అందినట్లు లేదు”

“ఇందాకటి వరకూ ఇక్కడ నెట్‌వర్క్ లేదు. ఇప్పుడు నేను వెంటనే చేస్తాను..” అంటూ వెంటనే బావమరిదికి ఫోన్ చేశాడు.

బావమరిదితో మాట్లాడుతూ వుండగానే దగ్గరగా తుపాకీ మోత వినిపించింది. ఫోన్ పెట్టేసి సుధీర్ అప్రమత్తమైనాడు. ఇప్పుడిక్కడి పరిస్థితి చూస్తే అంత బరువున్న కార్బన్ స్టీలు పైపుల్ని కూడా కోసి పారేసేటట్లున్నారు. మరి కొందరు ఆయిల్ రిగ్గును స్వాధీనం చేసుకునే పనిలో వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆగివున్న షిప్ మీద దాడి చేసి ఆహార పదార్థాల దగ్గర్నుండీ అందినవన్నీ పోగు చేసుకుంటున్నారు. షిప్‍లో పనిచేసే వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇదివరకు కూడా దాడులు చేసినా ఇలా ప్రారణాలను మరీ ఇంతగా బలిపెట్టలేదు, వాళ్ల నాయకుణ్ణి ఎక్కడో అరెస్టు చేయటమేంటి? ఇక్కడ షిప్ మీద దాడి చేసి విధ్వంసం సృష్టించటమేంటో అర్థం కావటం లేదు. ఇది అమెరికన్ షిప్ కాదు, ఇటలీదని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకునే స్థితిలో లేరు.

ఇప్పుడు ఇండియాలో తన ఇంట్లోనూ, ఇక్కడ షిప్ లోనూ రెండు చోట్లా పరిస్థితులు భయానకంగా వున్నాయి. తనిప్పుడు ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా వుండాలి. తప్పదనుకున్నాడు. ఎలాగో నైజేరియన్లకు నచ్చచెప్పి వారిని సమాధాన పరిచారు. వాళ్లు అందినవన్నీ దోచుకున్న తర్వాత కొంత చల్లబడ్డారు. కానీ మీ షిప్ ఇక్కడ నుండి త్వరగా మా భూభాగం నుంచి వెళ్లిపోవాలన్న హుకుం జారీ చేసి మరీ వెళ్లారు.

షిప్‍లో తనకు కొంతసేపు పనీ, వెంటనే మరి కొంతసేపు విశ్రాంతీ వుంటుంది ఎప్పుడూ. ఇక్కడి నుండి ఎంత త్వరగా బయట పడదామా అని అందరూ తహతహలాడుతున్నారు. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పూర్తయింది. షిప్ తిరిగి ఇటలీ బయలుదేరింది. కానీ ఇటలీలో బసచేయటానికి అప్పుడు ఏ మాత్రం అనువుగా లేదు. కరోనా తీవ్రత వలన ఎక్కడి వారక్కడ పిట్టల్లా నేల రాలి చనిపోతున్నారన్న వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో అర్థం కావటం లేదు, పిప్ లోని వారందరూ ఎక్కడి కెళ్లేటట్లు! ఎక్కడ వుండేటట్లు?

నెదర్లాండ్స్ లోని ‘రోటర్‍డామ్’ ఓడ రేవు చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ప్ర్రాంతం చాలా సురక్షితంగా వుందన్న రిపోర్టు వచ్చింది. మరలా షిప్‍ను నెదర్లాండ్స్‌కు మళ్ళించారు. అక్కడి ఓడ రేవులో షిప్ ఆగింది. కంపెనీ వారు షిప్ లోని వారందరికీ వీలైనంత వరకూ ఏ లోటూ లేకుండా అన్ని సదుపాయాలు కలుగ జేస్తున్నారు. అలజడి పెట్టే మనసును అదుపులో పెట్టుకోవటానికి ధ్యానం, యోగా, వ్యాయామం లాంటివి మరింత ఎక్కువ సేపు చేయటం, వేళకు ఏదో తినటం, కాలక్షేపానికి అక్కడకక్కడే అటూ, ఇటూ ఎరగటం దినచర్య అయిపోయింది. ‘రోటర్‌డామ్’ ఓడ రేవు లోనే నెలరోజులు ఆగిపోవాల్సిన్చుంది. లాక్‌డౌన్ కొద్ది కొద్దిగా సడలింపు జరుగుతున్నది. సుధీర్ పారిస్ చేరుకోగలిగాడు. పారిస్ నుండి ప్రత్యేక ఫ్లయిట్‌లో ఇండియా చేరుకున్నాడు. ఎటు వీలుంటే అటు మజిలీలు చేస్తూ బెంగుళూరు, బెంగుళూరు నుండి తిరుపతి వచ్చాడు. తిరుపతి నుండి విజయవాడ దగ్గరున్న తన ఊరు యనమలకుదురు చేరుకోవాలి. ఒక బాడుగ కారుకు రెట్టింపు చార్జి ఇచ్చి మాట్లాడుకున్నాడు. బయల్దేరపోయే సమయానికి ఎవరో ఒకతను వెనుక నుంచి పరుగెత్తు కొచ్చాడు. “సార్! హైదరాబాద్ ఏమైనా వెడుతున్నారా?” అనడిగాడు.

“కాదండీ. విజయవాడ వైపుకు”

“ప్లీజ్! నన్ను షేర్ చేసుకోనివ్వండి. నేను త్వరగా వెళ్లాలి, విజయవాడ అయినా ఫర్వాలేదు. అక్కడి నుండి నా దారి నేను చూసుకుంటాను. ఇక్కడి నుండి బయట పడటానికి ఇంకే దారి దొరకటం లేదు.” అన్నాడు ప్రాధేయపూర్వకంగా. నెత్తిన టోపీ, ముఖాన మాస్కు, పోలికలే సరిగా కనబడటంలేదు. ఇతనూ ఎవరో తన బాపతే అనుకుంటూ సరేనన్నాడు సుధీర్. అతను భుజాన ఒక చిన్న బ్యాగ్, చేతిలో సుధీర్ బ్యాగ్ లాంటి పెద్ద బ్యాగుతో వచ్చి తన బ్యాగ్‌ను సుధీర్ బాగు పక్కన ఉంచాడు. భుజాన వున్న బ్యాగు తీసి సుధీర్‍కూ తనకూ మధ్యలో వుంచి పట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ ఏం మాట్లాడటం లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడిపోయారు. డ్రైవర్‌తో సహా ముగ్గురు మాస్కులు తీయకుండానే ప్రయాణం చేస్తున్నారు.

కారు నెల్లూరు వచ్చింది. “సార్! ఇక్కడ ఏమైనా తినటానికి దొరుకుతుందేమో ట్రై చేద్దాం. పొద్దుపోయే కొద్దీ దారిలో తినటానికి ఏం దొరకదు” అన్నాడు, డ్రైవరు.

“నేను ఏమీ తినను, నాకు వద్దు” అన్నాడు సుధీర్.

“నేను కనీసం టీ అయినా తాగాలి” అని డ్రైవర్ కారుని ఆపాడు. రెండో అతను కూడా కిందికి దిగి “నాకు ఓ పని గుర్తు కొచ్చింది. ఇక్కడే దిగిపోతాను. డిక్కీ ఓపెన్ చేసి ఇటు చివరగా పెట్టిన బ్యాగ్ బయటకు తియ్యి” అంటూ నాలుగు వైపులా పరికించి డబ్బిచ్చాడు. డ్రైవరిచ్చిన నల్ల బ్యాగును తనదేనని గమనించుకుని తీసుకుని ఆ చీకట్లో వెళ్లిపోయాడు.

తెల్లవారు జాముకు సుధీర్ యనమలకుదురు చేరుకున్నాడు. అతన్ని చూడగానే ఇంట్లో అంతా గొల్లుమన్నారు. సుధీర్ వచ్చే దారిలో కోవిడ్ టెస్టులు జరిగినా కూడా ఎందుకైనా మంచిదని తనకు తానే హామ్ ఐసోలేషన్‌కి – తన బ్యాగ్‍తో సహా తన రూమ్ లోకి వెళ్లాడు. “14 రోజుల పాటు ఇలాగే ఒంటరిగా ఈ రూమ్ లోనే వుంటాను. భోజనం, టిఫినూ అందించండి” అన్నాడు. భయానక మహమ్మారి కరోనా వలన ఇప్పుడు కూడా ఇటువంటి స్థితిలో మనసారా తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చి నాలుగు ఉపశమనపు మాటలు చెప్పలేక పోయానని అప్పుడు బిగ్గరగా రోదించాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమున్నదని వాపోయాడు.

స్నానం చేద్దామని బ్యాగ్‌ను తెరచి బట్టలు తీసుకోవాలని తాళం చెవులు తీసి బ్యాగ్ తాళం తిప్పబోతే తెరుచుకోలేదు. పరీక్షగా చూశాడు. అది తన బ్యాగ్ కాదు. అచ్చం అలాగే వున్నది. నెల్లూరులో దిగిపోయిన అతనిదై వుంటుంది. చీకట్లో పొరపాటున చూసుకోకుండా వెళ్లిపోయి వుంటాడనుకున్నాడు. ఆ బ్యాగ్‍ని అలాగే వదిలేసి కప్‌బోర్డు వున్న లుంగీ, బనీను తీసి స్నానం చేసి వచ్చాడు. ఆ బ్యాగ్‍లో తన బట్టలే వున్నాయి. పాస్‌పోర్టు వగైరాలన్నీ తన హ్యాండ్ బ్యాగ్ లోనే వున్నాయి. థాంక్ గాడ్ అనుకున్నాడు. మర్నాడు ఆ బ్యాగ్‌కున్న తాళాన్ని తెరిచి చూశాడు. అందులో వున్న వాటిని చూసి ఖంగుతిన్నాడు. దిమ్మెరపోయి బ్యాగ్‌ని మూసి మంచం క్రిందికి తోసేశాడు.

***

ఆరునెలల కాలం గడిచిపోయింది. పరిస్థితి అదుపులోకి వస్తున్నది. తను పనిచేసే కంపెనీ ‘కాస్టోరో-6’ షిప్‌తో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టబోతుందన్న సమాచారం తెలుసుకున్నాడు. మరలా ఫిట్‌నెన్ సర్టిఫికెట్ అదీ తీసుకుని షిప్ లోకి వెళ్ళే ప్రయత్నం మొదలు పెడదామా అన్పించింది. కాని ఈసారి షిప్ మీదకు వెళ్లటానికి ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేరు. తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటే, కూతుళ్లు బిక్కముఖాలు వేసుకున్నారు.

“ఇక్కడితో ఈ పరుగు ఆపేయండి. ఇప్పటికి సంపాదించదానితో తృప్తి పడదాం. ఇప్పటికైతే సంపాదన మెరుగ్గానే వున్నది. ఇక్కడే వుండి మీకు నచ్చిన పని ఏదైనా ప్లాన్ చేసుకోండి. నా మాట వినండి” అని భార్య శాంతి గట్టిగానే చెప్పింది.

ఆ రోజు ఆ అగంతకుడు వదిలి వెళ్లిన బ్యాగును భద్రపరిచాడు. కాలం గడుస్తున్నది. ఏడాది దాటింది. ఇక్కడే ఒక వెల్డింగ్ కమ్ మెకానిక్ షెడ్డును పెట్టుకున్నాడు. తనకు బాగా ఇష్టమైన పని వెల్డింగ్. దాంతోపాటే కరెంటుకు, శానిటరీకి సంబంధించిన సామాగ్రిని కూడా తెప్పించి అమ్ముతున్నాడు. చేతి క్రింద ఇద్దరు కుర్రాళ్ళు కూడా పనిచేస్తున్నారు. విజయవాడ పరిసరాలలో యనమలకుదురు కూడా కలిసిపోయింది. కాబట్టి సుధీర్ షెడ్డు, షాపు బాగానే నడుస్తున్నాయి.

“సుధీర్! మనమంతా చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కూలిపోయేటట్లున్నది. మేమంతా పూనుకుని బాగు చేయాలనుకుంటున్నాం. నువ్వు పెద్ద మనసు చేసుకుని వీలైనంత ఎక్కువగా ఆర్థిక సాయం చేయాలి” అన్నారు పాత మిత్రులు వచ్చి.

“చేసే ఉద్యోగాన్నే వదిలేశాను. ఇదివరకటిలాగా సంపాదన లేదు. ఆలోచించి ఎంతో కొంత ఇస్తానులే” అన్నాడు.

షిప్ లలో ఇంకా ఉద్యోగం చేసే ఓపిక వున్నా కూడా వద్దనుకున్నాడు. చూస్తూ, చూస్తూ నెలకు వచ్చే రెండు లక్షల్ని వదులుకున్నానని కాసేపు బాధపడ్డాడు.

ఆ రోజు నెల్లూరులో ఆ ఆగంతకుడు వదిలి వెళ్లిన బ్యాగును తెరిచి చూసి మళ్లీ సర్దేశాడు.

‘ఆగంతక మిత్రమా! మళ్లీ నీ జాడ నాకు తెలియిలేదు. నిన్ను గురించే నీ బ్యాగు గురించి నేను ఎవరికీ ఏ కంఫ్లయింటూ చేయలేదు. లేనిపోని చిక్కులోస్తాయని భయపడ్డాను. నా పాస్‍పోర్టు, వీసా, అన్నీ రద్దవుతాయి. కేసు అవుతుందన్న భయం తోనే నిశ్శబ్దంగా వుండి పోయాను. నువ్వూ ఏదో భయంతోనే మౌనంగా వుండి పోయావనుకుంటా. అయితే నీ కోసం మాత్రం ఎదురు చూస్తున్నాను. ఏం ప్రయోజనం కనపడటం లేదు. కనీసం నీ పేరు కూడా తెలియదు’ అని తరుచూ అతన్ని జ్ఞాపకం చేసుకునేవాడు.

ఎకరం తర్వాత ఎకరం పొలం కొంటూ ఇప్పటికి తొమ్మిదెకరాల పొలం సంపాదించాడు. ఇప్పుడు పక్క చేను అతను తన ఎకరం పొలం కూడా అమ్మతాను, కొనండి అంటూ వచ్చి అడిగాడు. కొందామని మనసు పీకింది. కాని తమాయించుకున్నాడు. భార్యా పిల్లలకు బంగారం కొనిపెడదామనుకున్నాడు. కాని మరలా విరమించుకున్నాడు.

తను ఉద్యోగం, దాని ద్వారా వచ్చే సంపాదన వదులుకున్నాడని భగవంతునికి కూడా జాలి కలిగి నట్లుంది. కొంత ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నాడని, కొంతసేపు ఆలోచిస్తాడు. వద్దు, వద్దు ఆయాచిత సహాయం పొందకూడదని మరలా మనసుకు నచ్చ చెప్పుకుంటున్నాడు.

రెండు సంవత్సరాలు కాలగర్భంలో కలసి పోయాయి. పాతమిత్రులు మరలా కలిసి స్కూల్‌కు ఆర్థిక సహాయం అందించమని అడుగుతున్నారు.

“సరే” అన్నాడు సుధీర్.

‘గోత్రం తెలియని వారికి దేముడి పేరుతో పూజలు చేయించుతారు. స్వామి సన్నిధి తిరుపతిలో నువ్వు కలిశావు. ఆ స్వామి వేంకటేశ్వరస్వామి పేరుతోనే ‘శ్రీ వేంకటేశ్వర సమావేశమందిరం’ మా యనమలకుదురు హైస్కూల్‌లో కట్టిస్తున్నాను. దీని ఖర్చుకు నీ బ్యాగ్ లోని 20 లక్షలు నా స్వంతడబ్బు 5 లక్షలు కలిపి ‘శ్రీవేంకటేశ్వర’ పేరు మీద రశీదు వ్రాయించాను. ఆగంతక మిత్రమా! నీకా డబ్బు ఎక్కడిదో తెలియదు. ఎక్కడకు తీసుకెడుతున్నావో అంతకన్నా తెలియదు. ఇంతకన్నా సద్వినియోగం చేయటానికి నాకు తెలియలేదు. ‘బడి’ కూడా దేవాలయం లాంటిదే అన్న ఉద్దేశంతో ఈ పని చేశాను. భవిష్యత్తులో నువ్వెప్పుడైనా తారసపడితే నీకా స్కూలును, సమావేశమందిరాన్ని చూపిస్తాను. నీ కోసం ఎదురు చూస్తున్నాను’ అనుకున్నాడు సుధీర్.

అంతేకాక ఆ ఆగంతుకుని బ్యాగ్ లోని డబ్బుతో, తాను తన స్వంత ఆస్తిని ఏర్పాటు చేసుకోకుండా ఇలా స్కూల్ కోసం ఖర్చుపెట్టటం మనసుకు ఎంతో తృప్తి నిచ్చిందని అనుకున్నాడు.

Exit mobile version