ఆకాశ హర్మ్యం

0
2

[dropcap]ఆ[/dropcap]గస్టు 12వ తేదీ జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల.

~

మౌనం మాటలాడుతుంది.
నిశ్శబ్దం పలుకుల మూట
విప్పుతుంది.
సమూహం లో ఏకాంతం
చక్కని తోడు నిస్తుంది.
వివక్షత లెరుగని చోటు
ఉచిత ఆసనం వేస్తుంది.

దళసరి కళ్ళజోడొకటి
దిన పత్రిక తొలి శీర్షిక
తరువాయి పుటకు
మలుపు తిరిగే కాగితం
స్పర్శ ఆత్మీయమౌతుంది.

బరువు పుస్తకాలను
కొనలేని చదువుల దీక్ష
ఆధార సంపుటాలను
హృదయ శీర్షానికి ఎత్తి
భుజ కీర్తులకొక
బాట వేస్తుంది.

కథలు, నాటకాలు, కవితల
వరుస కితాబుల గూడు
ధ్యాన ముద్రల సొదల
కళ్ళు తెరుస్తుంది.

ఇంటి పనులన్ని తీరి వచ్చిన వేళ
కాల్పనిక లోకాన
కాస్తింత సేపు తిరిగి రమ్మని
తనివి తీర్చగ
నవలా మణి చేతికందుతుంది.

అక్షర సంహితల ఆకాశ
హర్మ్యమొక్కటి
పుడమికి దిగి వచ్చి
గ్రంథాలయం అని పేరు పెట్టుకుంది.
తర తరాల జ్ఞాన సోపానమును పరచి
దరికి రమ్మని సమ్మతికి పిలుపును ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here