ఆకాశం మొగులేసింది

0
2

[dropcap]ఆ[/dropcap]కాశం మొగులేసింది నల్లగా
వానదేమో ఊరించే ఆట
మనిషిది తీరని కోరిక
బతికిన ఆశల నీటి గూడు

నిలబడ్డవాడు
తన కాళ్లను తానే ఛేదించు వైనం
బతుకు చెట్లను కూల్చి కాల్చడం

మట్టిని ప్రేమతో
అక్కున చేర్చుకోలేనివాడు
మనిషిని ఎలా ప్రేమించగలడు

స్వార్థం కబళించే ప్రతి క్రియ అర్థంలేనిదీ
అనుమానాల అవమానాల అంపశయ్య

ధూళీ దుమ్మూ విచ్చలవిడి లేచే
కొండల గుండెలను పేల్చినప్పుడు
వాతావరణ రక్షితశ్రేణికి
సుతామూ ఆపద వచ్చిపడే
ఇక వానేల నేలను ముద్దాడునో

చల్లగాలి వీస్తే గదా
కురిసే వాన చిరునామా
కాలుష్యం కోరలు కాటేస్తే
పర్యావరణం అస్తవ్యస్తం
అతలాకుతలం

ఆకాశం మొగులేసింది కానీ
వరద గుడి విచ్చుకున్నప్పుడే
చిటపట చినుకుల వాన
గలగల పరుగుల వరద నావ
నీటిలో తడిసి నీటిలో మెరిసే
బతుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here