Site icon Sanchika

ఆకాశమే హద్దు, అవకాశం వదలద్దు-2

(గత వారం తరువాయి. మొదటి భాగం ఈ లింక్ లో చదవచ్చు.)

[dropcap]పొ[/dropcap]ద్దున్నే మళ్ళీ ఫోన్ చేసింది రమణ. “10 గంటలకి కార్ పంపుతాను, మీకు వంట చెస్తున్నాను” అని.

కార్ వచ్చేసరికి తయారయ్యి శ్యామల రాజారావు బయలుదేరి వెళ్లారు. రమణ అద్దెకి తీసుకున్న ఇల్లు ఒక పేరుపొందిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉంది. అవడానికి చిన్న ఇల్లు అయినా చాల సదుపాయాలు ఉన్నాయి.

“నేను నెలకి ఒకటి రెండు సార్లు వస్తాను అంత దానికి ఇంతకంటే దండగ” అంది రమణ, శ్యామల “కొద్దిగా పెద్దది తీసుకోకపోయావా” అంటే.

“ఈ ఇంట్లో మా వారి పిన్ని కొడుకు, కోడలు ఉంటారు. ఇక్కడ షాప్‌లో పై ఎత్తున చూస్తారు ఇద్దరు” అని వాళ్ళని పరిచయం చేసింది.

ఈలోగా లోపలి నుంచి ఒక 40-45 మధ్య వయస్కుడు వచ్చాడు. అతను నల్లగా, సన్నగా ఉన్నాడు.

శ్యామల వెంటనే గుర్తుపట్టింది. “బావున్నారా! రాజుగారు” అంటూ “మన రమణ భర్త అండీ” అని రాజారావుతో అంది.

“అబ్బో! రాజుగారూ అనక్కర్లేదు అమ్మా! రాజు అంటే చాలు” నవ్వుతూ అంది రమణ.

పక్కనే 18-20 మధ్యలో ఉన్న అబ్బాయి, రమణ పోలికలతో కొద్దిగా స్టైల్‌గా ఉన్నాడు. జీన్ ప్యాంటు, టీ షర్ట్, చేతికి ఖరీదైన వాచ్, కళ్ళజోడు. ఇద్దరు వచ్చి శ్యామలకి రాజారావుకి కాళ్ళకి నమస్కారం చేసారు.

“అయ్యో ఏమిటమ్మా ఇది” అంటూ ఆపారు.

“అమ్మా! మా అబ్బాయి శ్యాం. చేనేత మగ్గాల దగ్గర చీరలు ఆర్డర్ ఇవ్వడం, తేవడం అన్ని మా బావ, అదే మా ఆయన చూస్తాడు. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. కొంత బిజినెస్ వ్యవహారాలు చూస్తాడు. వైజాగ్ షాప్‌లో అన్నయ్య, పిల్లలు, విజయవాడ షాప్‌లో, బావ, పిల్లలు ఉంటారు. ఇప్పుడు మేము అందరం ఇదే బిజినెస్‌లో” అని అంది.

“అసలు నీ పెళ్లి అయ్యాక ఎక్కడికి వెళ్లారు? ఈ బిజినెస్ ఎలా మొదలు అయింది? నీ గురించి అప్పుడు ఎంత ప్రయత్నించినా తెలీలేదు” అంది శ్యామల.

“అన్నీ చెప్తాను, ముందు మీరు భోజనం చెయండి” అంటూ టేబుల్ దగ్గర అన్ని పెడుతోంది వేరే అమ్మాయి సాయంతో.

“రండి సర్, మీరు భోజనానికి వచ్చినందుకు మేము చాలారోజుల తరవాత రమణ వంట తింటున్నాము, లేపోతే రోజూ ఉరుకులు పరుగులు” నవ్వుతూ అన్నాడు రాజు.

“అవును మరే, నువ్వు వేరే వాళ్ళ వంట తింటావు, నీకు, నీకొడుక్కు ఒక్క కూర అయినా చేసి వెళ్తాను, నా మీద నేరాలు చెప్పకు” చిరుకోపంతో రాజుని అంటూ “వంకాయ కూర ఎలా ఉందో చెప్పండి అయ్యగారు, అమ్మగారిలా చేశానా లేదా?” అంది.

“అంటే నువ్వు ఇలా అమ్మగారు, అయ్యగారు అంటే మాకు బాగోదు రమణా” అన్నాడు రాజారావు.

“నాకు అలా అంటేనే తృప్తిగా ఉంటుంది. నేను వంట కూడా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నన్ను పెంచింది మా అమ్మ కాదు, ఆవిడే” అని రమణ అంటుంటే “మా అమ్మ ఇవాళ చాలా రోజుల తరవాత ఇంత హ్యాపీగా ఉంది ఆంటీ” అన్నాడు శ్యాం.

“ఆంటీ ఏమిటి శ్యాం? అమ్మమ్మ అను, మీ అమ్మ నా కూతురు అయితే నువ్వు నా మనవడివి, నువ్వు పుట్టావని తెలిసాక చూడాలని చాలా అనుకున్నాము, కానీ ఏమిటో అడ్రస్ తెలియక కొంత, మా అశ్రద్ధ కొంత” – అని శ్యాం భుజం నిమురుతూ శ్యామల అంటే శ్యాంకి కూడా అర్థమైంది తల్లి వాళ్లంటే ఎందుకంత ఇష్టపడుతోంది అని.

శ్యామల మాటల్లో కల్తీ లేని ప్రేమ కనిపిస్తోంది. భోజనాలు చేసి కూర్చున్నాక రమణ తన కథ చెప్పడం మొదలుపెట్టింది.

***

రమణ పెళ్లి అయిన వారానికి వాళ్ళ అమ్మ పోయింది. శ్యామలవాళ్ళు అకౌంట్‌లో వేసిన డబ్బుల్లో పది, పదిహేను వేలు ఖర్చు అయ్యాయి.

రమణ అత్తగారి ఊరు ఆంధ్ర, తమిళనాడు బోర్డర్. దగ్గర పెద్ద సిటీ అంటే కంచి. ఆ ఊరు బాగా పల్లెటూరు. రాజువాళ్ళకి ఒక రెండు ఎకరాల పొలం ఉంది. రెండు ఆవులు, రెండు ఎద్దులు, రెండు గేదెలు ఉన్నాయి.

అవడానికి సొంత ఇల్లు అయినా పెంకుటిల్లు. రాజుకి ఒక తమ్ముడు, ఒక అక్క. అక్కకి పెళ్లి అయి దగ్గర ఊర్లోనే ఉండేది. వాళ్ళది వ్యవసాయమే. అక్కడ కరెంటు ఉన్నా రోజులో సగం సమయం కూడా ఉండేది కాదు.

రమణ అత్త, మేనత్త కనక ప్రేమగానే ఉండేది, కానీ ఇంట్లో పని ఎప్పటికి తెమిలేది కాదు.

హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లినా అది అంత పల్లెటూరు కాదు కనక ఏదో రకంగా సర్దుకుంటున్న రమణకి ఈ పల్లెటూరుకి వచ్చాక పిచ్చెక్కిపోయేది. అక్కడ తెలుగు కూడా అరవం కలిసి సగం అర్థం అయ్యేది కాదు.

అత్త, ఇద్దరు మొగవాళ్ళు పొలానికి వెళితే పశువులకి మేత, పేడ తియ్యడం వేరే మనిషి ఉన్నా కొంత రమణకి పని పడేది.

శ్యామల వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో వాళ్ళ రూంలో ఏసీ వేసుకుని పడుకుని అలవాటయ్యి, కొత్తల్లో రాత్రి కరెంట్ పోయి ఫ్యాన్ కూడా లేక ఏడుపు వచ్చేది.

ఆ టైములో తన దురదృష్టానికి అందరిమీద కోపం వచ్చి తిడుతూ ఉండేది. రాజు పదో క్లాస్ వరకు చదివి కాలేజీకి వెళ్ళడానికి వేరే ఊరు వెళ్లేందుకు డబ్బులు సరిపోక మానేసాడు.

రమణ బాధ అర్థం అయినా ఏమి చెయ్యలేని స్థితి.

పొలానికి డబ్బు కోసం ఇల్లు ఎప్పుడు తాకట్టు లోనే ఉండేది. డబ్బులకి ఎంత ఇబ్బందిగా ఉన్నా, రాజు రమణ ఖాతా లోనించి డబ్బులు తీసి ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు.

రెండేళ్ళకి శ్యాం పుట్టాడు.

వ్యవసాయంలో పెద్ద ఆదాయం లేకపోయినా ఏదో గడిచిపోతోంది.

శ్యాంని స్కూల్లో చేర్పించే టైంకి, రమణ ఆ పల్లెటూరి స్కూల్లో చేర్పించడానికి అసలు ఒప్పుకోలేదు.

తప్పనిసరియై శ్యాం కోసం రాజు, రమణ మకాం దగ్గర్లో ఉన్న టౌన్‌కి మార్చారు.

టౌన్‌కి వెళ్ళాక, ఉన్న డబ్బుల్లోంచి కొంత తీసి కుట్టు మెషిన్ ఎంబ్రాయిడరీ సామాను కొన్నది రమణ.

అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి రోజుకి ఒకటి రెండు జాకెట్లు కుట్టేది. పెద్ద డబ్బులు వచ్చేవి కావు కానీ కొంత కాలక్షేపం ఇంకా నలుగురితో పరిచయం అయింది.

రమణకి వినయ్, సుష్మ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఇంగ్లీష్ మాట్లాడితే విని బాగా అర్థం చేసుకోవడం చిన్న, చిన్న వాక్యాలు మాట్లాడడం వచ్చింది.

అదే ఇప్పుడు కొంత ఉపయోగపడింది. శ్యాం స్కూల్లో టీచర్స్‌తో మాట్లాడడానికి రమణే వెళ్ళేది.

ఒకసారి శ్యాం చదువుతున్న స్కూల్లో వాళ్ళ టీచర్ని కలవడానికి రమణ వెళ్ళినప్పుడు రమణ వేసుకున్న బ్లౌజ్ ఆవిడకి చాల నచ్చింది.

“ఎక్కడ కుట్టించారు. వర్క్ బాగుంది” అన్న టీచర్‌తో,

“నేనే కుట్టుకున్నాను, నాకు బ్లవుజ్ కుట్టడం దాని మీద వర్క్ చెయ్యడం వచ్చు. మీవి ఏవయినా ఉంటే ముందు ఒకటి ఇవ్వండి, నాకు దానితో చీర కూడా పంపండి. పీకో చేసి చీరకి మాచింగ్ వర్క్ చేస్తాను” అంది రమణ.

ఆ మరునాడే ఆ టీచర్ ఒక చీర, బ్లౌజ్ పంపింది. అది అంత ఖరీదైన చీర కాదు కానీ రమణ దానిమీద సరిపడా రంగులతో వర్క్ చేసింది. చీరకొంగుకి కూడా మంచి బోర్డర్ లాగ చేసి ఇచ్చింది. అది ఆ టీచర్‌కి చాలా నచ్చింది.

“చాలా బావుంది. ఎంత ఇమ్మంటారు?” అడిగింది ఆవిడ. అటువంటి వర్క్ జాకెట్ కుట్టడానికి కనీసం వెయ్యి తీసుకుంటారు.

కానీ రమణ చాలా తెలివిగా “మీది బోణి మేడం. మీరు ఏమీ ఇవ్వొద్దు కానీ కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి.” అంది.

అదే ఒక పెద్ద ప్రచారం అయింది. ఆ టీచర్ ఆ చీర కట్టుకొని ఒక డబ్బున్న విద్యార్థి ఇంట్లో పుట్టినరోజుకి వెళ్ళింది. అక్కడ చూసినవాళ్లు అందరూ ఆవిడని అడిగారు, చాలా బావుంది ఎక్కడ కుట్టించారు అని.

అంతే ఆ దెబ్బకి రమణకి పని బాగా దొరికింది.

ఒక ఆరునెలల తరవాత చేతికింద ఒక అమ్మాయిని పెట్టుకుని పగలు, రాత్రి చేసేది.

నెలకి ఒక 15-20 వేలు మిగిలేవి.

ఒకసారి రాజు వాళ్ళ చుట్టాల పెళ్ళికి వెళ్లి, అక్కడ మగ్గాల మీద నేశారని ఒక నాలుగు నేత చీరలు రమణకి తెచ్చాడు.

అవి చూసాక రమణకి ఒక ఆలోచన వచ్చింది. తనే ఆ చీరలకి సరిపడా జాకెట్టు బట్ట తెచ్చి వాటిమీద ఎంబ్రాయిడరీ చేసి, చీరలకి కూడా అక్కడ అక్కడ చిన్న డిజైన్ వేసి బయట కనపడేటట్టు పెట్టింది.

నాలుగు చీరలు, రెండురోజుల్లో అమ్ముడుపోయాయి.

ఇది బావుంది, అని రాజుతో సంప్రదించి, ఇంటికి దగ్గరలో ఒక చిన్న షాప్ తీసుకుంది.

ఇంకో అమ్మయిని కూడా పెట్టుకుని, రాజు ద్వారా ఆ మగ్గం నుంచి ఇంకో పది చీరలు తెప్పించింది. ఒక నెల లోపే అవి అయిపోయాయి.

ఈసారి మగ్గం దగ్గరికి తానే వెళ్లి, ఏ రంగు చీరకి ఏ అంచు వేయాలి దానికి జాకెట్టు కోసం కూడా నేయించి ఒక పాతిక చీరలు తెచ్చింది.

తన పని ఆలస్యం అవుతోంది కానీ, పెట్టిన చీరలు పెట్టినట్టు అమ్ముడుపోతున్నాయి.

శ్యామల, వాళ్ళ బంధువులు స్నేహితులు ఎటువంటి చీరలు కట్టేవాళ్లో, అలాంటి రంగులు డిజైన్లు తెస్తే చకచకా అమ్ముడుపోయేవి.

ఇద్దరు పనివాళ్ళతో మొదలుపెట్టిన షాప్, పెద్ద దాంట్లోకి మార్చి 5, 6 గురు పనివాళ్ళతో నడిచింది.

ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో పొలం కౌలుకి ఇచ్చి రాజు తల్లి తమ్ముడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చారు.

ఖర్చులు పోయి నెలకి 40-50 వేలు మిగలడంతో ధైర్యం చేసి బ్యాంకులో అప్పు చేసి ఇల్లు కూడా కొన్నారు.

రమణ అన్న, అక్క, పరిస్థితులు అంత బాగా లేకపోవడంతో, వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది అని, కొన్ని చీరలు వైజాగ్ పంపి లాభం వాళ్ళని తీసుకోమంది రమణ.

అక్కడ కూడా ఆ చీరలకి బాగా గిరాకీ ఉండేసరికి, వైజాగ్‌లో చిన్న షాప్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది.

అలా మొదలైన షాప్. అయిదు ఏళ్లలో విజయవాడలో ఒక శాఖ, హైదరాబాద్‌లో ఒక శాఖ విస్తరించింది.

మొదటి షాప్ రాజు తమ్ముడు చూస్తున్నాడు. వైజాగ్‌లో షాప్ రమణ అన్న, అక్క చూస్తున్నారు.

హైదరాబాద్ షాప్ కొడుకుకి అన్నట్టు ఆలోచన. బ్లౌసులు వర్క్ చేయించడం, చీరలకి అంచులు కుట్టడం ఎక్కడికి అక్కడే మనుషులని పెట్టి రమణ చూసుకుంటుంది.

ప్రతి నెలా, అన్ని ఊళ్లలో మగ్గాల దగ్గరికి వెళ్లి, చీరలు ఎలా కావాలో చెప్పి చేయించేది.

రమణ, రాజు మాత్రమే కాక, కుటుంబంలో అందరు మంచి ఇళ్ళు ఏర్పరచుకుని పిల్లల్ని చక్కగా చదివిస్తూ బావున్నారు.

***

“ఇది నా కథ, మీతో చిన్నపుడు ఉండి కుట్టు నేర్చుకున్నది, బజారులో చీరలు కొనేప్పుడు మీరు చెప్పే సూత్రాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇంకా, అయ్యగారు పిల్లలకి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నాకు బాగా గుర్తుంది. నువ్వు ఏ పని చేసినా బాగా మనసు పెట్టి చెయ్యాలి అని. నేను చేసింది అదే. డబ్బు సంపాదించడం కన్నా నా పని పదిమందికి నచ్చటం నాకు ముఖ్యం. అది నాకు ఎక్కువ ఆనందం ఇస్తుంది. నేను ఈ రకంగా విజయం అందుకున్నాక మిమ్మల్ని కలవాలని చాలా ప్రయ్నతించాను.”

“మనం ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళితే అది అమ్మి వెళ్లిపోయారు అన్నారు. ఆఫీస్ దగ్గర ఫోన్ నెంబర్ పాతదే ఉంది. అనుకోకుండా మొన్న షాప్ వీడియోలో మిమ్మల్ని చూసాను. మీరు చీరలు, బ్లౌజులూ ఇవ్వడంతో నాకు మీ అడ్రస్ తేలిగ్గా దొరికింది.

ఇదంతా మీ పెంపకం, నా అదృష్టం కొద్దీ మీ ఇంట్లో పడ్డాను. నేనే కాదు నా వల్ల ఒక 100 మంది కుటుంబాలు బతుకుతున్నారు.” అంది.

రమణ మాటలకు శ్యామల కళ్లలో నీళ్లు తిరిగాయి.

“నేను ఏమి చేశాను రమణా, ఒక పని అమ్మాయి లాగానే నీ చేత పని చేయించాను.” అన్న శ్యామలతో

“లేదు మీరు నన్ను మీ కూతురులానే చూసారు. మా అమ్మ చేయించలేదా పని. మీరు నా చేత పని చేయించేప్పుడు ప్రతి పని ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో చెప్పేవారు. నేను ఏమి మర్చిపోలేదు. మీరు ఎప్పుడూ, నాకు వినయ్‌కి, సుష్మకి ఏమి తేడా చూపించలేదు. మీరు భోజనం చేయడం లేట్ అవుంటుంది అంటే ముందు నన్ను తినమనేవారు. నేను కట్టుకునే బట్టలు కూడా నన్ను షాప్‌కి తీసుకెళ్లి కొనేవారు. ఎప్పుడైనా నాకు ఏదైనా తిందామని అనుకుని అది చేద్దామా అంటే మర్నాడే చేసేవారు.

అయ్యగారు సినిమాలకి రాను, అంటే మనం నలుగురం వెళ్ళేవాళ్ళం. అంత ఎందుకు? మీ కుటుంబం అంతా తిరుపతి వెళ్తుంటే, మీరు నాకు కూడా విమానం టికెట్ కొంటే, అందరూ అన్నారు పనిపిల్లని విమానంలో తీసుకెళ్లకపోతే ఏమైంది అని. ‘ఇంట్లో ఉండదా, పెద్ద అమ్మాయే కదా’ అని మీరు అప్పుడు అన్న మాట నేను మర్చిపోను. ఇదే సుష్మ అయితే మీరు అలా అంటారా అని.

నాకు తెలుసు, మీ చుట్టాలు అందరు మిమ్మల్ని అనేవారు, పనిపిల్లని నెత్తికి ఎక్కించుకుంటావు అని. అవును నాకు అవసరానికి చేస్తోంది రమణ, అందుకే నెత్తికి ఎక్కించుకుంటాను అని మీరన్నారు.

నన్ను కుట్టు ఎంబ్రాయిడరీలో చేర్చిన ఆ రోజు మీరు ఏమన్నారో నాకు గుర్తుంది. ‘నువ్వు మా ఇంట్లో ఉన్నట్టు ఎక్కడ ఉండలేవు, మేము చూసినట్టు ఎవరు చూడరు. నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్లి మీ అమ్మలాగా ఇళ్లల్లో పని చేయలేవు, కుట్టు నేర్చుకుంటే నాలుగు జాకెట్లు కుట్టుకున్నా గౌరవంగా బతకచ్చు. చేతిలో విద్య ఉంటే ఎక్కడైనా బతకచ్చు’ అని. ఆ విద్యే నాకు నాతోపాటు ఇంకా కొంతమంది కడుపు నింపుతోంది.

నేను చేసిందల్లా నాకు వచ్చిన ఏ అవకాశం వదలలేదు.

నా అదృష్టం కొద్దీ మా బావ కూడా నాకు అన్నివిధాలా సహకరించాడు, నేను ఏది కొత్తగా చేద్దామన్న నా మీద నమ్మకంతో విన్నాడు.

వచ్చే వారం హైదరాబాద్ షాపులో, మేము మా బిజినెస్ మొదలుపెట్టి పది సంవత్సరాలు అయిన పండగ చేస్తున్నాము. అప్పుడు మా వాళ్ళు అందరు వస్తారు.

అన్న, అక్క అందరూ మిమ్మల్ని కలుస్తాము అంటున్నారు, మీరందరు తప్పక రండి” గొంతు గద్గదమవుతుంటే చెప్పింది రమణి.

శ్యాంకి కూడా తల్లి ఎక్కడినుంచి, ఎక్కడికి వచ్చింది, వేరేవాళ్లు చెపితే వినడమే కానీ, ఇవాళ ఆ కథ అంతా తల్లి నోట్లోనుంచి వినడం, దానికి కారణం అయినవాళ్లని చూడడం చాలా ఆనందం కలిగింది.

రాజు పరిస్థితి కూడా అదే.

ఎప్పుడూ శ్యామల, రాజారావు గురించి వినడమే కానీ ఇవాళ చూసాక వాళ్ళ గొప్పతనం అర్థమైంది.

ఈ రోజుకి వాళ్ళు రమణనే పొగుడుతున్నారు కానీ వాళ్ళ గొప్పతనం అనడంలేదు.

శ్యామల, రాజారావు బయలుదేరుతుంటే పళ్ళు స్వీట్స్ ఇచ్చి మళ్ళీ ఇంటిల్లిపాది దణ్ణాలు పెట్టారు.

“ఈ దణ్ణాల గోల ఏమిటి, నీకు తెలియదా నాకు ఇలాంటివే ఇష్టం ఉండదు అని?” అంది శ్యామల మళ్ళీ రమణని దగ్గరికి తీసుకుంటూ.

“ఇంకా మీ ఇష్టాలేమి ఉండవు. నేను చెప్పినట్టు వినాల్సిందే” అని సంతోషంగా నవ్వింది రమణ.

“బై అమ్మమ్మగారు, తాతగారు” అని శ్యాం అంటే

“అదిరా నాన్నా! నువ్బు నచ్చావు కానీ ‘గారు’ తీసెయ్యి సరేనా” అని “ఫంక్షన్‌కి అందరం తప్పకుండా వస్తాము” అని రాజుతో చెప్తూ కార్ ఎక్కారు.

“మన ఇంట్లో పెరిగిన పిల్ల, మన పిల్లలకన్నా గొప్పగా ఎదిగింది నాకు చాల గర్వంగా ఉంది” అన్న రాజారావుని చూస్తూ శ్యామల అంది –

“అవకాశం వచ్చింది, అంది పుచ్చుకుంది, ఆకాశమే హద్దుగా పెట్టుకుంది. ఆ ఎదుగుదలలో మన భాగం కూడా ఉందని నాకు గర్వంగా ఉంది.”

(సమాప్తం)

Exit mobile version