[డా. ఎమ్. సుగుణరావు రచించిన ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]డా. [/dropcap]ఎమ్. సుగుణరావు గారి మూడో కథాసంపుటి ‘ఆకాశంలో ఒక నక్షత్రం’. 24 కథలున్న ఈ సంపుటిని జూన్ 2022లో ప్రచురించారు.
“విభిన్నరకాల ఇతివృత్తాలతో రూపొందిన ఈ కథల్లో మానవ జీవితంలోని వైశాల్యం, భిన్న ప్రవృత్తులతో సంచరించే మనుషుల నైజం సాక్షాత్కారిస్తుంది. సమాజం మారుతున్నట్టే కనిపిస్తున్నా మారని మనుషుల ప్రవర్తనాసరళిని చిత్రించడానికి ప్రయత్నించారు సుగుణరావు గారు” అని ‘వస్తువులో వైవిధ్యం – కథనంలో సౌందర్యం’ అనే తమ ముందుమాటలో గుడిపాటి గారు పేర్కొన్నారు.
‘మానవీయ స్పర్శ గల కథల్లోని రాజకీయ సామాజిక దృక్పథం’ అనే తన ముందుమాటలో “మనకి కథలు ఎందుకు అవసరం?” అని ప్రశ్నించి, “జీవితాన్ని ఊహించుకోడానికి, పునరాలోచించుకోడానికి, చింతించడానికి, నిర్లిప్తత నిండిపోయిన జీవనాన్ని re-imagine చేసుకోడానికి, మరింత బాగా జీవించడానికి, జీవితానికే ప్రాతినిధ్యం వహించడానికి. అందుకని జీవితం ఉన్నంత వరకు సుగుణ రావు లాంటి వారెందరో రాసిన కథలు చదువుకుందాం” అన్నారు హర్ష.
ఈ పుస్తకం లోని కథలు ఎలా ఉండబోతున్నాయో పాఠకులకు విశదం చేస్తాయి ఈ రెండు ముందుమాటలు.
***
‘ఆకాశంలో ఒక నక్షత్రం’ విశ్వవిద్యాలయంలో కుల వివక్ష కారణంగా బలవన్మరణానికి పాల్పడిన రోహిత్ వేముల వృత్తాంతంతో అల్లిన కథ. చాలాసార్లు బాహటంగా, కొన్నిసార్లు నిగూఢంగా వ్యక్తమయ్యే వివక్షను అత్యంత ప్రభావంతంగా ప్రదర్శిస్తుందీ కథ. మనుషులు వస్తారు, వెళతారు; కానీ నక్షత్రాలు నిలిచే ఉంటాయనే వ్యాఖ్యతో కథ ముగుస్తుంది, పాఠకుల మనసులకు హత్తుకుంటుంది.
న్యాయమూర్తిగా ఎదిగిన ఆ కూతురు వృద్ధుడూ, మరణానికి దగ్గరైన తండ్రిని ఎందుకు క్షమించలేకపోయిందో ‘క్షమాభిక్ష’ కథ చెబుతుంది. ఆ తండ్రి చేసిన ఘోరమైన నేరమేమిటి? ఇరవై ఏళ్ళుగా కూతురు ఆయనతో మాట్లాడకపోవడం ఆయనకు వేసిన దుర్భరమైన శిక్షా లేక ఆయన తనకు తాను వేసుకున్న శిక్ష అంతకంటే సహించరానిదా?
నీటి విలువ గ్రహించడం ఎంతో అవసరం. ఇటీవలి కాలంలో బెంగుళూరు నగరంలో తలెత్తిన నీటి ఎద్దడి అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగుళూరు నగరం సమస్య ఇటీవలిదే కావచ్చు కానీ రాయలసీమ జిల్లాల్లో నీటి కరువు ఏళ్ళ తరబడి ఉన్నదే. బిందెడు నీళ్ళ కోసం మైళ్ళ తరబడి నడక సాగించే స్త్రీలూ, వాళ్ళకి దూరంగా బెంగుళూరు నగరంలో వానలో నాట్యం చేయడం కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు నీటిని వృథా చేసే మెడికల్ కాలేజీ యాజమాన్యం.. ‘రెయిన్ డాన్స్’ కథలో తటస్థపడతారు. వర్షంలో తడవటం ఎంతో ఇష్టమైన కస్తూరి, ఆ కాలేజీలో చదవకూడదనుకుంటుంది. “If there is magic on the planet, it is contained in water.” అని అమెరికన్ ఆంత్రపాలజిస్ట్ Loren Eisley అన్న మాటలు ఎంతో నిజమనిపిస్తాయి ఈ కథ చదివాకా.
‘పూర్ణాహుతి’ కథలో కీలకపాత్ర పూర్ణకీ, ఆమె అన్న చేసిన యాగానికీ, ఆమెకి చదువు నేర్పిన గురువుకీ మధ్య ఉన్న సంబంధం చక్కగా వెల్లడవుతుంది. పూర్ణ లాంటి వ్యక్తులు చాలా అరుదని పాఠకులు గ్రహిస్తారు.
భూమి మీద కొన్ని రకాల జంతువులు అంతరించిపోతుంటాయి. కొన్ని అంతరించిపోయే దశలో ఉంటాయి. కాస్త శ్రమిస్తే కొన్ని జాతులను కాపాడుకోవచ్చు. IUCN అనే అంతర్జాతీయ సంస్థ ఇలా అంతరించిపోతున్న జంతువుల జాబితాను రూపొందించి, వాటిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేస్తుంది. అలాగే ‘జీవజాతి’ కథలోని సత్యం లాంటి అరుదైన వ్యక్తులను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం సమాజానికెంతో ఉంది. ధర్మం ఆచరించాల్సి వచ్చినప్పుడు ముందువెనకాలడకు, నిలబడు అనే సందేశాన్నిస్తుందీ కథ.
భౌతికంగా విస్తృతంగా పరిధులు పెంచుకుపోతున్న మనిషి అంతర్లీనంగా కుంచించుకుపోతున్న వైనాన్ని చెప్పిన కథ ‘నేను విశ్వం’. మనవాళ్ళు ఎవరు? అనే ప్రశ్నకి జవాబు కథలో చాలా సార్లు మారుతుంది. మనుషులందరినీ మనవాళ్ళు అనుకోవాలని చివరగా సూచిస్తుంది. “Who are we? We find that we live on an insignificant planet of a humdrum star lost in a galaxy tucked away in some forgotten corner of a universe in which there are far more galaxies than people.” అన్న కార్ల్ సాగన్ మాటలు చదివినప్పుడు సాటి మనుషులను మనమెందుకు కలుపుకుని పోవాలో అర్థమవుతుంది.
బీదరికం నుంచి ఎదిగి సంపన్నుడై, తన మూలాలని మరిచిపోయిన లక్ష్మీపతిరావు కథ ‘కన్నీరు ఉప్పగా ఉంటుంది!’ ఉప్పు మడులలో పనిచేసే కార్మికుల వెతలను చెప్పిన కథ. మరణం తరువాత కూడా ఉప్పు వాళ్ళనెలా వెంటాడుతుందో తెలినప్పుడు పాఠకుల కళ్లు చెమర్చుతాయి.
నిజాయితీ, నిబద్ధత కలిగి, తన ఉద్యోగ బాధ్యతలను ఒక యోగిలా నిర్వర్తించిన సుదర్శనం ఓ మారుమూల ఊళ్ళో స్వామీజీగా ఎలా అయ్యాడో ‘దేవుడిని చూసిన వాడు’ కథ చెబుతుంది. దేవుడంటే ఎక్కడో బయట లేడని, మనలోనే ఉంటాడని చెప్తుందీ కథ.
బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ స్థానికుల కన్నా తక్కువ వేతనాలకు పనిచేస్తుంటే, స్థానికులు బయటనుండి వచ్చిన వాళ్ళు తమ పొట్టలు కొడుతున్నారంటూ గొడవలు చేయడం, వలస వచ్చిన వారిని హింసించడం మనం మన ఊర్లలో, రాష్ట్రాలలో, ఇతర దేశాలలో చూస్తున్నాం. అలాగే వలస పక్షులు తమ ఆహారాన్ని తన్నుకుపోతున్నాయన్న భయంతో పక్షులు వాటిపై దాడులకు దిగితున్నాయని చెప్తుంది ‘వలస పక్షులు’ కథ. ఈ కథలోని అనంత్ తీసుకున్న నిర్ణయం ఆదర్శప్రాయమైనది.
తోటి మనుషులకు నిస్వార్థంగా సాయం చేసి, మంచివాడని పేరు తెచ్చుకున్న విశ్వేశ్వరయ్య విశ్వనరుడిగా మారిన వైనాన్ని ‘విశ్వమానవుడి వీలునామా’ కథ చెబుతుంది. ఊర్లలో ఎక్కడబడితే అక్కడ ప్రముఖుల విగ్రహాలు పెట్టే బదులు వారి స్మృతిలో మొక్కలు నాటితే, శిలా విగ్రహాల కన్నా మొక్కలే మానవాళికి మేలు చేస్తాయని ఈ కథ సందేశమిస్తుంది.
సాధారణంగా రచయితలు పాఠకులను ప్రభావితం చేస్తారు. కానీ ఒక పాఠకురాలు అస్త్రసన్యాసం చేసిన ఓ రచయితని ప్రభావితం చేస్తుంది, మళ్ళీ రాసేలా చేయడమే కాక, అతను మరో గొప్ప నిర్ణయం తీసుకునేందుకు కారణమవుతుంది ‘అజ్ఞాతి’ కథలో.
స్త్రీ పురుషుల స్వచ్ఛమైన స్నేహం, సంగీతం నేపథ్యంగా అల్లిన కథ ‘మొగలి రేకు’. కాలేజీలో మొగల్తూరు అమ్మాయిని ఇష్టపడిన అబ్బాయిగా, ఆ అమ్మాయి దగ్గరే సంగీతం నేర్చుకుని, రాణించి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రధాన పాత్ర పార్థసారథి గురించిన ఓ విషయాన్ని కథ చివరిలో వెల్లడించడం పాఠకులు ఏ మాత్రం ఊహించలేరు.
‘అప్పట్లో ఒకడుండేవాడు!’ కథలో ఏజన్సీ ప్రాంతంలో నిర్మించదలచిన ఇండస్ట్రియల్ కారిడార్‍ని స్థానిక గిరిజనులతో పాటు అక్కడి జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి తుకారాం కూడా వ్యతిరేకించడం సంచలనం సృష్టిస్తుంది. ఆ కారిడర్ నిర్మించతలపెట్టిన ప్రాంతంలో ఒక చిన్న కుటీరాన్ని మాత్రం ఎలాగైనా కాపాడుకోవాలని గిరిజనులు ఉద్యమం చేపడుతారు. ఆ గుడిసె ఎవరిదీ, ఎందుకు గిరిజనులు ఆ వ్యక్తిని అంతగా అభినందిస్తున్నారనేది తుకారం ద్వారా తెలుస్తుంది. ప్రపంచంలో కొందరు వ్యక్తులుంటారు.. వాళ్ళకో సంకల్పం కలిగి ఓ పనిని చేయాలనుకుంటే ఎన్ని ఆటంకాలెదురైనా, ఒంటరిగానే తాము అనుకున్న పనిని చేసి తీరుతారు. అలాంటి వాడే ఈ కథలోని బైరాగి! ఏజన్సీ వాసులకు సహాయ సహాకారలు అందిస్తూ, ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సి వస్తే, కావడిలో పెట్టుకుని 15 మైళ్ళు నడిచి ఆసుపత్రిలో చేరుస్తాడు. అంతటి శారీరక శ్రమని అతని ముసలి శరీరం తట్టుకోలేకపోతుంది. తల్లీ బిడ్డ క్షేమమని విన్నాకా ఆ వృద్ధుడు ప్రాణాలొదులుతాడు. ఆ కుటీరం బైరాగిదని, ఆయన స్మారకంగా గిరిజనులు కాపాడుకుంటున్నారని తెలుస్తుంది. ఈ కథ చదివాకా, నాకెందుకో – బీహార్‍లో తానొక్కడే కొండని తవ్వి రోడ్డు వేసిన దశరథ్ మాంజీ గుర్తొచ్చారు. ఈ ప్రపంచంలో బ్రతికే హక్కు అందరికీ ఉందని చెబుతుందీ కథ.
సత్యాన్ని గ్రహించిన వ్యక్తిని తుదముట్టించి అత మూఢనమ్మకాన్ని గుడ్డిగా బ్రతికించుకున్న ఓ ఊరి ప్రజల కథ ‘నమ్మకం’. స్వార్థపూరిత రాజకీయాలు పట్టి పీడించే గ్రామాలెలా ఉంటాయో ఈ కథలో తెలుస్తుంది.
“ప్రపంచం సరిగ్గా లేదంటే, ఆ తప్పు ప్రపంచానికి కాదు, సరిగ్గా దృష్టి పెట్టని నీదే” అంటారో గురుజీ ‘సృష్టిలో తీయనిది’ కథలో. మనుషుల్ని అపార్థం చేసుకుంటే స్నేహాలెలా మసకబారుతాయో ఈ కథ చెబుతుంది.
కుల వివక్ష కారణంగా, బాల్యంలో స్నేహితుడికి దూరమవుతుంది వసుంధర. దాదాపు యాభై ఏళ్ళ తరువాత మళ్ళీ అతన్ని కలుసుకునే అవకాశం వస్తుంది. రైల్లో టాయ్‍లెట్‍కి వెళ్ళి వస్తుంటే వసుంధర జారిపడిగా కాలి ఎముక విరుగుతుంది. మిత్రుడి ఫోన్ నెంబర్ సంపాదించి అతనితో మాట్లాడుతుంది. ఆమెను చూడడానికి తానే వస్తానంటాడు. హార్ట్ పేషంట్ అయిన ఆ మిత్రుడు లిఫ్ట్ లేని ఆ ప్లాట్ మెట్లు దిగి కిందకి రావాలి. అందుకని తానే వస్తానంటుంది వసుంధర. కాని అనుకోకుండా అతనే కిందకి దిగి రావాల్సి వస్తుంది. దిగి వచ్చిన అతన్ని చూసి ఆమె దుఃఖం ఆగదు. ‘దేవుడే దిగి వచ్చాడు’ కథ మనసుని కదిలిస్తుంది.
ఈ సంపుటిలోని చివరి కథ ‘కాలభైరవుడు’ చక్కని కథ. వైద్యుడిగా అద్దెంట్లో దిగి, ఇంటివారి ఆప్యాయతానుబంధాలకు నోచుకున్న లింకన్ – హఠాత్తుగా వారిలో వచ్చిన మార్పుకు విస్తుపోతాడు. ఇది వరకటి ఆదరణ, ఆప్యాయతలు మాయమవుతాయి. ఆ మార్పు తన కులం బహర్గతమవటం వల్లనే అని తెలిసి బాధపడతాడు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్నాడనే నెపంతో అతన్నిఇల్లు ఖాళీ చేయమంటారు. అయితే, కరోనా వల్ల ఆ ఇంటి పెద్ద చనిపోతే శవదహనంతో పాటు అన్ని కార్యక్రమాలకు లింకన్ వాళ్ళకి అండగా నిలబడతాడు. దాంతో వాళ్ళలోని మానవత్వం బయటపడుతుంది. లింకన్‍ని హత్తుకుని ఏడుస్తారు. కొద్ది రోజుల క్రితం తమలో కలిగిన వికారాలకు, వికృత ఆలోచనలకు వాళ్ళు ఏడ్చారు. కరోనా కన్నా పెద్దదైన ‘దురాచారం’ అనే వైరస్ నుంచి కోలుకుంటున్నందుకు పొరలి పొరలి ఏడ్చారంటాడు లింకన్.
‘గంగ పొంగింది’ కథ వర్గపోరాటాన్ని, పేదల దోపిడీని ప్రదర్శిస్తుంది. ‘ఆపాల’ పెద్దమ్మ, నాయకుడు, ప్రొటోకాల్, దేవుని ప్రసాదం, తదితర కథలు సమాజంలో మార్పును ఆశిస్తాయి. ఆ మార్పు వల్ల కలిగే మేలును వ్యక్తం చేస్తాయి.
“మంచి వైపు నిలబడే స్వభావాన్ని, నిజాయితీగా బ్రతకాలనే చింతనను, సత్యం కోసం తెగువతో ముందుకెళ్ళో ధైర్యాన్ని అందించే కథల సమాహారం ఇది” అన్న గుడిపాటి గారి మాటలతో పాఠకులు ఏకీభవిస్తారు.
***
రచన: డా. ఎమ్. సుగుణరావు
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
పేజీలు: 248
వెల: ₹ 200/-
ప్రతులకు: డాక్టర్. ఎమ్. సుగుణ రావు,
312 గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్స్,
హోటల్ ఫెయీర్ ఫీల్డ్ మారియట్,
మాధవధార, ఉడా కాలనీ,
విశాఖపట్నం – 530018.
ఫోన్: 9704677930, 9393129945
~
డా. ఎమ్. సుగుణరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-m-suguna-rao/