ఆకాశంపై దుమ్మెత్తిపోస్తే

1
2

[dropcap]అ[/dropcap]ప్పుడే గ్రూపుహౌస్‌లో తన ఫ్లాట్‌కి వచ్చి, బూట్లు తీసి లోనికి రాబోతున్న మధుకి మానులా అడ్డుగా నిలబడిన లలిత “స్టాప్ ఇక్కడే ఆగిపోండి. లోనికి రావాలంటే, మీ బట్టలు ఇక్కడే గుట్టగా పోసి వెనుక గుమ్మం నుండి లోనికి రండి. లోన ఏ వస్తువులూ ముట్టుకోవద్దు. నేను తట్టుకోలేను” చెప్పిందామె ముఖానికి ఉన్న మాస్క్ సరి చేసుకుంటూ.

“ఇలా బుసలు కొట్టేస్తున్నావ్. విషయం తెలిసిందా” అడిగాడు చిన్న స్వరంతో ఆమె చెవిలో.

రెండు అడుగులు వెనక్కి గెంతి “అవును.ఇందాకే లోకల్ ఛానల్లో వార్తలు చూసాను. మీరు ట్రీట్మెంట్ చేసిన పేషంట్లలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలిందనీ,అందుకని మీ బ్లడ్ సేంపిల్ తీసుకున్నారని ఆ న్యూస్ యాంకర్, లోకల్ న్యూస్ చానెల్లో వోకల్ కార్డ్ అరిగేలా చెప్పింది. అదేదో పేద్ద న్యూస్‌లా అదే పదే, పదే చెప్పి మాకు కొంత వ్యథ కలిగించారు. అందుకే ఈ భయం” కళ్ళొత్తుకుంది.

మధుకి ఓ ప్రైవేట్ క్లినిక్ ఉంది. ఆ ఏరియాలో మంచి డాక్టరుగా పేరు కూడా ఉంది. భార్య వద్దని చెప్పినా, ఇది నా కనీస బాధ్యత అని పేషేంట్లని చూసి వస్తుంటాడు. పేదలైతే ఫీజు కూడా తీసుకోడు. ఇపుడు ఇలా జరగడం ఆమెకి మింగుడు పడలేదు. దాంతో మరోమారు మధు వంక చూస్తూ – “వెనుక వీధి జీవకుమార్‌లా మీరూ క్లినిక్ మూసేయండీ. అంతా పూర్తిగా సర్దుకున్నాక తీద్దురు గాని అంటే వినలేదు. సేవ, జావా అంటూ లావాలో వేలుపెడుతున్నారండీ అని నెత్తీ, నోరు పలుమార్లు కొట్టుకుని, క్లినిక్ కట్టేయమని పోరినందుకు, కోపంతో నా నెత్తిన మొట్టేశారు, నా మాట కొట్టేశారు. అసలే పిల్లలతో ఉన్నవాళ్ళం. పైగా అద్దిళ్ళ పిల్లులం. వద్దంటే నేను హద్దు మీరుతున్నానంటారు” ముక్కు చీదిందామె.

“అలా అనకు. నన్నూతినకు. ఇలాంటి పరిస్థితులలోనే మనం సమాజానికి ఉల్లిపాయంతైనా ఉపయోగపడాలి. ఇక వైరస్ సైరన్‌కి వైధ్యుడు భయపడితే ఎలా? అది సోకితే అంటావా… అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను. ఆపైన పైవాడున్నాడు. నేను మంచే చేస్తున్నాను. అదే కంచై కాపాడుతుంది” చెప్పాడు ఇంటి వెనుక వైపుకి నడుస్తూ.

ఆ మరుసటిరోజు, పక్కింటివరకూ వచ్చిన కూరగాయలావిడ, మధు ఇంటి గుమ్మం వైపు కూడా చూడలేదు. లలిత రెండు మార్లు “కొండమ్మా, కొండమ్మా” అని పిలిచినా,”ఉండమ్మా,ఉండమ్మా వస్తానూ” అంటూ గబ,గబా వెళ్ళిపోయింది.

పక్కింటావిడని చూసి, అక్కా అని పలకరించే లోపు, విననట్టు లోనికెళ్లి, కలుపు మొక్కని చూసినట్టు చూసి తలుపేసుకుందామె. అది చూసిన లలిత, “ఛ,ఛ విశ్వాసం లేని మనుషులు. అంత భయం అయితే దూరం నుండి ఓ చిన్న చిరునవ్వు నవ్వొచ్చుకదా. వీళ్ళ ఒంట్లో బాలేనపుడూ, కంట్లో బాలేనపుడూ, ఇంట్లోకి నేరుగా వచ్చేసి మధన్నయ్యా, చంటాడికి జ్వరం, అత్తయ్యకి చెమటలు పట్టేస్తున్నాయి, మావయ్య గారు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఆయనికి కడుపు నొప్పి అని ఎన్ని సార్లో ఆయన్ని అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా వాళ్ళ ఇంటికి లాక్కుపోయింది. అలాంటిది ఈ ఒక్క వార్త చూసి ఇలా దూర్తలా ప్రవర్తిస్తోంది…. ఛీ,ఛీ” అనుకుని లోనకొచ్చేసింది.

కొద్ది సేపటికి బయట అరుపులు వినిపిస్తుండడంతో, తలుపు తీసింది లలిత. ఇంటి ఓనరు పాపారావ్, కాస్త దూరంగా నిలబడి, “ఇలా అయితే మేమందరం ఏవైపోవాలి. మెళ్ళో పూల మాలలు వేసుకుని, ముక్కులో దూదులు పెట్టుకుని, పాడెక్కి శ్మశానానికి పార్శిల్ అవ్వాలి. అసలే బిక్కు బిక్కుమంటూ ఉంటున్నాo. ఇలాంటివి వింటుంటే ఆ గుప్పెడు ధైర్యం కూడా ఇప్పుడు పప్పుచారులా పలచబడిపోతోంది. అయినా, డాక్టర్ గారికి పాజిటివ్ అని తేలితే వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఇందులో ఇసుమంత మొహమాటం లేదని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఈ గ్రూపు హౌస్ లోని వారందరూ తెగ భయపడి పోతున్నారు. మీరెవనుకున్నా పర్వాలేదు. అయినా డాక్టర్‌కి ఇల్లు అద్దెకి ఇవ్వడం కాదు కానీ, నాకు మద్దెల దరువైపోతోంది. చెప్పింది చేయండి. సిగ్గుంటే మళ్ళీ చెప్పించుకోకండి” అంటూ నసుగుతూ వెళ్లిపోయాడాయన.

మధు బెడ్ రూమ్ నుండే అన్నీ విని, ‘స్వార్థం పక్కన పెట్టి, తన గురించీ, పిల్లల గురించీ ఆలోచించకుండా, బయటకు వెళ్లి, అందరి ఆరోగ్యం చక్కదిద్దే తనకే ఇలాంటి పరిస్థితి వచ్చిందేవిటి, లలిత చెప్పిందే నిజమా’ అని ఆలోచిస్తూ వెనగ్గా వాలిపోయాడు.

ఆ మరుసటి రోజు మధు కరోనా టెస్ట్ రిజల్ట్స్ రానే వచ్చాయి. రిపోర్ట్స్‌లో నెగిటివ్ వచ్చింది. లలిత వెంటనే పూజ గదిలోకి వెళ్లి దణ్ణం పెట్టుకుంది. బొట్టు తీసుకొచ్చి మధుకు పెట్టింది. అప్పటివరకూ దూరంగా పెట్టిన పిల్లల్ని పిలిచి మనసారా ముద్దాడాడు. ఎత్తుకు తిప్పాడు. లలిత కళ్ళొత్తుకుంటూ, మధుని హత్తుకుంది.

ఇంతలో మళ్ళీ బయట, ఏవో కేకలు వినిపిస్తుండడంతో, లలిత భయపడుతూనే తలుపు తీసింది. ఎదురుగా, ఇంటి ఓనర్ భార్య జ్యోతి దీనంగా నిలబడి ఏడుస్తోంది.

“ఏమైందండీ” అడిగింది లలిత.

“మొన్న ఓ సారి బిర్యానీ తెచ్చుకుని, ఓ మూల కూర్చుని మొత్తం ఆయనే తినేశారు.”

“అలాగా? దానికి ఏడుపు ఎందుకూ! ఇవాళ మీరూ ఓ బిర్యానీ తెచ్చుకుని ఆయనికి పెట్టకుండా తినండి. సరిపోతుంది” చెప్పింది లలిత.

“నా ఏడుపు పూర్తిగా వినమ్మా. మొన్న అలా తిని, ఇవాళ జ్వరం, గొంతు నొప్పి, తలనెప్పి అంటున్నారు. ఆ బిర్యానీ తిన్న వాళ్ళ స్నేహితులకీ ఇదే అయిందట” బోరుమందావిడ.

“అయితే ఏం చేయమంటారు. నిన్ననేగా మీవారు పళ్ళు నూరి మరీ ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఇపుడు ఆయన డాక్టర్ అని గుర్తొచ్చిందా. ఆయన రారు. అది కరోనా అయితే ఆయనికి సోకదూ. అపుడు మేవేవైపోవాలీ! కనుక నాకు కోపం రాకముందే మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి” చెప్పింది లలిత మూతి బిగిస్తూ.

సిగ్గుతో తల వంచుకుందామె. ఇంతలో మధు మాస్క్, చేతులకి గ్లవుస్ వేసుకుని “పదండి” అన్నాడు ఆమెతో. అతన్ని చెక్ చేసి మందులు రాసాడు. ధైర్యం చెప్పి వచ్చేశాడు.

మరుసటి రోజు రిపోర్ట్స్‌లో ఇంటి ఓనర్ పాపారావ్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. మధు అతని ఇంటికి వెళ్ళగానే,అతను బిక్కచచ్చిపోయాడు.కొద్ది సేపటికి, “మీరు కూడా మాలాగ ఇరుగ్గా ఆలోచించి,ఇంటికే పరిమితమైపోతే,మమ్మల్ని కాపాడడానికి డాక్టర్లు ఎక్కడినుండి వస్తారు. అలా రాకపోతే, కరోనా కోరలు చాచి, పాజిటివ్ కేసులు కోటలు దాటిపోతాయి. నా లాంటి వెధవతనం గల వారితో, ఇంకా ఎందరు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారో. నన్ను క్షమించండి” రెండు చేతులూ జోడించాడు.

“భలే వారే. వేడినీరు తాగుతూ ఉండండి.ఇంట్లోనే ఉండండి. మందులు వాడండి. మంచి ఆహారం తీసుకోండి. పరిస్థితి బట్టి చూద్దాం” చెప్పాడు మధు.

అయినా ఆయన కన్నీళ్లు ఆగలేదు. అది చూసిన మధు,”బాధపడకండి” చెప్పాడు.

“నా బాధ వ్యాధి సోకినందుకే కాదండీ”

“మరి” అడిగాడు మధు అమితాశ్చర్యంగా.

“ఆకాశంపై దుమ్మెత్తి పోయాలనుకుంటే అది మనమీదే పడుతుందని అర్థమైంది డాక్టర్ గారూ. మీకు టెస్ట్‌లో పాజిటివ్ అని తేలితే, మిమ్మల్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయించడంలో నాతో కలిసి రావాలని , నిన్న నేను మన గ్రూప్ హౌస్ లో కొంత మందిని పిలిచి మరీ మీటింగ్ పెట్టాను. దాంతో ఇపుడు వారికీ నా కారణంగా కరోనా వచ్చే అవకాశం ఉంది కనుక, ఇప్పుడు వారంతా నన్ను పొద్దున నుండీ ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. పైగా మా ఆవిడా, మా అబ్బాయి, నన్ను ఇంట్లో ఉండకుండా గవర్న్మెంట్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు. నేను హోం క్వారంటైన్‌లో అంటే ఓ గదిలో తలుపు వేసుకు ఉంటానన్నా వద్దంటున్నారు.మానవత్వం ఉండొద్దూ? ఇలాంటపుడు సాటి మనిషికి బాసటగా నిలవక పోతే ఎలాగూ. అయినా నా ప్రవర్తన ఇలా ఉన్నపుడు వాళ్ళ ప్రవర్తన అలా ఉండటంలో తప్పులేదులెండి.” చెప్పాడు బేలగా నేల చూపులు చూస్తూ. “మీలో ఈ మార్పుకోసమే, నేను మీ రిపోర్ట్ పాజిటివ్ అని అబద్దం చెప్పించాను. మీకు కరోన లేదు పాపారావ్ గారూ. జస్ట్ ఫుడ్ పాయిసన్” చెప్పి అక్కడి నుండి కదిలాడు మధు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here