[dropcap]ఆ[/dropcap]కలిని కొలిచిన వాడికే
జీవితం తెలుస్తుంది
ఆకలి తీర్చుకోవడమంటే
కడుపు నింపుకోవటం మాత్రమే కాదు
నవరస జీవన గమనానికి
ఇరుసు అవ్వడమూనూ
ఆకలంటే నాకెంతో ఇష్టం
నేటి ఈ చిరునామా
ఖాళీ కడుపు చూపిన దారి
అప్పుడప్పుడూ
నన్ను పలకరిస్తుంది
తోడుగా వున్నానంటుంది
పేగుల్ని గిల్లుతూ మనిషినని గుర్తుచేస్తుంటుంది.
ఎంత ఆకలికి అంత రుచి
అమ్మ చేతి గోరుముద్దల ముందు
పంచభక్ష్యపరమాన్నాలు
రుచి కోల్పోతాయి
చెమట చుక్కలు రాల్చి
చేను గట్టున రైతన్న చేతిలోని
పెరుగన్నం ముద్ద కదా అమృతమంటే
ఆకలిది అపూర్వ శక్తి
ఆవేదనను పెంచుతుంది
అకృత్యాలకు దారితీస్తుంది
అందుకే కదా
కూటి కోసం కోటి విద్యలన్నది
అరగని వాడికి
ఆకలి రుచి తెలియదు
జీవితం కసి తెలియదు
అవ్వ ఎపుడో చెప్పింది
అర్ధాకలి అన్నింటికీ మంచిదని
కడుపు నింపుకోవాల్సిన మాట కదా…!
పెద్దల మాట చద్దిమూట మరి