Site icon Sanchika

ఆకలి విజయం

[dropcap]“జీ[/dropcap]వితంలో, కష్టాలను ఎదుర్కొనే మనస్తత్వం, నీతి నిజాయితీ ఉన్నవారికి విజయం ఎప్పటికైనా ప్రాప్తిస్తుంది. వెంటనే కాకున్నా , సమయం వచ్చినప్పుడు…. వస్తుంది.” అంది కావేరి కొడుకు అనిల్ కేసి ప్రేమతో చూస్తూ.

“వచ్చేవారం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఉందమ్మా. గడిచిన ఆరు నెలల్లో ఉద్యోగాలకు దాదాపుగా ఆరు పరీక్షలు రాశాను. ఇప్పుడు ఇందులో జరిగే ఇంటర్వ్యూకి, హైదరాబాద్‍కు రమ్మని ఉత్తరం వచ్చింది.” అన్నాడు దిగులుగా అనిల్.

“నాన్నకు చెపుతాను, ఖర్చులకు సర్దుతారు ఎలాగో ఒకలా, నువ్వైతే అన్నీ రెడీ చేసుకో” అంది కావేరి.

హైదరాబాద్ వెళ్ళి రావడానికి, అక్కడ భోజనానికి అయ్యే ఖర్చులను, అతి కష్టం మీద సమకూర్చుకొని బయల్దేరాడు అనిల్.

ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేదు. జనరల్ నాలెడ్జి పుస్తకం ముందు పెట్టుకుని, అమ్మ చెప్పిన విషయాలు మననం చేసుకోసాగాడు అనిల్.

“అనిల్,…. మీ నాన్నగారి ఆరోగ్యం దెబ్బ తింటోంది… ఆయనకు విలేకరిగా ఇంటి బయట బోలెడు పేరూ, ప్రతిష్ఠ, అయినా ఇంట్లో తిండి గింజలు కూడా కొరతే. చూస్తున్నావుగా, వారానికి కనీసం ఒక రోజు పస్తులు మనకు తప్పనిసరి. బొరుగులు తిని, అవి సరిపోక, నీళ్లు తాగటం మనకు అలవాటు అయిపొయింది., .. నీకు వుద్యోగం వస్తే మన కుటుంబం నిలబడుతుంది. భగవంతుడిని ప్రార్థించి, ఇంటర్వ్యూ జాగ్రత్తగా చేసి రా.” అంది ధైర్యం చెబుతూ.

అనిల్ ఇంటి పరిస్థితి బాగా లేదు.. నాన్న గారు ఊరు నుండి వచ్చి ఇరవై లేదా పది రూపాయల వరకు ఇస్తే అప్పుడు కిరాణా కొట్టుకు వెళ్లి, సరుకులు తెచ్చిన తర్వాత వంట మొదలయ్యేది. అప్పటి వరకు అందరూ ఆకలితో నీరసంగా పడుకున్న రోజులు ఎన్నో.

ఇంటర్వ్యూకై తప్పనిసరి పరిస్థితుల్లో, చాలా ఇబ్బందులతో డబ్బులు సర్దుబాటు చేశారు. ఇంటర్వ్యూ గురించి తీసి పెట్టుకున్న ఒకే ఒక ప్రత్యేకమైన మంచి డ్రెస్ వేసుకుని…. గదిలోకి వెళ్లి దేవుని పటానికి మ్రొక్కుకొని, అమ్మ కాళ్లకు దండం పెట్టుకొని హైదరాబాద్‌కు బయలుదేరాడు.

“అనిల్… నీకు ఈ ఉద్యోగం వస్తుంది. మన కష్టాలు త్వరలో తీరతాయి. ఏమి దిగులు పెట్టుకోవద్దు” అని ఆశీర్వదించింది.

అమ్మ కళ్ళలో లోకి చూసాడు.. ఆ కళ్ళలో ఎన్నో ఆశలు. మనసు బాధతో నిండి పోయింది.

కొద్ది దూరం నడిచి వెనక్కి తిరిగి చూసాడు, అమ్మ తలుపు దగ్గర నిలబడి నవ్వుతూ చేతులు ఊపుతూ కనిపించింది.

అమ్మ చూపులలో అనిల్ మీద నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ. అది చూసి అనిల్ గుండె బరువెక్కి, కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతూ ఉంటే వాటిని బలవంతంగా ఆపుకుని ముందుకు నడిచాడు..

ప్రతి పరీక్షకు దాదాపు నలభై ఐదు రూపాయలు ఖర్చు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో లేదో తెలియకపోయినప్పటికీ ఇలా ప్రతి రాత పరీక్షకు డబ్బులు కట్టడం అన్నది శక్తి మించిన పని.

హైదరాబాద్‌లో బస్ దిగి చుట్టూ చూసాడు. ఆటో వాళ్ళు పిలుస్తూవుంటే వాళ్ళని తప్పించుకుంటూ బయటకు సిటీ బస్సు వేపు అడుగులు వేసాడు.

ఇంటర్వ్యూ ఉత్తరంలో ఉన్న చిరునామాకు సిటీ బస్సు ఎక్కి చేరుకున్నాడు.

అదొక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. చాలా విశాలంగా అన్ని హంగులతో ఉంది. దాదాపు ఒక పదిహేను మంది అభ్యర్థులు కూర్చుని ఉన్నారు. అందరూ ఒకరినొకరు పరిచయాలు చేసుకుని ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల గురించి చర్చించుకుంటూ వున్నారు.

కాసేపటికి అందరికీ టీ బిస్కెట్లు పంపించారు.

అది చూసి అనిల్‌కు ప్రాణం లేచి వచ్చింది. ఆకలిగా వుంది. ఎందుకంటే ఉదయం నుంచి టిఫిన్ తినలేదు. హైదరాబాద్‍లో టిఫిన్ అంటే మళ్ళీ కనీసం మూడు రూపాయల ఖర్చు అనుకుని చేయలేదు. వచ్చిన వాళ్ళందరూ తలా ఒకే ఒక బిస్కట్ తీసుకొని టీ తాగడం మొదలు పెట్టారు. తాను మాత్రం, ఎవరు గమనించకుండా ఒకటేసారి దాదాపుగా ఐదు బిస్కెట్‌లు తీసుకుని తిన్న తర్వాత కాస్త ఆకలి తీరినట్లుగా అనిపించింది. ఎక్కడో చదివినట్టుగా దరిద్రానికి ఆకలెక్కువ అని.

పస్తులున్న ప్రతీసారి అనిల్‌కు ఆలోచన వచ్చేది.. ‘అసలు మనిషికి ఆకలి, కడుపు అనేది లేకపోతే ఎంత బాగుండేది!!’ అని.

2

క్యాబిన్ బయట లైట్ వెలిగింది. లోపల్నుంచి ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న అభ్యర్థి బయటకు వచ్చేసాడు.

క్యాబిన్ బయట కూర్చున్న వ్యక్తి చేతిలో ఉన్న లిస్ట్ చూసి ‘అనిల్ కుమార్’ అని పిలిచాడు.

బిస్కెట్లు తిని, టీ తాగిన తర్వాత ఆకలి తీరి, నింపాదిగా కూర్చుని ఉన్న అనిల్, తన పేరు పిలవగానే లేచి తన తల్లిని మనసులో ప్రార్థించు కొని ముందుకు అడుగులు వేశాడు.

కేబిన్ లోపలికి అడుగు వేసి ‘గుడ్ మార్నింగ్ సర్’ అంటూ కాస్త చిన్న చిరునవ్వు నవ్వాడు.

“ఎస్, మిస్టర్ అనిల్ ,ప్లీజ్ టేక్ యువర్ సీట్” అని ఏమాత్రం నవ్వకుండా చాలా సీరియస్‌గా అతనికి సీటు చూపించారు.

అనిల్ ఎదురుగా కూర్చున్న ఇంటర్వ్యూ చేసే అధికారులు ముగ్గురూ రక రకాలుగా ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేశారు. మధ్యలో కూర్చున్న పెద్ద అధికారి మాత్రం ఏమీ మాట్లాడకుండా అనిల్‌ను గమనించసాగాడు.

ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చాలా అలవోకగా, తప్పులు లేకుండా చెప్పడం చూసి అధికారులు నివ్వెరపోయారు. అతను సమాధానాలు చెబుతున్న కొద్దీ ఇంకా రకరకాల ప్రశ్నలు సంధించడం చేశారు. అన్నింటికీ నిబ్బరంగా స్థిమితంగా సమాధానాలు చెప్పాడు అనిల్. సమయం అయిపోవటంతో ఆపేశారు.

ఆఖరున ,ఒక అధికారి అనిల్ బయోడేటాను పరిశీలిస్తూ

“మీ చదువంతా తెలుగు మీడియంలో జరిగింది కానీ, మీ ఇంగ్లీష్ ఇంత బాగుందేమిటి?” అని అత్యంత ఆశ్చర్యంగా అడిగాడు.

“అవునండి, …నేను చదివింది తెలుగు మీడియం” అంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు అనిల్ కుమార్.

ఆ ముగ్గురూ, మధ్యలో కూర్చున్న ముఖ్య అధికారి వైపు చూసి, ఇంక అయిపోయింది అన్నట్లుగా సైగ చేశారు.

అప్పుడు ఆ అధికారి “దాదాపుగా పది సంవత్సరాల కిందట, మిమ్మల్ని చూసినట్టుగా అనిపిస్తుంది…. సుల్తాన్ బజార్ దగ్గర వుండేవారా..” అని సందేహంగా అడిగాడు.

“అవునండి.. అప్పుడు… అక్కడ నేను న్యూస్ పేపర్ అమ్మేవాడిని” అన్నాడు అనిల్ తల కిందికి వంచుకుని.

ఒక క్షణం ఎవరు మాట్లాడలేదు. అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

“ఓకే మిస్టర్ అనిల్ మీరు వెళ్ళవచ్చు” అన్నారు.

వెనక్కి తిరిగి వెళుతున్న అనిల్‌ను చూస్తూ ఆలోచనలో పడ్డాడు ముఖ్య అధికారి.

3

ఇంటర్వ్యూ క్యాబిన్‌లో నుంచి బయటికి వచ్చి గాలి పీల్చుకున్నాడు అనిల్.. ఎందుకో గాని చాలా బాగా చేశానని అనిపించింది తనకు.

బయటకు రాగానే అక్కడ ఎదురుగా కూర్చున్న ఆఫీసర్ అనిల్‌ను పిలిచి “మీరు బస్ టికెట్లు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాం” అన్నాడు మొహంలో ఎటువంటి భావం లేకుండా.

ప్రాణం లేచి వచ్చినట్లయింది అనిల్‌కు… ఎందుకంటే ఆ డబ్బులు చాలా ముఖ్యం. ఇలా ఇస్తారని తనకు ఏ మాత్రం తెలియదు, అందుకని బస్ టికెట్లు, బస్సు దిగగానే తీసి పడేసాడు.

అదే విషయం అతనికి నిరాశగా చెప్పాడు.

“పర్వాలేదు, అది రాసి ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి” అన్నాడు.

ఉద్యోగం సంగతి దేవుడెరుగు ముందు ఈ డబ్బులు అనిల్‌కు అత్యంత ఆవశ్యకం. పదిహేను నిమిషాల తర్వాత అతను పిలిచి డబ్బులు చేతిలో పెట్టాడు.

చాలా సంతోషంగా, ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యాడు అనిల్.

బస్సులో వెనక్కి జారగిలబడి ఇంటర్వ్యూలో అందరికంటే పెద్ద అధికారి అడిగిన ప్రశ్న గుర్తు చేసుకున్నాడు. అసలు ఆయనెలా గుర్తుపట్టాడు? అది కూడా… దాదాపు పది సంవత్సరాల తర్వాత!! అని ఆలోచించసాగాడు.

బస్సు వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టింది. కళ్ళు మూసుకొని పది సంవత్సరాల వెనక్కి గతం లోకి జారుకున్నాడు.. అప్పుడు అనిల్ నానమ్మ, బాబాయిల దగ్గర అతి గారాబంగా, రాజకుమారుడిలా పెరుగుతూ వున్నాడు… కష్టం, ఆకలి అనేది తెలియకుండా…

4

“ఒరే అనిల్! రేపటి నుంచి స్కూలుకు సెలవులు. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొస్తావా?” అడిగింది అనిల్ నానమ్మ.

“మరి ఇప్పుడు నేను ఏడవ క్లాస్‌కు వెళ్తాను, కొత్త పుస్తకాలు కొనుక్కోవాలి కదా?” కాస్త అమాయకంగా సందేహాన్ని వెలిబుచ్చాడు అనిల్.

“మీ అమ్మానాన్నా అందరూ హైదరాబాద్‌కు మకాం మార్చేశారురా. …నువ్ వెళ్లి చాలా రోజులైంది. మీ బాబాయ్ బుక్స్ తీసుకుంటారు లే” అంది ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడుతూ.

“సరే నానమ్మ,. వెళ్తానులే” అంటూ, బయట ఎదురు చూస్తున్న స్నేహితుల దగ్గరకు నిక్కర్ పైకి లాగుకుంటూ, ఆడుకోవడానికి రయ్యిన పరిగెత్తాడు అనిల్.

మరుసటి రోజు నానమ్మ ఊరు నుండి, హైదరాబాద్‌కు బయల్దేరాడు అనిల్ కుమార్.

చప్పల్ బజార్‌లో, చిన్న చిన్న వీధుల్లో నుంచి తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపిస్తూ ఇంటికి చేరుకున్నాడు అనిల్. ఒకే ఒక రూములో జీవనం సాగిస్తున్నారు అందరూ. రూమ్‍కు ముందు వైపు తలుపులు వున్నాయి కానీ ఒక్క కిటికీ కూడా లేదు. దానికి ఆనుకుని చిన్న వంట గదిలో కట్టెల పొయ్యి మీద ఉప్మా చేసి అందరికీ వడ్డించింది కావేరి. ఇల్లంతా కట్టెల పొగ నిండి పోయింది కాసేపు. ఒక పక్కగా చాపలు, దిళ్లు, దుప్పట్లు చిన్న బల్ల మీద పెట్టి వున్నాయి. అక్కడే కాస్త పక్కకు జరిగి అందరూ టిఫిన్‌కు కూర్చున్నారు.

“అమ్మా నాకు ఇంకాస్త పెట్టు” అన్నాడు అనిల్. అందరి పిల్లలకు పెట్టిన తర్వాత అక్కడ ఇంక ఉప్మా మిగల్లేదు. అది తెలిసి కావేరి.

“ఇంకా కావాలా కన్నా ఇదిగో పట్టు” అంటూ తన కంచంలో నుంచి తీసి అనిల్ ప్లేట్‌లో పెట్టింది.

అమ్మకు తక్కువ అవటం గమనించి తిరిగి అమ్మ కంచంలో పెట్టేసి లేచి వెళ్ళాడు అనిల్.

నాన్న ఆఫీస్‌కు బయలుదేరి వెళ్ళాక అడిగాడు “అమ్మా ! నాన్న ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు?”

“ఇక్కడ దగ్గర్లో ఉన్న ఇంగ్లీష్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నార్రా కన్నా.”

“మరి మన ఊర్లో అదే చేసేవారు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చేసారమ్మా?”

“అక్కడ మన పేపర్ నడవట్లేదు రా, …..ఇల్లు గడవడం కష్టం అయిపోయింది. అందుకని, ఇక్కడకు వచ్చి ఉద్యోగం వెతుక్కుంటున్నారు….. ప్రస్తుతం ప్రింటింగ్ ప్రెస్‌లో రోజుకు ఎనిమిది రూపాయలు జీతం లెక్కన పని” అంది నిరాశ, నిస్పృహలతో.

“మరెందుకా పని? ఇంకేదైనా చేయవచ్చుగా నాన్నగారు” ఏదో తెలీని ఉక్రోషంతో కూడిన బాధతో అడిగాడు.

“ఏం చేయనురా, … వినరుకదా, మీ నాన్నగారికి దానిమీదే అభిమానం ముందు నుండి” అంది అమ్మ నిస్సహాయంగా.

“మరి ఇప్పుడు, వీళ్ళ స్కూలు ఎలా?” అడిగాడు తమ్ముడు చెల్లెళ్ళను చూస్తూ.

“దగ్గర్లో ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ఉంటే చూడాలి”

వాళ్ల మొహాలు చూసాడు అనిల్. సరైన ఆహారం లేక బుగ్గలు పూర్తిగా పీక్కొని పోయాయి. పాతగా, రంగు వెలిసిన బట్టలు. తైల సంస్కారం లేని, పెరిగిపోయిన వెంట్రుకలు. మొహాల్లో దైన్యం.

పూర్తిగా అర్థం కాకపోయినా ఇంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అర్థమైంది. ఆలోచనలో పడ్డాడు. ఇవన్నీ తెలియని తనేమో నానమ్మ బాబాయి దగ్గర హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నాను అని అనుకున్నాడు.

క్షణాల్లోనే అనిల్ మనసంతా దుఃఖంతో నిండిపోయి, దిగులుపడ్డాడు. ఆ వయసులో ఏం చేయాలో తెలీని అయోమయం. ఈ సారి గుడికి ఎక్కువ మార్లు వెళ్లి బాగా ఎక్కువగా మొక్కాలి అనుకున్నాడు.

మరుసటి రోజు నాన్న బయల్దేరే సమయానికి “నాన్నా నేను వస్తా నీ తోటి” అని అడిగాడు.

“సరే రా..” అన్నాడు కొడుకు మొహం చూసి.

ప్రింటింగ్ ప్రెస్‌లో అందరికీ ‘నా పెద్ద కొడుకు’ అంటూ అనిల్‌ను చూపించాడు. ఆ సమయంలో నాన్న కళ్ళలో గర్వం కనపడింది అనిల్‌కు. చాలా పెద్ద ప్రింటింగ్ ప్రెస్ అది. సాయంకాలం నాలుగు అయ్యేసరికి పేపర్ ఆ రోజు న్యూస్ పేపర్ ప్రింటింగ్ అయిపోవచ్చింది.

చాలామంది వచ్చి పేపర్లు తీసుకొని అమ్ముకోవడానికి సైకిల్ పైన కట్టుకుని తీసుకెళ్లటం గమనించాడు.

పేపర్ ధర 25 పైసలు వాటిని అమ్మితే ప్రతి పేపర్కు ఐదు పైసలు ఇస్తారని తెలిసింది. ఆ రోజుకు పని అయిపోగానే తనకు వచ్చిన ఎనిమిది రూపాయలు తీసుకొని అనిల్ నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చేసారు.

మరుసటి రోజు సాయంత్రం “అమ్మా! నేను నాన్నగారి ఆఫీస్‌కి వెళ్తున్నా” అని చెప్పి వెళ్ళాడు అనిల్.

ప్రింటింగ్ ప్రెస్‌లో సరాసరి మేనేజర్ దగ్గరికి వెళ్లి “నేను కూడా కొన్ని పేపర్లు ఈ రోజు నుంచే అమ్ముతాను. నాకు కొన్ని ఇవ్వండి” అని స్థిరమైన స్వరంతో అడిగాడు.

“నువ్వు..?? అమ్ముతావా బాబు!!” అంటూ అపనమ్మకంతో చూసాడు మేనేజర్.

“కొన్ని తీసుకెళ్ళు ఈ రోజు కైతే… …..చూద్దాం.” అని ఇరవై అయిదు మాత్రమే ఇచ్చాడు.

ఆ పేపర్లను చేతిలో పట్టుకొని, ఎక్కడమ్మాలో ఆలోచించి,…. తన ఇంటి దగ్గరలో ఉన్న సుల్తాన్ బజార్ సర్కిల్లో అయితే బావుంటుందని, అక్కడికి దారితీశాడు అనిల్.

ఏదో చేయాలనే తపన, పదకొండేళ్ల వయసు, మనసులో బాధ, కానీ మొండి ధైర్యం ఆవహించింది అనిల్ మనసులో.

సుల్తాన్ బజార్ సర్కిల్‌లో నిలబడి చేతిలో పేపరు పట్టుకుని “పేపర్!! పేపర్!!!” అంటూ పెద్దగా అరవసాగాడు. కానీ అక్కడ తిరిగే బస్సులు, తదితర వాహనాల చప్పుడులో అది వినపడటం లేదు.

ఇది గమనించిన ఒక కానిస్టేబుల్ అనిల్ దగ్గరగా వచ్చి “బాబు, ఇక్కడ వాహనాలు చాలా స్పీడ్‌గా వస్తున్నాయి. జాగ్రత్త!! ఇక్కడ కాదు, కానీ అదిగో అటు పక్కగా నిలబడు” అని చూపించాడు.

అనిల్ తిరిగి అక్కడికి వెళ్లి నిలబడ్డాడు. చాలా సేపు ఎవరు కొనలేదు, గుండె నిండా చెప్పలేని దుఃఖం వస్తూ వుంది. దేవుడా మాకు ఎందుకు సహాయం చేయవు అని అనుకున్నాడు.

కొద్దిసేపట్లో ఒక స్కూటర్ పైన వచ్చిన వ్యక్తి స్కూటర్ ఆపి, పేపర్ కొన్నాడు. అనిల్‌కు చెప్పలేనంత సంతోషం కలిగింది. రెట్టించిన ఉత్సాహంతో, “పేపర్! పేపర్!” అని అరుచుకుంటూ తిరగసాగాడు.

ఒక గంట దాటింది. దాదాపు పది పేపర్లు అమ్మిన తర్వాత మరొక స్కూటర్ పైన ఒకతను వచ్చి ఒక రూపాయి కాయిన్ ఇచ్చి, పేపర్ తీసుకుని, ముందు బాక్స్‌లో పెట్టుకుని, తర్వాత మిగిలిన చిల్లర తీసుకోకుండా స్కూటర్‌ను ముందుకు ఉరికించాడు.

అది చూసి అనిల్ “సార్!! సార్!!! మీ డబ్బులు” అంటూ స్కూటర్ వెనకాల పరిగెత్తడం మొదలు పెట్టాడు.

స్కూటర్ చాలా వేగంగా పరుగెడుతోంది. .. చేతిలో పేపర్ల బరువు మోసుకుంటూ వెనకాల పదకొండు సంవత్సరాల చిన్న పిల్లవాడు పరిగెత్తడం అందరూ చూస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి పక్క నుంచి ఇంకొక మోటార్ సైకిల్ వేగంగా వచ్చి అదుపుతప్పి అనిల్ వెనుక నడుము వైపుగా తగిలింది. అంతే… ఆ తాకిడికి అనిల్ బాలెన్స్ కోల్పోయి ముందుకు బోర్లా పడిపోయాడు.

పేపర్‌లన్ని రోడ్డుమీద చిందరవందరగా పడిపోయాయి. చుట్టూ వస్తున్న వారు వాహనాలు ఆపి అనిల్ ను లేపి పేపర్లు అన్నీ తీసి చేతికి ఇచ్చారు. మోచేతులు, నిక్కర్ కింద మోకాళ్ళు దెబ్బతిని, చర్మం పోయి, రక్తం కారటం మొదలైంది. నుదురు మీద అర్ధచంద్ర ఆకారంలో దెబ్బ తగిలి రక్తం కారటం మొదలైనది. అవేవి గమనించటం లేదు అనిల్. ధ్యాస, చూపు అంతా మిగిలిన పేపర్స్ మీదే. అవన్నీ ఏరుకుని వాటికి అంటిన దుమ్ము, మట్టి తుడవడం మొదలు పెట్టాడు.

ఇంతలో చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి వెనక్కి వచ్చి తన చేతి రుమాలుతో ఆ రక్తాన్ని తుడిచి.. “ఎందుకు బాబు, నా వెంట పరుగెత్తుకు వస్తున్నావేంటీ?” అని అడిగాడు.

“సార్, మీరు నా వద్ద నుండి చిల్లర మర్చిపోయి వెళ్ళిపోతున్నారు…. అది ఇద్దామని” అంటూ తన జేబులో నుంచి ఇవ్వవలసిన నాణేలు కొన్ని లెక్క పెట్టి ఇచ్చేశాడు.

“నీ పేరేంటి బాబు?” ప్రశ్నించాడు, నుదుటి మీద ఉన్న అర్ధచంద్రాకారం దెబ్బకున్న రక్తం తుడుస్తూ ఆ వ్యక్తి.

తన పేరు చెప్పాడు అనిల్. ఆ వ్యక్తి అనిల్‌ను కేసి చూసి వీపు తట్టి వెళ్లి పోయాడు.

మిగిలిన పేపర్లు అమ్మేసి చాలా తృప్తిగా ఇంటికి వెనుతిరిగాడు అనిల్. ఇంటికి వెళ్లి ఆ రోజు సంపాదించిన ఒక రూపాయి పావలా అమ్మ చేతిలో పెట్టాడు అనిల్.

జరిగిందంతా విని, చేతిలో ఆ డబ్బులను, కొడుకు ఒంటికి తగిలిన దెబ్బలు చూసి కొడుకును గట్టిగా హత్తుకొని భోరున ఏడవ సాగింది కావేరి. అనిల్ అమ్మ కన్నీటిని చేతితో తుడవ సాగాడు.

ఏమీ అర్థం కాకపోయినా చిన్న తమ్ముళ్లు, చెల్లెలు కూడా అమ్మను పట్టుకుని ఏడవడం మొదలు పెట్టారు.

”ఎవరూ ఏడవద్దు….. నేను పెద్దయ్యాక.. అందరికి డబ్బులిస్తాను” తొణక్కుండా అన్నాడు అనిల్ రెండు పిడికిళ్లు బిగించి, కసిగా.

ఆ తర్వాత నెల రోజుల పాటు ప్రతి దినం పేపర్లు ఆ విధంగా అమ్మి దాదాపు రోజుకు రెండు రూపాయల యాభై పైసలు సంపాదించాడు.

ఒక రోజు ప్రింటింగ్ ప్రెస్ అంతా కలయ తిరుగుతుండగా ఒక మూల చెత్త సామానులో, కొన్ని పిల్లల బొమ్మల కథల పుస్తకాలు చూశాడు. అవి సగానికి పైగా పాతబడిపోయి, నలిగి పోయి వున్నాయి.

వాటిని చూసి కాసేపు ఆలోచించి, మేనేజర్ వద్దకు వెళ్లి “సార్ అక్కడ మూలన పడేసిన కథల పుస్తకాలు మీకు పనికి రావా?” అని అడిగాడు.

వాటి వైపు చూసిన మేనేజర్ “అవా…, అవి.. రెండు సంవత్సరాలుగా అలాగే పడేసి వున్నాయి బాబు, బయట పారేయటం కుదరలేదు, ఏం, ఎందుకని?” ప్రశ్నించాడు.

“నేను కొన్ని తీసుకోవచ్చా సార్” అన్నాడు.

“సరే తీసుకో. …. చదువుతావా?”

“అవునండి” అంటూ సాలోచనగా సమాధానం ఇచ్చాడు అనిల్.

దాదాపు ఇరవై పుస్తకాలు తీసుకుని ఇంటికి వెళ్లి, వాటిని శుభ్రంగా బట్టతో తుడిచి, ఒక తాడుతో కట్టుకుని, ముందుగా అనుకున్న విధంగా దగ్గరలో వున్న కాచిగూడ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్ళాడు.

స్టేషన్‌లో అప్పుడే ఒక ట్రైన్ వచ్చి ఆగి వుంది. అందులో ఎక్కి పుస్తకాలు చేతిలో పట్టుకుని “కథల పుస్తకాలు.. యాభై పైసలు మాత్రమే” అంటూ తిరగసాగాడు.

చాలా వరకు వాటిని అటూ ఇటూ తిప్పి చూసారే కానీ ఎవ్వరూ కొనలేదు.

ఇంతలో ఒక రైల్వే ఆఫీసర్ చూసి “బాబు, ఇక్కడ పుస్తకాలు అమ్మడానికి వీలు లేదు. స్టేషన్ బయటకు వెళ్ళు.” అని అనునయంగా చెప్పాడు.

అతన్ని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు అనిల్‌కు, అయినా ధైర్యం తెచ్చుకుని “సార్! ఇవి అమ్మితే వచ్చే డబ్బులు మా ఇంట్లో చాలా అవసరమండి, వచ్చే రూపాయలతో తినడానికి, బియ్యం, సరుకులు కొంటాను సార్… ప్లీజ్ ప్లీజ్” అని అభ్యర్థించాడు.

చూస్తే మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిలా వున్నాడు అనుకుని “ఏం చదువుతున్నావు బాబు…, సరే, అన్నీ కలిపి ఎంత?” అన్నాడు ప్రేమగా అనిల్‌ను చూస్తూ.

చెప్పాడు అనిల్.

పది రూపాయల నోటు చేతిలో పెట్టి, ఆ పుస్తకాలన్నిటినీ తీసుకుని “మరింకో మారు ఇటు వచ్చి అమ్మకూడదు,ఇక్కడ పోలీసులు పట్టుకుంటారు, సరేనా” అని నవ్వి తల నిమిరి పంపాడు.

మరుసటి రోజు అందులోనుండి అయిదు రూపాయలు తీసుకెళ్లి ప్రెస్‌లో మేనేజర్‌కు ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యంలో మునిగి పోయాడు మేనేజర్. అనిల్, మేనేజర్‌ను చూసి “ఆ బుక్స్ అమ్మి ఆ డబ్బులో కొన్ని నేను తీసుకుని కొన్ని మీకు తెచ్చాను సార్, ఇంకా కొన్ని బుక్స్ కావాలి” అంటున్న లేతగా అందంగా, అమ్మాయిలా వున్న అనిల్‌ను చూసి, ముద్దుగా దగ్గరకు తీసుకుని చేతుల మీదుగా పైకి లేపి “సరే బాబు, ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళు” అని చెప్పాడు.

ప్రతి రోజు కొన్ని పుస్తకాలు తీసుకెళ్లి చప్పల్ బజార్ మెయిన్ రోడ్ పక్కన పెట్టుకుని, కింద కూర్చొని అమ్మేశాడు అనిల్.

నెల రోజులు దాటి సెలవులు అయిపోయి స్కూల్ మొదలు కాగానే, నానమ్మ, బాబాయ్ దగ్గరికి, మొదటి సారి జీవితంలో దుఃఖంతో ఏడుస్తూ, బరువైన మనసుతో దిగాలుగా వెళ్లిపోయాడు అనిల్.

వెళుతున్న అనిల్‌ను చూసి ‘పోనిలే వీడోక్కడయినా సంతోషంగా బ్రతుకుతున్నాడు’ అనుకుంది కావేరి. తన పక్కన నిలబడ్డ పిల్లల వేపు చూసి , వీరిని కూడా ఎవరైనా పెంచుకుంటే బాగుండు అనుకుని వారిని చేతులతో దగ్గరగా హత్తుకుంది.

5

“సార్ మీ స్టాప్ వచ్చేసింది దిగండి” అంటూ కండక్టర్ పిలిచే సరికి గతం లోంచి బయటకు వచ్చాడు అనిల్.

దాదాపు ఒక నెల గడిచిన తర్వాత “అనిల్ కుమార్… పోస్ట్!!” అంటూ అరిచాడు పోస్ట్‌మ్యాన్.

అనిల్ ఆ కవర్ తీసుకుని, కంగారుతో చూసాడు. అందులో బీమా కంపెనీలో ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్ వుంది!! తీరా పోస్టింగ్ కూడా వున్న ఊరిలో అని తెలిసేసరికి అనిల్ ఆనందానికి అవధులు లేవు. అమ్మ సంతోషానికైతే పట్ట పగ్గాలు లేవు.

అది చూసి, అయిదు వందల తొంబై జీతం అని తెలిసిన వెంటనే అనిల్ ఆలోచన ఏవిటంటే, ….ఇంక మేమందరం ప్రతి రోజు అన్నం తింటాము!, ఆకలి బాధలు వుండవు!. ముఖ్యంగా,… పస్తులు వుండవు .. ఇక మీదట ,,అన్న నిజాన్ని నమ్మలేకపోయాడు. అంటే ఇక ప్రతి దినం కడుపు నిండా అన్నం గ్యారంటీ…… ఇక ఎవరైనా భోజనం పెడతారా… అని కడుపు నింపుకోవడానికి చుట్టాల ఇండ్లలో, స్నేహితుల ఇళ్లల్లో వివాహాల కొరకు ఎదురు చూడాల్సిన పని లేదన్న మాట.

మొదటిసారిగా ఇంట్లో అందరి ముందు పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చాడు. మనసు తీర,…..ఆపుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా,….. డొక్కలో నొప్పి పుట్టేలా రోదించాడు…. ఎన్నో సంవత్సరాల నుండి భరిస్తూ వచ్చిన బాధలు, కష్టాల కడలి దాటి ఒడ్డుకు పడినట్లుగా ,,, నిజాన్ని నమ్మలేని స్థితి. కావేరి ఎంత సముదాయించినప్పటికీ అనిల్ ఏడుపు ఆపలేదు. అలా చాలా సేపు ఏడుస్తూనే అనిల్.

ఏనాడు అన్నయ్యను అలా చూడని తమ్ముళ్లు, చెల్లెలు వచ్చి కళ్ళు తుడుస్తూ వారు కూడా కళ్ళలో నీరు తుడుచుకున్నారు…

నానమ్మ, బాబాయిలను వదిలి పదహారవ ఏట, అమ్మ, నాన్న దగ్గరకు వచ్చి చదువు పూర్తి చేసుకున్న ఈ ఏడు సంవత్సరాలు, వారితో కలిసి అనుభవించిన ఈ ఆకలి బాధలు,.. ఈ శిక్ష తాను ఏ జన్మలో చేసిన పాపమో కదా అనుకుని భగవంతుడి పటం ముందు కూర్చుని కళ్ళలో నీరు కారుస్తూ చాలా సేపు ఉండి పోయాడు.

ఆఫీస్‍కు వెళ్లి ఆ రోజు ఉద్యోగంలో చేరి, తర్వాత పదిహేను రోజుల పాటు హైదరాబాద్‌లో ట్రైనింగ్‌కు వెళ్ళాడు.

అక్కడ ట్రైనింగ్ జరుగుతుండగా ఇంటర్వ్యూ చేసిన ఒక ఆఫీసర్ అనిల్‍ను చూసి చాలా సంతోషంగా పలకరించి, మధ్యాహ్న భోజన సమయంలో పిలిచి, వివరాలు అడుగుతూ అనిల్ వూహించని, ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాడు.

“అనిల్, …నీకు ఈ ఉద్యోగం రావడానికి ముఖ్య కారణం…. నీవు చిన్నప్పుడు పడ్డ కష్టమే….. నీవు సుల్తాన్ బజార్‌లో న్యూస్ పేపర్ అమ్ముతున్నప్పుడు ఒక వ్యక్తి…. మిగిలిన డబ్బులు నీ దగ్గర నుంచి తీసుకోకుండా మర్చిపోయి వెళ్తుంటే ఆ వ్యక్తి వెంబడి నువ్వు పరిగెత్తుకెళ్లి, …. ప్రమాదం బారిన పడి, …గాయాలపాలైనప్పటికీ, అది తిరిగి ఇచ్చావు. గుర్తుందా? …చూడు.. ఆ నిజాయితీ ఫలితమే ఇది. ….. ఎందుకంటే? … ఆ వ్యక్తి ఎవరో కాదు…, మన సంస్థలో రాష్ట్రానికి చెందిన అతి పెద్ద అధికారి! ఇంటర్వ్యూ కేబిన్‌లో మా మధ్యలో కూర్చున్నారు చూడు, మన రీజినల్ మేనేజర్,ఆయనే!” అని చెప్పి, నా చెయ్యి నొక్కి “బెస్ట్ అఫ్ లక్” అని వెళ్లిపోయారు.

చేతలుడిగి నిలబడి పోయాడు అనిల్, అలా కాసేపు.

నిజానికి ఆ విషయాన్ని అనిల్ ఎప్పుడో మరిచిపోయాడు, కానీ ఇప్పుడు… మళ్ళీ ఆ సన్నివేశం కళ్ళ ముందు కదలాడింది. కళ్ళ నుంచి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు. అంత చిన్న వయసులో ఎవరికీ కూడా అంత కష్టాలను ఇవ్వొద్దని దేవుడిని కోరుకున్నాడు.

చదువుకోవడానికి , కడుపు నింపుకోవడానికి వచ్చే కష్టాలు ఎంత నరకప్రాయమో అనుభవించిన వారికే తెలుస్తాయి అని అనుకుని, ఎవరికీ అది రాకూడదు అనుకుంటూ ముందుకు కదిలాడు.

ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ విషయం అమ్మకు చెప్పాడు అనిల్.

అది విని “చూసావా, ఆ చిన్నతనంలో కనిపించిన ఆ వ్యక్తి, భగవంతుడి రూపం.. నీ భవిష్యత్తుకు నీవే బాటలు వేసుకున్నావు. పరీక్షించటానికి లేదా సహాయం చేయటానికి భగవంతుడు ఎప్పుడైనా, ఎవరి రూపంలో అయినా రావచ్చు. ప్రతి మనిషి దేవుని స్వరూపం.” అని వంటింట్లోకి దారి తీసింది కావేరి.

Exit mobile version