Site icon Sanchika

కొత్తదనంతో ‘ఆకాశం నీ హద్దురా…’

?????????????????????????????????????????????????????????

[dropcap]’ఆ[/dropcap]కాశం నీ హద్దురా’ సినిమా…. కొత్తగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. కథ గొప్పదే. మనసును కదిలించి, మనిషిని ఒక గొప్ప సంకల్పానికై ప్రేరణ కలిగించేదే. ఒక బయోపిక్. యం.యస్. ధోనీ (అన్‌టోల్డ్ స్టోరీ) లాగే గొప్పగా ఉంది. తప్పక చూడాల్సిన సినిమా.

కథేంటి…. కెప్టెన్ గోపీనాథ్ (జి.ఆర్.గోపీనాథ్) అనే ఒక రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కథ… తక్కువ ధరకే విమానాలు నడపాలి… విమానప్రయాణం కూడా సామాన్యులకు అందుబాటులోకి తేవాలి అన్న, అతని గొప్ప కలను, ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొని ‘ఎయిర్ డెక్కన్’ అనే విమానయాన సంస్థగా నిజం చేసుకున్న కథ.

పేర్లు మార్చేసారు. ఊర్లు మార్చేసారు. కానీ భావాలు, ఉద్వేగాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆశలు, ఆశయాలు… అన్నీ అలాగే వెండితెరకు ఎక్కించారు.

మహా(మహేశ్)గా పిలువబడే హీరో ఆవేశం ఆలోచన కలగలిసిపోయిన వ్యక్తి. ఆరంభించిన పనిని అంతుచూసేదాకా వదలని యువశక్తి. ఎక్కడో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసుకుంటుంటే తండ్రి ఆఖరిక్షణాల్లో ఉన్నాడని, తనని చూడాలని తాపత్రయపడుతున్నాడని తల్లి ఫోన్ చేస్తుంది.

అప్పటికి చిన్నచిన్న మనస్పర్ధల వల్ల మహాకి అతని తండ్రికి మాటల్లేవు. తన తండ్రి చివరి చూపును దక్కించుకోవాలని, అత్యవసరమై విమానంలో ప్రయాణం చేయాలనుకుంటాడు. ఆకాలంలో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండి, విలాసవంతమైన ప్రయాణసాధనంగా ఉన్న విమానప్రయాణపు చార్జీలకు సరిపడా డబ్బులేక ఆలస్యమైపోయి, తండ్రి అంత్యక్రియల తరువాత మాత్రమే ఇంటికి చేరుకోగలుగుతాడు.

అతని బాధలోంచి పుట్టిన ఆలోచనే… పేదలు, మధ్య తరగతి కుటుంబాలవారు ప్రయాణించడానికి వీలైన ధరల్లో విమానాలను నడపడం. పెద్ద పెద్ద నగరాలకే కాదు చిన్నచిన్న పట్టణాలు మధ్య కూడా విమానాలు ప్రయాణీకులకై ఎగరాలి అనేది మరో ఆశయం. అలా నిర్ణయించుకుని, ఓ విమానయాన సంస్థను నెలకొల్పాలని మొదలెట్టిన ‘మహా’ ప్రయాణం ఆలోచన నుంచి ఆచరణలోకి వచ్చే క్రమంలో ఎన్నో, ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఊహకందని చేదైన మలుపులు తీసుకుంటుంది.

అప్పటికే విమానయాన రంగంలో పాతుకుపోయి, ‘పైస్థాయి ఆర్థికస్థితి కలిగినవాళ్ళ కొరకే విమానం’ అన్న అభిప్రాయం కలిగి ఉన్న విమానసంస్థల అధిపతులు, వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారి చెప్పినట్లు ఆడిన జాతీయ విమానయాన అధికారగణం, స్వార్థానికై  వెన్నుపోటు పొడిచిన తన సంస్థ సిబ్బంది, విమానాల కొనుగోలు/లీజుకు డబ్బులు లేని పరిస్థితి…

ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పట్టువదలకుండా, తన ఆశయం సిద్ధించుకునేందుకు అహరహం కష్టపడిన ‘మహా'(మహేశ్) పాత్రలో సూర్య నటన అద్భుతం. ఇక తనకు జోడీగా/పోటీగా ‘డీ గ్లామరస్’ పాత్రలో ‘మహా’ భార్య ‘బేబీ’గా నటించిన అపర్ణా బాలమురళి తగినన్ని మార్కులు కొట్టేసింది. హీరోయిన్‌కు కూడా కొంత కథ ఉంటుంది. తన చుట్టూను కొంత కథ తిరుగుతుంది అని చెప్పే పాత్ర తనది. ఇక ‘మహా’ తల్లిగా నటించిన ఊర్వశి నటనకు ఇప్పుడేమి కితాబులివ్వగలం, అప్పుడెప్పుడో ఇచ్చేశారు కదా.

మిగతా పాత్రధారులందరూ…

ఎయిర్‌ఫోర్స్ అధికారిగా మోహన్ బాబు, విమానయాన సంస్థ అధిపతిగా, ‘మహా’కు అడుగడుగునా అడ్డుపడి అతనిని, అతని లక్ష్యాన్ని అడుగంటా తొక్కేయడానికి ప్రయత్నించిన విలన్‌గా పారిశ్రామికవేత్త పరేష్ రావల్, మహా మిత్రులు బంధువులుగా నటించినవారు, నటించారనడం కంటే ఆయా పాత్రలలో జీవించారనడమో, చక్కగా ఇమిడిపోయారనడం చాలా సమంజసం.

ఇది మల్టీస్టారర్ సినిమా. సూర్య ఒక హీరో, కథ రెండవ హీరో, స్క్రీన్ ప్లే మూడవ హీరో. చక్కని కథను, చిక్కని కథనం (స్క్రీన్ ప్లే) తో రెండుగంటల పైగా ఉన్న చోటున కూచోబెట్టించేలా చెప్పారు సినిమా  దర్శకురాలు సుధా కొంగర… అసలు సిసలయిన హీరో.

ఓ మాటలో చెప్పాలంటే కాలం ఎలా గడిచిపోయిందో గమనింపులోకే రాదు. సన్నివేశం తరువాత సన్నివేశం ఊహించినట్లో/ఊహించనట్లో అలా అలా వచ్చేస్తుంటే కథలో లీనమైపోయి చూస్తుండిపోతాం. సినీ ఫార్ములానుండి కాస్త దూరంగా జరిగి కొత్తదనంతో కేవలం పదిహేనుకోట్ల చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఈ ‘ఆకాశం నీ హద్దురా’ తప్పక చూడాల్సిందే.

Exit mobile version