కాజాల్లాంటి బాజాలు-108: ఆకుచాటు పిందె తడిసె..

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]‘ఆ[/dropcap]కుచాటు పిందె తడిసె.. కొమ్మచాటు పువ్వు తడిసె..’

వదిన దగ్గర్నించి వచ్చిన ఫోన్ ఎత్తగానే ఎక్కడో దూరం నించి వినిపిస్తున్నట్టు నాకు పై పాట వినిపించింది. ఫోన్ చేసింది వదినా కాదా అన్న అనుమానం వచ్చింది ఒక్కక్షణం నాకు. కానీ వెంటనే “స్వర్ణా, బయల్దేరేవా.” అన్న వదిన కంఠం వినపడగానే వదినే చేసిందని నిర్ధారించుకుని, “ఇదిగో.. పది నిమిషాల్లో బయల్దేర్తున్నాను.” అన్నాను.

“ఓ నాలుగు చీరలూ, ఇంకా కావల్సినవీ ఓ బేగ్‌లో పెట్టుకుని తెచ్చుకో..” అన్న వదిన మాటలకి ఆశ్చర్యపోయేను.

“ఇవాళ ఒక్కరోజే కదా వదినా షూటింగూ.. అన్ని రోజులని నువ్వు నాకు చెప్పలేదుగా!” అన్నాను.

“హూ.. నీకూ, మీ అన్నయ్యకీ చెప్పలేక చస్తున్నాను. వర్షంలో షూటింగ్ అంటే బట్టలు తడిసిపోవూ! ముందు జాగ్రత్తగా ఇంకో జత పెట్టుకోరూ!” అంది వదిన విసుగ్గా.

షూటింగ్ వర్షంలోనా.. ఈ సంగతి అన్నయ్యకి తెల్సా! తెల్సీ ఒప్పుకున్నాడా.. అసలే అక్కడ నల్లమేఘాలు కనపడితే ఇక్కడ అన్నయ్య తుమ్మడం మొదలెడతాడు.. అలాంటిది వర్షంలో షూటింగా.. అయినా షూటింగ్ అన్నయ్యా, వదినలమీద చేస్తుంటే నేనెందుకు తడుస్తానూ!.. ఏవిటో అన్నీ సందేహాలే.. అడిగితే కొట్టేటట్టుంది వదిన. అందుకని ఇంకేం మాట్లాడకుండా “అలాగే వదినా.. ఇదిగో బయల్దేరుతున్నాను..” అంటూ ఫోన్ పెట్టేసి. వదిన చెప్పినట్టు ఏకంగా నాలుగు చీరలు కాకుండా ఓ రెండు చీరలు బేగ్‌లో పడేసుకుని అన్నయ్యింటికి బయల్దేరేను. దారంతా నాకు ఇవాళ్టి షూటింగ్‌కి ముందు జరిగిన భాగోతం అంతా గుర్తొచ్చింది.

వచ్చే నెలకి అన్నయ్య, వదినల పెళ్ళయి పాతికేళ్ళవుతాయి. సిల్వర్ జూబిలీ గ్రాండ్‌గా చేసుకుందామంది వదిన. అన్నయ్యకి ఆర్భాటాలు నచ్చవు. కానీ పాపం వదిన సరదా పడుతుంటే కాదనలేక సరే నన్నాడు. అక్కడికీ ముందు జాగ్రత్తగా నన్ను అడిగేడు. “చెల్లాయ్, గ్రాండ్‌గా చేసుకోవడమంటే ఏం చేస్తారూ!” అని.

నేను మహా అనుభవం ఉన్నదానిలా, “ఏం లేదన్నయ్యా. నువ్వు వదినకి నచ్చిన జ్యూయలరీ కొనిపెడతావూ.. మంచి పట్టుచీర కొంటావూ. పనిలో పనిగా వదిన నీకు మంచి సూటో ఏదో కొంటుందీ. మీ పిల్లలిద్దరూ వస్తారూ.. మిమ్మల్ని గ్రీట్ చేస్తారూ.. ఆ రోజు మీ ఇద్దరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటారూ. పదిమందినీ పిలిచి బ్రహ్మాండమైన విందు ఇస్తారూ.. అంతే..” అన్నాను.

“అంతే కదా! ఐతే ఓకే.. పాపం మీ వదిన సరదా పడుతోంది. మాకా బాధ్యతలు తీరిపోయేయీ.. తన సరదా ఎందుక్కాదనాలీ.” అన్నాడు పాపం అన్నయ్య.

ఏ ముహూర్తాన సరే నన్నాడో కానీ ఇంక మా వదినని పట్టడం మా ఇద్దరి తరం కాలేదు.

ఈమధ్య పెళ్ళికి ముందే పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ వీడియోలు తీయించేసుకుని వాటిని పెళ్ళి రిసెప్షన్ టైమ్‌లో ఓ పెద్ద స్క్రీన్ మీద వెయ్యడం చూసిన వదిన తెగ థ్రిల్లయిపోయింది. అనవసరంగా పాతికేళ్ళముందే పెళ్ళి చేసుకున్నందుకు మహా బాధపడిపోయింది. అనుకోకుండా వదిన పడుతున్న బాధ విన్న ఆవిడగారి కజిన్ అంతకంటే బాధపడిపోయి వదినకి ఒక ఈవెంట్ మేనేజర్‌ని పరిచయం చేసేడు. ఆ మేనేజర్ పెళ్ళికి ముందూ, పెళ్ళిలోనూ, పెళ్ళి తర్వాతా, ఏడాది తర్వాతా. ..అలా ఎప్పుడైనా మొగుడూపెళ్ళాలు డ్యూయట్లు పాడుకోవచ్చనీ, దానిని తాము ఎంతో కళాత్మకంగా షూట్ చేస్తామనీ చెప్పేడు. అది విన్న వదిన మహా ఆనందపడిపోయి అతనికి డేట్స్ ఇచ్చేసింది.

సంగతి విన్న అన్నయ్య కాదూ కూడదన్నాడు. ఈ వయసులో ఇంత శరీరం వేసుకుని అలాంటి ఆటలూ పాటలు తన వల్ల కాదన్నాడు. నాకూ నిజవే కదా అనిపించింది. ఎంతలేదన్నా ఏభైయేళ్ళొచ్చినవాళ్ళు ఇరవైల్లో వాళ్లలా ఉండరు కదా! ఈ కథంతా జరిగి పదిరోజులైంది.

మొన్న ఒకరోజు పొద్దున్నే వదిన ఫోన్ చేసి ఇలా ఫొటోషూట్ తీసుకుంటున్నట్టు చెప్పి కాస్త సాయంగా ఉండడానికి ఆరోజుకి నన్నూ రమ్మంది. “అన్నయ్య ఒప్పుకున్నాడా!” వెంటనే నా నోట్లోంచి వచ్చిందా ప్రశ్న.

“నువ్వూ, మీ అన్నయ్య ఓ పాతికేళ్ళు వెనక్కెళ్ళమంటే వెడతారు కానీ ముందు కెడతారా!” అంది వదిన.

“మరి, ఈ ఫొటోషూట్‌కి ఎలా ఒప్పుకున్నాడూ!”

“మీ వదినంటే ఏవనుకున్నావు మరీ..” అంది గర్వంగా.

అవును.. వదిన ఎలాగైనా గ్రేటే. అన్నయ్యలాంటి మనిషిని డేన్సులు చెయ్యడానికి ఒప్పించిందంటే ఎంతటి జాణ అనుకోవాలీ!

ఏదేమైనా వదిన దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంటూ అన్నయ్యింటికి చేరుకున్నాను. అక్కడందరూ నాకోసమే ఎదురుచూస్తున్నారు. ఇంక ఆలస్యం చెయ్యకుండా వెంటనే షూటింగ్ స్పాట్‌కి బయల్దేరేం.

కారులో అన్నయ్య వదినలతోపాటు నేనుంటే వెనక రెండు వేనుల్లో షూట్ చేసేవాళ్ళు వస్తున్నారు. నేను నెమ్మదిగా అన్నయ్యని అడిగేను.

“ఎక్కడి కన్నయ్యా మనం వెళ్ళేది!”

“ఏవో.. నాకేం తెల్సూ..” విసుగ్గా అన్నయ్య జవాబు.

“తెలీకుండానే ఎలా వెడుతున్నావ్!”

“వెళ్ళకేం చేస్తానూ.. లక్షలు వాళ్ల చేతిలో గుమ్మరించేక..”

ఇంక నేనేమీ మాట్లాడలేకపోయేను.

అక్కణ్ణించి ఓ రెండుగంటలు ప్రయాణం చేసి అన్నయ్య, వదినలతో కలిసి షూటింగ్ స్పాట్‌లో అడుగు పెట్టిన నేను ఆశ్చర్యపోయేను. అవేవో ఎర్రమట్టిదిబ్బల్లా ఉన్నాయి. ఇదివరకు తెలుగు సినిమాల్లో హీరో విలనూ క్లైమాక్స్‌లో అలాంటి ఎర్రమట్టి దిబ్బల్లాంటి చోటే దెబ్బలాడుకునేవారు. అలాంటి చోట షూటింగేవిటీ అనడిగేను వదిన్ని.

“మరింకెక్కడ చేస్తారూ!” అడిగింది వదిన నన్ను మళ్ళీ.

“అదేంటీ.. ఏ గార్డెనో, నదీతీరమోలాంటి ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాల్లో కదా డ్యూయట్లు పాడుకుంటారూ!”

“అబ్బా.. నువ్వా ఇక్ష్వాకుల కాలంనుండి ముందుకు రావా! ఇప్పుడు ట్రెండ్ అంతా వర్షంలో తడుస్తూ, బురదలో దొర్లుతూ పాడుకోవడమే.” అంది.

చుట్టూ చూసేను. సినిమా షూటింగుల్లో లాగా పైనుంచి వర్షం కురిపించేలాంటి వేమీ కనిపించలేదక్కడ.

“మరి వర్షమేదీ!” అన్నాను అక్కడ అలాంటి ఏర్పాట్లేవీ కనిపించకపోవడంతో.

“వస్తుంది..” అంది వదిన..

“ఏవీ.. నీళ్ళటాంకులేవీ కనపట్టంలేదే..” అన్నాను.

“నీళ్ళటాంకులతో, జల్లెళ్ళతో వర్షం కురిపించటంలేదు. సహజంగా కురిసే వర్షం లోనే షూటింగ్ జరుగుతుంది”

సహజమైన వర్షమా! ఈ కాలంకాని కాలంలో..అనుమానంగా ఆకాశం వైపు చూసేను. అంతా నిర్మలంగా ఉంది. ఎక్కడా వర్షం వచ్చే ఛాయలే కనపడలేదు.

ఈ లోపల కొరియొగ్రాఫర్ వచ్చి, “అమ్మా, ఓసారి స్టెప్స్ చూసుకుందామా!” అన్నాడు.

“ఓ.. అలాగే.. స్వర్ణా, మీ అన్నయ్యని పిలూ..” అంది.

అన్నయ్యకోసం ఆ చుట్టుపక్కలంతా చూసేను. ఎక్కడా కనపడలేదు. ఆమాటే చెప్దామని వదిన దగ్గరికి వచ్చేసరికి వదిన వెనకనించి వినిపించే “ఆకుచాటు పిందె తడిసె, కొమ్మచాటు పువ్వు తడిసె..” అనే పాటకి స్టెప్స్ నేర్చుకుంటూ కనిపించింది. అప్పుడు అర్థమయింది అన్నయ్య ఎందుకు మాయమయిపోయేడో..

ఈ లోపల ఆ మేనేజరెవరో గబగబా వదిన దగ్గరికి వచ్చి, “మేడమ్, మనం వెంటనే బయల్దేరాలి..” అన్నాడు హడావిడిగా.

“ఎక్కడికీ..ఎందుకూ..” అడిగింది వదిన.

“మనం క్లౌడ్ సీడింగ్ ఇక్కడ మబ్బులమీద చేయిస్తే ఆ మబ్బులు ఇక్కడినించి నిజామాబాద్‌కి తేలుకుంటూ పోయేయి. ఇప్పుడు వర్షం అక్కడ కురుస్తోంది. మనం వెంటనే బయల్దేరితే కానీ ఆ వర్షం ఆగేలోపు నిజామాబాద్ చేరుకోలేం. మళ్ళీ వర్షం కురిపించాలంటే మళ్ళీ క్లౌడ్ సీడింగ్ చేయించాల్సిందే..” అన్నాడు.

“ఇక్కడ క్లౌడ్ సీడింగ్ చేయిస్తే అక్కడెందుకు వర్షం కురుస్తోందీ! ఇక్కడ కదా కురవాలీ..”

సూటిగా అడిగిన వదిన ప్రశ్నకి ఆ మేనేజర్ ఇలా చెప్పేడు. “మీరు సహజంగా కురిసే వర్షంలోనే షూటింగ్ చేసుకుంటానన్నారు. అందుకని ఈ ఎర్రమట్టిదిబ్బలు నీళ్ళకి తొందరగా కరుగుతాయని, బురద బాగా వంటికి అంటుకుంటుందనీ ఇక్కడ ప్లాన్ చేసేం. కానీ ఆ ఇంజనీరు చేసిన క్లౌడ్ సీడింగ్‌కి వర్షం ఇక్కడ కురవలేదు. నిజామాబాద్‌లో కురుస్తోంది.”

“అదే ఎందుకూ అని అడుగుతున్నాను. లక్షల డబ్బులు పుచ్చుకుని మాకు కావల్సినట్టు చేయకపోతే ఇంకెందుకు మీరూ! ఆ వర్షం అక్కడెందుకు కురుస్తోందీ!”

“ఎందుకంటే ఏం చెపుతాం మేడమ్.. ఎక్కడో చైనాలో క్లౌడ్ సీడింగ్ చేస్తే ఆ మబ్బులొచ్చి మన తెలంగాణాలో కుంభవృష్టి కురిసిపోయేయి. పెద్ద పెద్దవాళ్ళే ఏం చెయ్యలేకపోతున్నారూ! ఇంక మేమెంత!”

వింటున్న నేను అప్రతిభురాలి నయ్యేను. అంటే సహజంగా పడే వర్షంలో తడుస్తూ అన్నయ్యతో కలిసి ‘ఆకుచాటు పిందె తడిసె కొమ్మచాటు పువ్వు తడిసె’ అనే పాటకి స్టెప్పు లెయ్యడానికి వదిన లక్షలు ఖర్చు పెట్టిందా!

నాకు అర్థమైపోయింది.. లక్షలు ఖర్చుపెడుతోందని తెలిసీ, బాధేసీ అన్నయ్య ఈ షూట్‌కి ఒప్పుకుని ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చీ, ఇదంతా చూసీ, ఆ పాట విన్న తర్వాత ఒక్కసారిగా మాయమైపోయుంటాడు.

వదినా, ఆ మేనేజరూ ఇంకా ఏవో తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. నేను నెమ్మదిగా అక్కడినించి అన్నయ్య కోసం వెతుకుతూ బయల్దేరేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here