Site icon Sanchika

ఆకులు నేసిన ఆకాశం

[శ్రీ కంచరాన భుజంగరావు రచించిన ‘ఆకులు నేసిన ఆకాశం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఊ[/dropcap]రికి పడమట గోలిలో తోటపెండంత మఱ్ఱిచెట్టు
మా బాల్యానికి భాగ్యానికి ఆత్మ తరువు లెక్క!
ఎటువైపు నుండి చూసినా గుబురుకొమ్మల
పొదిలో పచ్చగా పొద్దు పొడిచినట్టు
ఆ పొద్దుకింద పొద్దల్లా తెలుకలి పాపన్న గానుగ నడిచినట్టు
కుప్పతొట్టి లాంటి ఒండలున్న ఒట్టి తొర్రపైన
ఆకాశానికి అడుగున పచ్చటి గొడుగు తెరిచినట్టు
నీడల్తో ఊడల్తో పిట్టరంగుండే చిగుళ్ల జాడల్తో
కొమ్మల కింద కోటి బొమ్మల్ని అంటుకట్టినట్టు
అచ్చంగా అది బేతాళ కథల్లో శవం వేళాడిన
ఊడల మఱ్ఱి!

ప్రతి రోజూ సాయంత్రానికి అక్కడొక పిట్టల కాలనీ
నీడల కొమ్మల్లో పిల్లపిచ్చిరి కేరింతల జాతర!
వేసవి సెలవుల మిట్ట మధ్యాహ్నపు వేళల్లో
గడసరి గాలి దాగుడుమూత లాడినపుడు
ఎండుటాకుల సడికి ఎన్నిసార్లు జడుసుకున్నామో..
పిట్టలు కొరికిన మఱ్ఱిపళ్ళ మీద
చిన్నారి నేస్తాలతో ఎన్ని పరిశోధనలు చేశామో..
ఊడలు పట్టి ఊయలూగుతూ ఎన్నిసార్లు
పట్టుజారి కింద పడ్డామో..
తలకిందులు వేలాడే గబ్బిలాల్ని అనుకరిస్తూ
ఊరిని కొండని చెట్టుని చెరువుగట్టునీ
ఎంత అబ్బురంగా చూసేవాళ్ళమో..

ఇక్కడి ప్రతి మట్టి రవ్వ.. గాలి పరక.. నీటి తరక..
ఏదోరకంగా ఆ భూజానికి బంధువులేనని
మా బూసమ్మ చెప్పేది
ఆ ఊడల మఱ్ఱిమాను చుట్టూ
ఎన్ని కట్టుకథలు ఎన్నెన్ని దెయ్యాల గాథలో..
ఏ బైరాగి మంత్రానికో దాని తొర్రలో
భూతాలు బందీలుగా ఉన్నాయని నమ్మి
ఎన్ని తరాలు భయపడి చచ్చేవో..

వందల ఏళ్ల వయసున్న ఆ చెట్టు కొమ్మకొమ్మకీ
ఊడవూడకీ మా ఊరి కథ తెలుసు!
దాని కిందనుండి దారిచేసుకుని శ్మశానానికి
పీనుగెల్లినపుడల్లా
బొటబొటా కొన్ని ఆకుబొట్లను రాల్చేది
ప్రతి ఏడూ నందన్న గూడుకి రాటాపట్టి కోసం
కొన్ని కొమ్మల్ని నరుక్కొమ్మని త్యాగం చేసేది
ఏ ఇంట్లో త్రినాథ మేళా జరిగినా
కమ్మకత్తి దాని కొమ్మల వంకే చూసేది
రెల్లుపొదలోని మూడు పైసలు ఎవరికి దొరికేవో గాని
ఆ మర్రాకు దొన్నెల్లోనే బెల్లం పెసరపప్పు
ప్రసాదమై మా అరిచేతుల్లో వాలేది
మా ముందు ఎన్ని తరాలకు ఆదరువు అయ్యిందో ఆ తరువు
తనువుంటే, మా తరువాత ఇంకెన్ని తరాలను
ఆదరించేదో!

ఊరిని ఎన్నేళ్లుగానో స్వయం ప్రగతికి వాడుకునే
తేనెకుండ లాంటి నోరున్న నక్క వాలకాల ఒక తెల్ల చొక్కాకి
వీధి చివర రచ్చబండలా ఉన్న మర్రిమాను ఎందుకో నచ్చలేదు
రోడ్డు విస్తరణకు అడ్డనే నెపంతో ఆకులు నేసిన
మా ఆకాశాన్ని నేలమట్టం చేయించాడు
నిలువ నీడనూ చల్లని గాలినీ ఏళ్ళకేళ్లు వరమిచ్చిన
చెట్టుతల్లి కాయాన్ని తుండలుగా కోసుకెళ్ళిపోయాక
ఇప్పుడు ఆ పుడమికానుపు సమాధిపైనుండి
జెర్రిపోతులా పాకుతోంది తారురోడ్డు
దానిపైన బోడిగా మిగిలిన ఆకాశంలో
ఏడుస్తూ శపిస్తూ గూడు చెదిరిన పిట్టలు..

నేల రాలిన ప్రాణ సర్వాన్ని నేలలోకే తోడుకుని
లోలోన కుములుతూ కుతకుతా ఉడుకుతూ
భూమిలోతున దాగిన వేర్ల సామ్రాజ్యాన్ని
మట్టి పిడికిళ్లలోకి పొదువుకుంది గానీ
ఇక్కడ అదృశ్యమైన మా ఊరి మఱ్ఱిచెట్టు
ప్రతి వెన్నెల రాత్రి చందమామలో కన్పిస్తుంది
జాబిలిలో ఊగే మచ్చలన్నీ దాని కన్నీటి ఊడల ప్రతిబింబాలే!

ఎడారి కాంక్షల అభివృద్ధి మాయకు
ఏ వృక్ష విలాపమూ వినబడకపోవచ్చు
మట్టిలో పూడ్చిన శోకం ఎన్నాళ్ళు మరుగునుంటుంది?
ఏదో ఒక నాటికి శాపమై విరుచుకొస్తే
అప్పటికప్పుడు శరణార్థుల్లా ఎక్కడికి పారిపోవడం?
రోదిస్తున్న పిట్టల భాషన్నా ఒంటబడితే
ఎక్కడో ఓ చెట్టు కింద
వెన్నెల గూటిలో కాస్తంత చోటడిగి
కొన్నాళ్ళయినా తలదాచుకోవచ్చు!

Exit mobile version