మెలకువనంతా
దోసిలి పట్టి జుర్రుకుంటున్నా
ఉగాది షడ్రుచులకుమల్లే.
సుఖదుఃఖాల తీతువు పిట్టల్ని
కాలం అంచుపై ఎగరేసి
కన్నీటిని సిరాగా ఒంపి
రుధిర గాయాల చెక్కిళ్లపై
కవిత్వ విద్యుల్లతనై
ఆకుపచ్చ సంతకం చేస్తున్నా
ఈ ఉగాది శుభోదయాన.
వాళ్ళు పరుస్తున్న
విద్వేషాల గాజుపెంకులపై
సామరస్య గడ్డి మేటల్ని పర్చుకుంటూ
కలతల్ని దూది పింజల్లా మార్చి
వసంత గాలుల్ని పెనవేసుకుంటున్నట్టు
ఉక్కిరిబిక్కిరి అవుతున్నా
ఈ ఉగాది సంరంభాన.
ఊపిరిని డాలుగా మలిచి
మొలిచే ప్రశ్నల ముళ్లని
అధినాయకుల ముఖాలకు
కొక్కేలుగా వేలాడదీసి
నవనవోన్వేషణలో
అలిసిసొలిసి సేద తీర్తున్నా
ఈ ఉగాది నది ఒడ్డున.
అస్తిత్వరాహిత్యాన్నై
నామవాచకం నుండి
నిష్క్రమించిన జీవితాన్ని
పునర్నిర్మించే వజ్రసంకల్పాన్ని
చాటింపు వేస్తున్నా
ఈ ఉగాది ఘడియల తీరాన.
రూపుమార్చుకుంటున్న
మతోన్మాద,ఉగ్రవాద
ఉపద్రవాల ఊసరవెల్లుల్ని
క్రీగంట కనిపెడ్తూ
నిద్రకు దూరమైన కనుపాపల్లో
సూర్యచంద్రుల్ని నింపుకుంటూ
నిటారుగా నడుస్తున్నా
ఈ ఉగాది నవోదయాన.
………….షేక్ కరీముల్లా,
వినుకొండ,గుంటూరు జిల్లా,ఏ.పి.