కాజాల్లాంటి బాజాలు-109: ఆలసించిన ఆశాభంగం..

4
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఎం[/dropcap]తైనా మేధావులు మేధావులే. ఎన్నెన్ని పరిశోధనలో చేసి మనకి మంచి మంచి విషయాలు చెప్తారు.

సంగతేమిటంటే ఇవాళ నేను వ్యక్తిత్వ వికాసం పుస్తకం ఒకటి చదివేను. అదేనండీ పెర్సనాలిటీ డెవలప్‌మెంట్.. హ హ అర్థమైపోయింది కదా! అందులో మనం ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందు మనం ఒక లక్ష్యం అదేనండీ గోల్ పెట్టుకోవాలీ అన్నారు. బాగుంది.

మన మీద మనకి నమ్మకం యేర్పడడానికి ముందుగా మన లక్ష్యాలు చిన్నవిగా వుండాలిట. ఒకేసారి పేద్ద లక్ష్యం పెట్టుకుని చెయ్యలేక బాధపడేకన్నా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని పూర్తి చేసుకుంటూంటే మనమీద మనకి నమ్మకం యేర్పడి, మన వ్యక్తిత్వం వికసిస్తుందట.. యెంత పరిశోధన చేసి కనుక్కున్నారో ఆ మేధావి.. సరే పాపం.. ఆ పెద్దమనిషి మాట కాదనడం ఎందుకూ! అలాగే చేద్దాం అనుకున్నాను.

మరి నా లక్ష్యం యేమిటీ.. వేరే యేముంటుందీ.. పొద్దున్న లేస్తే వంట చెయ్యడం, యిల్లు సర్దడమేగా. అందుకని శిక్షణలో ఆయన చెప్పినట్టు పెద్ద పెద్దవాటి జోలికి పోకుండా చిన్న చిన్నవి ముందు లక్ష్యాలుగా పెట్టుకుందామని ఇల్లు సర్దే పని ఎంచుకున్నాను. ముందు ఇవాళ చిన్నగా ముందరి గదిలో కిటికీ తుడిచేస్తె ఓ పనైపోతుంది. రేపు అల్మైరాల అద్దాలు తుడవొచ్చు. ఎల్లుండి మధ్యగదిలో తుడవడం. ఇలా మా యింట్లో ఒక్కొక్కగది తుడవడానికీ రెండు మూడేసిరోజులని కేటాయించుకుని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూంటే నా పని మీద నాకు బాగా చేసాననే నమ్మకం యేర్పడుతుంది.

ఆహా, ఎంత మంచివాడా మేధావీ! బహుశా ఆయనకి అరగంట పనిచేసి ఆరుగంటలు రెస్టు తీసుకునే నాలాంటి పనిగండంవాళ్ల గురించి బాగా తెలిసుంటుంది.

అలాగే భోజనం కూడా.. పప్పూ, కూర, పులుసు.. యిలా అన్నీ ఒక్కపూటే చెయ్యకుండా పొద్దున్న పప్పు, మధ్యాహ్నం కూర, రాత్రికి పచ్చడి పెట్టుకుంటే మన లక్ష్యాలు తొందరగా నెరవేరతాయి.

కానీ అలా చేస్తే ఇంట్లో కుదరదుగా.. ఒక్క పప్పుతో ఎవరైనా భోజనం మొత్తం చెయ్యగలరా! పప్పు, కూర, పచ్చడి, పులుసు లాంటి ఆధరువులతో కుదిరితే పిండివంటలతో సహా భోజనం చేసే అలవాటున్న వాళ్ళకి ఒక్క ఆధరువుతో ఎలా పెడతాం. మరి నేనిలా అన్నీ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యక్తిత్వం వికసించేదెట్లా! దీనిగురించి బాగా ఆలోచించాల్సిందే.. అయినా నేనెందుకు ఆలోచించి నా బుర్ర పాడుచేసుకోవాలీ! ఆ మేధావినే అడిగేస్తే పోలా అనుకున్నాను. అనుకున్నదే తడవు ఆ పుస్తకంలో ఉన్న ఆ మేధావి నంబర్‌కి ఫోన్ చేసేను. పెద్దమనిషే.. ఫోన్ రింగవగానే ఎత్తేరు పాపం.

నన్ను నేను పరిచయం చేసుకుని నా సందేహం అడిగేను. అది వినగానే ఆయన పకపకా నవ్వేసేరు. చెప్పొద్దూ… నాకు కొంచెం కోపం లాంటిది వచ్చింది. ఎంతైనా మేధావి కదా! నాకు కోపం వచ్చిందని కనిపెట్టేసినట్టున్నారు..

“అమ్మా, కోపగించుకోకండీ. మేము చెప్పే వ్యక్తిత్వవికాసం ఇంట్లో పనికీ, వంటకీ సంబంధించినది కాదు. బైట నాలుగురకాల మనుషులతో కలిసి పనిచేయవలసి వచ్చినప్పుడు మీ పెర్సనాలిటీ మెరుగుపరుచుకుని మీరు పనుల్లో విజయం సాధించడానికి మేమందించే సలహాలు.” అన్నారు.

ఈసారి నాకు కోపం ఎక్కువే వచ్చింది. అంటే ఇంట్లో వంటా, పనీ, మూడుతరాల మనుషులతో ఇంట్లో ఇల్లాలు సర్దుకుపోవడం ఆయనకి పెద్దవిషయంలా కనిపించడం లేదా! ఈ విషయంలోనే ఆయనతో పెద్ద దెబ్బలాట వేసేసుకుందామనుకున్నాను.

కానీ నేను శాంతిని కోరుకునే మనిషిని. అంతంత పెద్ద పెద్ద పుస్తకాలు రాసే మేధావితో వాదించి ఆయనని చిన్నబుచ్చదల్చుకోలేదు. అందుకే వెంటనే ఫోన్ పెట్టేసేను.

కానీ, ఈ విషయాన్ని నేను ఇంతటితో వదలదలచుకోలేదు. ఆ మేధావికి ఒక ఇల్లాలి సమస్యలు చిన్న విషయాలు కావచ్చు. బైటకెళ్ళి పని చేస్తేనే వ్యక్తిత్వం వికసిస్తుందనే భావనలో ఉండొచ్చు. కానీ, నేనలా కాదే.. పూట పూటే కాదు క్షణం క్షణం కూడా మూడుతరాల మనుషుల మధ్య సమన్వయం ఏర్పరుచుకుంటూ ఇంటిని ప్రశాంతంగా ఉంచగలిగే ఇల్లాలికి చాలా సందేహాలు వస్తూ ఉండొచ్చు. అవన్నీ ఎవరు తీరుస్తారు. ఆ ఇల్లాలు ఎలా ఆ సమస్యని అధిగమించాలి. ఎవరిని అడిగితే ఆ ఇల్లాలికి సరైన సలహా ఇవ్వగలరు.

ఇదివరకు అయితే ఏ అక్కో, వదినో ఇలా చెయ్యీ అని చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరి ఇంటి విషయాలు వాళ్ళే చూసుకుంటున్నారు. అక్కచెల్లెళ్ళతో కూడా పంచుకుందుకు ఇష్టపడడం లేదు. అలాంటివారి పరిస్థితి ఏంటి!

ఇదే ఏ మేధావి అయినా అయితే ఏం చెప్తారు.. ఆలోచిస్తుంటే ఇలాంటి ఇల్లాలి సందేహాలకి నాకు బోల్డు సమాధానాలు దొరికేయి. ఆహా.. భలే ఉందే.. నాకూ మంచి మంచి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అయితే నేనూ మేధావినే నన్నమాట.

నాకు బోల్డు సంతోషం వేసేసింది.

ఇంకనేం.. నేనే ఓ పుస్తకం రాసి పడేస్తా. ఇంట్లో ఇల్లాలికి వ్యక్తిత్వం ఎలా వికసించాలో బోల్డు విధానాలు చెప్పేస్తాను. అసలే ఆధ్యాత్మిక పుస్తకాలకీ, వ్యక్తిత్వవికాస పుస్తకాలకీ బోల్డు డిమాండ్. బలే అమ్ముడైపోతాయి. నాకు ఆనందం లోపల్నించి తన్నుకుంటూ వచ్చేస్తోంది.

రేపే రాయడం మొదలుపెట్టేస్తాను. వచ్చే నెలకల్లా పుస్తకం మార్కెట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ కాపీలు దొరకలేదనకోకండీ… ఇప్పుడే మీ కాపీ బుక్ చేసుకోండి. ఆలసించిన ఆశాభంగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here