ఆమని-13

0
3

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 13వ భాగం. [/box]

[dropcap]న[/dropcap]ల్లమల అడవులు, గుంటూరు ప్రకాశం, కర్నూలు జిల్లాల పర్యంతం వ్యాపించి వున్నాయి. ఈ నల్లమల అడవులే దేశంలో ఎక్కడా లేని ఔషధుల్ని, మూలికల్నీ అందిస్తున్నాయి. చూడదగ్గ అందమైన అటవీ ప్రదేశం కూడా. కర్నూలు జిల్లలలోని ‘బైర్లూటి’, ‘పచ్చర్ల’ అభయారణ్యంలో చెంచుగూడేలు వున్నాయి. వాటికి దగ్గరగా ఎకోటూరిజమ్ ప్రాజెక్టు కింద పది కాటేజీలు కట్టించారు. అక్కడ పర్యాటకుల స్పందన బాగానే వున్నదన్న సమాచారం వినపడుతోంది. ఆ తరహాలోనే ఇక్కడ మన దగ్గర ఏమైనా ఏర్పాటు చేయడానికి వీలుంటుందా? అన్న ఆలోచనలో పడింది స్నేహలత.

లంబాడీలు, ఎరుకలు, యానాదులు, వడ్డెరలు, కొంతమంది చెంచులూ వున్న ప్రాంతాలివి. ఇక్కడి మైదాన ప్రాంతాలకు దగ్గరగా కొంత ప్రాంతముంటే, సమస్యాత్మక ప్రాంతం కొంత వున్నది. ఈ సమస్యాత్మక ప్రాంతంలోనే జాగరూకతతో వ్యవహరించాలి. పరిపాలనా వ్యవస్థ కుంటుపడకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేవలం అభివృద్ధి వైపే దృష్టి పెట్టడం తన విధి. రేపు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా తను చేసిన మంచి పనులు ఇక్కడి ప్రజలకు, ఉపయోగపడేటట్లుగా తనను వారంతా గుర్తుపెట్టుకునేటట్లుగా తను చేసిపోవాలి. వాళ్ళ మనస్సుల్లో తాను స్థానం సంపాదించుకోగల్గాలి. అది తన కోరిక. గిరిజనులకు ఎక్కువ ఉపాధి కలిగించగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ ఆలోచనల మధ్య తన పెళ్ళి ప్రస్తావనా గుర్తుకొస్తున్నది. అమ్మ ఈసారి పట్టిన పట్టు వదిలి పెట్టేట్టులేదు. అందుకే పట్టుదలగా తమ్ముణ్ణి, మరదలినీ పిలిపించింది. ఇటువంటి పరిస్థితిలో ఏ పాపనైనా పెంచుకుంటానన్న ఆలోచనే అమ్మ భరించలేదు. నెమ్మది నెమ్మదిగా నాన్నగారు కూడా తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సౌందర్య, కిషోర్, సుమబాలా అందరిదీ ఒకటే మాట ‘పెళ్ళి చేసుకో, పెళ్ళి చేసుకో’ అని.

సుమబాల తనకు దగ్గరగానే వున్నది. వాళ్ళనొకసారి తన ఇంటికి పిలవాలి. వాళ్ళ పిల్లల్ని చూసి అమ్మ ఇంకా గోలపెట్టి సతాయింపులు ఎక్కువ చేస్తుందేమో? ‘వాళ్ళ కెంత చక్కని పిల్లలో చూడు. చూసయినా నీకు తెలిసిరావడం లేద’నే అంటుంది. సుమబాల పి.హెచ్.డి సబ్‍మిషన్ పనిలో వున్నది. అది కాగానే తనని ఫామిలీతో రమ్మని పిలవాలి.

ఈలోగా చెఱువుజుమ్మలపాలెం స్కూలులోని డ్రిల్లు మాస్టర్‌గారిని కలిసి ఆ పిల్లవాడి వివరాలు వాడి, ఆర్చరీ సామర్థ్యం తెలుసుకోమని ఆ డివిజన్ ఆఫీసర్‌కు పురమాయిచింది. ఆ వివరాలు వచ్చాయి.  ఆ వివరాలు చూస్తుండగానే, తన కోసం ఎవరో విజిటర్స్ వచ్చారని సమాచార శాఖ సిబ్బంది వచ్చి చెప్పారు. వారిని లోపలికి పిలిపించింది. రేపల్లె రూరల్ మండలం నుండి వచ్చామని చెప్పారు. వచ్చిన వారంతా సన్నకారు రైతులు. వాళ్ళొచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

“విషయమేమిటంటే దిగువనున్న లంక గ్రామాలకు సాగునీరిచ్చే పథకం కింద కాలువలు తవ్వుతూ, చేపల చెరువులూ, రొయ్యల చెరువులూ కూడా తవ్వేశారండీ. దానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పారండీ. ఇదెప్పుడో జరిగి మూడేళ్ళు కావస్తుందండీ. మాకప్పటి నుండి చెరువులు లేకుండా పోయాయండీ. ఇటు ప్రభుత్వము నష్టపరిహార మివ్వలేదు. మా భూమీ పోయే. చేసేదిలేక కూలీ పనుల కెళుతున్నామండీ. ఈ మధ్య ఒకాయన వచ్చి తాను గుంటురు జిల్లా అటవీ శాఖ నుంచి వచ్చాయని చెప్పాడు. తవ్వేసిన మా చెఱువులన్నీ మా అటవీశాఖ క్లస్టర్ కిందకే వస్తాయని, నష్టపరిహారం మా అటవీశాఖే చెల్లిస్తుందనీ చెప్పాడు. మా వివరాలన్నీ తెలుసుకురమ్మని మా అటవీశాఖ కన్జర్వేటర్ మేడమ్ గారు పంపారు. అందరూ, మీ వివరాలను అంటే భూమి వివరాలను ఫొటోస్టాట్ కాపీ ఇవ్వండని చెప్పాడు. అలాగే ఇచ్చాం. మరోసారి ఇంకో ఇద్దరు వచ్చారు. అతనే తీసుకొచ్చాడు. మీ పొలం లెక్కలన్నింటికి, వాటికి రావల్సిన పరిహారం వివరాలు తయారవుతున్నాయి. మీ అందరికీ నష్టపరిహారం భారీగానే వస్తుంది. కాని మా మేడమ్ గారికి కొంత కమీషన్ కావాలి. మేమంతా కలిసి తీసుకుంటామనుకోండి. మీ చేతికి త్వరగా డబ్బు కావాలంటే ఇప్పుడు మీరు కొంత ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు భరించండి. మీ చేతికి సొమ్మొచ్చాకా, మా కమీషన్ మాకివ్వండి… అని చెప్పారు. ఇప్పుడు కొంత అంటే ఎంత ఇవ్వాలని అడిగాం. ఒక్కొక్కరినీ పాతికవేలిమ్మని అడిగారు. ఇవ్వలేమని బ్రతిమాలాం. తర్వాతే తీసుకోండి. కమీషన్ కొంచెం ఎక్కువైనా ఫరవాలేదు అని ఎంతగానో చెప్పాం. వాళ్ళు వినలేదు. ఇవాళా, రేపట్లో కాకపోతే ఒక వారం ఆగి వస్తాం. తలా ఒక పాతికవేలు చొప్పున ఇవ్వాల్సిందే. పైగా ఈ విషయాలేం బయట చెప్పకండి. అలా బయటపడితే మీ పనులే ఆగిపోతాయి. చేతికందే సొమ్ము రావటానికి ఏళ్ళూ, పూళ్ళు పడుతుంది. ఆ తర్వాత మేమేం చేయలేం. మీ ఇష్టం అంటూ బెదిరించారు. వారం రోజుల్లో నానా తిప్పలు పడి సొమ్ము జత చేసాం. వచ్చి తీసుకున్నారు. డబ్బు తీసుకునేడప్పుడు ఇంకో మాట కూడా చెప్పి ఆశపెట్టారు. మా కుటుంబాలలో ఎవరైనా చదువుకున్న వాళ్ళుంటే అటవీశాఖలోనే ఏదైనా ఉద్యోగం ఇప్పించమని మా మేడంకు చెప్తాం. ఎందుకంటే మీరంతా బీద రైతులు, ఆధారంగా వున్న చెరువులూ పోయినవి కాబట్టి వాళ్ళకేదైనా దారి చూపించమని మీ తరఫున మేమడుగుతాం. ముందుగా మేం చెప్పి వుంచుతాం.  ఆ తర్వాత మిమ్మల్ని తీసుకెళతాం, మీ గోడు చెప్పుకుందురుగాని అని చెప్పారు. ఆ తర్వాత మీ నష్టపరిహారం చెక్కులతో వస్తాము. బ్యాంకుల్లో డ్రా చేసుకుందురు గాని అని చెప్పారు. నిజమేనని పొంగిపోయాం. ఆ తర్వాత ఇరవై రోజులకొచ్చారు. చెక్కులు తయారవటానికి కొంచెం ఆలస్యమైపోయేటట్టుంది. పోయినసారి ఉద్యోగాల సంగతి చెప్పాంగా, ఎవరెవరు ఏం చదివారో ఆ వివరాలు ఉద్యోగాల నిమిత్తం కొంత డబ్బు ఇవ్వాలి. చెక్కులూ, ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికారు. ఆ మాటల్ని కొంతమంది నమ్మేశారు. మరికొంతమందికి అనుమానమొచ్చింది. తర్వాత ఇస్తాం లే అని చెప్పి పంపాం. మరలా పది రోజులకొచ్చారు. మా అనుమానం ఎక్కువయింది. ఎందుకంటే మాకివ్వాల్సిన పరిహారం సంగతి దాటవేస్తూ, వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వాలని అడగటమే పనిగా పెట్టుకున్నారు. ‘మాకు పరిహారం వచ్చినప్పుడే వస్తుంది. మా పిల్లలకు ఉద్యోగాలు వాళ్ళే వెతుక్కుంటారు. మేం ఇదివరకిచ్చిన పాతికవేల సంగతేంటి? మీరింత వరకూ ఏ పని చేయలేదు. మా డబ్బులు మాకు వెనక్కిచ్చేయండి’ అంటూ గట్టిగా నిలదీశాము.

‘అలాగే ఈసారి వచ్చినప్పుడు తెచ్చి మీ ముఖాన కొడతాం. ఇంక మీరు మీ నష్టపరిహారం సంగతి మర్చిపోండి’ అంటూ విసురుగా వెళ్ళిపోయారు.”

“మాకు అనుమానాలు ఎక్కువయిపోయాయి. తెలిసిన వారి ద్వారా డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి దగ్గరకు వెళితే ‘అలాంటిదేం వుండదు. అటవీశాఖ ఏ నష్టపరిహారమూ ఇవ్వడు. ఎందుకంటే మీ పొలాలు కానీ, చెరువులు కానీ అటవీశాఖ పరిధిలో లేవు. ఏ మేడమూ డబ్బు వసూళ్ళకు పంపలేదు. మీరు బాగా మోసపోయార’ని చెప్పారు. ఏం లాభం ఉండదని చెప్పినా, ఏదో ఆశ చావక మీరేమైనా న్యాయం చేయిస్తారేమోనని మీ దగ్గరకొచ్చామమ్మా…”

“ఆ వెళ్ళేదేదో ముందుగా డివిజన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాల్సింది. మీరు ఎన్నేళ్లబట్టో మీ పొలాలకు శిస్తు కడుతున్నారు, సాగు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ పొలంలోనే చేపల చెరువులూ, రొయ్యల చెరువులూ తవ్వుకున్నారు. అటవీ భూములైతే మీరెలా సాగు చేసుకున్నారయ్యా? పట్టాలూ మీ పేరెలా వున్నాయి? మీ పట్టా భూమిని వేరే ఎవరిదో అని ఎలా అనుకున్నారయ్యా? మరీ ఇంత అమాయకత్వమతే ఎలా? మీలో ఏ ఒక్కరికైనా, కనీసం చదువుకుంటున్న మీ పిల్లలకైనా అనుమానం రాలేదా? సాగునీటి పథకం కింద తీసుకున్న భూమికి కొంత ఆలస్యమైనా గవర్నమెంటు నష్టపరిహారం ఇస్తుంది. మా డి.ఎఫ్.ఓ చెప్పినట్లు మా డిపార్టుమెంటు నుండి మేమేం చెయ్యలేం. మీ ఏరియా పోలీసు స్టేషన్లో రిపోర్ట్ చెయ్యండి. డబ్బుల కోసం వచ్చిన వాళ్ళ ఫోటోలు ఏవైనా వుంటే ఇవ్వండి. ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వండి. పోలీసులైతేనే ఏమైనా ఆచూకీ తీయగలరు. మీలో ఎవరు చదువుకున్నవాళ్ళు లేరా? చదువు లేకపోబట్టే కదా మరీ ఇంత అమాయకంగా మోసపోయారు. అయినా గూడా మీ రైతులు బాగా వ్యవహర్తలుగా, తెలివిగా ఉంటారని మేమంతా అనుకుంటాం. ఇలా ఎలా పొరపాటు పడ్డారో అర్థం కావడం లేదు. కనీసం మీ పిల్లల్ని అయినా బాగా చదివించండి. మీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధేస్తుంది. మీ ఏరియా పోలీసు స్టేషన్ నెంబరు కనుక్కుని నేను ఫోన్ చేసి మాట్లాడుతాను. వెళ్ళి రండి” అంటూ వాళ్ళను పంపిస్తూ, “ఒక్క మాట. మా డి.ఎఫ్.ఓ. గారిని కనుక్కోండి. మీకు ఏమైనా పని చూపించమని. నేను ఫోన్ చేసి చెప్తాను, వీళ్లు చేయదగ్గ పని చూపించమని” అన్నది.

‘ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. ఐ.ఎఫ్.ఎస్. అధికారిగా ఒక లేడీ వున్నదన్న విషయాన్ని ఆసరాగా, ఉపయోగించుకుని దాన్ని ఆ మోసగాళ్ళు ఎలా క్యాష్ చేసుకున్నారో రాస్కెల్స్… బీద రైతుల్ని పీడించి డబ్బు గుంజటానికి వాళ్ళకు మనసెలా ఒప్పిందో? ప్రతి ఒక్కరూ ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది’ అనుకున్నది.

***

సుమబాల ఫోన్ చేసింది.

“నా థీసిస్ అవార్డ్ అయినట్లుగా తెలిసింది. ‘వైవా’ మాత్రం మిగిలుంది. ఆ ‘వైవా’ ఇవ్వటానికి నాగార్జునా యూనివర్సిటీకి రావాలి. అదీ అయిన తర్వాత మనమొకసారి కలుద్దాం స్నేహలతా. నా సంగతులు సరే, నువ్వెలా వున్నారు? అమ్మా నాన్న ఏమంటున్నారు?” అంది.

“మా అమ్మా నాన్న ఝార్ఖండ్ వెళ్ళిపోవాలన్న కోర్కె తీరడం లేదు. ఎన్నాళ్ళున్నా మా అమ్మకు ఇది పరాయి రాష్ట్రమే. నీకు పి.హెచ్.డి. డిగ్రీ వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ‘వైవా’దేముంది? అయిపోతుందిలే. ఫార్మాలిటీగా పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అంటూ డెమో ఇవ్వడమేగా. చాలా చాలా కంగ్రాట్యులేషన్స్. త్వరలో సుమబాల పేరు ముందు డాక్టర్ పదం చేరుతున్నందుకు సంతోషంగా వున్నది. ఇంతకీ పిల్లలెలా వున్నారు?”

“పిల్లలా! మూడు పొట్లాటలూ, ఆరు కొట్లాటలూగా వున్నారు. ఇద్దరికీ కాసేపు పడదు. మరలా ఒకళ్ళను విడిచి మరొకరు కాసేపు కుడా వుండలేరు. ఈసారి హాలిడేస్ ఇవ్వగానే నీ దగ్గరకు పంపిస్తాను. దగ్గరుండి చూద్దువుగాని ఎలా గిల్లికజ్జాలు పెట్టుకుంటారో?”

“నిజంగా పంపిస్తావా? ఇప్పట్నుంచే వాళ్ళ కోసం ఎదురుచూస్తుంటాను. మరిచిపోవద్దు”

“వాళ్ళ పిల్లలూ, వీళ్ళ పిల్లలతో ఆడుకోడం కాదు స్నేహలతా, మ్యారేజ్ ప్లాన్ చేసుకో. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానుకోకు.”

“ఇంట్లో అమ్మ ఒక్కటే పోరు పెడుతున్నది. నువ్వూ మొదలుపెట్టావా సుమా. మ్యారేజ్ అంటే అదేదో కాని పని అని కాదు. అందరిలాగా చదువైపోగానే చేసుకుంటే బావుండేది. విధి అంటామే, అది అనుకూలించక అప్పట్లో జరగలేదు. ఇప్పుడు ఈ జాబ్ శాటిస్‌ఫాక్షన్ బాగానే వున్నది. నాకేదో పెద్దరికం వచ్చినట్లుగ వున్నది. మళ్ళా వెనక్కు తిరిగి పెళ్ళికూతుర్ని అవాలంటే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది. ఎందుకొచ్చిన జంజాటం అని కూడా అనిపిస్తున్నది. కాని ఇంట్లో ససేమిరా ఒప్పుకోవడం లేదు. మొన్నీ మధ్య మా తమ్ముడూ, మరదలూ కూడా ఇదే పని మీద వచ్చి వెళ్ళారు.”

“ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డలెప్పుడూ చిన్నవాళ్ళుగానే వుంటారు. నువ్వు లేనిపోని పెద్దరికాన్ని నెత్తికి చుట్టుకోకు. ఎంత వయసు మీరిపోయింది నీకు? పిచ్చి ఆలోచనలు మానుకుని పెళ్ళి చేసుకో. పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఆదర్శంగానే వుండి వృత్తికే అంకితం కావాలని ఎవరూ అనరు. నీకీ పిచ్చి ఆలోచనలు ఎలా వస్తున్నాయసలు?” అంటూ చనువుగా కోప్పడింది. “మీ అమ్మా నాన్నల బాధలో అర్థం ఉంది. వాళ్ళ తర్వాత నీకు తోడెవరుంటారు? నిన్నొకరి కప్పగిస్తే వాళ్ళకు నిశ్చింతగా ఉంటుంది. ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా గడపాలన్న వాళ్ళ కోరికా తీరుతుంది. అప్పుడప్పుడూ నాకొక అనుమానం వస్తుంది స్నేహలతా. మన ఎమ్మెస్సీ వరకు నీకు బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఆ తర్వాత ఐ.ఎఫ్.ఎస్.లో వుండగా ఎవర్నైనా కావాలనుకున్నావా? లేకపోతే నీకు నచ్చినవాడు ఇంకా దొరకలేదా? లేక దొరికిన వ్యక్తి కోసం వెయిట్ చేయాల్సి వస్తుందా? అలాంటిదేమన్నా వుంటే నాకు చెప్పాలనిపిస్తే చెప్పు. నాకు తోచిన సొల్యూషన్ చెప్తాను.”

“నీ కన్సర్న్‌కు థాంక్స్. ప్రస్తుతానికి ఏ సొల్యూషన్ అవసరం లేదు. నేనే పెళ్ళి చేసుకోవాలనే విషయం మీదకు ధ్యాసను మరల్చుకుంటాను, సరేనా. నిజం. ఆ ప్రయత్నంలోనే ఉంటాను. గోవర్ధన్ గారిని అడిగానని చెప్పు. పిల్లల్ని మరీ మరీ అడిగానని చెప్పు. బై!”

యమ్మెస్సీలో తామిద్దరూ చాలా క్లోజ్‌గా వుండేవాళ్ళు. తర్వాత సుమబాల ఎం.ఇడి చేసింది. తానేమో గ్రూప్ పరీక్షలకి ప్రిపేరవడంలో నిమగ్నమైపోయింది. మళ్ళీ ఇప్పుడు బాగా దగ్గరయ్యారు. కాని చిన్నపిల్లలా కిషోర్ విషయం మాత్రం చెప్పాలనిపించలేదు. ‘అతడు కాలక్షేపానికి నీకు పెళ్ళి కబుర్లు చెప్పాడు. ఆ తర్వాత మేనమామ కూతురంటూ, కట్నకానుకలంటూ శుభ్రంగా పెళ్ళి చేసుకున్నాడు. కాపురం చేస్తూ ఇద్దరు పిల్లల్ని కని పెంచుకుంటున్నాడు. నీకా మాత్రం జ్ఞానం లేదా? చూసైనా నేర్చుకోవా పిచ్చీ!’ అంటూ తనకే వార్నింగులిస్తుంది.

అసలు దేని మీద విరక్తితో తాను పెళ్ళినీ, కుటుంబాన్నీ నిర్లక్ష్యం చేస్తున్నది? అంత పెద్ద విషయం తన జీవితంలో ఏమీ జరగలేదే! పెళ్ళి చేసుకునే వయసు దాటిపోయిందని తను అనుకుంటున్నది గాని అది ముగిసిపోయిన ఛాప్టర్ కానే కాదు. ఆ ఛాప్టర్ ఇంకా మొదలవ్వాల్సి ఉందని, పెళ్ళితోనే జీవితానికి పరిపూర్ణత వస్తుందని అందరూ సలహా ఇస్తున్నారు, చూద్దాం అనుకున్నది స్నేహలత.

***

జిల్లాల వారీగా ఐ.ఎఫ్.ఎస్. అధికారులందరూ తమ ప్రతిపాదనలతో ఆ రోజు సి.ఎం. కార్యాలయానికొచ్చారు. వీళ్ళకు కేటాయించిన సమయానికి కొద్దిగా ఆలస్యంగా అటవీశాఖ అధికారులతో ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ మొదలయింది.

“మీరంతా ఎంతో బాధ్యతగా పని చేస్తున్నారు. చాలా సంతోషం. నా ముందు చాలా ప్రతిపాదనలుంచారు. అన్నింటినీ పరిశీలిద్దాం. నల్లమల అడవుల్లో ‘టైగర్ ప్రాజెక్ట్ ఏరియా’గా డిక్లేర్ చేయబడిన దాంతో సహా అన్ని చోట్లా డెవెలప్‌మెంట్‌నే కోరుకుందాం.”

“ఇలా డిక్లేర్ చేయబడ్డ ఏరియా ఎంతుంటుందండీ?”

ఒక్క నాగార్జునసాగర్, శ్రీశైలం ఏరియాలోనే టైగర్ శాంక్చువరీ 3518 చ.కిమీ మేర విస్తరించి వున్నది సర్. అక్కడ 31 గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో 23,404 షెడ్యూల్ తెగలవాళ్ళున్నారు సర్.”

“ఈ ప్రకారం అన్ని చోట్లా ఈ తెగల వాళ్ళు వుంటూనే వుంటారుగా. అందరికీ న్యాయం చేస్తూనే పోతున్నాం. బయో డైవర్సీటీలను ఇంకా పెంచుదాం. ఎకో టూరిజాన్ని ఇంకా డెవలప్ చేయాలి”

“నల్లమల అడవుల్లోనే చెంచుల గుడీ, శివాలయం అంటున్నారు మనవాళ్ళు. వాటి సంగతేంటండీ?” ఆసక్తిగా అడిగారు సి.ఎమ్.గారు.

“ఈ అడవుల్లో ఐదుచోట్ల శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయని చెప్తుంటార్ సర్. నాలుగు ప్రదేశాల్లో శివలింగాలు బయటపడ్డాయి సర్. ఎంతమంది వెతికినా మరో శివలింగం జాడ ఇప్పటి వరకైతే తెలియలేదు సర్. ఉల్లెడ ప్రాంతంలోని ఉమామహేశ్వరుడూ, సలేశ్వరంలోని గుడీ బాగా ప్రసిద్ధి అని చెప్తున్నారు సర్. ఈ సలేశ్వర క్షేత్రానికి సమీపంలోనే నవాబుల భవనాల శిథిలాలూ కనబడతాయి సర్. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడికొచ్చి దర్శనం చేసుకున్నాడనీ చరిత్ర చెబుతుంది సర్.”

“వీలైతే ఓసారి వెళ్ళి చూడాలి అయితే” అంటూ సి.యమ్. నవ్వారు.

“తప్పకుండా రండి సర్. అన్ని ఏర్పాట్లూ చేస్తాం సర్. ఇంకా అడవుల్లో పవర్‌ఫుల్ విషంతో నిండిన స్పైడర్సూ, గోల్డెన్ యాంట్స్ కూడా ఇక్కడే వున్నాయి. మరో వైపు దేశంలో ఎక్కడా లేని ఔషదులూ, మూలికలూ ఇక్కడే దొరుకుతాయి సర్. సెలయేర్లయితే చెప్పనక్కరలేదు. ప్రవహిస్తూనే వుంటాయి సర్.”

మరొక ఆఫీసర్ అందుకున్నారు – “ఉల్లెడ ఉమామహేశ్వరుణ్ణి దర్శిస్తే అమరనాథ్ శివలింగాన్ని దర్శించినట్టేనని చెప్తారు సర్.”

“అయితే అమర్‌నాథ్ జోలికి పోకుండా నల్లమల కొస్తే చాలంటారు” అంటూ ప్రసన్నంగా నవ్వారు సి.యమ్. ఆయనతో పాటు పర్యాటక శాఖా మంత్రీ శృతి కలిపారు.

“ఈ శివలింగాన్ని అశ్వత్థామ ప్రతిష్ఠించినదంటారు సర్. అందుకే చాలా శక్తివంతమైనదని పేరు. ఇక్కడి పూజారులంతా చెంచులే. ఈ క్షేత్రం హైదరాబాదుకు, శ్రీశైలానికి మధ్య ఉంటుంది. సంవత్సరానికొకసారి జాతర బాగా చేస్తారు సర్. ప్రతియేటా చైత్రమాసంలో చైత్రపూర్ణిమకు ముందు రెండు రోజులు, పూర్ణిమ తర్వాతి రెండు రోజూలు, పూర్ణిమతో కలుపుకుని మొత్తం ఐదు రోజులూ వీళ్ళకు జాతర వుంటుంది సర్. ఎక్కడెక్కడి చెంచులూ మిగతా తెగలవాళ్ళూ కూడా ఇక్కడికి చేరుకుంటారు సర్.”

“అయితే అప్పుడు రమ్మంటారా?” అనడిగారు పర్యటక మంత్రి.

“మీ అవకాశాన్ని బట్టి సర్.”

“సరే, ఈ సమాచారం బాగా సేకరించారు. వెరీ గుడ్. అయితే మన ప్రధాన లక్ష్యం ఔషధులనూ, మూలికలనూ అందించే మొక్కల పెంపకం ఎక్కువ చేయటం. లోగడ మనం అనుకున్న టార్గెట్‌ను చేరుకోవటం. ఎలాగూ ఈ ఏరియా అద్భుతంగా వున్నది. ఈ షెడ్యూల్ తెగల వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ, ప్లాంటేషన్‌నూ పెంచగలగడం. వాళ్ళకి కావలసిన విద్య, వైద్యం అన్నీ అందేటట్టు చూస్తున్నాం. అవసరమైన చోట ఇంకా పెంచుదాం. మీకందరికీ ఒక సూచన. అన్ని రంగాలతో పాటు రైతుల్ని కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రమ్మని విదేశాల వరకూ పంపిస్తున్నాం. మీ ఐ.ఎఫ్.ఎస్.లు కూడా పొరుగు రాష్ట్రాలకు, అవసరమైతే విదేశాలకూ వెళ్ళి వాళ్ళ పనితీరును గమనించండి. ఇక్కడి మనవాళ్ళతో షేర్ చేసుకోండి. మనక్కావల్సింది ఆల్‌రౌండ్ డెవెలప్‌మెంట్. ఆలోచించండి. బెస్ట్ ఆఫ్ లక్” అంటూ ఆ సమావేశాన్ని చాలా ప్రశాంతంగా ముగించారు సి.యమ్.గారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here